మణిపుర్ హింస: అసలేమైంది? ఎందుకు ఇదంతా జరుగుతోంది?

మణిపుర్ హింస

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మణిపుర్‌లో హింసకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న మహిళలు
    • రచయిత, గ్రేమ్ బేకర్
    • హోదా, బీబీసీ న్యూస్

చిన్న రాష్ట్రమైన మణిపుర్‌లో రెండు గ్రూపులైన మెజార్టీ మెయితెయ్, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి ఆ రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది.

మణిపుర్‌లో మే నెలలో మెయితెయ్ వర్గానికి చెందిన పురుషులు ఇద్దరు కుకి మహిళలను వివస్త్రులను చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన భయానక వీడియో బుధవారం బయటకొచ్చింది.

మహిళల గ్రామాన్ని ధ్వంసం చేసిన తర్వాత నిందితులుఈ ఘటనకు పాల్పడ్డారు.

ఈ ప్రాంతంలో జరుగుతున్న తీవ్రమైన హింసకు, మహిళలపై దాడులకు ఈ ఘటన తార్కాణంగా నిలుస్తోంది.

మణిపుర్ ఎక్కడుంది? అక్కడెవరు నివసిస్తున్నారు?

బంగ్లాదేశ్ తూర్పున, మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్. పర్వతాలతో, లోయలతో, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది.

ఈ ప్రాంత జనాభా 33 లక్షలు.

ఈ రాష్ట్రంలో సగానికి పైగా మెయితెయ్ వర్గం వారు ఉన్నారు. సుమారు 43 శాతం మంది కుకీలు, నాగాలు మైనార్టీ తెగలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు.

ఏం జరుగుతోంది?

మెయితెయ్, కుకి తెగల మధ్య రాజుకున్న హింసలో ఇప్పటివరకు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మంది గాయపడ్డారు.

ఆర్మీ, పారామిలటరీ బలగాలు, పోలీసులు ఈ హింసను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ హింసాత్మక ఘటనలు ఆగడం లేదు.

60 వేల మందికి పైగా ప్రజలు బలవంతంగా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

పోలీసుల ఆయుధాలను దొంగలించారు. వందలాది చర్చిలను తగులబెట్టారు, దేవాలయాలపై దాడిచేశారు. గ్రామాలను ధ్వంసం చేశారు.

మణిపుర్ గ్రాఫ్
ఫొటో క్యాప్షన్, మణిపుర్ గ్రాఫ్

ఇదెలా ప్రారంభమైంది?

మణిపుర్‌లోని మెయితెయ్ తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది.

ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకబడి ఉన్న వీరి ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే, కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూములు కొనేందుకు లేదా స్థిరపడేందుకు వారికి అనుమతిస్తున్నట్లు అవుతుందని వాదిస్తూ నిరసనలకు దిగారు.

అంతేకాక, వారి నిరసనలకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మెయితెయ్‌కి చెందిన ప్రభుత్వం డ్రగ్స్‌పై చేపట్టిన యుద్ధంతో, తమ కమ్యూనిటీలను సమూలంగా నాశనం చేయాలని చూస్తుందని కుకీలు ఆరోపిస్తున్నారు.

మియన్మార్ నుంచి ఈ రాష్ట్రంలో వస్తోన్న అక్రమ వలసలు కూడా ఈ ఉద్రిక్తలను మరింత పెంచాయి.

పెరుగుతోన్న జనాభాతో ఆ రాష్ట్రంలో భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. యువతలో నిరుద్యోగం వారిని మిలటెంట్ల వైపుకి ఆకర్షితమయ్యేలా చేసింది.

ఎవరు, ఎవరితో యుద్ధం చేస్తున్నారు?

మెయితెయ్, కుకీ, నాగా మిలటెంట్లు ఎన్నో దశాబ్దాలుగా భూహక్కులు, మతపరమైన విభేదాలతో ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. భారత భద్రతా దళాలతో కూడా ఘర్షణలు జరుగుతున్నాయి.

అయితే, తాజాగా నెలకొన్న ఈ వివాదం పూర్తిగా మెయితెయ్, కుకీల మధ్యనే జరుగుతోంది.

‘‘ఈ సారి జరుగుతోన్న ఘర్షణలు పూర్తిగా రెండు జాతుల మధ్యనే జరుగుతున్నాయి. మతపరమైనవి కావు’’ అని ఫ్రంటియర్ మణిపుర్ ఎడిటర్ ధిరేన్ ఏ సదోక్పం చెప్పారు.

