చిరిగిన, పాడైపోయిన నోట్లను ఫ్రీగా ఎలా మార్చుకోవాలి? నిబంధనలు ఇవీ

నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైతన్య తరచూ షేర్ ఆటోలలో ప్రయాణిస్తుంటారు. ఆటోవాలాలకు పెద్ద నోటు ఇచ్చినప్పుడల్లా చిల్లర నోట్లు చేతికి వస్తుంటాయి. చాలాసార్లు మాసిన, చినిగిన, పాడైపోయిన నోట్లు కూడా అలా జేబులోకి చేరుతుంటాయి. వాటిని తిరిగి ఎవరికీ ఇవ్వలేరు. ఇచ్చినా ఎవరూ తీసుకోరు. ఇలాంటి నోట్లు చైతన్య ఇంట్లో చాలా పోగుపడ్డాయి.

వీటిని ఏం చేయాలో, తిరిగి ఎలా మార్చుకోవాలో చైతన్యకు అర్ధం కావడం లేదు.

ఈ సమస్య చైతన్య ఒక్కరిదే కాదు. దేశంలో చాలా మంది ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు.

పాతబడిన నోట్లు, చినిగిపోయిన, పాడైపోయిన నోట్లు, దెబ్బతిన్న నాణేలు చేతికి వచ్చినప్పుడు వాటిని మార్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అప్పుడప్పుడూ ఏటీఎంల నుంచి కూడా ఇలాంటి పాడైపోయిన, దెబ్బతిన్న నోట్లు వస్తుంటాయి.

ఈ రోజుల్లో కరెన్సీ నోట్లలో పది, ఇరవై, యాభై రూపాయల డినామినేషన్లలో కొత్త నోట్లు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. రానురాను ఈ నోట్లు ఇంకా నలిగి, పాతబడి పాడైపోతున్నాయి. వీటిని మార్చుకునే విధానం తెలియక, చాలా మంది నష్టపోతున్నారు కూడా.

ఇలాంటి నోట్లను మార్చుకోవడానికి ఓ మోస్తరు పట్టణాల నుంచి నగరాల వరకు, కొన్ని షాపులు ప్రత్యేకంగా పని చేస్తుంటాయి. ప్రైవేటు వ్యక్తులు నడిపే ఈ షాపుల్లో పాత, చినిగిపోయిన నోట్లను, దెబ్బతిన్న కాయిన్లను తీసుకుని కొత్తవి ఇస్తుంటారు. ఇందుకు కొంత ‘కమీషన్’ తీసుకుంటారు. నోట్ల స్థితిని బట్టి, ప్రాంతాన్నిబట్టి ఈ కమీషన్ మారిపోవచ్చు.

అయితే, ఇలాంటి నోట్లను సులభంగా మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అవే బ్యాంకులు, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాలు.

చెలామణికి వీలుకాని నోట్లు అని వేటిని అంటారు? మాసిన నోట్లుగా వేటిని పరిగణించాలి? ఏవి చిరిగిన నోట్లు? వీటిని ఎలా వర్గీకరిస్తారు? ఏ నోటుకు ఎంత మార్పిడి విలువ చెల్లిస్తారు? - అనే వివరాలు తెలుసుకుందాం.

మాసిన నోట్లు

ఫొటో సోర్స్, RBI

ఫొటో క్యాప్షన్, మాసిన నోట్లు

మార్పిడి చేసుకోదగిన నోట్లు ఏవి?

మాసిన నోట్లు

మాసిన నోట్లను ఇంగ్లీషులో సాయిల్డ్ నోట్స్ (Soiled Notes) అంటారు. బాగా మాసిపోయి, మురికిపట్టినట్లుగా ఉండి, అక్కడక్కడా చిరిగిన నోట్లను సాయిల్డ్ నోట్స్ కింద పరిగణిస్తారు. రూ. 10కి మించిన డినామినేషన్లు రెండు ముక్కలుగా చినిగిపోయినా వాటిని సాయిల్డ్ నోట్‌‌గానే పరిగణిస్తారు.

అయితే, ఈ చిరుగు నంబర్ ప్యానెల్స్ ( వాటి మీదున్న సంఖ్యల) మీదుగా జరిగి ఉండకూడదు. ఇలాంటి నోట్లను మార్చుకునే అవకాశం ఉంది.

చిరిగిన నోట్లు

రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా మారినవి/ లేదా ముఖ్యమైన భాగాలు మిస్సయిన వాటిని చినిగిన నోట్లు అంటారు. ముఖ్యమైన భాగాలు అంటే నోట్లను విడుదల చేసిన అథారిటీ పేరు(గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సంతకం, అశోక స్తంభం, గాంధీ బొమ్మ, వాటర్ మార్క్ లాంటి ఫీచర్లు మిస్సయిన నోట్లను చిరిగిన నోట్లుగా ఆర్‌బీఐ పరిగణిస్తుంది. ఇలాంటివి కూడా మార్చుకోవచ్చు.

చివికిన, కాలిన, నలిగిన నోట్లు

బాగా చివికిపోయిన(చీకిపోయిన) దశలో అంటే పట్టుకుంటే ముక్కలుగా రాలిపోయే స్థితిలో ఉన్న నోట్లు, కాలిపోయినవి, నలిగిపోయి విడదీస్తే చిరిగిపోయేలా ఉన్నవి, సాధారణ స్థితిలో వాడటానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నవి ఈ కోవలోకి వస్తాయి. వీటినీ మార్చుకోవచ్చు.

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కరెన్సీ నోట్లు (ఫైల్ ఫొటో )

మార్పిడి చేసుకునే విధానం

పైన చెప్పిన వివిధ నోట్లను రోజుకు 20 నోట్ల చొప్పున, విలువలో రూ.5000 మించని నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. బ్యాంకులు వీటిని కౌంటర్లలో ఎలాంటి చార్జీలూ వసూలు చేయకుండా మార్పిడి చేయాలి.

ఒకవేళ ఒక వ్యక్తి 20 నోట్లకన్నా ఎక్కువ, రూ.5,000 వేలకు మించి విలువ ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అభ్యర్ధిస్తే, బ్యాంకు ఒక రిసీట్ ఇచ్చి, ఆ సొమ్మును తర్వాత చెల్లించే ఏర్పాటు చేయవచ్చు.

అయితే, 2015 జులైలో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, బ్యాంకులు ఇలాంటి సందర్భాలలో సర్వీస్ చార్జీలను కూడా వసూలు చేయవచ్చు. ఈ నోట్ల విలువ రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే బ్యాంకులు నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేస్తాయి.

దెబ్బతిన్న నోట్లు

ఫొటో సోర్స్, RBI

ఫొటో క్యాప్షన్, దెబ్బతిన్న నోట్లు

ఎక్కడెక్కడ తీసుకుంటారు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934లోని సెక్షన్ 58 (2)తోపాటు, సెక్షన్ 28 ప్రకారం, చెడిపోయిన, దొంగిలించిన, అసంపూర్ణంగా ఉన్న నోట్లకు సమానమైన విలువను ప్రభుత్వం నుంచిగాని, ఆర్‌బీఐ నుంచి గాని రాబట్టుకొనే హక్కు ఏ ఒక్క వ్యక్తికీ లేదు.

అంటే పూర్తిగా కనిపించకుండా పోయిననోట్లను, అసంపూర్ణంగా ఉన్ననోట్లను, దొంగతనానికి గురైన నోట్లను ఫిర్యాదు ద్వారా బ్యాంకుల నుంచి రాబట్టుకోవడం కుదరదు.

కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రజలకు ఈ విషయంలో కలిగే అసౌకర్యాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ ఉదారంగా చెడిపోయిన నోట్లను మాత్రం తిరిగి ఇవ్వడానికి పూనుకుంది.

బ్యాంకులు, కరెన్సీ చెస్టులలో (ఆర్‌బీఐ ముద్రించే నోట్లను బ్యాంకులకు, ఏటీఎంలకు సరఫరా చేసే ప్రదేశం) చెడిపోయిన నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది.

పాత, చినిగిన నోట్లు, నాణేలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్‌లో మాస్టర్ డైరక్షన్స్ విడుదల చేసింది.

వీటి ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకుల శాఖలు ఈ కింది సర్వీసులను సామాన్య ప్రజలకు కల్పించాలి. తద్వారా వారు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వచ్చి నోట్లను మార్పిడి చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించాలి.

మాస్టర్ డైరెక్షన్‌లో ఆదేశాలు ఇలా ఉన్నాయి:

A. అన్ని డినామినేషన్లకు సంబంధించిన తాజా/మంచి నాణ్యతగల నోట్లను, నాణేలను జారీ చేయాలి

B. చెడిపోయిన/దెబ్బతిన్న/లోపభూయిష్టమైన నోట్లను మార్పిడి చేయాలి.

C. నోట్లను, నాణేలను లావాదేవీలు, మార్పిడుల కోసం అనుమతించాలి.

తమ పని దినాల్లో బ్యాంకులు ఈ చెడిపోయిన/దెబ్బతిన్న/లోపభూయిష్టమైన నోట్ల మార్పిడిని అనుమతించాలనీ, ఈ విషయంలో ఎవరి పట్లా ఎలాంటి వివక్షనూ చూపరాదని ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, తమ దగ్గర ఇలాంటి నోట్లను మార్పిడి చేసుకునే సౌలభ్యం ఉందని ప్రజలకు తెలిసేలా ప్రకటనలు, బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఏ బ్యాంకు కూడా నోట్లను తీసుకోవడానికి నిరాకరించడానికి వీలులేదు.

నోట్ల మార్పిడిలో ఎలాంటి చార్జ్‌లు వసూలు చేయడానికి వీలులేదు. అలాగే ఎలాంటి ఫారాలు నింపాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తి బ్యాంకులో ఇచ్చిన నోట్లు 5 వరకు ఉంటే నాన్-చెస్ట్ బ్రాంచ్‌లు నోట్ రీఫండ్ రూల్స్ 2009- లోని పార్ట్ 3లో నిర్దేశించిన విధానంలో ఆ నోట్‌లను పరిశీలించి, వాటి మార్పిడి విలువను చెల్లించాలి.

నాన్-చెస్ట్ బ్రాంచ్‌లు ఈ చినిగిన నోట్లను నిర్ధరించలేని పరిస్థితి ఎదురైతే, వాటి విలువకు రసీదు ఇచ్చి, వాటిని తమకు లింక్ చేసిన చెస్ట్ బ్రాంచ్‌కు పంపాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన చెల్లింపు ఏ తేదీలోగా జరుగుతుందో ఆ నోట్లను ఇచ్చిన వారికి తెలియజేయాలి.

అయితే, ఈ సమయం 30 రోజుల కన్నా ఎక్కువ ఉండరాదు.

ఎలక్ట్రానిక్ పద్ధతిలో మార్పిడి విలువను అకౌంట్‌లో జమ చేయడానికి ఆ నోట్ ఇచ్చిన వ్యక్తుల నుంచి వారి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి.

ఎక్కువ విలువ ఉన్న నోట్లయితే...

ఒక వ్యక్తి సమర్పించిన నోట్ల సంఖ్య 5 కంటే ఎక్కువగా ఉండి, వాటి విలువ రూ. 5,000కు మించకుండా ఉంటే, సదరు వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలను పేర్కొంటూ ఈ నోట్‌ను ఇన్సూర్ చేసిన పోస్టేజ్ ద్వారా సమీపంలోని కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ ద్వారా పంపవచ్చు. లేదంటే స్వయంగా వెళ్లి కూడా మార్చుకోవచ్చు.

ఇన్సూర్ చేసిన పోస్ట్ ద్వారా నోట్లను పంపిన వ్యక్తికి కరెన్సీ చెస్ట్ బ్రాంచ్‌లు 30 రోజులలో మార్పిడి విలువను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఖాతాలో జమ చేయాలి.

ఒక వేళ ఆ నోట్ల విలువ రూ. 5,000 కంటే ఎక్కువ ఉంటే, మార్పిడిని కోరే వ్యక్తి సమీపంలోని చెస్ట్ బ్రాంచ్‌ను వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటుంది.

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రెండువేల నోట్లు

ఎలాంటి నోట్లను మార్పిడి చేస్తారు ?

మాసిన నోట్లలో సింగిల్ డిజిట్ కరెన్సీ నోట్ అంటే, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నోట్లు ఉంటే, అవి రెండు కంటే ఎక్కువ ముక్కలుగా ఉండకూడదు.

రెండు ముక్కలు ఒకే నోటువై ఉండాలి. అలాగే దాని మీద ఉన్న ముఖ్యమైన ఫీచర్లు చెడిపోవడం/ మిస్ కావడం లాంటివి జరిగి ఉండకూడదు.

