పెళ్లయినా సెక్స్‌లో పాల్గొనడం లేదా?

Male, Female

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదర్శ్ రాథోడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''మేం సరైన సమయానికి కౌన్సెలింగ్ తీసుకోకపోతే విడిపోయావాళ్లం''

హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఇంజనీర్ మనీశ్ (పేరు మార్చాం) 2013లో వివాహం చేసుకున్నారు.

అయితే ఏడేళ్లలో అంటే 2020 నాటికి ఆయనకు భార్యతో కలహాలు పెరిగిపోయాయి.

“అంతా బాగున్నప్పటికీ, మా మధ్య శారీరక కలయిక పెద్దగా ఉండేది కాదు. దాదాపు ఐదేళ్ల పాటు ఇలాగే సాగింది. ఇది రిలేషన్‌పై ప్రభావం చూపించడం ప్రారంభించింది. చివరికి మేం కౌన్సెలర్ సహాయం తీసుకోవలసి వచ్చింది'' అని తెలిపారు మనీశ్.

మనీష్, అతని భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి సమస్య అసాధారణమైతే కాదు.

వివాహితుల్లో ముఖ్యంగా యువ జంటలలో, యువతలో సెక్స్ పట్ల నిరాసక్తత పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.

1980ల ప్రారంభం నుంచి 1990ల చివరి వరకు కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్ లేదా జనరేషన్ Y అని పిలుస్తారు.

వారి వయస్సు ఇపుడు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. మనుషులు ఈ వయసులోనే సెక్స్‌లో బాగా చురుగ్గా ఉంటారు.

అందుకే ఈ వయసును ‘సెక్సువల్ ప్రైమ్ టైమ్’ అంటారు. అయితే ‘సెక్సువల్ ప్రైమ్ టైమ్’లో ఉన్న చాలామందిలో కోరిక తగ్గే ధోరణి కనిపిస్తోంది ఇప్పుడు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మిగతా జనరేషన్ వాళ్లు ఎలా ఉన్నారు?

ఇండియానా యూనివర్శిటీకి చెందిన కింజీ ఇన్‌స్టిట్యూట్, 'లవ్ హనీ' అనే సెక్స్ టాయ్‌ల విక్రయ సంస్థ 2021లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల అమెరికన్ యువతలో ఒక సర్వే నిర్వహించాయి.

ఈ సర్వే ప్రకారం అంతకుముందు సంవత్సరం వివాహిత జంటలలో సెక్స్ కోరిక తగ్గిన సమస్య 'జనరేషన్ Y' వ్యక్తులలో ఎక్కువగా కనిపించింది.

దీని ప్రకారం 'పెళ్లైన జనరేషన్ Y' వ్యక్తులలో 25.8 శాతం మంది సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోయారు.

ఇది వారి తర్వాత తరం (జెనరేషన్ Z)లో 10.5 శాతం, వారి ముందు తరం (జనరేషన్ X)లో 21.2 శాతంగా ఉంది.

1965 నుంచి 1980 మధ్య జన్మించిన వారిని జనరేషన్ X, 1990ల చివరి నుంచి 2010ల మధ్య జన్మించిన వారిని జెనరేషన్ Zగా పరిగణిస్తారు.

శృంగారం పట్ల విముఖత చూపుతున్న 'జనరేషన్ Y' వ్యక్తుల సంఖ్య పెరుగుతోందని దిల్లీలో థెరపిస్ట్‌గా పనిచేస్తున్న సైకాలజిస్ట్ శివాని మిస్రీ సాధు అంటున్నారు.

"యువ వివాహిత జంటలు, ముఖ్యంగా మిలీనియల్స్‌లో సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి ఉంటోంది. వారిలో శారీరక సంబంధాలు కూడా తక్కువే" అని ఆమె వివరిస్తున్నారు.

వివాహితుల మధ్య తక్కువ శారీరక సంబంధం ఉంటే దానిని సెక్స్‌లెస్ వివాహం అంటారు. అంటే లైంగిక సంబంధాలు దాదాపుగా ఉనికిలో లేనట్లు.

