మైటోకాండ్రియల్ ఈవ్: ప్రపంచంలోని ఆడవాళ్లందరికీ మూలం ఈమేనా?

ఈవ్

ఫొటో సోర్స్, Getty Images

బైబిల్ ప్రకారం సృష్టిలో మొట్టమొదటి మహిళ ఈవ్. మన శరీరంలోని కణాల్లో జన్యుపరంగా జరిగే ప్రక్రియను వివరించడానికి, సైన్స్ కూడా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈవ్ పదాన్ని ఉపయోగిస్తోంది.

సైన్స్ నిర్వచించిన శాస్త్రీయపరమైన ఈవ్ (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మైటోకాండ్రియల్ ఈవ్) బైబిల్‌కి విరుద్ధమైనప్పటికీ ఆధునిక మానవుడికి ఆమే పూర్వీకురాలు.

ఇప్పటివరకూ తెలిసిన విషయాల ప్రకారం, ఆ మహిళ సుమారు లక్షా యాభై వేల సంవత్సరాల నుంచి 2 లక్షల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాలోని జింబాబ్వే, బోట్స్‌వానా ప్రాంతంలో నివసించి ఉండొచ్చని భావిస్తున్నారు.

అయితే, చరిత్రలో ఆమె మొదటి మహిళ కాదు, ఆ యుగంలోనూ ఆమె మాత్రమే మహిళ అయ్యి ఉండే అవకాశం కూడా లేదు. కానీ, ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారం ఆమె డీఎన్‌ఏ ఆనవాళ్లు మాత్రం ప్రతి తరం మానవుల్లోనూ కనిపిస్తున్నాయి.

ఇదంతా అర్థం చేసుకోవాలంటే, ఒక అడుగు వెనక్కి వేసి మన శరీరంలోని మైటోకాండ్రియా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈవ్

ఫొటో సోర్స్, Getty Images

మినీ జనరేటర్.. ఈ మైటోకాండ్రియా

మానవ శరీరంలోని జీవకణాల్లో మైటోకాండ్రియా అనే నిర్మాణం ఉంటుంది.

''మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేస్తుంది'' అని రియో గ్రాండే డు సల్ యూనివర్సిటీ (యూఎఫ్‌ఆర్‌జీఎస్)లో స్టాటిస్టిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బయాలజిస్ట్ గాబ్రియెలా సైబిస్ చెప్పారు.

ఇది ఆహారంలోని షుగర్‌ను ఏటీపీ మాలిక్యూల్స్‌గా మారుస్తుంది. ఈ ఏటీపీ మాలిక్యూల్స్ శరీరం సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన శక్తిని అందిస్తాయి.

అయితే, ఈ చిన్న శక్తి ఉత్పాదక కేంద్రాలకు ఒక అరుదైన లక్షణం ఉంది. అవి వాటి డీఎన్‌ఏను అలాగే కొనసాగిస్తాయి.

దాదాపు 20 వేల విభిన్న జన్యుకణాలతో మైటోకాండ్రియా జన్యువు ఏర్పడుతుంది. మనిషి శరీర కణాల్లో ఉండే ఈ మైటోకాండ్రియా, శరీరంలో వ్యాధికారక లక్షణాలను గుర్తిస్తుంది.

మైటోకాండ్రియా శరీరంలోని కణాల లోపల ఉన్నప్పటికీ కణ కేంద్రానికి దూరంగా ఉంటుంది. ఒక్కో మైటోకాండ్రియా జన్యువు 37 జన్యుకణాలను కలిగి ఉంటుంది. వాటినే మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ లేదా ఎంటీడీఎన్‌ఏ(mtDNA)గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు.

ఇక్కడే కథ మరింత ఆసక్తిగా మారింది. ఈ ఎంటీడీఎన్‌ఏ(mtDNA) మన తల్లుల నుంచి మనకు వారసత్వంగా వస్తుంది.

ఫలదీకరణ సమయంలో అండం, వీర్యకణాలు ఒకదానితో మరొకటి కలిసే ప్రక్రియలో మగ జన్యువుకి సంబంధించిన మైటోకాండ్రియా అదృశ్యమవుతుంది.

అందువల్ల తల్లికి సంబంధించిన మైటోకాండ్రియా డీఎన్‌ఏ మాత్రమే పిండానికి సంక్రమిస్తుంది.

ఈ పిండ ప్రక్రియ వేల ఏళ్లుగా, అనేక తరాలుగా మానవజాతి పరిణామక్రమం మహిళల ఆధారంగా నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు నిర్ధరిస్తోంది. ఈ గొలుసుకట్టు సంబంధాన్ని ఎంటీడీఎన్‌ఏ స్పష్టంగా కలుపుతోంది.

వీటి ద్వారా ఏం తెలుస్తుందంటే, ప్రతి మహిళకు తల్లి ఉంటుంది. కానీ, అందరు తల్లులకు కూతుళ్లు ఉండరు. ఒక మహిళకు కొడకులు మాత్రమే ఉంటే ఆమె మైటోకాండ్రియల్ డీఎన్ఏ ఆ తర్వాతి తరాలకు సంక్రమించదు.

''జన్యుపరంగా చెప్పాలంటే, తల్లికి తల్లి ఎవరు, ఆ తల్లికి తల్లి, ఆ తల్లికి తల్లి.. ఇలా శోధించుకుంటూ వెళ్లడం సాధ్యమే'' అని సైబిస్ చెప్పారు.

ఈవ్

ఒకే చెట్టుకి ఎన్నో శాఖలు..

జన్యుశాస్త్రం, జీన్ సీక్సెన్సింగ్‌, ప్రాసెసింగ్ టెక్నాలజీలలో సాధించిన పురోగతితో ఎంటీడీఎన్‌ఏ మూలాల గురించి శాస్త్రవేత్తలు మరింత తెలుసుకునేందుకు సాధ్యమవుతోంది.

మన చివరి పూర్వీకుల గురించిన పరిశోధనలు 1980లలో తొలుత ప్రచురితమయ్యాయని బ్రెజిల్‌‌కి చెందిన హాస్పిటల్ డి క్లినికస్ డీ పోర్టో అలెగ్రోలో, జినోమిక్ మెడిసిన్ లేబొరేటరీకి చెందిన జీవ శాస్త్రవేత్త బిబియానా ఫామ్ తెలిపారు.

''ఆ పరిశోధనల్లో మన చివరి పూర్వీకులు నివసించిన కాలాన్ని పేర్కొనడం ప్రారంభించారు. అదే సమయంలో, మైటోకాండ్రియల్ ఈవ్ అనే పదం గురించి కూడా తొలిసారి వాటిలో ప్రస్తావించారు'' అని ఆమె చెప్పారు.

బైబిల్‌‌లో ఉన్న ఈవ్ వృత్తాంతంతో గందరగోళం ఉన్నప్పటికీ, ఆ పదం అప్పటి నుంచి ఇప్పటికీ వాడుకలో ఉంది.

మైటోకాండ్రియల్ ఈవ్ అనే భావనపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, మానవజాతికి పూర్వీకురాలిగా భావిస్తున్న మహిళ ఏ కాలంలో జీవించిందనేది మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

దాదాపు 50 వేల సంవత్సరాలకు ముందు ఆమె జీవనం సాగించినట్లు అత్యంత విశ్వసనీయం అంచనాలు చెబుతున్నాయి.

అయితే, 'ఈవ్' అనే పదం ఎక్కువగా వాడడంపై కొందరు పరిశోధకులు విమర్శలు కూడా చేశారు. ఈవ్ గురించి వివరించేటప్పుడు గందరగోళం తలెత్తుతోందని, ఇది శాస్త్రీయ భావనలకు, బైబిల్ పురాణాలకు మధ్య సంఘర్షణకు దారితీస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

1980లలో తొలిసారి ఈవ్ ప్రస్తావన వచ్చినప్పటి నుంచే ఈ సమస్య కూడా తలెత్తింది. సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ''ట్రయల్ ఆప్ కన్ఫ్యూజన్'' అనే అధ్యయనం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఈవ్

ఫొటో సోర్స్, Getty Images

బైబిల్‌తో సంబంధమేంటి?

''ఇలాంటి సందర్భంలో ఆ పేరును తొలిసారి వాడడం కవి స్వేచ్ఛ లాంటిదే'' అని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసైన్సెస్‌‌కి చెందిన జీవశాస్త్రవేత్త టాబిట హ్యునిమీర్ చెప్పారు. ఆమె జెనిటిక్స్ అండ్ ఎవల్యూషనరీ బయాలజీ విభాగంలో పనిచేస్తున్నారు.

''అయితే, ఇది పూర్తిగా శాస్త్రీయ ఆధారాలతో రూపొందిన భావన. బైబిల్‌తో దీనికి ఎలాంటి సంబంధం లేదు'' అని ఆమె చెప్పారు.

శాస్త్రీయంగా దీన్ని నిర్ధరించేందుకు శాస్త్రవేత్తలు రివర్స్ కౌంట్ పద్ధతిలో పరిశోధనలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యక్తుల ఎంటీడీఎన్‌ఏలను సేకరించి, వాటిలోని మ్యుటేషన్లను ఒకదానితో మరొకదానిని సరిపోల్చడంతో పాటు వాటిని విశ్లేషించారు.

దీనివల్ల తరతరాలుగా జన్యు మ్యుటేషన్లలో వచ్చే మార్పులను అంచనా వేయడం శాస్త్రవేత్తలకు సాధ్యమైంది.

