‘‘అర్ధరాత్రి నాన్న ఫోన్ చేశాడు. ఏ క్షణంలోనైనా ఆయన్ను ఉరి తీయొచ్చు’’

ఫొటో సోర్స్, GAZELLE SHARMAHD
- రచయిత, డామియన్ మెక్‌గిన్నీస్
- హోదా, బీబీసీ న్యూస్, బెర్లిన్
ఆ ఇంటికి ఫోన్ కాల్ వచ్చినప్పుడు అర్థరాత్రి అవుతుంది. గజెల్ శర్మాద్‌ను ఆమె తల్లి లేపి, మీ నాన్న ఇరాన్‌లోని జైలు నుంచి ఫోన్ చేశారని చెప్పారు.
రెండేళ్లుగా గజెల్‌కి తన తండ్రి జంషీద్ శర్మాద్‌తో మాట్లాడేందుకు అనుమతి లభించలేదు. ఆయనొక ఇరాన్-జర్మన్ వ్యాపారవేత్త.
‘‘ఆయనను ఇప్పటికే ఉరితీశారా అనే విషయం మాకు తెలియదు. వాళ్లు మాకేమీ చెప్పడంలేదు’’ అని తన తండ్రి ఫోన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత లాస్ ఏంజెలస్‌లోని తన ఇంటి నుంచి గజెల్ శర్మాద్ బీబీసీతో అన్నారు.
‘‘కరెక్షన్ ఆన్ ఎర్త్’’ పేరుతో జంషీద్ శర్మాద్‌కి గత ఫిబ్రవరిలోనే మరణ శిక్ష విధించింది. కరెక్షన్ ఆన్ ఎర్త్ అనే పదాన్ని ఇరాన్ నేర నిరోధక విభాగాలు విస్తృత నేరాలను సూచించేందుకు ఉపయోగిస్తున్నారు.
ఆయనపై జరిగిన విచారణను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.
తన తండ్రితో మాట్లాడినందుకు గజెల్‌కు ఎంతో సంతోషమేసింది. కానీ, ఉరిశిక్ష అమలుకు ముందు చివరిసారి గుడ్‌బై చెప్పేందుకు ఈ ఫోన్‌కాల్‌కు అనుమతించారా అనే భయాందోళన కూడా ఆమెలో మొదలైంది.

ఫొటో సోర్స్, AFP
68 ఏళ్ల జంషీద్ శర్మాద్‌మూడేళ్లుగా ఇరాన్ జైలులోనే ఉంటున్నారు. బయటి ప్రపంచంతో ఆయనకు ఎటువంటి సంబంధాలు లేవు.
గంటసేపు ఫోన్‌లో మాట్లాడిన తన తండ్రి మరణ శిక్ష గురించి ఏమీ చెప్పలేదని గజెల్ శర్మాద్ గ్రహించారు.
ఈ నెల ప్రారంభంలోనే గజెల్ శర్మాద్ దీనిపై జర్మనీలో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.
అమానవీయ రీతిలో నేరారోపణలు చేస్తూ కేసులు పెడుతున్న ఇరాన్ న్యాయవ్యవస్థ, ఇంటెలిజెన్స్ సర్వీసులకు చెందిన 8 మంది ఉన్నత స్థాయి సభ్యులపై విచారణ చేపట్టాలని జర్మన్ ప్రాసిక్యూటర్లను ఆమె కోరారు.
తన తండ్రితో వ్యవహరించిన తీరుపై ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు.
పోషకాహార లోపం లేదా హింస కారణంగా తన తండ్రి పళ్లు ఊడిపోయాయని, కనీసం తినలేకపోతున్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి వల్ల తన తండ్రి సరిగ్గా నడవలేరని లేదా కూర్చోలేరని చెప్పారు. తనకు సరైన వైద్య చికిత్స కూడా అందించలేదంటున్నారు.
‘‘ఈ డెత్ సెల్‌లో నిర్భంధించి వారు ఆయన్ను సాఫ్ట్‌గా చంపేస్తున్నారు. ఒకవేళ ఆయన బతికి బయటపడ్డా, పబ్లిక్‌లో ఒక క్రేన్‌కు వేలాడదీసి మా నాన్నకి ఉరిశిక్ష అమలు చేస్తారు’’ అని ఆమె భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
‘మా నాన్నను వారు పబ్లిక్‌గా ఉరితీయాలనుకుంటున్నారు’
‘‘మా నాన్నను వారు పబ్లిక్‌గా ఉరితీయాలనుకుంటున్నారు. వీరి పాలన గురించి ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే, మీకు కూడా ఇదే జరుగుతుందని హెచ్చరించేందుకు ఇలా చేయాలనుకుంటున్నారు. ఆ వ్యక్తిని చూడండి, ఎలా ఉరిశిక్షకు గురయ్యాడో అని చూపాలనుకుంటున్నారు’’ అని తెలిపారు.
