సల్మా: ‘నా ప్రపంచం భారత్‌లోనే ఉంది.. పాకిస్తాన్‌కు పంపిస్తే నాకు చావే గతి’- భారత పౌరసత్వం కోసం 38 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాక్ మహిళ కథ

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
- రచయిత, షాబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ కోసం
ఓ భారతీయుడిని ప్రేమించి పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చేసిన సీమా హైదర్ పేరు ఈ మధ్య వార్తల్లో ప్రధానంగా వినిపిస్తోంది. నలుగురు పిల్లలను తోడ్కొని నేపాల్ గుండా సీమా భారత్‌లోకి ప్రవేశించారు.
సీమా హైదర్‌కు వంద కి.మీ. దూరంలో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని శామిలీలో సల్మా జీవిస్తున్నారు. ఆమె కూడా సీమాలానే పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చారు.
63 ఏళ్ల సల్మా చూడటానికి కాస్త బలహీనంగా కనిపిస్తున్నారు. ఆమెకు మధుమేహముంది. శుక్లాల వల్ల ఒక కన్ను కూడా ఆమెకు కనిపించదు.
చూపు మందగించినప్పటికీ, ఇక్కడి కోడలిగా తన పేరును పేపర్లపై చూసుకోవాలని ఆమె ఎంతో ఆశపడుతున్నారు. గత 38 ఏళ్లుగా భారత పౌరసత్వం కోసం ఆమె ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ విషయంపై గడీ పుఖ్తా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి, ఇన్‌స్పెక్టర్ రాధేశ్యామ్ మాట్లాడుతూ- ‘‘గడీ పుఖ్తాలోని జైన్‌పురీ ప్రాంతంలో అనీస్ అహ్మద్ నివసిస్తున్నారు. ఆయన భార్య సల్మా పాకిస్తాన్ నుంచి వచ్చారు. ఆమె ప్రస్తుతం లాంగ్ టర్మ్ వీసాపై ఇక్కడ జీవిస్తున్నారు. అంతవరకే మాకు తెలుసు. ఆమె కదలికలను మేం నిరంతరం గమనిస్తుంటాం’’ అన్నారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
సల్మా నా అత్తకూతురు
65 ఏళ్ల అనీస్ అహ్మద్ ఇల్లు శామిలీలోని గడీ పుఖ్తాలో ఉంది. ఆయన కూరగాయల హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన భార్య సల్మా స్వస్థలం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్.
సల్మాతో తనకు ఎలా పెళ్లైందో బీబీసీతో అనీస్ మాట్లాడారు.
‘‘1983 సెప్టెంబరు 23న పాకిస్తాన్‌లోనే సల్మాతో నాకు పెళ్లి జరిగింది. ఆమె మా అత్త కూతురు. దేశ విభజనకు ముందు, మా అత్తయ్య పానీపత్‌లో జీవించేవారు. కానీ, విభజన తర్వాత ఆమె పాక్ వెళ్లిపోయారు. మా నాన్న అబ్దుల్ అజీజ్ మాత్రం గడీ పుఖ్తాలోనే ఉండిపోయారు’’ అని ఆయన చెప్పారు.
‘‘దేశ విభజన తర్వాత మా అత్తయ్య, మామయ్య సల్మాతుల్లా ఇక్కడకు వస్తుండేవారు. సల్మా ఝంగ్‌లోనే పుట్టారు. మాతో సంబంధం కలుపుకోవాలని మా అత్తయ్య భావించారు. అప్పట్లో నాకు 24 ఏళ్లు. సల్మాకు 22 ఏళ్లు. పెళ్లి తర్వాత 1985 నుంచి సల్మాకు పౌరసత్వం కోసం మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
పాకిస్తాన్‌లో పెళ్లి
అనీస్‌కు ముగ్గురు సోదరులు, ఒక సోదరి. వీరంతా గడీ పుఖ్తాలోనే జీవిస్తారు. వీరిలో ఒక అన్నయ్య, చెల్లి మరణించారు.
‘‘నాడు పెళ్లి కోసం మేం పాకిస్తాన్‌కు రైల్లో వెళ్లాం. మొత్తం బంధువులంతా కలిసి 22 మంది వెళ్లాం. అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మాలో కొందరం అక్కడే మూడు నెలలపాటు ఉన్నాం. పెళ్లి సంప్రదాయాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత సల్మాతో కలిసి ఇక్కడకు వచ్చాం’’ అని అనీస్ చెప్పారు.