ఒక జంట సంవత్సరానికి పది కంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే అలాంటి వివాహాలను సెక్స్‌లెస్ వివాహాలుగా నిపుణులు పరిగణిస్తారు.

“ఒకరు లేదా ఇద్దరు భార్యాభర్తలు సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయినప్పుడు, అలాంటివాళ్లలో శారీరక సంబంధం తగ్గిపోతుంది. ఇది వివాహాన్ని సెక్స్‌లెస్‌గా మార్చుతుంది'' అని కిన్సే ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకుడు జస్టిన్ లెహ్‌మిల్లర్ అంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

దూరం ఎందుకు పెరుగుతోంది?

“కోరికలలో అసమతుల్యత అనేది ఒక అంశం, జాగ్రత్త తీసుకోకపోతే, అది కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. ఎవరైనా చొరవ తీసుకున్న సమయంలో కూడా భాగస్వామి తిరస్కరిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అదే సమయంలో తిరస్కరించే భాగస్వామి కూడా చింతిస్తారు. దీని కారణంగా లైంగిక ప్రేరేపణలు తగ్గుతాయి'' అని కాలిఫోర్నియాలోని సెక్స్ థెరపిస్ట్ క్రిస్టీన్ లోజానో తెలిపారు.

"సెక్స్ చేయకపోవడానికి అది కష్టం, బాధాకరం కావడమో లేదా వైద్యపరమైన, మానసిక కారణాలూ ఉంటాయి. బిజీ, పనిభారం, పిల్లల వల్ల కూడా సెక్స్‌ తగ్గొచ్చు. భార్యాభర్తలు ఒకరి కోరికల గురించి ఒకరు మాట్లాడుకోకపోవడం కూడా ఒక కారణం" అని అన్నారు క్రిస్టీన్.

ఒక్క తరం మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని కాదు, కానీ నిపుణులు పెద్ద మార్పును చూస్తున్నారు.

"ఇంతకుముందు పెళ్లయిన 10-15 ఏళ్ల తర్వాత సెక్స్ పట్ల కోరిక తగ్గుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇది మూడు నుంచి ఐదేళ్లకే జరుగుతోంది'' అని శాన్ ఫ్రాన్సిస్కోలోని సెక్స్ థెరపిస్ట్ సెలెస్టే హెర్ష్‌మన్ అన్నారు.

“30 సంవత్సరాల క్రితం 50 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి సమస్యతో నా దగ్గరకు వచ్చేవారు. వయస్సు సంబంధిత వ్యాధులు లేదా హార్మోన్ల మార్పుల కారణంగా లైంగిక కోరిక తగ్గేవి. కానీ ఈ రోజుల్లో 45 ఏళ్లలోపు వివాహిత జంటలు కూడా సెక్స్‌లెస్‌గా మారుతున్నాయి'' అని కాలిఫోర్నియా వర్సిటీలో సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింబర్లీ ఆండర్సన్ తెలిపారు. కింబర్లీ 30 ఏళ్లుగా సెక్స్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అధిక ఒత్తిడే కారణమా?

"అధిక ఒత్తిడి కూడా లైంగిక కోరికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 'జనరేషన్ Y' వారి మునుపటి తరం కంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు" అని అమెరికాలో కిన్సే ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకుడు జస్టిన్ లెహ్‌మిల్లర్ అంటున్నారు.

ఈ టెన్షన్‌కి కూడా చాలా కారణాలున్నాయి. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో 61 శాతం మంది తమ చిన్న పిల్లలను చూసుకోవడం వల్ల సెక్స్‌ తగ్గిందని తెలిపినట్లు బ్రిటన్ కౌన్సెలింగ్ నెట్‌వర్క్ 'రిలేట్' 2018 అధ్యయనం వెల్లడించింది.

అంతేకాకుండా పిల్లలు పుట్టిన తర్వాత తమ లైంగిక కోరికను కోల్పోయామని 31 శాతం మంది చెప్పారు.

జనరేషన్ Y వ్యక్తులపై కెరీర్‌లో విజయం సాధించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలనే ఒత్తిడి కూడా ఉంది.

మాంద్యం, కరోనా దెబ్బతీశాయా?

