కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి

YS Jagan Mohan Reddy

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదు అంటోంది కేంద్రం. తాజాగా మరోసారి పార్లమెంట్ వేదికగా తన వైఖరిని తేల్చేసింది. లోక్‌సభలో కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి వచ్చింది.

విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కడప స్టాల్ ప్లాంట్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ

తామే మూడేళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ 2019లోనే శంకుస్థాపన చేశారు సీఎం జగన్.

సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్య్లూ కంపెనీ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వమే కడప స్టీల్ ప్లాంట్ కడుతుందంటూ ఆయన ప్రకటించారు.

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో భూములు కేటాయించారు.

దీని కోసం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత దానిని వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌గా పేరు మార్చింది. గ్లోబల్ నోటిఫికేషన్ ద్వారా భాగస్వామ్య సంస్థగా జేఎస్‌డబ్ల్యూను ఎంపిక చేసినట్టు ప్రకటించింది.

రెండేళ్ల తర్వాత 2023 ఫిబ్రవరి 15న మరోసారి భూమి పూజ కూడా చేశారు. 24 నుంచి 30 నెలల్లోపు ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. తొలుత శంకుస్థాపన నాడు మూడేళ్ల గడువు నిర్దేశించుకోగా, ఆ తర్వాత దానిని పొడిగించారు.

ప్రస్తుతం అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు అనుగుణంగా కడప స్టీల్ ప్లాంట్ పనులు సాగుతున్నాయా? కేంద్రం సహకరించకపోతే ప్లాంట్ పూర్తి అవుతుందా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.

కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకం

రెండు దశల్లో పూర్తి చేస్తామంటూ రంగంలోకి...

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 2019 డిసెంబర్ 23న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని ప్రకటించారు. అది జరగలేదు.

ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 15న భూమి పూజ పేరుతో సజ్జన్ జిందాల్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

స్టీల్ ప్టాంట్ నిర్మాణం ద్వారా విశాఖ రూపురేఖలు మారిపోయినట్టుగానే జమ్మలమడుగు ప్రాంతం కూడా భవిష్యత్‌లో పారిశ్రామికాభివృద్ధి సాధిస్తుందని ప్రకటించారు.

"రెండు దశల్లో ఈ ప్లాంట్ పూర్తవుతుంది. 30 నెలల్లోపు కమిషన్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దానికి గానూ ప్రభుత్వం తరుపున 3500 ఎకరాల భూమిని జిందాల్ కంపెనీకి అప్పగిస్తున్నాం. మరో రూ. 700 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తొలి దశలో రూ. 3800 కోట్లతో ప్లాంట్ వస్తుంది. ఆ తర్వాత రెండోదశలో మరో రూ. 5వేల కోట్లు వెచ్చిస్తారు.. 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు కాబోతున్న స్టీల్ ప్లాంట్ మరింత పురోభివృద్ధి సాధిస్తుంది" అని భూమిపూజ సందర్భంగా జగన్ ప్రకటించారు.

గండికోట నుంచి 2 టీఎంసీల నీటిని తరలించి, జాతీయ రహదారికి అనుసంధానించేలా 7 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్, ప్రొద్దుటూరు నుంచి రైల్వే లైన్ కూడా అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కడప స్టీల్ ప్లాంట్

పర్యావరణ అనుమతులు లేవు...

తొలుత మూడేళ్ల గడువు పెట్టగా దాని ప్రకారం ఈ డిసెంబర్ నాటికి కడప స్టీల్ ప్లాంట్ సిద్ధం కావాల్సి ఉంది. కానీ ఆ తర్వాత దానిని మరో ఏడాది గడువు పొడిగించారు. తాజా గడువు నిర్ణయించి ఆరు నెలలు దాటిపోతోంది.

ఇప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మాత్రం రాలేదు.

అవి త్వరలోనే వస్తాయనే అంచనాతో ఏపీ ప్రభుత్వం ఉంది.

దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని అంచనా వేస్తోంది.

మరోవైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.

"స్టీల్ ప్లాంట్ నిర్మాణం కడప ప్రాంత వాసుల సుదీర్ఘకల. కానీ దానికి అనుగుణంగా పనులు జరగడం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రెండేళ్లలో ఉత్పత్తి మొదలయ్యే అవకాశాలు లేవు. ఇప్పటికీ పునాదులు కూడా లేవు. దానికి సంబంధించిన అనుమతులు కూడా ఇంకా రాలేదు. 3 మిలియన్ టన్నుల ప్లాంట్ నిర్మాణానికి కనీసంగా ఐదారేళ్లు పడుతుంది. ఇప్పటికింకా పనులు మొదలుకాకపోవడంతో వేగంగా పనులు చేస్తూ, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూరితే 2026 నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది" అని స్టీల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అధికారి పీఎన్ కామేశ్వరరావు అన్నారు.

