పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు

ఫొటో సోర్స్, NHLANHLA MOSHOMO
- రచయిత, ఎంపో లకాజే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలను కొనసాగించే 'పాలియామరీ' దక్షిణాఫ్రికా యువతలో పెరుగుతోంది.
లెథాబో మొజలేఫా బై సెక్సువల్. ఆమె 2018 డిసెంబర్‌లో ఫ్లెచర్ మొజలేఫా అనే వ్యక్తితో డేటింగ్ ప్రారంభించారు.
20 ఏళ్ల వయస్సున్న ఈ జంట, వాళ్ల రెండేళ్ల కొడుకు దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లోని ఓ టౌన్‌షిప్‌లో ఉంటున్నారు.
అయితే మొదట్లో లెథాబో బై సెక్సువల్ అని ఫ్లెచర్‌కు తెలియదు.
"మేం రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన రెండు, మూడు నెలల తర్వాత విషయం చెప్పాను. ఎందుకంటే ఫ్లెచర్ దగ్గర ఏదీ దాచకూడదని అనుకున్నా'' అని లెథాబో చెప్పారు.
విషయం తెలిశాక ఫ్లెచర్ ఏమీ అనలేదు. "ఆమె నాతో చెప్పినందుకు సంతోషిస్తున్నా" అన్నారాయన.
లెథాబో నిజం చెప్పకపోతే, మేం రహస్యంగా మరో రిలేషన్‌షిప్ కొనసాగించినా, అది ఎక్కువ రోజులు దాగదని మాకు తెలుసని ప్లెచర్ అన్నారు.
అయితే, తమ సంబంధం బాగుండాలంటే తమ ఇద్దరి సెక్సువల్, ఎమోషనల్ అవసరాలను తీర్చే మరో బై సెక్సువల్‌ను తమ జీవితంలోకి ఆహ్వానించాలని ఈ జంట నిర్ణయించుకుంది.
బయట అలాంటి వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, NHLANHLA MOSHOMO
ముగ్గురినీ కలిపిన నైట్‌క్లబ్
నిరుడు ఆగస్టులో బర్గర్స్‌ఫోర్ట్‌లోని నైట్‌క్లబ్‌లో స్ట్రిప్పర్‌గా పనిచేస్తున్న లున్యా మకువా అనే బై సెక్సువల్ మహిళను ఇరువురు కలిశారు. ఆమెది కూడా 20 ఏళ్ల వయసే.
"మేం ముగ్గురం బాగా కలిసిపోయాం. మా మాటల్లో చాలా విషయాలకు కనెక్ట్ అయ్యాం. ఫ్లెచర్ మొదటి నుంచి ఆమెను ఇష్టపడ్డాడు. తను అలాంటి ఆడవారిని ఇష్టపడతాడని నాకు తెలుసు" అని లెథాబో చెప్పారు.
"నేను కూడా ఇలాంటి వ్యక్తినే. అందుకే మేమంతా ఒకచోట కలిశాం" అన్నారు లూన్యా.
నాకు ఇద్దరిపై ఫీలింగ్స్ ఉన్నాయి: లూన్యా
"లెథాబో నన్ను కలిసింది, అనంతరం ఆమెతో డేటింగ్ మొదలుపెట్టా. ఆ తర్వాత నన్ను ఫ్లెచర్‌కు పరిచయం చేసింది. మేం ముగ్గురం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం" అని లున్యా చెప్పారు.
"నాకు లెథాబో మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే, ఫ్లెచర్‌పై కూడా ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమైంది. మేం ఒక సోషల్ ఈవెంట్‌లో ఉన్నపుడు అతన్ని ముద్దుపెట్టుకున్నా. సోషల్ ఈవెంట్స్‌కు హాజరైనా, గెస్ట్ హౌస్‌లో బస చేసినా, మేం ముగ్గురం ఒకే బెడ్‌పై పడుకుంటాం'' అని తెలిపారు లూన్యా.
దక్షిణాఫ్రికాలో లింపోపో ప్రావిన్స్ గ్రామీణ ప్రాంత ప్రజలు పాలియామరీ బంధాన్ని అంత త్వరగా అంగీకరించలేదు.
చుట్టుపక్కల వాళ్లు కొందరు ఇప్పటికీ తమను అర్థం చేసుకోలేదని, తమ బంధాన్ని ఎక్కువ మంది పెళ్లాలు, ఎక్కువమంది మొగుళ్లతో సంసారం చేసే బంధంగా పొరబడతారని లెథాబో అంటున్నారు. అలాంటి బంధాలు దక్షిణాఫ్రికాలోని కొన్ని కమ్యూనిటీలలో సాధారణం.

ఫొటో సోర్స్, NHLANHLA MOSHOMO
ఇద్దరితో డేటింగ్ చేస్తున్నా: లెథాబో
"నా భాగస్వామి మరొక భాగస్వామితో ఎలా ఉంటాడని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. లూన్యా అతని భాగస్వామి మాత్రమే కాదు, నేను కూడా ఆమెతో డేటింగ్ చేస్తున్నానని వారికి చెబుతున్నా'' అని లెథాబో తెలిపారు.
"ఆమె నా భాగస్వామి అని జనానికి అర్థమైన తర్వాత ఇది మంచిపని కాదని, అందరూ నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. నేను వీటన్నింటినీ పట్టించుకోను. నేనేం చేస్తున్నానో నాకు స్పృహ ఉంది. నేను తీసుకుంటున్న నిర్ణయాల గురించి నాకు తెలుసు'' అన్నారు లెథాబో.
ఒక మహిళ మరొక మహిళ పట్ల ఆకర్షితమవుతుందంటే వారు పెద్దగా నమ్మరంటున్నారు లెథాబో. ఆ సంబంధం ఎలా ఉంటుందో ముగ్గురు వివరించాల్సి వచ్చేది.
ఈ ఇద్దరు యువతుల్లో ఫ్లెచర్ తను కావాలనుకున్న అమ్మాయితో సెక్స్ చేస్తున్నాడని చుట్టుపక్కలవాళ్లు అనుకొంటుంటారని లెథాబో చెబుతున్నారు. అయితే దీనిపై ఫ్లెచర్ స్పందిస్తూ- ఆ ఇద్దరు యువతులు తాను లేకున్నా సెక్స్ చేసుకోగలరని అంటున్నారు.
సైకాలజిస్టులు ఏమంటున్నారు?
పాలిమరస్ సంబంధాలను నిర్వచించేది పరస్పర అంగీకారమని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ ఒపెర్‌మాన్ చెప్పారు.
"వివిధ లైంగిక ధోరణులున్న వ్యక్తులూ సంఘంలో భాగమే. వాళ్లు వారి భాగస్వాములను ఒప్పించి రిలేషన్‌షిప్స్ నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తారు" అని ఒపెర్‌మాన్ అన్నారు.
తాము ఇప్పుడు పాలియామరీలో ఎక్కువ మంది వ్యక్తులను చూస్తున్నామని, దక్షిణాఫ్రికాలో ఇది చాలా సాధారణమని రిలేషన్ షిప్ కౌన్సెలర్లు అంటున్నారు.
పాలియామరీ సంబంధాన్ని ఇష్టపడే వాళ్లు తరచూ ఆన్‌లైన్‌లో డేటింగ్ చేయడం ప్రారంభిస్తారు.
జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్, డర్బన్ లాంటి ప్రధాన నగరాల్లో సోషల్ ఈవెంట్లను నిర్వహించే ‘పాలియామరీ’ పార్ట్‌నర్స్ సంఖ్య పెరుగుతోంది.
యువతకే పరిమితం కాదు
పాలియామరీ వ్యవహారాలు పెరుగుతున్నప్పటికీ అవి యువతకు మాత్రమే పరిమితం కాలేదని ఇంటిమసీ, రిలేషన్‌షిప్స్ కోచ్ నిపుణులు ట్రేసీ జాకబ్స్ చెప్పారు.
"జనరేషన్ వై, జనరేషన్ జెడ్ వంటి యువ తరాలలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు కూడా పాాలిమరీ బంధాలను, ఒకరికన్నా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలను పెట్టుకొంటున్నారు'' అని తెలిపారు.
ఇలాంటి వ్యక్తుల పరిధి చాలా విస్తృతమైనదని, దీనికి స్పష్టమైన వయస్సు లేదని ట్రేసీ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, NHLANHLA MOSHOMO
పిల్లల విషయంలో జాగ్రత్త
పాలియామరీ విషయంలో సాధారణంగా తలెత్తే ప్రశ్నలు ఏమిటంటే- ఇది పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా లూన్యా, లెథాబో, ఫ్లెచర్ లాంటి వారి కేసుల్లో ఎలా ఉంటుంది?
"బిడ్డకు ఇద్దరు తల్లులున్నారు, కాబట్టి పిల్లాడు బాగానే ఎదుగుతాడని భావిస్తున్నా. ఒకరి కన్నా ఎక్కువ మంది జీవిత భాగస్వాములు ఉండే కుటుంబాలను చాలానే చూశా. ఆ కుటుంబమంతా ఒక పెరట్లో, ఒకే ఇంట్లో పెరిగారు. కాబట్టి, అంతా బాగానే ఉంటుందనుకుంటున్నా" అని లెథాబో వ్యాఖ్యానించారు.
లూన్యా కూడా లెథాబో వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఆమె సొంత తల్లి కానప్పటికీ, బిడ్డను పెంచడంలో బాధ్యత తీసుకొంటున్నట్టు చెప్పారు.
"లెథాబో సాధారణంగా బిజీగా ఉంటుంది. కాబట్టి, తను లేనప్పుడు, నేను బిడ్డను చూసుకుంటా. ఒక రోజు నాకు కూడా బిడ్డ పుడుతుంది. మనకు బిడ్డ పుట్టబోతుంటే, అంగీకరించాలి. లెథాబో సరేనంటే, మేమూ బిడ్డను కనవచ్చు" అని లూన్యా తెలిపారు.
అయితే, పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఓపెర్‌మాన్ సూచిస్తున్నారు.
"పాలీమోరస్ వ్యవహారాలు ఉండే చోట పిల్లలు గందరగోళాన్ని అనుభవించవచ్చు. తల్లిదండ్రులు వారి రిలేషన్‌షిప్‌లో నిజాయతీగా లేనప్పుడు ఇది జరగొచ్చు. ప్రేమను అనేక విధాలుగా వ్యక్తీకరించవచ్చనే వాస్తవం పిల్లలకు అర్థం కాకపోతే, వారు గందరగోళానికి గురవుతారు" అని తెలిపారు ఓపెర్ మాన్.
ఇక ఫ్లెచర్, లెథాబో, ల్యూనా వారి జీవితంలోకి నాలుగో వ్యక్తిని కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














