గంజాయి సాగుకు అనుమతి ఇవ్వాలని ఆ రైతులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? చట్టం ఏం చెబుతోంది?

గంజాయి

ఫొటో సోర్స్, GANESH WASALWAR

    • రచయిత, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''సార్, అన్ని పంటలు వేసి ప్రయత్నించాం. ఇక గంజాయి సాగు చేసుకునేందుకు మాకు అనుమతివ్వండి''

నాసిక్‌ ప్రాంతంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ వచ్చినప్పుడు, గంజాయి సాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఒక రైతు నేరుగా మంత్రిని అడిగారు.

''అది నా చేతుల్లో లేదు'' అని మంత్రి అబ్దుల్ సత్తార్ సమాధానమిచ్చారు.

''వ్యవసాయ ఖర్చులు భరించలేకపోతున్నాం. ధరలు బాగా పెరిగిపోయాయి. ఎరువులు, కూలీ రేట్లు కూడా పెరిగాయి. రైతులకు ఏమీ మిగలడం లేదు. ఒకవేళ వర్షాలు కురిస్తే, 10 నుంచి 20 శాతం గంజాయి మొక్కలైనా బతుకుతాయి. కొంతైనా ఆ భారం తగ్గుతుంది'' అని ఆ రైతు తర్వాత మీడియాతో అన్నారు.

గంజాయి సాగు చేసేందుకు, రవాణా చేసుకునేందుకు రైతులు అనుమతులు అడగడం ఇదేమీ తొలిసారి కాదు.

గంజాయి సాగుకు రైతులు అనుమతి అడుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

వాళ్లు ఇలా ఎందుకు అడుగుతున్నారు? గంజాయి సాగు వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందా? గంజాయి సాగుపై చట్టం ఏం చెబుతోంది?

గంజాయే ఎందుకు?

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

బీడ్ జిల్లా వాఘోరాకి చెందిన శుభమ్ మానె ఒక అగ్రికల్చరల్ ఇంజనీర్. ఆయన ప్రస్తుతం వ్యవసాయంలో తన తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నారు. ఆయన కొద్ది రోజుల కిందట స్థానిక అధికారులకు ఒక విషయం చెప్పారు.

''గంజాయి సాగుకు అనుమతి ఇవ్వాలని నేను కలెక్టర్‌‌కి విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే చెరకు, పత్తి, సోయాబీన్స్ ఏది సాగు చేసినా, వాటికి ధర ఉండదు. చెరకు సాగు చేస్తే త్వరగా కోత కోసేందుకు కంపెనీ ఒప్పుకోదు. అది ఎక్కువకాలం గడిస్తే దాని తియ్యదనం తగ్గుతుంది. దాని వల్ల రైతులకు వచ్చే లాభం తగ్గిపోతుంది'' అని ఆయన తెలిపారు.

శుభమ్ కుటుంబానికి పదెకరాల పొలం ఉంది. అందులో చెరకు, సోయాబీన్స్ పండిస్తారు. గంజాయి సాగు లాభదాయకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

''ఎప్పుడూ వార్తల్లో చూస్తుంటాను. గంజాయి పట్టుకున్నారు అని. అందులో దాని విలువ గురించి పోలీసులు చెబుతుంటారు. అందువల్లే మనం కూడా గంజాయి సాగు చేయాలని అనుకున్నా. దాంతో మా కుటుంబ అవసరాలు తీరుతాయని అనుకుంటున్నా'' అని శుభమ్ చెప్పారు.

అక్రమంగా గంజాయి సాగు

ఫొటో సోర్స్, NBRI

రైతు అరెస్టు

గంజాయి సాగు కేవలం డిమాండ్‌తో ఆగిపోలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు రహస్యంగా సాగు చేస్తున్నారు కూడా.

చించూర్ గ్రామంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న రైతును బీడ్ పోలీసులు 2023 జూన్ 7న పట్టుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకున్నారు.

''చించ్‌పూర్ గ్రామానికి వెళ్లాం. ఆ రైతు తన మిరప పొలంలో ఎనిమిది గంజాయి మొక్కలు నాటాడు. 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం'' అని బీడ్ జిల్లాలోని యూసుఫ్ వడ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న యోగేష్ ఉబాలే చెప్పారు.

''దాని మార్కెట్ విలువ లక్షా 24 వేల రూపాయలు. అతనిపై “నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) కింద కేసు నమోదు చేశాం. ఆయనను అదుపులోకి తీసుకున్నాం'' అని తెలిపారు.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏం చెబుతోంది?

ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్‌ఎస్‌డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం.

ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది.

దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపుర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది.

మహారాష్ట్రలోని శుభమ్ లాంటి రైతులు ఇప్పుడు జనపనార సాగును ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.

‘‘మేము మా తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఆయన తర్వాత మా తండ్రి తరం కూడా అదే చేసింది. ఇప్పుడు నేను కూడా వ్యవసాయం చేయాలనుకుంటున్నా. కానీ, వ్యవసాయం లాభదాయకంగా లేదు. యంత్రాలు వాడడం ద్వారా దిగుబడులు పెంచుతున్నాం. దిగుబడి పెరిగినప్పటికీ మార్కెట్‌లో ధరలు ఉండడం లేదు. కానీ, గంజాయికి మాత్రం మంచి ధర ఉంది. అందుకే గంజాయిని ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా'' అని శుభమ్ చెప్పారు.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క గంజాయే ప్రత్యామ్నాయమా?

కేవలం గంజాయి పంటనే రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందా? వారి ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదేనా?

‘‘ఆర్థిక వ్యవస్థపరంగా మనం ఆలోచిస్తే, శాస్త్రీయ విధానంలో అంటే ఆధునిక పద్ధతిలో పండిస్తే ఏ పంటతో అయినా రైతుల ఆర్థిక స్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది. దాని కోసం గంజాయినే పండించాల్సిన అవసరం లేదు’’ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాట్వాడ యూనివర్సిటీకి చెందిన వృక్షశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ అశోక్ చవాన్ అన్నారు.

ఆదాయానికి, సరికొత్త ఆవిష్కరణలకు ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

‘‘ఒకవేళ సాంకేతిక పద్ధతిలో, అంటే ఆధునిక వ్యవసాయ విధానాల్లో పంటలు వేస్తే రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది’’ అని ఆయన అన్నారు.

అశోక్ చవాన్

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC

ఫొటో క్యాప్షన్, పంటలను శాస్త్రీయ విధానంలో పండించడం ముఖ్యమని డాక్టర్ అశోక్ చవాన్ చెప్పారు.

వైద్యంలోనూ గంజాయి వాడకం

చెరకు, పత్తి వంటి ఎత్తు ఎక్కువగా పెరిగే పంటలలో కొందరు రైతులు అనధికారికంగా గంజాయిని పండిస్తున్నారు.

మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

శుభమ్ లాంటి రైతులకు ఈ విషయం తెలుసు.

‘‘గంజాయిని మత్తు కోసం, వైద్యం కోసం రెండింటికీ వాడతారు. గంజాయితో ఔషధాలు తయారు చేస్తుంటే గంజాయిని పండించేందుకు కూడా అనుమతి ఇవ్వాలి’’ అని శుభమ్ అన్నారు.

గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు.

ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు.

కాన్నబిడాల్‌లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు.

నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25 వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

గంజాయి

ఫొటో సోర్స్, NBRI

ఉత్తరాఖండ్ రైతులు ఏం చెబుతున్నారు?

గంజాయి పండించడాన్ని ఉత్తరాఖండ్‌లో అనుమతిస్తున్నారు. కానీ, ఈ పంట వేయాలంటే తొలుత లైసెన్స్ పొందాలి.

‘‘పరిశోధన కోసం నిరుడు మేం కొంత భూమిలో గంజాయి వేశాం. కానీ, ఈ పంట కోసం మేం విత్తనాలను విదేశాల నుంచి తెప్పించుకున్నాం’’ అని ఒక యువ రైతు బీబీసీ మరాఠీతో చెప్పారు.

‘‘గంజాయి సాగుపై ఈ ఏడాది ఉత్తరాఖండ్ ప్రభుత్వం తన విధానంలో మార్పులు చేసే అవకాశం ఉంది. భారతదేశంలోని సంప్రదాయ రకాల సాగులను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం అనుమతించవచ్చు’’ అని రైతు అభిప్రాయపడ్డారు.

భారత్‌లో చట్టబద్ధంగా పెంచడానికి వీలైన వివిధ రకాలను ఇప్పటివరకు దేశంలో అభివృద్ధి చేయలేదు.

గంజాయి పంట పండించడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి రైతుల్ని అడిగినప్పుడు, ‘‘గంజాయి పంట మూడు నెలల పాటే ఉంటుంది. మూడు నెలల తర్వాత దీన్ని ఎవరు కొంటారు? దీని కోసం పరిశ్రమల వారు ముందుకు వస్తారా’’ అనేది ప్రశ్నార్థకమేనని వారు బదులిచ్చారు.

గంజాయి సాగుకు నీటి లభ్యత బాగుండాలి.

ఈ పంటను ఏడాదిలో రెండుసార్లు పండించవచ్చని ఉత్తరాఖండ్ రైతులు అంటున్నారు.

గంజాయి పంట వల్ల తమ ఆర్థిక స్థితి మెరుగవుతుందని కొంత మంది రైతులంటున్నారు.

గంజాయి తీసుకునేవారు దీనికి బానిసలు అవుతారని, ఇది ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరమని ఈ పంట వేయడాన్ని వ్యతిరేకించే ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: