ఓపెన్‌హైమర్ చిత్రంలో భగవద్గీతపై వివాదమేంటి... అణుబాంబు తయారు చేసిన సైంటిస్ట్‌కు ఈ గ్రంథంతో ఏమిటి సంబంధం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
‘అణుబాంబు పిత’గా పేరుపొందిన శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథతో క్రిస్టొఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
భారత్‌లోనూ హిట్ అయిన ఈ సినిమా అందులోని ఒక సన్నివేశ సమయంలో వచ్చిన డైలాగ్ కారణంగా నిరసనలు కూడా ఎదుర్కొంటోంది.
సినిమాలో ఓ సన్నివేశంలో శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్ సెక్స్ చేసిన తరువాత భగవద్గీతలోని శ్లోకం చదవడం వివాదానికి కారణమైంది.
హిందువులు పవిత్ర గ్రంథంగా పరిగణించే భగవద్గీతలోని శ్లోకాన్ని సెక్స్ సీన్ తరువాత చదవడంపై కొందరు నిరసన తెలిపారు.
అయితే, సంస్కృతం నేర్చుకుని మరీ భగవద్గీత చదివిన ఓపెన్‌హైమర్ దాన్ని తనకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటిగా చెప్పారు.
న్యూ మెక్సికో ఎడారిలో మొదటిసారి 1945 జులైలో అణుబాంబును పేల్చడానికి రెండు రోజుల ముందు కూడా రాబర్ట్ హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పఠించారు.
సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన ఓపెన్‌హైమర్‌కు అక్కడికి కొన్ని సంవత్సరాల ముందు బర్క్‌లీలోని ఓ టీచర్ సంస్కృతాన్ని పరిచయం చేశారు, ఆ తరువాత సంస్కృత భాషలోని భగవద్గీత ఆయనకు పరిచయమైంది.
మహాభారతంలో భాగమైన భగవద్గీతలో 700 శ్లోకాలుంటాయి. ప్రపంచంలోనే అత్యంత దీర్ఘ కవితగా భగవద్గీతను చెప్తారు.
అలాంటి భగవద్గీతలోని శ్లోకాన్ని.. ప్రపంచ చరిత్రనే మార్చగలిగే ఒక ఘట్టం ప్రారంభించడానికి ముందు ‘అణుబాంబు పిత’ చదివి అప్పటికి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘అమెరికన్ ప్రోమీథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్’ పేరుతో కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ 2005లో ఓపెన్‌హైమర్ జీవిత కథ రాశారు.
బర్క్‌లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సంస్కృతం ప్రొఫెసర్‌గా పనిచేసిన ‘ఆర్థర్ వై రైడర్’ ఓపెన్‌హైమర్ యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు సంస్కృతాన్ని పరిచయం చేసినట్లు ఆ జీవిత కథలో రాశారు.
ఓపెన్‌హైమర్ తన 25 ఏళ్ల వయసులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆ యూనివర్సిటీకి వచ్చినప్పుడు జరిగిందది.
ఆ తరువాత కొన్ని దశాబ్దాలలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో గొప్ప అధ్యయన కేంద్రంగా అభివృద్ధి చెందడంలో ఓపెన్‌హైమర్ తోడ్పడ్డారు.
రిపబ్లికన్ అయిన ‘ఆర్థర్ రైడర్’ గుడ్డినమ్మకాలు, అప్పటి వరకు ఉన్న విశ్వాసాలను బలంగా ప్రశ్నించేవారు. అలాంటి రైడర్ ఓపెన్‌హైమర్ అంటే బాగా ఇష్టపడేవారు.
ఓపెన్‌హైమర్ కూడా రైడర్‌ను గొప్ప మేధావిగా పరిగణించేవారు. ఓపెన్‌హైమర్ తండ్రి దుస్తుల దిగుమతి వ్యాపారం చేసేవారు.
రైడర్ కరకు మాటలను దాటి చూస్తే ఆయన సున్నిత హృదయం అర్థమవుతుందని.. కాఠిన్యం, సౌహార్ద్రాల అరుదైన కలయికే ఆర్థర్ రైడర్ అని ఓపెన్‌హైమర్ తండ్రి కూడా అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక తాజాగా వచ్చిన సినిమాలో ఓపెన్‌హైమర్ పాత్రను పోషించిన ఐరిష్ నటుడు కిలియన్ మర్ఫీ కూడా రైడర్‌ను ‘మరణానంతర గతులను నిర్ణయించేవి మానవ కర్మలేనన్న జీవితపు విషాదకర స్పృహ తెలిసిన అరుదైన వ్యక్తి’ అని పేర్కొన్నారు.