మరోవైపు సల్మా మాట్లాడుతూ.. ‘‘మా పెళ్లి ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను ఆ రోజు ఎరుపు రంగు బట్టలు వేసుకున్నాను. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా గడిపారు. నేను భారత్‌కు వెళ్తున్నానని చాలా ఉత్సహంగా ఉండేదాన్ని. ఆ దేశం ఎలా ఉంటుందో చూడాలని ఎంతో అంతురత పడేదాన్ని’’ అని ఆమె చెప్పారు.
సల్మా తండ్రి పేరు సల్మాతుల్లా. ఝంగ్‌లోని భబరానా ప్రాంతానికి చెందిన ఆయన చాలా కాలం క్రితమే మరణించారు. అయితే, ప్రస్తుతం సల్మాతుల్లా మేనల్లుళ్లు, మేనకోడళ్లు మాత్రమే ఆయన ఇంట్లో జీవిస్తున్నారు. సల్మాకు నలుగురు తోబుట్టువులు. వీరిలో ప్రస్తుతం సల్మా మాత్రమే జీవించి ఉన్నారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
1985లోనే పౌరసత్వానికి దరఖాస్తు
పెళ్లి తర్వాత వీసాపై తన భార్యను భారత్‌కు తీసుకొచ్చినట్లు అనీస్ అహ్మద్ వెల్లడించారు. వీసా గడుపు పూర్తయిన వెంటనే 1985లో ఆమెకు పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టారు.
‘‘అప్పట్లోనే పౌరసత్వం కోసం జిల్లా పరిపాలనా యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నాం. అప్పట్లో శామిలీ జిల్లా కాదు. ముజఫర్‌నగరే మా జిల్లా’’ అని అనీస్ చెప్పారు.
‘‘ఆ తర్వాత నా భార్య వీసాను ఐదేళ్లపాటు పొడిగించారు. కానీ, ఇప్పటివరకు ఆమెకు పౌరసత్వం రాలేదు. దీంతో ప్రతిసారీ వీసా పొడిగించుకోవడానికి, పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR
‘భారత పౌరురాలిగా అక్కడ ప్రమాణం కూడా చేశారు’
పౌరసత్వం కోసం 38 ఏళ్లుగా సల్మా, ఆమె భర్త అనీస్ అహ్మద్ దరఖాస్తు చేస్తూనే ఉన్నారు.
అయితే, 2015 ఆగస్టు 10న శామిలీ జిల్లా పరిపాలనా విభాగం నుంచి దేశ పౌరురాలిగా ప్రమాణం చేసేందుకు రావాలని లేఖ కూడా వీరికి వచ్చింది. దీంతో పౌరసత్వం ఇక వస్తుందనే వీరు భావించారు.
‘‘2015, ఆగస్టు 10న నా భార్యకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆ లేఖ పంపించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు రమ్మని చెప్పారు. మేం అలానే అక్కడికి వెళ్లాం. ప్రమాణం కూడా చేశాం. అయినప్పటికీ మాకు పౌరసత్వం ఇప్పటివరకూ రాలేదు’’ అని అనీస్ అహ్మద్ చెప్పారు.
ఈ విషయంపై శామిలీ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర సింగ్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘ఈ విషయంలో మేం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే’’ అని ఆయన అన్నారు.
నా ప్రపంచం భారత్‌లోనే ఉంది: సల్మా
38 ఏళ్ల నుంచి పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న సల్మాకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీరి వయసు 37 నుంచి 19 ఏళ్ల మధ్య ఉంటుంది.
పౌరసత్వంపై సల్మా మాట్లాడుతూ- ‘‘నా పిల్లలు, నా భర్త అందరూ భారత్ పౌరులే. ఈ వయసులో ఇక పరుగులు పెట్టలేను. ఇప్పటికైనా భారత ప్రభుత్వం నాకు పౌరసత్వం ఇవ్వాలి. నా ప్రపంచం భారత్‌లోనే ఉంది. పాకిస్తాన్‌కు పంపిస్తే నాకు చావే గతి’’ అని ఆమె అన్నారు.
ఈ విషయాలు చెప్పేటప్పుడు సల్మా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె చిన్న కుమార్తె తఫ్సిరా కూడా ఆమెతోపాటు ఏడుస్తూ కనిపించారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















