తెలంగాణలో మైనార్టీల‌కు ఉచితంగా లక్ష రూపాయలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

గాజులకు డిజైన్లు అద్దుతున్న ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎ.కిశోర్ బాబు
    • హోదా, బీబీసీ కోసం

పేద మైనార్టీల ఆర్థిక అభ్యున్న‌తి కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెస్తోంది.

పేద మైనారిటీ కుటుంబాలలో అర్హులైనవారికి రూ.1,00,000 ఆర్థిక స‌హాయం చేసే ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌క‌టించారు.

ఇంత‌వరకు రాష్ట్రంలో పేద బీసీ వ‌ర్గాల‌కు రూ. లక్ష ఇచ్చే ప‌థ‌కాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడీ ప‌థ‌కాన్ని మైనార్టీల‌కూ వ‌ర్తింప‌జేయాల‌ని నిర్ణ‌యించింది.

ఈ ప‌థ‌కం స్వ‌రూప స్వ‌భావాలేమిటీ? మైనార్టీల‌కు, బీసీల కోసం ఈ ప‌థ‌కం ఎందుకు ప్ర‌వేశ‌పెట్టాల‌నుకున్నారు? ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవడం ఎలా?

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ప‌థ‌కం?

తెలంగాణ ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం రాష్ట్రంలో ముస్లింలు 12.6 శాతం మంది, క్రైస్త‌వులు 1.3 శాతం మంది, బౌద్ధులు 1 శాతం మంది, సిక్కులు 0.04 శాతం మంది, జైనులు 0.75 శాతం మంది ఉన్నారు.

వీరిలో చాలా మంది పేద‌రికంలో మ‌గ్గుతున్నవారేనని ప్రభుత్వ సర్వేలు చెప్తున్నాయి.

అత్య‌ధికులు చేతివృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవ‌నోపాధి పొందుతున్నారు.

ఈ క్రమంలోనే మైనార్టీల్లో పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు, పేదరికం నుంచి వారిని బయటకు తెచ్చేందుకు వీలుగా ఒక్కో పేద కుటుంబానికి రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం తాజా పథకాన్ని రూపొందింది.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవ‌రు అర్హులు?

ఈ పథకంలో లబ్ధి పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్త‌వులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు ఇత‌ర అల్ప సంఖ్యాక మతస్థులు అర్హులు.

ఆర్థిక సాయం ఎలా ఇస్తారు?

క్రైస్త‌వుల‌కు ‘టీఎస్ క్రిస్టియ‌న్ ఫైనాన్స్ కార్పొరేష‌న్’ ద్వారా ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తారు.

మిగిలిన మైనార్టీల‌కు మాత్రం ‘టీఎస్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేష‌న్’ ద్వారా ఈ సాయం అందిస్తారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదా?

ఈ పథకంలో అందించే లక్ష రూపాయలు రుణ రూపంలో ఇవ్వరు. ఇది రుణం ఎంత మాత్రం కాదు.

తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తి ఉచితంగా వంద శాతం రాయితీతో ఒకేసారి అందించే ఆర్థిక సాయం ఇది.

ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ల‌బ్ధిదారుల‌కు ఈ సాయం అంద‌జేస్తారు.

ఈ ఆర్థిక సాయం ఎందుకోసం ఇస్తున్నారు?

ఈ ఆర్థిక సాయం అందుకున్న మైనార్టీలు తాము చేస్తున్న చేతి వృత్తుల‌కు సంబంధించి ప‌రికరాలు కొనుగోలు చేసుకోవ‌డానికి, చిన్న వ్యాపారాలు చేస్తుంటే దాన్ని మ‌రికొంత విస్త‌రింప‌జేసుకోవ‌డానికి ఉప‌యోగించుకోవాల‌నే ఉద్దేశంతో ఇస్తున్నారు.

వ‌యో ప‌రిమితి ఎంత‌? కుటుంబ ఆదాయ పరిమితి ఉందా?

2023 జూన్ 3వ తేదీ నాటికి 21 సంవ‌త్స‌రాలు పూర్తయి 55 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ ప‌థ‌కానికి అర్హులు.

ఈ ప‌థ‌కం పొంద‌డానికి కుటుంబ ఆదాయ ప‌రిమితి విధించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న‌వారికి వార్షిక ఆదాయ ప‌రిమితి రూ.1.50 ల‌క్ష‌లు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్న‌వారికి వార్షిక ఆదాయ ప‌రిమితి రూ. 2 ల‌క్ష‌లు.

కుటుంబ వార్షిక ఆదాయం ఇంతకంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఎంపిక ఎలా?

ఒక కుటుంబంలో ఒక్క‌రికి మాత్ర‌మే ఈ ప‌థ‌కం ఇస్తారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ పరిధిలో ఉంటుంది.

జిల్లా క‌లెక్ట‌ర్ల నేతృత్వంలో మానిట‌రింగ్‌, స్క్రీనింగ్ క‌మిటీలను ఏర్పాటు చేశారు.

ఒక్కో జిల్లాలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ఈ క‌మిటీలు ప‌రిశీలించి ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేస్తాయి.

ఈ జాబితాలను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లా మంత్రి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.

అనంతరం లబ్ధిదారుల‌కు జిల్లా క‌లెక్టర్ ఆదేశాల‌తో ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తారు.

ముస్లిం వ్యాపారి

ఫొటో సోర్స్, Getty Images

ద‌ర‌ఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ ప‌థ‌కం కోసం మైనార్టీలు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

http://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

క్రిస్టియన్ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలంటే https://tscmfc.in/ నుంచి వెళ్లొచ్చు.

ఇతర మైనారిటీలు https://tsmfc.in/ వెబ్‌సైట్ నుంచి వెళ్లొచ్చు.

అయితే, దరఖాస్తులకు సంబంధించిన లింకులు ఈ వెబ్‌సైట్లలో ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.

ఎంపిక తరువాత..

ఎంపికైన ల‌బ్ది దారుల జాబితాను ఆయా పంచాయ‌తీల్లో ప్ర‌ద‌ర్శిస్తారు.

అలాగే ఆయా మైనార్టీ కార్పొరేష‌న్ వెబ్‌సైట్ల‌లో కూడా ఉంచుతారు.

లబ్ధిదారుల ఎంపికకు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న కూడా నిర్వ‌హించి ఎంపిక చేస్తారు.

చెక్కుల‌ను స్థానిక ఎమ్మెల్యే ద్వారా ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)