రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకు ఎలా చేరింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రేటింగ్, రివ్యూ, లైక్ చేయడం వంటి టాస్కులు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశచూపి భారతీయుల నుంచి చైనా ముఠా వందల కోట్ల రూపాయలు దోచుకుంది.
పార్ట్ టైం ఉద్యోగాలు, పెట్టుబడుల ముసుగులో జరిగిన రూ.712 కోట్ల మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఛేదించారు. అలా దోచుకున్న డబ్బును చైనాకు మళ్లించడంతో పాటు, లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకూ పంపించినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
ఈ కేసులో హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, ముంబయికి చెందిన 9 మందిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.10.54 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
మెసేజ్‌లతో మొదలు..
మెసేజ్‌లతో ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు పథకం మొదలవుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ లేదా నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు పంపుతారని సైబర్ సెక్యురిటీ నిపుణులు చెబుతున్నారు.
‘‘Hi, side job workers needed in my firm. Good salary and benefits.
Do you want to know more??”
“Dear,
I am a project manager, we are hiring a team, you can work from home.
Daily salary: 900,
Accept job on whats: wa.me/00000000
Todays appointment” వంటి మెసేజ్‌లు ఫోన్‌కి వస్తాయి.
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని, లేదంటే ఎక్కువ రాబడి ఉంటుందని ఆశ కల్పించేలా మెసేజ్‌లు వస్తాయి. వాటిలో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి వివరాలు పంపిస్తే ఉద్యోగం కల్పిస్తున్నట్లు నమ్మబలుకుతారు. అక్కడి నుంచి మోసాలకు తెరలేపుతారు.
ఈ తరహా ఆన్‌లైన్ మోసాలపై ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సైబర్ సెక్యురిటీ నిపుణులు అనిల్ రాచమళ్ల బీబీసీతో మాట్లాడారు.
‘‘మూడు రకాలుగా మోసాలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా, వెబ్‌సైట్లకు రేటింగ్, రివ్యూ ఇవ్వడం, లైకులు కొట్టడం మొదటిది.''
''రెండోది పెట్టుబడి పేరిట జరిగే మోసాలు.. అది భారతీయ కరెన్సీలో కావొచ్చు.. క్రిప్టో కరెన్సీలో కావొచ్చు. మూడోది షాపింగ్ పేరిట మోసాలు. వీటిన్నింటిలోనూ అప్లికేషన్ ఒకటే ఉంటుంది. కానీ వెబ్‌సైట్లు మారిపోతుంటాయి. అవసరమైతే ఉదయం వాడిన వెబ్‌సైట్ సాయంత్రానికి కనిపించకుండా ఏవో చిన్న మార్పులు చేస్తారు.’’ అని అనిల్ రాచమళ్ల బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Hyderabad City Police
ఒక్క ఫిర్యాదుతో కదిలిన డొంక
వందల కోట్ల మోసపూరిత సామ్రాజ్యం ఒక్క ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన శివకుమార్ టెలిగ్రామ్ వాడుతుంటారు. కొన్ని నెలల కిందట www.travelling-boodt-99.com కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం ఉందంటూ ఆయనకు మేసేజ్ వచ్చింది.
ఆ లింకు క్లిక్ చేసి జాయిన్ అయ్యాడు. ‘రేట్ అండ్ రివ్యూ’ ఉద్యోగమని ఆఫర్ ఇచ్చారు.
తాము పంపించే టాస్క్‌లను క్లిక్ చేసి రేటింగ్ ఇస్తే రోజుకు రూ.900 నుంచి రూ.1500 వరకు సంపాదించవచ్చని సైబర్ నేరగాళ్లు ఆశచూపారు.
నమ్మించడానికి మొదట్లో సులువైన టాస్క్‌లు ఇచ్చేవారు. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 866 రూపాయలు లాభం వచ్చినట్టుగా ఏమార్చారు.
తర్వాతి టాస్క్‌లను పూర్తి చేయాలంటే పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. అప్పటి నుంచి విడతల వారీగా శివకుమార్ 28 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు.
వ్యాలెట్‌లో డబ్బు కనిపిస్తున్నా.. తీసుకునే అవకాశం ఉండేది కాదు. అనుమానం వచ్చి కంపెనీ నిర్వాహకులను ఎన్నిసార్లు అడిగినా, మరింత పెట్టుబడి పెట్టాలని చెప్పేవారే కానీ డబ్బు తిరిగి ఇచ్చేవారు కాదు.
చివరికి మోసపోయినట్లు గ్రహించిన శివకుమార్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబర్ 598/2023 కేసు నమోదు చేశారు పోలీసులు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసు విచారణలో ఎన్నో కీలక విషయాలు తెలియశాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ స్నేహ మెహ్రా బీబీసీకి చెప్పారు.
‘‘ముందుగా టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూపు ఏర్పాటు చేశారు. గ్రూపు అడ్మిన్ రోజూ టాస్క్‌లు పంపించేవాడు.
మొదట్లో వెబ్ సైట్లకు రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం, యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం వంటివి చేయాలి.
అలా చేశాక స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే.. డబ్బులు మన వ్యాలెట్లో జమ అయినట్లు చూపిస్తారు.'' అని ఆమె అన్నారు.
''ఆ తర్వాత నుంచి ప్రీమియం టాస్క్‌లు ఉంటాయి. వీటికి పెట్టుబడి ఎక్కువ. ఒక్క టాస్క్‌తో ఆగిపోకుండా పది టాస్క్‌ల వరకూ చేసుకుంటూ వెళ్తే రిటర్న్స్ వస్తాయని నమ్మిస్తారు. వాటిల్లో పెట్టుబడి పెట్టడమే తప్ప రాబడి ఉండదు.’’ అని స్నేహమెహ్రా బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Hyderabad City Police
ఈ మోసాల వెనక చైనీస్
ఈ టాస్క్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వెనుక ముగ్గురు చైనీయుల హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపిస్తూ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లోకి దించడంలో చైనీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.712 కోట్ల విలువైన మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
చైనాకు చెందిన కెవిన్ జున్, లీ లౌ లాంగ్ జౌ, షాషా అనే వ్యక్తులను ప్రధాన సూత్రధారులుగా తేల్చారు.
ఈ మొత్తం మోసం ఎలా జరిగిందనే విషయంపై బీబీసీ అధ్యయనం చేసింది. పోలీసుల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
షెల్ కంపెనీలు, బ్యాంకు అకౌంట్లు
టాస్క్‌ల పేరుతో శివ కుమార్‌ని మోసం చేసి కొల్లగొట్టిన 28 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు ఆరు వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు మళ్లించారు.
ఆ ఆరు అకౌంట్ల నుంచి మరో 48 బ్యాంకు అకౌంట్లతో లావాదేవీలు జరుగుతున్నట్లు తేలింది.
ఇందులోని కొన్ని అకౌంట్ల నుంచి హైదరాబాద్‌లోని రాధికా మర్చంట్ అనే డొల్ల(షెల్) కంపెనీతో లావాదేవీలు నడిచాయి. ఇందుకు 8948013209 ఫోన్ నంబరు లింక్ అయ్యి ఉంది.
‘‘రాధికా మర్చంట్ కంపెనీ, ఫోన్ నంబర్.. ఈ రెండు ఆధారాలతో విచారణ చేపట్టాం.
హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహమ్మద్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, ఎస్.సుమేర్‌కు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించాం.’’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
వారు నిర్వహిస్తున్న 48 బ్యాంకు అకౌంట్లతో 584 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు వివరించారు.
హైదరాబాద్‌లో అరెస్టైన నలుగురు వ్యక్తులకు ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని సైబర్ నేరగాళ్లతో సంబంధాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
లఖ్‌నవూకి చెందిన వికాస్, మనీష్ రాజేష్ సలహాలతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వారిని కలిసేందుకు యూపీ వెళ్లారు. అలా 33 డొల్ల కంపెనీలు పెట్టి 65 బ్యాంకు అకౌంట్లు తెరిచారు.
‘’65 అకౌంట్లను పరిశీలిస్తే మరో 128 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు తేలింది. అలా మొత్తం కలిపి రూ.712 కోట్ల మోసాన్ని గుర్తించాం. ఇందులో 15 వేల మంది బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నాం.’’ అని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.

ఫొటో సోర్స్, Hyderabad City Police
దుబాయ్ కేంద్రంగా చేతులు మారుతున్న చీటింగ్ మనీ
ఇలా దోచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీని వెనుక గుజరాత్ లోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి ఈ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
వారు ముంబయిలో ఉండే గగన్, గుడ్డూ, నయీంతో సమన్వయం చేసుకుంటూ డొల్ల కంపెనీల అకౌంట్లో పడిన డబ్బును వేరొక నకిలీ ఖాతాలకు పంపిస్తున్నారు.
వారిలో గుడ్డూ అనే వ్యక్తి హవాలా ద్వారా సొమ్మును దుబాయికి చేరవేస్తున్నారు.
అలాగే, ప్రకాశ్ ప్రజాపతి దుబాయిలో స్థిరపడిన అనాస్, అరిఫ్, శైలేష్, పియూష్, ఖాన్ సాహెబ్, షెల్లీతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భారతీయ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము తీసుకునేందుకు.. ఆయా ఖాతాలతో లింక్ అయిన సిమ్ కార్డులను దుబాయి తీసుకెళ్లారు.
ఆ సిమ్ కార్డుల సాయంతో కూల్ టెక్ లేదా ఎయిర్ డ్రాయిడ్ యాప్‌లను యాక్టివేట్ చేసుకున్నారు.
తర్వాత సిమ్ కార్డులు తొలగించి నేరుగా ఆ యాప్‌లతో నగదు లావాదేవీలు చేస్తున్నారు.
దుబాయిలోని ఐపీ అడ్రస్‌ల నుంచి ఇండియాలోని బ్యాంకు అకౌంట్లను నిర్వహిస్తున్నట్లు, డబ్బులు ఇతర అకౌంట్లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అందుకోసం ప్రతి లావాదేవీకి రెండు లేదా మూడు శాతం వరకూ కమీషన్ తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
చైనా సహా మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకు నిధులు
లావాదేవీల వివరాలు కనుక్కొనేందుకు హైదరాబాద్ పోలీసులు ఇండియన్ సైబర్ క్రైం కోఆర్ఢినేషన్ సెంటర్‌తో సమన్వయం చేసుకుని పనిచేశారు.
దుబాయిలో ఉండే వ్యక్తులు భారతీయ కరెన్సీని యూఎస్డీటీ(క్రిప్టో కరెన్సీ)గా మారుస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీని చైనాలోని ప్రధాన నిందితుల అకౌంట్లకు మళ్లిస్తున్నారు.
ప్రకాశ్ ప్రజాపతికి నేరుగా చైనీయులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన గతంలో పలుమార్లు దుబాయి, చైనా వెళ్లివచ్చినట్లు విచారణలో తేలింది.
ఇతను వాడే ట్రోన్ కాయిన్ వ్యాలెట్ నుంచి కూడా చైనాకు నిధులు వెళ్లినట్లు ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు గుర్తించారు.
ప్రకాశ్ ప్రజాపతి వ్యాలెట్‌తో అనుసంధానమైన మరో వ్యాలెట్ నుంచి లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్‌బొల్లాకు నిధులు వెళ్లాయి.
‘‘ప్రకాశ్ ప్రజాపతి వ్యాలెట్ నుంచి మరో వ్యాలెట్‌తో లావాదేవీలు జరిగాయి. ఆ వ్యాలెట్ నుంచి ఉగ్రవాద సంస్థలకు నిధులు వెళ్లినట్లు గుర్తించాం.’’ అని డీసీపీ స్నేహ మెహ్రా బీబీసీతో చెప్పారు.
హిజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు మూడు సార్లు.. 98,073.95, 273,690.61, 102,076.97 యూఎస్ డాలర్లు పంపినట్లు గుర్తించారు.
అయితే, ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న ముగ్గురు ఆ చైనా దేశీయులను అరెస్టు చేయడం సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వద్ద వారి పేర్లు తప్ప మరే ఇతర వివరాలు లేవు.
‘‘వారి పేర్లు మాత్రమే మనకు తెలుసు.. వాళ్లు ఎక్కడ ఉంటారు.. ఏం చేస్తుంటారనే వివరాలు ఇంకా తెలియాలి.’’ అని డీసీపీ స్నేహమెహ్రా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీ లావాదేవీలు
సైబర్ మోసగాళ్లు వివిధ బ్యాంకులలో మొత్తం 113 అకౌంట్లు తెరిచారు. బాధితుల నుంచి పెట్టుబడి తీసుకుంటున్న డబ్బును ఈ అకౌంట్లలోనే జమ చేయించుకుంటున్నారు.
ఎస్ బ్యాంకు, ఆర్బీఎల్, యాక్సిస్ వంటి బ్యాంకుల్లో పన్నెండు అకౌంట్లను ఓపెన్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
‘‘కంపెనీలకు డైరెక్టర్ గా అరుళ్ దాస్ అనే వ్యక్తి ఉన్నారు. ఒకే కంపెనీ పేరుతో వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి.
కానీ, కంపెనీ పేరు మాత్రం ఒక్కటే ఉంది. అలా ఏడు కంపెనీల పేరుతో పన్నెండు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం’’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
డొల్ల కంపెనీల పేర్లు..
- బ్లూ వాటర్ గ్రనేట్స్
- కన్సోల్ గ్రీన్ ఎనర్జీ
- నైరా కన్‌స్ర్టక్షన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- అర్సు సివిల్ కాంట్రాక్టర్స్
- ఏడీ సివిల్ వర్స్క్
- సమ్ ట్రేడింగ్ కంపెనీ
- ఎస్ఏ మర్చంట్స్
ఈ డొల్ల కంపెనీల పేర్లతో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగాయి. వీటి వల్ల దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగి కేసు వివరాలను సేకరించారు.
'మేమూ మోసపోయాం'
సైబర్ నేరగాళ్ల అరెస్టు తర్వాత హైదరాబాద్ పోలీస్ ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు తమకు జరిగిన మోసాలను చెప్పుకుంటున్నారు.
టాస్క్ ఫ్రాడ్స్‌కు సంబంధించి కొన్ని ఫోన్ నంబర్ల నుంచి చాలా మేసేజ్‌లు వచ్చినట్లు హుస్నా మహమ్మద్ ట్వీట్ చేశారు.
9648370897, 8924024466, 8235397052, +2776139650, 8250987107, 7054295841, +8562097855293 నంబర్ల నుంచి మేసేజ్‌లు వచ్చాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాను 13 లక్షల 20 రూపాయలు పోగొట్టుకున్నట్లు తాహుర అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ క్రైం బ్రాంచీలో టాస్క్ ఫ్రాడ్స్‌పై 0684/2023 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు శ్రీకాంత త్రిపాఠి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గత ఏడాది రూ. 903 కోట్ల మోసం
నిరుడు అక్టోబర్‌లోనూ హైదరాబాద్ పోలీసులు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ ముఠాను అరెస్టు చేశారు. అప్పట్లో ఏకంగా రూ. 903 కోట్ల మోసం జరిగినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
ఇందులో భాగస్వాములైన పది మందిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు చైనా, మరొకరు తైవాన్ దేశానికి చెందిన వారున్నారు. ఇప్పుడు తాజాగా రూ.712 కోట్లు కొట్టేసిన ముఠాకు సంబంధించిన తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
‘‘ఈ రెండు కేసులకు సంబంధం ఉండకపోవచ్చు. కానీ, రెండు మోసాల్లోనూ ఆపరేషన్ ఒకే తరహాలో సాగింది. అప్పట్లో లాగ్జమ్ అనే యాప్ వాడారు. ఇప్పుడు వెబ్ లింక్స్ పంపించారు.’’ అని సైబర్ క్రైమ్స్ డీసీపీ స్నేహమెహ్రా బీబీసీతో అన్నారు.
ఆర్థిక నేరాలలో ఫ్రాడ్, చీటింగ్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక నేరాలలో ఈ తరహా కేసులే ఎక్కువగా ఉంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో(ఎన్సీఆర్బీ) గణంకాలు చెబుతున్నాయి.
ఎన్సీఆర్బీ 2021 గణాంకాల ప్రకారం...దేశంలో 1,74,013 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి.
వాటిలో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ వంటి కేటగిరీలోకి వచ్చే ఐపీసీ 420, 465, 468, 471, 231-243, 255, 489A, 489E సెక్షన్ల కింద నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2021లో మొత్తం 1,46,327 కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- సోఫియా దులీప్ సింగ్: బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన భారత రాకుమారి కథ
- కార్గిల్ యుద్ధం: పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం ఎలా విరుచుకుపడింది? అమెరికాను నవాజ్ షరీఫ్ ఎందుకు శరణు కోరారు?
- ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?
- మైటోకాండ్రియల్ ఈవ్: ప్రపంచంలోని ఆడవాళ్లందరికీ మూలం ఈమేనా?
- అమిటి హనుమంతు, ASP: 'బడిలో చేరాలని వెళ్తే బిచ్చగాడని తరిమేశారు...'