జంషీద్ శర్మాద్ ఇరాన్‌లో జన్మించారు. జర్మనీలో పెరిగారు.
ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. సీమెన్స్‌లో ఆయన ఇంజనీర్‌గా పనిచేశారు. 2000 ప్రారంభంలో అమెరికాలో సొంతంగా టెక్నాలజీ బిజినెస్‌ను ప్రారంభించారు.
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పబ్లిక్‌గా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత, ఇరాన్ హ్యాకింగ్ అటాక్ కింద ఆయన టార్గెట్‌గా మారారు.
మూడేళ్ల క్రితం, దుబాయ్‌కి బిజినెస్ ట్రిప్ మీద వెళ్లినప్పుడు, ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇరాన్ జైలులో పెట్టారు.
ఆయనపై చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. అమెరికన్లకు, బ్రిటన్లకు, జర్మన్లకు గూఢాచారిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం నుంచి పలు ఉగ్రవాద దాడులకు కారణమంటూ ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు.
ఆయనపై మోపిన ఈ అభియోగాలన్ని బోగస్ అంటూ జర్మన్, యూరోపియన్ యూనియన్ రాజకీయ నాయకులు చెప్పారు.
‘‘ఇరాన్‌లో అయినా, రుజువులు చూపించకుండా ఉగ్రవాదం పేరుతో ఒకరిని శిక్షించడానికి వీలు లేదు’’ అని గజెల్ శర్మాద్ అన్నారు.
జర్మనీలో పెరిగిన గజెల్, అమెరికాలో ఇంటెన్సివ్ కేర్ నర్సుగా పనిచేస్తున్నారు.
తన తండ్రిని విడుదల చేయాలని చాలాకాలంగా ఆమె పోరాడుతున్నారు. కానీ, జర్మన్ ప్రభుత్వం నుంచి ఆమెకు సరైన మద్ధతు లభించడం లేదు.
ఇరాన్ న్యాయవ్యవస్థలో, ఇంటెలిజెన్స్ విభాగంలోని ఉన్నతస్థాయి అధికారులను లక్ష్యంగా యూనివర్సల్ జ్యూరిస్‌డిక్షన్ సూత్రాన్ని వాడుతూ ఆమె క్రిమినల్ కంప్లయింట్‌ను దాఖలు చేశారు.
ఎక్కడ నేరాలు చేశారన్న దానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా మానవత్వానికి వ్యతిరేకంగా చేసే నేరాలపై లేదా యుద్ధ నేరాలపై విచారించడానికి ఇది అనుమతిస్తోంది.
సిరియాలో నెలకొన్న హింస, హత్యలపై సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు చెందిన మాజీ అధికారిని విచారించేందుకు గజెల్ శర్మాద్ జర్మన్ న్యాయవాది, యూరోపియన్ సెంటర్ ఫర్ కాన్స్‌స్టిట్యూషనల్ అండ్ హ్యుమన్ రైట్స్‌కు చెందిన పాట్రిక్ క్రోకర్ గత ఏడాది ఈ విధానాన్ని వాడారు. జర్మనీలో ఆయనకు జీవిత కాల జైలు శిక్ష పడింది.

ఫొటో సోర్స్, Getty Images
మానవ హక్కుల దుర్వినియోగాలను నిరోధించేలా ఈ కేసులు పనిచేయనున్నాయని క్రోకర్ నమ్ముతున్నారు.
కానీ ఇరాన్ అధికారులు ఎలా స్పందిస్తారనేది స్పష్టంగా తెలియదు. గజెల్ శర్మాద్ తన తండ్రిని ఏ నిమిషంలోనైనా ఉరితీయవచ్చని భయపడుతున్నారు.
యూరప్‌లో అతిపెద్ద ఇరానియన్ డయాస్పోరాగా జర్మనీ పేరుగాంచింది. కానీ, జర్మన్ ప్రభుత్వం తమల్ని విస్మరిస్తుందని ఇరానియన్ జర్మన్ ప్రజలు చెప్పారు.