గ్లోబల్ కన్సల్టింగ్ కంపెనీ అయిన డెలాయిట్ ఐదు దేశాలలో అధ్యయనం జరిపింది. ఈ సర్వేలో 38 శాతం జనరేషన్ Y వ్యక్తులు చాలా పని ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. పురుషుల (36 శాతం) కంటే మహిళలు (41 శాతం) ఈ ఒత్తిడికి ఎక్కువగా గురైనట్లు చెప్పారు.

"చాలా మంది మిలీనియల్స్ మాంద్యం (2008) సమయంలో తమ వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి ద్వారా తీవ్రంగా దెబ్బతిన్నారు" అని పరిశోధకుడు లెహ్‌మిల్లర్ తెలిపారు.

అదే సమయంలో సాంకేతికత కూడా వేగంగా మారుతుండటంతో వారు మునుపటి కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. దీంతో వారు మరో ఆలోచన లేకుండా పనిచేయడంలో నిమగ్నమయ్యారు.

అయితే, ఇలా పని ఎక్కువ కావడంతో సెక్స్‌లో పాల్గొనలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియా, పోర్న్ ప్రభావాలు ఎంతవరకు?

యువత లైంగిక జీవితంపై సోషల్ మీడియా, పోర్న్ ప్రభావం విస్మరించలేనిది. సోషల్ మీడియాలో చాలా బ్యూటీ ఫిల్టర్లు ఉన్నాయి.

అటువంటి పరిస్థితిలో నిజ జీవితంలో కొంతమంది తమ శరీరం గురించి న్యూనత భావంలో ఉంటారని నిపుణులు అంటున్నారు.

"30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న యువతలో 37 శాతం మంది సెక్స్‌లో తక్కువగా పాల్గొంటున్నారు" అని కౌన్సెలింగ్ నెట్‌వర్క్ 'రిలేట్' సర్వే తెలిపింది.

“జనరేషన్ Y వ్యక్తులు పెరుగుతుండటంతో ఇంటర్నెట్‌లో పోర్న్ లభ్యత కూడా పెరుగుతోంది. కొంతమందికి సెక్స్ చేయడం కంటే పోర్న్ చూడటం వల్లనే ఎక్కువ ఆనందం కలుగుతుందని చూస్తున్నారు'' అని న్యూయార్క్ సెక్స్ థెరపిస్ట్ స్టీఫెన్ స్నైడర్ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పరిష్కారం ఏమిటి?

ఒత్తిడికి గల కారణాలను జీవితం నుంచి పూర్తిగా తొలగించలేం. అలాగే పోర్న్ లేదా సోషల్ మీడియా ప్రభావాన్ని తొలగించలేం. మరి వివాహం సెక్స్‌లెస్‌గా మారకుండా ఎలా నివారించాలి?

“భార్యాభర్తలు శారీరక సంబంధాలలో పాల్గొనడం, ఇద్దరూ సంతృప్తిని పొందడం అవసరం. ఇరువురు పరస్పర సంభాషణ, నమ్మకం, ఒకరి కోరికలు, వారి సరిహద్దులను జాగ్రత్తగా చూసుకోవాలి. శృంగారం ఎంత తరచుగా జరుగుతుందనే దానికంటే ఎలా ఉంది? అందులో ఆనందం, సాన్నిహిత్యం, ఆనందం ఉన్నాయా అనేది ముఖ్యం'' అని సైకాలజిస్ట్ శివాని మిస్రీ సాధు అంటున్నారు.

రిలేషన్ షిప్‌లో కమ్యూనికేషన్, ఆహ్లాదం, సంతృప్తి, పరిపూర్ణత అనే భావన ఉంటేనే మంచి సెక్స్ లైఫ్ అని నిపుణులు చెబుతున్నారు.

శారీరక సంబంధాలపై ఆసక్తి లేకపోవడం అనేది చాలావరకు మాట్లాడటానికి దూరంగా ఉండే అంశం.

అలాంటపుడు తప్పనిసరిగా మ్యారేజ్ కౌన్సెలర్ లేదా సెక్స్ థెరపిస్ట్ సహాయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)