సోఫియా దులీప్ సింగ్: బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన భారత రాకుమారి కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన ప్రముఖుల్లో సోఫియా దులీప్ సింగ్ ఒకరు. అయితే, ఆమె గురించి భారత్‌లో ఎవరికీ పెద్దగా తెలియదు.
1910లో అప్పటి బ్రిటన్ ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ ఆస్క్విత్‌తో సమావేశం కోరుతూ లండన్ పార్లమెంటుకు ప్రదర్శనగా వెళ్లిన 300 మంది హక్కుల ఉద్యమకారుల్లో ఆమె కూడా ఒకరు.
అయితే, ఆ మహిళా ఉద్యమకారులతో సమావేశమయ్యేందుకు ఆస్క్విత్ నిరాకరించారు. ఆ తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు వెలుపల ఆ మహిళలపై పోలీసులు, కొందరు మగవారు దాడులు కూడా చేశారు. నిరసనకారుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి బ్రిటన్‌లో ఆ రోజును ‘‘బ్లాక్ ఫ్రైడే’’గా పిలిచేవారు.
ఆ నిరసనల తర్వాత అరెస్టైన 119 మందిలో సోఫియా కూడా ఒకరు.

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌లోని చివరి సిక్కు చక్రవర్తి మహారాజా సర్ దులీప్ సింగ్‌కు ఆమె కుమార్తె. క్వీన్ విక్టోరియాతోనూ ఆమెకు దగ్గరి సంబంధాలుండేవి.
‘‘1910 నవంబరులో చోటుచేసుకున్న ఆ బ్లాక్ ఫ్రైడే నిరసనల్లో సోఫియా దులీప్ సింగ్ ఒక సెలబ్రిటీ లాంటివారు’’ అని సోఫియా జీవిత చరిత్ర రాసిన అనితా ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
సోఫియా గురించి చాలా ఆసక్తికర అంశాలు ఆనంద్ రాసిన ఆమె జీవిత చరిత్ర ‘సోఫియా: ప్రిన్సెస్, సఫ్రజెట్, రెవల్యూషనరీ’తో వెలుగులోకి వచ్చాయి. సోఫియాతో పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడి, పోలీసు, నిఘా విభాగం రికార్డులను పరిశీలించి ఆ పుస్తకాన్ని ఆనంద్ రాశారు.
1876లో సోఫియా జన్మించారు. రాజా దులీప్ సింగ్, ఆయన తొలి భార్య బాంబా ముల్లర్‌ల ఆరుగురు పిల్లల్లో ఆమె ఐదోవారు.
1849లో తన రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత దులీప్ సింగ్‌ను ఇంగ్లండ్‌కు తరలించారు. ఆ తర్వాత కుదిరిన ఒప్పందంలో భాగంగానే అమూల్యమైన కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్‌కు అప్పగించాల్సి వచ్చింది.
సఫోల్క్‌లోని కుటుంబ సభ్యుల మధ్యే సోఫియా పెరిగారు. అయితే, ఆమె బాల్యం చాలా కల్లోలిత పరిస్థితుల్లో గడిచిందని ఆనంద్ తన పుస్తకంలో రాశారు. దులీప్ సింగ్ తన రాజ్యాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు చాలా ప్రయత్నించారు. ఈ విఫల యత్నాల నడుమ 1886లో ఆయన్ను ఫ్రాన్స్‌కు తరలించారు. ఆయన వల్ల కుటుంబం కూడా అప్పుల భారం మోయాల్సి వచ్చింది.
అయితే, క్వీన్ విక్టోరియాతో దగ్గర సంబంధాలు ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వంలోని ‘ఇండియా ఆఫీస్’ విభాగం నుంచి ