బియ్యం ఎగుమతులపై నిషేధం: భారత్ నిర్ణయంతో అమెరికా సహా అనేక దేశాలపై ప్రభావం.. సూపర్ మార్కెట్ల దగ్గర క్యూ కడుతున్న ఆసియా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాస్మతి కాకుండా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై భారత్ తక్షణ నిషేధం విధించడంతో అమెరికా సహా వివిధ దేశాలలోని సూపర్ బజార్లలో ప్రజలు బారులు తీరుతున్నారు.
వీలైనన్ని బ్యాగుల బియ్యం కొనుక్కుని ఇంట్లో స్టాక్ పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు.
కొన్ని సూపర్ మార్కెట్ల వద్ద కోవిడ్ సమయంలో పానిక్ బయింగ్ తరహా వాతావరణం మళ్లీ కనిపించిందని అక్కడ ఉంటున్న నల్గొండ జిల్లాకు చెందిన నవీన్ చెప్పారు.
అమెరికా, కొన్ని ఇతర దేశాలలో ఈ నిర్ణయం తరువాత బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.
బియ్యం కోసం సూపర్ మార్కెట్ల క్యూ కడుతున్న భారతీయులు, ఇతర ఆసియన్లకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బాస్మతియేతర రకాల తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ ‘ఆహారం, వినియోగదారుల వ్యవహారాల’ మంత్రిత్వ శాఖ జులై 20న ఉత్తర్వులు జారీచేసింది. నిషేధం తక్షణం అమలులోకి వస్తుందనీ పేర్కొంది.
దేశంలో బియ్యం ధరలలో నిలకడ లేకపోవడంతో ధరలు స్థిరీకరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘దేశీయ మార్కెట్‌లో తగినంత సరకు ఉండేలా చూసేందుకు, తద్వారా ధరలు పెరగకుండా నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తర భారతదేశంలో వరి పండించే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం, దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో వర్షాభావం కారణంగా ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గనుందన్న అంచనాలున్నాయి. దానివల్ల బియ్యం ధరలు పెరగకుండా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
అయితే, బాయిల్డ్ రైస్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. నిషేధం పచ్చి(రా) బియ్యంపైనే.

ఫొటో సోర్స్, Getty Images
కాగా అమెరికాలో ఆసియా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. ఎక్కవగా భారత్ నుంచే అక్కడకు ఎగుమతి అవుతుంటుంది.
భారత్ ఇప్పుడు బాస్మతి తప్ప మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులు నిషేధించడంతో అమెరికాలోని భారతీయుల, ఆసియా ప్రజలు సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు.
దాంతో కొన్ని సూపర్ మార్కెట్లలో బియ్యం బస్తాలు కొద్ది నిమిషాలలోనే అమ్ముడుపోయాయని చెప్తున్నారు.
బియ్యం కోసం జనం పోటెత్తడంతో కొన్ని సూపర్ మార్కెట్లలో తమ కస్టమర్లు అందరికీ బియ్యం లభ్యమయ్యేలా చూసేందుకు గాను ఒక్కొక్కరికి ఒకట్రెండు బ్యాగుల కంటే ఎక్కువ విక్రయించకుండా పరిమితి పెట్టారని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
నిషేధం పరిధిలోకి వచ్చేవి ఏవంటే...
- పాక్షికంగా మరపట్టిన బాస్మతియేతర తెల్లబియ్యం
- పూర్తిగా మరపట్టిన తెల్లబియ్యం
- పాలిష్ చేయని తెల్లబియ్యం
వీటిపై నిషేధం లేదు
- బాస్మతి బియ్యం
- బాస్మతియేతర రకాలలలో ఉప్పుడు బియ్యం
- నూకలు
- బియ్యం పిండి

మినహాయింపులు
ఆహార భద్రత అవసరాల కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కేటగిరీలోని దేశాలకు ఎగుమతి చేయడంపై నిషేధం లేదు.
అలాగే ఈ నోటిఫికేషన్ జారీ అయ్యేటప్పటికే సరకు ఓడల్లో లోడ్ చేయడం ప్రారంభించిన కేసులకూ మినహాయింపు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
140 దేశాలకు భారత్ బియ్యమే
ప్రపంచంలోని బియ్యం ఎగుమతులలో భారత్ వాటా సుమారు 40 శాతం. భారత్ నుంచి సుమారు 140 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది.
భారత్ తరువాత అత్యధికంగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి.
2022లో ప్రపంచ బియ్యం ఎగుమతులు 5.54 కోట్ల టన్నులు కాగా అందులో ఒక్క భారత్ నుంచే 2.22 కోట్ల టన్నులు ఎగుమతయ్యాయి. ఇందులో బాస్మతియేతర రకాల బియ్యం 1.8 కోట్ల టన్నులు. ఈ 1.8 కోట్ల టన్నులలో 1.03 కోట్ల టన్నులు తెల్ల బియ్యం.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