రెండు ముక్కలుగా చినిగిన నోటులో కనీసం ఒకదాని మీద ఆ నోటుకు సంబంధించిన నంబర్ ఉండి తీరాలి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం లేదా మార్పిడి చేసుకోవడానికి బ్యాంకును అభ్యర్ధించవచ్చు.

డబుల్ డిజిట్ కరెన్సీ నోట్ అంటే రూ.10, రూ. 20, రూ.50 వరకు నోట్లను మార్పిడి చేసుకోవాలంటే అవి రెండు కంటే ఎక్కువ భాగాలుగా చిరిగి ఉండకూడదు.

ఆ రెండు ముక్కలు కూడా ఒకే నోటువి అయ్యుండాలి. అంతేకాకుండా చిరిగిన ఆ రెండు భాగాల మీదా కచ్చితంగా దాని నంబర్ కనిపించాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, AFP

ఏ నోటుకు ఎంత ఇస్తారు?

మాసిన నోట్లు:

ఒక మాసిన నోటు మార్పిడి విలువను పూర్తిగా/ సగం చెల్లించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.

1.ఆ నోటు మీద అచ్చువేసిన అక్షరాలు పూర్తిగా కనిపించకుండా పోయిన పరిస్థితి ఉండకూడదు.

2.ఆ నోటు మీద అచ్చువేసిన అక్షరాలను ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ పరిశీలించి, అది సరైన నోటేనని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే దానికి మార్పిడి విలువ చెల్లిస్తారు.

చినిగిన నోట్లు:

1. నోటు పెద్ద ముక్క, ఆ నోటు(డినామినేషన్ ) మొత్తం వైశాల్యంలో 50% కంటే ఎక్కువ ఉంటే, దానికి మార్పిడిలో పూర్తి విలువను ఇస్తారు.

2. మీరు బ్యాంకుకు తీసుకెళ్లిన ముక్క వైశాల్యం నోటు మొత్తం వైశాల్యంలో 50%కు సమానంగా ఉన్నా, తక్కువగా ఉన్నా దాని మార్పిడికి ఒప్పుకోరు.

పైన చెప్పిన నిబంధనలన్నీ రూపాయి నుంచి 20 రూపాయల( మహాత్మాగాంధీ బొమ్మతో ఉన్న కొత్త రూ.10, రూ. 20 నోట్ల సిరీస్‌ కూడా ఇందులో ఉంటాయి) వరకు నోట్లకు సంబంధించినవి.

రూ. 50 నుంచి ఆపై విలువ ఉన్న నోట్లకు ఈ కింది విధంగా మార్పిడి విలువను చెల్లించడం/ తిరస్కరించడం చేస్తారు.

1. ఒక చిరిగిన నోటులోని పెద్ద ముక్క, ఆ నోటు(డినామినేషన్ ) మొత్తం వైశాల్యంలో 80% కంటే ఎక్కువ ఉంటే, దానికి మార్పిడిలో పూర్తి విలువను ఇస్తారు.

2.ఒక చిరిగిన నోటులోని పెద్ద ముక్క, ఆ నోటు మొత్తం వైశాల్యంలో 40% కంటే ఎక్కువ, 80% కంటే తక్కువ ఉంటే దాని విలువలో సగాన్ని మార్పిడి విలువగా చెల్లిస్తారు.

3. ఒక చిరిగిన నోటులోని పెద్ద ముక్క, ఆ నోటు మొత్తం వైశాల్యంలో 40% కంటే తక్కువ ఉంటే దానిని మార్పిడికి తిరస్కరిస్తారు.

4. రూ.50 దాటిన డినామినేషన్లలో రెండు ముక్కలుగా చిరిగిన నోటులో ప్రతి ముక్క విడివిడిగా నోటు మొత్తం వైశాల్యంలో 40%కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ నోటు పూర్తి విలువను చెల్లిస్తారు.

చిరిగిన నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిరిగిన నోట్లు

కావాలని చించిన/ పాడుచేసిన నోట్లను ఏం చేస్తారు?

కరెన్సీ నోట్లను ఉద్దేశపూర్వకంగా కట్ చేసినా, చించినా, మార్పులు చేర్పులు చేసినట్లు కనిపించినా, ఆ నోట్లను నోట్ రీఫండ్ రూల్ 2009లోని 6(3) (ii) ప్రకారం మార్పిడి విలువ చెల్లించడానికి తిరస్కరిస్తారు.

అయితే, ఇలాంటి నోట్లు ఉద్దేశపూర్వకంగా చించారు లేదా పాడు చేశారు అని నిరూపించడం సులభం కాదు.

కాబట్టి, ఈ పరిస్థితుల్లో అధికారులు వాటిని నిశితంగా పరిశీలించి అవి పొరపాటున అలా పాడైపోయాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అలా చేశారా అన్నది నిర్ధరించే ప్రయత్నం చేస్తారు.

ఇలాంటి నోట్లు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు అవి ఒకే విధంగా చినిగిపోయి/పాడైపోయి కనిపించడం, అన్ని నోట్లలో ఒకే భాగం మిస్ కావడం, ఒకే పద్దతిలో ఆకారం చెడిపోవడం లాంటి వాటి ద్వారా గుర్తుపట్టే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో ఇలాంటి నోట్లను తెచ్చిన వ్యక్తి పేరు, ఏ నోట్లు, ఎన్నినోట్లు తెచ్చారు అన్న వివరాలను రిజర్వ్ బ్యాంక్ లోని సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇలాంటి నోట్లు వచ్చినప్పుడు బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయవచ్చు.

బ్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాంకు (ఫైల్ ఫొటో )

బ్యాంకులతో ఇబ్బంది కలిగితే ఏం చేయాలి?

నోట్ల మార్పిడి విషయంలో బ్యాంకు నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే కస్టమర్లు బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు సదరు ఫిర్యాదుకు 30 రోజుల లోపు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కస్టమర్లు ‘ది రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, 2021’ కింద ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.

ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో https://cms.rbi.org.inలో ఫైల్ చేయవచ్చు లేదంటే ఆర్‌బీఐ ఫిర్యాదుల ఈమెయిల్‌కు పంపవచ్చు.

లేదంటే ఈ కింది అడ్రస్‌కు ఫిర్యాదును పంపవచ్చు.

సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్’

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,

4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017

ఈ లేఖతోపాటు తమ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను, రసీదులను కూడా పంపవచ్చు.

ఎలాంటి నోట్లను తీసుకోరు?

చినిగిపోయినా, పాడైపోయిన నోట్లు ఒకసారి బ్రాంచ్‌కు వచ్చాక సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వాటికి 'PAY' /'PAID' & 'REJECT' అనే మూడు రకాల స్టాంపులలో ఏదో ఒకదానిని సదరు నోటు మీద వేస్తారు.

ఆ స్టాంపులో ఈ ముద్ర వేసిన బ్యాంక్ బ్రాంచ్ పేరు, అడ్రస్ వివరాలు ఉంటాయి.

ఒకసారి ఆర్‌బీఐ బ్రాంచ్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ఈ 'PAY' /'PAID' & 'REJECT' ముద్ర వేసిన నోటును మరొక బ్రాంచ్‌లో ఇచ్చినా వాటిని తిరస్కరిస్తారు. అలాగే ఇలాంటి ముద్రలున్న నోట్లు పొరపాటున కూడా కస్టమర్లకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

ఇలాంటి నోట్లను ఏ బ్యాంకులో ఇచ్చినా, ఎవరు ఇచ్చినా తీసుకోవద్దని తమ ఖాతాదారులకు అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

పాడైపోయిన నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాడైపోయిన నోట్లు

ఎలాంటి నోట్లు చెలామణి చెయ్యకూడదు?

ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం నినాదాలు, రాజకీయ, మతపరమైన సందేశాలు, నోటుపై రకరకాల గీతలు, రంగులు అంటిన నోట్లను నోట్ రీఫండ్ రూల్ 2009లోని 6(3) (iii) ప్రకారం చెలామణి చేయకూడదు.

గీతలు, మరకలు పడిన నోట్లు వాడకంలో ఉన్నట్లే లెక్క. కానీ, వాటిని బ్యాంకులలో ఇచ్చి కొత్త నోట్లను తీసుకోవాలి.

ఈ తరహా నోట్లు తమ దగ్గరకు వస్తే, ప్రజలు వాటిని ఆర్‌బీఐకి పంపాలి.

వీడియో క్యాప్షన్, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పూర్తైతే రెండు దేశాలకు లాభమంటున్న వ్యాపారులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)