ఓపెన్‌హైమర్‌కు ప్రతి గురువారం రైడర్ సంస్కృతం నేర్పేవారు. తాను సంస్కృతం నేర్చుకుంటున్నానంటూ ఓపెన్‌హైమర్ తన సోదరుడు ఫ్రాంక్‌కు లేఖ రాశారు.
అయతే, ఆయన స్నేహితులలో చాలామంది మాత్రం ఈ భారతీయ భాషపై ఆయనకున్న వల్లమాలిన అభిరుచిని విచిత్రంగా చూశారని ఓపెన్‌హైమర్ జీవిత కథలో ఉంది.
ఓపెన్‌హైమర్‌కు రైడర్‌ను పరిచయం చేసిన హెరాల్డ్ చెర్నిస్ కూడా వారిలో ఒకరు. ‘ఓపెన్‌హైమర్‌కు మార్మిక, నిగూఢ విషయాల పట్ల ఉన్న ఆసక్తికి ఈ సంస్కృత అభ్యాసం పరిపూర్ణత చేకూరుస్తుంది’ అని చెర్నిస్ భావించారు.
కాబట్టి ఓపెన్‌హైమర్‌కు సంస్కృతం, సంగీతంపై ఉన్న జ్ఞానాన్ని ఆయన కథను చెప్పేటప్పుడు ప్రస్తావించడం అసంబద్ధమేమీ కాదు. కానీ, కొందరు రైట్‌వింగ్ హిందువులు ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఆయన ప్రియురాలు జీన్ టాట్లాక్‌తో (సినిమాలో ఫ్లోరెన్స్ పగ్ ఈ పాత్ర పోషించారు) సెక్స్ సీన్‌పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సన్నివేశాన్ని హిందూ మతంపై దాడిగా పేర్కొంటూ దాన్ని సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ, భారత్‌లోని ఫిలిం సెన్సార్ బోర్డ్ మాత్రం దీనిపై అభ్యంతరాలేమీ వ్యక్తంచేయలేదు. అంతేకాదు, ఈ సినిమా భారతదేశంలో హాలీవుడ్ హిట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. శుక్రవారం రెండు హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి ఓపెన్‌హైమర్ కాగా రెండో బార్బీ. బార్బీ కంటే ఇక్కడ ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఓపెన్‌హైమర్ బాగా చదువుకున్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తత్వశాస్త్రం, ఫ్రెంచ్ లిటరేచర్, ఇంగ్లిష్, చరిత్ర కోర్సులు చదవడంతో పాటు కొన్నాళ్లు ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకున్నారు. ఆయన కవి, చిత్రకారుడు కూడా. విషాదం, ఒంటరితనం వంటి ఇతివృత్తాలపై కవితలు రాశారు.
‘ఆయనకు ప్రతిదీ సులభమే కాబట్టి ఇతరులకు కష్టమైన విషయాలను ఆయన ఇష్టపడ్డాడు, ఆయన దృష్టిని ఆకర్షించే అంశాలలో ఎక్కువగా కష్టమైనవే ఉన్నాయి’ అని చెర్నిస్ చెప్పారు.
భాషలు నేర్చుకోవడంలో తనకున్న సౌలభ్యం రీత్యా ఆయన గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్, జర్మన్ భాషలను ఆరువారాల్లోనే నేర్చుకున్నారు. డచ్ కూడా నేర్చుకున్నారు. ఇదంతా ఆయన భగవద్గీత చదవడానికి కొద్దికాలం ముందు జరిగిందే. భగవద్గీత చదివిన తరువాత ఆయన అది సులభంగా, అద్భుతంగా ఉందని భావించడమే కాకుండా అంత అందంగా పద్యరూపంలో తత్వాన్ని చెప్పిన పుస్తకం ఇంకేదీ లేదంటూ తన స్నేహితులకు కూడా రిఫర్ చేశారు.
ఆయన పుస్తకాల షెల్ఫ్‌లో గులాబీ రంగు అట్టతో భగవద్గీత ఉండేది. దాన్ని ఆయనకు రైడర్ బహూకరించారు. ఓపెన్‌హైమర్ స్వయంగా తాను ఎన్నో భగవద్గీత పుస్తకాలను తన స్నేహితులు, పరిచయస్థులకు ఇచ్చారు.