''ఇది మైటోకాండ్రియా డీఎన్‌ఏలో మ్యుటేషన్లు జరగడానికి ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకునేందుకు, మాలిక్యులర్ క్లాక్‌ని రూపొందించడానికి ఉపయోగపడింది'' అని ఫామ్ చెప్పారు.

వీటి వల్ల ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాల్లో లక్షా యాభై వేల నుంచి 2 లక్షల ఏళ్ల కిందట ఈ మైటోకాండ్రియా ఈవ్ జీవించి ఉందని నిర్ధరించడం సాధ్యమైంది.

ఇది నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ భారీ జన్యువృక్షానికి బలమైన కాండాన్ని ఏర్పరచింది.

ఈ ఎంటీడీఎన్‌ఏ కలిగిన వ్యక్తులను మరికొన్ని నివేదికల్లో ఎల్ లేదా ఎల్0గా వర్గీకరించారు. అప్పటి నుంచి, తరువాతి తరాల ఎంటీడీఎన్‌ఏ మ్యుటేషన్లను శాస్త్రీయ పరిభాషలో వివిధ శాఖలుగా విభజించారు.

ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల్లో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 వంటి శాఖలను గుర్తించారు.

పూర్వీకులు ఇతర ఖండాలకు వలస వెళ్లడంతో అక్కడ మరికొన్ని మ్యుటేషన్లు కనిపించాయి. మిడిల్ ఈస్ట్, యూరప్‌లలో హెచ్, వీ, ఆర్ శాఖలు ప్రధానంగా కనిపించాయి.

అమెరికాలో ఏ,బీ,సీ,డీ గ్రూపులను గుర్తించారు.

మైటోకాండ్రియల్ డీఎన్‌ఏపై అధ్యయనాల ద్వారా మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియడమే కాకుండా, వేల ఏళ్లలో మన పూర్వీకులు (మహిళా పూర్వీకులు) ఖండాంతరాలకు ఎలా విస్తరించారో తెలుసుకోవడం సాధ్యమైంది.

''ఇప్పుడున్న ఎంటీడీఎన్‌ఏలు అన్నీ అప్పటి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఎంటీడీఎన్‌ఏ నుంచి వచ్చినవే'' అని హునిమీర్ వివరించారు.

''అందరిలో ఒకటే ఎంటీడీఎన్‌ఏ ఉందని చెప్పడం లేదు. కానీ, కాలక్రమేణా వచ్చిన మ్యుటేషన్లు అన్నింటికీ సంబంధం ఉంది'' అని ఆమె చెప్పారు.

ఈవ్

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధనల్లో ఏం తేలింది?

ఇక్కడ స్పష్టంగా తేలింది ఏంటంటే, మైటోకాండ్రియల్ ఈవ్ చరిత్రలో తొలి మహిళ కాదు.

లక్షల సంవత్సరాల కిందట హోమో సెపియన్స్ నుంచి ఉద్భవించిన జాతుల పరిణామక్రమంలో ఆమె కంటే ముందు, ఆమె తల్లి, ఆ తల్లికి తల్లి, ఆ తల్లికి తల్లి.. ఇలా చాలా తరాలు ఉన్నాయి.

''ఇలా పరిణామ క్రమాన్ని శోధించుకుంటూ వెనక్కి వెళ్లడం ద్వారా హోమో సెపియన్స్ కాని మానవజాతి పూర్వీకుల గురించి తెలుసుకోవచ్చు'' అని సైబిస్ తెలిపారు.

అలాగే, మైటోకాండ్రియా ఆ కాలంలో నివసించిన మొదటి మహిళది కాదు.. అప్పట్లో అదే ప్రాంతంలో జీవించిన ఒక మహిళది కావొచ్చని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

అయితే, వేల సంవత్సరాలు గడిచేకొద్దీ వీటిలో కొన్ని ఎంటీడీఎన్‌ఏలు మరుగునపడ్డాయి.

పిల్లలు పుట్టకపోవడం, లేదా కేవలం కొడుకులు మాత్రమే పుట్టడం వల్ల వేర్వేరు ఎంటీడీఎన్‌ఏలు ఉన్న మహిళల జన్యు క్రమానికి అవరోధం ఏర్పడింది.

వేల ఏళ్ల పరిణామక్రమంలో కాలానికి సంబంధించిన అధ్యయనాల్లో, ఇప్పటి వరకూ ప్రచురితమైన అంచనాల్లో చాలా అనిశ్చితి ఉందని సైబిస్ అభిప్రాయపడ్డారు.

''అయితే, మైటోకాండ్రియా ఈవ్‌పై ఇప్పటి అంచనాలు ఉత్తమమైనవని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు'' అని ఆమె అన్నారు.

''అలాగే, వలసలు, జనాభా పెరుగుదల ప్రక్రియలను పరిగణనలోకి తీసుకోవాలి. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ'' అని హ్యుమినీర్ అన్నారు.

ఇవి కూడా చదవండి: