స్విట్జర్లాండ్‌కు చెందిన ఈవ్ వైవోనె సావిత్రీబాయిగా ఎందుకు మారారు, పరమవీర, శౌర్య చక్ర పతకాల రూకల్పనలో ఆమె పాత్ర ఏంటి?

విక్రమ్ ఖణోల్కర్, సావిత్రిబాయి

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్, విక్రమ్ ఖణోల్కర్, సావిత్రిబాయి

స్విట్జర్లాండ్‌కి చెందిన 16 ఏళ్ల బాలిక.. తన కంటే ఎనిమిదేళ్ల పెద్ద అయిన భారతీయ యువకుడిని ప్రేమించింది. కుటుంబ సభ్యులను వదులుకుని ఆయన్ను పెళ్లాడేందుకు భారత్‌కు వచ్చేసింది.

ఇది విన్న తర్వాత, ఈ ప్రేమ పెళ్లిలో కొత్తేముందని మీకనిపించొచ్చు. కానీ, ఇది జరిగింది సుమారు 90 ఏళ్ల కిందట. అంటే 1929లో.

స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు వచ్చిన ఆ బాలిక పేరు ఈవ్ వైవోనె. తర్వాత ఆమె తన పేరు సావిత్రిబాయిగా మార్చుకున్నారు.

ఆమె పేరుకి మాత్రమే కాదు, ఇక్కడ సంస్కృతిని కూడా అలవరుచుకున్నారు.

భారతీయ సైనికులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ‘పరమ వీర చక్ర’ను డిజైన్ చేసింది సావిత్రిబాయే.

సావిత్రిబాయి దేశం, భాష, సంస్కృతి అడ్డంకులను దాటుకుని తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? ఆమె కథేంటి చూద్దాం..

24 ఏళ్ల మరాఠీ యువకుడు విక్రమ్ ఖణోల్కర్ రాయల్ మిలటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో చదువుకున్నారు.

మహారాష్ట్రలోని సావంత్వాడికి చెందిన విక్రమ్, రాయల్ మిలటరీ అకాడమీలో చదువుకుంటూనే స్విట్జర్లాండ్ వచ్చారు.

అక్కడే ఈవ్‌ను కలుసుకున్నారు. ఆమె అతనికంటే ఎనిమిదేళ్ల చిన్న. వారిద్దరూ ప్రేమలో పడ్డారు.

ఈవ్ తండ్రి హంగేరియన్. తల్లి రష్యన్. 16 ఏళ్ల వయసులోనే ఈవ్, విక్రమ్ ఖణోల్కర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఆ తర్వాత విక్రమ్ కోసం భారత్‌కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ సోషియాలజీ ప్రొఫెసర్ అయిన ఈవ్ తండ్రికి తన కూతురు ఒక శ్వేతజాతీయేతరుడిని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు.

కానీ, ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. 1932లో 19 ఏళ్ల వయసులోనే ఈవ్ భారత్‌కు వచ్చారు. లఖ్‌నవూలో విక్రమ్ ఖణోల్కర్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు.

‘తప్పిదం వల్ల నేను యూరప్‌లో పుట్టాను’

పెళ్లి తర్వాత ఈవ్ వైవోనె హిందూ మతంలోకి మారారు. ఆ తర్వాత తన పేరును కూడా సావిత్రిబాయిగా మార్చుకున్నారు.

భారత్ వచ్చిన తర్వాత ఆమెకు ఇక్కడున్న ఎన్నో విషయాలపై మక్కువ పెంచుకున్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక పరిజ్ఞానం, హిందూ గ్రంథాలు, హిందూ సంస్కృతిని చదవడం ప్రారంభించారు.

కేవలం మామూలుగా చదవడంతోనే ఆపేయకుండా నలందా యూనివర్సిటీ నుంచి డిగ్రీని కూడా పొందారు.

హిందూ సంప్రదాయాలు, సిద్ధాంతాలపై ఎనలేని అభిమానాన్ని పెంచుకున్న సావిత్రిబాయికి భారతీయ సమాజం, సంస్కృతిని అలవరుచుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు.

హిందూ మతాన్ని అనుసరించడం, ఆ తర్వాత సహజంగానే భారతీయ సంస్కృతిని పాటించడం జరిగాయి.

సావిత్రి ఖణోల్కర్ కేవలం భారతీయ సంస్కృతిని మాత్రమే తెలుసుకోలేదు. ఇక్కడున్న భాషలను కూడా ఆమె నేర్చుకున్నారు.

మరాఠీ, సంస్కృతం, హిందీ భాషలపై ఆమె పట్టు సంపాదించుకున్నారు.

భారతీయ నృత్యం, సంగీతం, చిత్రలేఖనాలను ఆమె నేర్చుకున్నారు.

తనను విదేశీయురాలు అని పిలవడం సావిత్రిబాయికి అసలు నచ్చేది కాదు.

ఎందుకంటే ఆ సమయంలో ఆమె భారత్‌తో ఎంతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు.

‘‘పొరపాటున నేను యూరప్‌లో పుట్టాను’’ అని సావిత్రిబాయి ఎప్పుడూ అంటూ ఉండేవారు.

భారతీయ పురాణ గాథలను, చరిత్రను లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్నారు.

ఆమె విద్యానైపుణ్యాలను తెలుసుకున్న తర్వాత, మేజర్ జనరల్ హిరాలాల్ అటల్ భారతీయ అత్యున్నత శౌర్య పురస్కారం పరమ వీర చక్రను డిజైన్ చేయడంలో సావిత్రిబాయి సాయం తీసుకున్నారు.

సావిత్రిబాయ్ ఖణోల్కర్ స్విట్జర్లాండ్ సంతతికి చెందిన మహిళే అయినప్పటికీ, ఆమె భారతీయ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు.

పరమ వీర చక్ర అవార్డు

ఫొటో సోర్స్, NATIONAL WAR MEMORIAL

పరమ వీర చక్రను ఎలా రూపొందించారు?

1947లో భారత్‌కి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశం విభజనకు గురైంది. భారత్, పాకిస్తాన్‌లు రెండు దేశాలుగా విడిపోయాయి.

స్వాతంత్య్రం తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాలకు గౌరవంగా పతకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ బాధ్యతను భారత సైన్యం మేజర్ జనరల్ హిరాలాల్ అటల్‌కి అప్పజెప్పారు.

ఈ అవార్డును డిజైన్ చేసేందుకు అటల్, సావిత్రిబాయిని ఆహ్వానించారు.

వేదాలు, భారతీయ గ్రంథాలతో పాటు పలు భారతీయ భాషలపై ఆమెకు పట్టు ఉండడంతో ఆమె సాయం తీసుకోవాలని మేజర్ జనరల్ అటల్ నిర్ణయించారు.

సావిత్రిబాయి రెండు పుస్తకాలను కూడా రాశారు. మహారాష్ట్ర సాధువులపై కూడా ఆమె పుస్తకం రాశారు. సంస్కృత పేర్లతో డిక్షనరీ రూపొందించారు.

భారత్‌ను 150 ఏళ్ల పాటు పాలించిన బ్రిటన్ తన సైనికులకు అత్యున్నత శౌర్య పురస్కారంగా విక్టోరియా క్రాస్‌ను ఇస్తుంటుంది.

అంతే స్థాయిలో భారత్‌కి కూడా అవార్డును రూపొందించడం సావిత్రిబాయి ముందున్న సవాలే.

పరమ వీర చక్ర అవార్డును డిజైన్ చేసేటప్పుడు, సావిత్రిబాయ్ హిందూ పురాణాలను ఆధారంగా తీసుకున్నారు.

ఈ అవార్డును రూపొందించేటప్పుడు, ఆమె ‘వజ్ర’ అనే కథను స్ఫూర్తిగా తీసుకున్నారు.

రాక్షసులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇంద్రుని ఆయుధంగా వజ్రానికి పేరుంది.

భారతీయ పురాణాల ప్రకారం, వృత్రాసురుడి సంహారం కోసం ఇంద్రునికి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చేందుకు దధీచి అనే రుషి తన శరీరాన్ని అర్పించాడు.

ఆయన వెన్నెముకతో రూపొందించినదే ‘వజ్రాయుధం’. ఇంద్రుడు ఈ వజ్రాయుధంతో వృత్రాసురుడిని సంహరిస్తాడు.

దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న సావిత్రి ఖణోల్కర్, 3.5 సెంటీ మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో కాంస్య పతకాన్ని రూపొందించారు.

పాకిస్తాన్‌తో జరిగిన 1948 యుద్ధంలో బద్గాం యుద్ధ క్షేత్రంలో పోరాడి అమరవీరులైన మేజర్ సోమ్‌నాథ్ శర్మకు తొలిసారి పరమ వీర చక్ర పురస్కారాన్ని ఇచ్చారు.

కేవలం పరమ వీర చక్రను మాత్రమే కాకుండా సావిత్రి ఖణోల్కర్ పలు ఇతర శౌర్య పురస్కారాలను కూడా రూపొందించారు.

అశోక చక్ర, మహా వీర చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర వంటి పురస్కారాలను ఆమె డిజైన్ చేశారు.

1952లో సావిత్రిబాయ్‌తో కలిసి రైలులో రాంచి నుంచి కోల్‌కతాకి వస్తోన్న సమయంలో, ఆగస్ట్ 29 ఉదయం విక్రమ్ ఖణోల్కర్ గుండెపోటుతో కన్నుమూశారు.

సావిత్రిబాయ్ తన మిగిలిన జీవితాన్ని రామకృష్ట మఠంలో గడిపారు.

యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు, విభజన సమయంలో నిరాశ్రయులైన కుటుంబాలకు సాయంగా ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఆ తరువాత 77 ఏళ్ల వయసులో 1990లో సావిత్రిబాయి మరణించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)