సంస్కృత అధ్యయనాల ప్రభావం ఆయనపై ఉండేదని.. 1933లో తండ్రి ఆయనకు కారు ఇవ్వగా దానికి హిందూ పురాణాలలోని గరుడ పక్షి పేరు పెట్టుకున్నారని ఆయన జీవిత చరిత్రలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
1920ల చివర్లో ఓపెన్‌హైమర్ ఐహిక ప్రపంచానికి దూరం కావడం గురించి అన్వేషించినట్లుగా అనిపించారు. భౌతిక ప్రపంచంలో ఒక శాస్త్రవేత్తగా మాత్రమే ఉంటూ మిగతా ఐహిక ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ఆయన తపించారని జీవిత కథలో రాశారు.
‘పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోవాలని ఆయన కోరుకోలేదు. మతాన్ని కోరుకోలేదు. ఆయన కోరుకున్నది మనశ్శాంతి. ఇంద్రియ సుఖాలు, పురుష వ్యవహారాలపై అనురక్తి చూపే ఒక మేధావికి భగవద్గీత సరైన తత్వాన్ని అందించినట్లుంది’ అని రాశారు.
భగవద్గీత ఒక్కటే కాదు కాళిదాసు రాసిన మేఘదూతం కూడా ఆయనకు బాగా నచ్చిన సంస్కృత గ్రంథం. ‘రైడర్‌తో కలిసి నేను మేఘాదూతం చదివాను. ఆనందంతో మంత్రముగ్థులమవుతూ చదివాం’ అని ఆయన సోదరుడు ఫ్రాంక్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
భగవద్గీతను ఇష్టపడినవారిలో ఓపెన్‌హైమర్ ఒక్కరే కాదు, హెన్రీ డేవిడ్ థోరో, హెన్రిచ్ హిమ్లర్, మహాత్మాగాంధీ వంటివారూ భగవద్గీతను అనుసరించారు. అంతేకాదు, ఓపెన్‌హైమర్ ఆరాధించిన కవులు డబ్ల్యూబీ యీట్స్, టీఎస్ ఎలియట్ కూడా మహాభారతాన్ని చదివారు.
అణు బాంబును తొలిసారి పరీక్షించినప్పడు ఆకాశంలో పుట్టగొడుగు ఆకారంలో కమ్ముకున్న నారింజరంగు మేఘం ఓపెన్‌హైమర్‌ను మళ్లీ గీతవైపు మళ్లేలా చేసింది.
మొదటి అణు బాంబు పరీక్ష తర్వాత ఆకాశంలో పెద్ద ఆరెంజ్ మష్రూమ్ మేఘం పైకి లేవడం ఓపెన్‌హైమర్‌ని మళ్లీ గీత వైపుకు తీసుకెళ్లేలా చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై వేసిన బాంబులు వేలాది మంది ప్రాణాలు తీశాయి.
‘ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదని మాకు తెలుసు. కొందరు నవ్వారు. కొందరు ఏడ్చారు. ఇంకొందరు మౌనం దాల్చారు’ 1965లో ఎన్బీసీ డాక్యుమెంటరీలో ఆయన చెప్పారు.
‘‘నాకు హిందూ గ్రంథం భగవద్గీతలోని ఒక లైన్ గుర్తొచ్చింది. అందులో అర్జునుడు కౌరవులంతా తన బంధువులేనని, వారితో యుద్ధం చేయలేనంటూ దుఃఖించగా అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని గీతోపదేశంతో కర్తవ్య బోధ చేస్తాడు. ఆ సందర్భంగా అర్జునుడికి తన విశ్వరూపం చూపిస్తాడు. ‘ఇప్పుడు నేను మృత్యువును. లోకాలను నాశనం చేసేవాడిని’’ అని చెప్తాడు. అదేరకంగానో, ఇంకోరకంగా మనమంతా అలా అనుకుంటాం’’ అని ఓపెన్‌హైమర్ చెప్పారు.
‘మీ తాత్విక దృక్పథాన్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?’ అని ‘ది క్రిస్టియన్ సెంచరీ’ సంపాదకులు ఒకసారి ఓపెన్‌హైమర్‌ను అడిగినప్పుడు ఆయన, ఫ్రెంచ్ రచయిత చార్లెస్ బాదలేర్ ఫ్రెంచి కవితల సంకలనం ‘లెస్ ఫ్లూయర్స్ డు మాల్’ (ఇంగ్లిష్‌లో 'ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్' మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. రెండోది భగవద్గీత అని బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