‘‘ఏపీ ప్రభుత్వం ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి నిర్దేశించిన గడువులోగా ప్రారంభమయ్యే అవకాశాలు స్వల్పమే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కడప స్టీల్ ప్లాంట్

కేంద్రం సహకరించకపోతే సాధ్యమా

కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ససేమీరా అంటోంది. 2017 నుంచి ఇదే వైఖరితో ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయంలో కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా శంకుస్థాపన చేశారు.

అంతకుముందు వైఎస్సార్ కూడా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాంతో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుగా కడప స్టీల్ ప్లాంట్ మిగిలింది.

కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదంటూ జులై 25న కేంద్ర మంత్రి మానవేంద్ర రాయ్ లోక్‌సభలో ప్రకటించారు. అయితే 2017లోనే కేంద్రం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. విభజన చట్టానికి అనుగుణంగా ఏపీలో స్టాల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందని ఆనాడు ప్రకటించారు. కానీ నేటికీ ఆ విషయంలో అతీగతీ లేదు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తావించ లేదు.

ఈలోగా ఏపీలోనే ప్రతిష్టాత్మక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడంతో స్టీల్ ప్లాంట్ నష్టాల పాలవుతోందని ఏపీ ప్రభుత్వం కూడా వాదిస్తోంది.

దాంతో కడప స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం సహకరించకుండా సాధ్యమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వివిధ అనుమతులతో పాటుగా పెట్టుబడి కోసం నిధుల విడుదల, అన్నింటికీ మించి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు అనేవి కేంద్రం చేతుల్లో ఉన్నాయి.

కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదంటూ పదే పదే చెబుతున్న కేంద్రం తాజాగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఏ మేరకు సహకరిస్తుందన్న దానిని బట్టే ప్లాంట్ భవితవ్యం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

వీడియో క్యాప్షన్, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్, వైసీపీ నేతలు ఏమన్నారంటే..

పోలవరంలానే...

విభజన చట్టం, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి బదులుగా తామే స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడమే కాకుండా దానికి అనుగుణంగా వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్‌ను కూడా ప్రభుత్వ హయంలో ప్రారంభించింది.

సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్ డబ్య్లూ సంస్థ భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలని సంకల్పించింది. కానీ దానికి అనుగుణంగా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని రెండున్నరేళ్ల తర్వాత శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పరిస్థితి చాటుతోంది.

చంద్రబాబు ప్రభుత్వ హయంలో పోలవరం కూడా ఏపీ ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుంది. జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రమే పోలవరం పూర్తి చేయాల్సి ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దానిని పూర్తి చేస్తామని చెప్పడంతో నేటికీ అది సందిగ్ధంలో పడింది.

"వెనుకబడిన రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అత్యవసరం. వైఎస్సార్ హయంలో బ్రాహ్మణి స్టీల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, ఇనుప ఖనిజం గనులు కూడా కేటాయించారు. ఆ తర్వాత దానిని ఏపీ పునర్విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. అంటే కేంద్రమే స్టీల్ ప్లాంట్ కట్టాలి. కానీ అప్పుడు లాభదాయం అని భావించి ఇప్పుడు కాదు అంటూ కేంద్రం వాదించడం తగదు. ఇది ఏపీ ప్రజలను మోసగించడమే. దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్రం పూర్తిచేయాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం రెండు సార్లు పునాదిరాళ్లు వేసినా అక్కడేమీ పనులు మాత్రం జరగడం లేదు" అని రాజకీయ విశ్లేషకుడు టీ లక్ష్మీనారాయణ అన్నారు.

స్టీల్ ప్టాంట్ కట్టేందుకు బాధ్యత తీసుకోవాల్సిన కేంద్రం అందుకు భిన్నంగా సాగడం ఏపీ పాలకపక్ష వైఫల్యం అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్‌కు ఉన్న డిమాండ్, ధర పరిశీలిస్తే స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదనడంలో అర్థం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

కరోనా వల్లే ఆలస్యమైంది...

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం వైఎస్సార్ కల అని దానిని జగన్ సాకారం చేసి తీరుతారని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

"కరోనా కారణంగా రెండేళ్ల కాలం పోయింది. అందుకే నిర్మాణం ఆలస్యమైంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంపై ఆరంభం నుంచి కొందరు అడ్డంకులు పెడుతున్నారు. అన్నింటినీ అధిగమిస్తాం. రెండు దశల్లో ప్లాంట్ పూర్తి చేస్తాం. సుమారు రూ. 8,800 కోట్లతో ప్లాంట్ పూర్తయితే అనేక మందికి ఉపాధి వస్తుంది. వైఎస్సార్ జిల్లా ఈ స్టీల్ ప్లాంట్‌తో రూపురేఖలు మార్చుకుంటుంది. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన వివరించారు.

అన్ని అనుమతులు సాధించి, ప్రాజెక్ట్ పనులు అనుకున్న లక్ష్యాలతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఏకకాలంలో మూడు పోర్టుల నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో జరుగుతోందని, స్టీల్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకెళుతుందని అన్నారు.

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం లాభదాయకం కాదని కేంద్రం చెబుతున్నప్పటికీ తాము మాత్రం ముందుకే సాగుతామని ఆయన బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)