కుకీ, మెయితెయ్‌లు ఎవరు?

మెయితెయ్ వర్గానికి చెందిన వారి మూలాలు మణిపూర్, మియన్మార్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి.

వీరు ఎక్కువగా హిందూవులు. కొందరు సనామహి మతాన్ని అనుసరిస్తున్నారు.

కుకీలు ఎక్కువగా క్రిస్టియన్లు ఉన్నారు. ఈశాన్య భారతంలో వీరు వ్యాప్తించి ఉన్నారు. మణిపుర్‌లో చాలా మంది క్రిస్టియన్లు తమ మూలాలు మియన్మార్‌లో కూడా ఉన్నాయి.

మెయితెయ్‌లు ఇంఫాల్ వ్యాలీలో నివసిస్తుండగా.. కుకీలు చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

మహిళలపై ఎందుకు దాడి జరిగింది, ఎందుకంత అమానవీయంగా ప్రవర్తించారు?

హింసాత్మక సంఘటనలు చెలరేగినప్పుడు, లైంగిక వేధింపులు, అత్యాచారాలను ఆయుధంగా వాడుకుంటున్నారన్న దానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా ఉందని దిల్లీలోని బీబీసీ గీతా పాండే అన్నారు.

ఇది తరచుగా ప్రతీకార దాడులుగా మారే ప్రమాదముందని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, మే నెలలో ఈ సంఘటన జరిగిన తర్వాత, కుకీ సైనికాధికారుల చేతిలో మెయితెయ్ మహిళలు అత్యాచారానికి గురయ్యారని నకిలీ రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.

కుకీ మహిళలపై దాడిపై స్పందించిన మోదీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కుకీ మహిళలపై దాడిపై స్పందించిన మోదీ

కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఈ వారంలో మే 4న జరిగిన దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపుర్ దాడి విషయంలో మౌనంగా ఉన్నారు.

మణిపుర్‌లో మహిళల పట్ల జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ తన హృదయం బాధతో నిండిపోయిందని అన్నారు.

ఇలాంటి చర్యలతో దేశాన్ని అవమానిస్తున్నారని, దోషులను వదిలిపెట్టబోమని చెప్పారు.

మణిపుర్‌లోని ఆడపిల్లలపై జరిగిన దాడి ఎప్పటికీ మర్చిపోలేనిది అన్నారు. మణిపుర్‌లో జరుగుతోన్న హింసపై ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారి.

మణిపుర్ విషయంలో పబ్లిక్‌గా కామెంట్ చేయడానికి ప్రధానికి ఎందుకింత సమయం పట్టిందని చాలా మంది భారతీయులు ప్రశ్నిస్తున్నారు.

తాజా హింసను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 40 వేల మంది సైనికుల్ని, పారామిలటరీ బలగాలను, పోలీసులను ఈ ప్రాంతానికి పంపించింది.

ఈ రాష్ట్రంలో డైరెక్ట్ రూల్(కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి నియంత్రణా అధికారాలను తీసుకోవడం)ను విధించాలని చాలా మంది గిరిజన నేతలు కోరుతున్నారు.

కానీ, ఈ హింస మాత్రం ఆగడం లేదు. పలు ప్రాంతాలకు ఈ హింస విస్తరిస్తోంది.

చాలా మంది గ్రామస్తులు తమ ఇళ్లను విడిచిపెట్టి, బలవంతంగా వేరే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.

మణిపుర్‌లో ప్రభుత్వం ఎవరిది?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీనే, ఎన్ బిరేన్ సింగ్‌ నేతృత్వంలో మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది.

60 అసెంబ్లీ సీట్లున్న మణిపుర్‌లో 53 శాతం జనాభా ఉన్న మెయితెయ్ వర్గానికే 40 సీట్లున్నాయి.

మాదకద్రవ్యాలపై అణచివేత కూడా ఈ హింసకు ఒక కారణం. ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం కుకీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వాణిజ్యం కోసం పండిస్తోన్న నల్లమందు పంటలపై చర్యలు తీసుకుంటోందని కుకీలు తెలిపారు.

బీరేన్ సింగ్ మెయితెయ్ వర్గానికి చెందినవారు. 2017 నుంచి ప్రభుత్వం 18,600 ఎకరాల్లో నల్లమందు పంటలను ధ్వంసం చేశామని వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతాలన్నీ ఎక్కువగా కుకీలు జీవించే గ్రామాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)