బెర్లిన్ బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద జరుగుతోన్న నిరసనల్లో, ఇరాన్-జర్మన్ మహిళ అలీనాను నేను కలిశాను.
తండ్రిని జైలు నుంచి విడిచిపెట్టాలంటూ గజెల్ శర్మాద్ చేస్తోన్న పోరాటానికి మద్దతుగా ఆమె ఈ నిరసనలకు వచ్చారు.
‘‘గజెల్ బాధ విని కన్నీళ్లొచ్చాయి. తండ్రి కోసం గజెల్ పోరాటాన్ని తలుచుకుంటే నాకు రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి. ’’ అని అలీనా చెప్పారు.
నేను మాట్లాడిన చాలామంది మాదిరి ఆమె కూడా తన పూర్తి పేరు లేదా ఫొటోగ్రాఫ్ పబ్లిష్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఆమెను లేదా వారి కుటుంబాన్ని ఇరాన్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందని ఆమె భయపడుతున్నారు.
జంషీద్ శర్మాద్‌కు రాజకీయ మద్దతు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
జర్మన్ పౌరురాలు అయినప్పటికీ, తనకుగానీ, తన కుటుంబానికిగానీ ఇలానే జరిగితే, జర్మన్ ప్రభుత్వం సాయం చేయకపోవచ్చని అలీనా నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నేను ఒంటరి దాన్ని’
‘‘నా దేశం నాకు సాయంగా నిలబడదని తెలుసు, నేను ఒంటరి దాన్ని’’ అని అలీనా చెప్పారు.
కొందరు ఇరాన్-జర్మన్లు జాత్యాంహకారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ, శర్మాద్‌ను అసలైన జర్మన్ పౌరుడిగా గుర్తించట్లేదా అనే అనుమానం కూడా వస్తోంది.
బెర్లిన్ మానవ హక్కుల కంటే వాణిజ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని కొందరంటున్నారు.
జర్మన్ విదేశీ కార్యాలయం వద్ద ఈ విమర్శలను ప్రస్తావించినప్పుడు, మరణశిక్ష అసలు ఆమోదించదగ్గది కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నాలీనా బేర్‌బాక్ చెప్పారు.
మరణ శిక్షను జర్మన్ పౌరుల హక్కులకు తీవ్ర భంగపాటుగా జర్మన్ ప్రభుత్వం చూస్తుందన్నారు.
జంషీద్ శర్మాద్‌ను తమ పౌరుడిగానే ఇరాన్ ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. జర్మన్ దౌత్య ప్రయత్నాలను అసలు అంగీకరించడం లేదన్నారు.
‘‘అన్ని విధాలా శర్మాద్ కోసం మేం ప్రయత్నిస్తున్నాం. ఉన్నత స్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని ఛానల్స్‌ను, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మరణ శిక్ష విధించడం తీవ్రమైన పరిణామంగా చూస్తున్నాం’’ అని బేర్‌బాక్ అన్నారు.
విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేసినప్పటికీ, ఇరాన్-జర్మన్ కమ్యూనిటీ మాత్రం ఈ విషయంపై చాలా ఆగ్రహంతో ఉన్నారు.
చాలా మంది ఇరాన్ నుంచి పొంచి ఉన్న ప్రమాదానికి, విచారణకు భయపడుతున్నారు. కానీ, జర్మనీ కచ్చితంగా తమల్ని కాపాడుతుందని అనుకోవడం లేదని, వాళ్లు తమను రక్షిస్తారన్న విషయం మర్చిపోవాల్సిందేనని వారు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బడి మానిపించేందుకు 650 మంది అమ్మాయిలకు కలుషిత ఆహారం-బీబీసీ పరిశీలనలో వెల్లడి
- పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వందలాది గాడిదలను ఇరాన్ ఎందుకు చంపేస్తోంది?
- ఇరాన్: ఎందుకు ఉరి తీయకూడదో 15 నిమిషాల్లోపే చెప్పాలి, ఆపై శిక్ష అమలు
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఇరాన్: ‘నా 19 ఏళ్ల జీవితంలో ఎన్నడూ తిననన్ని దెబ్బలు జైల్లో తిన్నాను’ - చనిపోయే ముందు ఒక యువతి చెప్పిన దారుణ వివరాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














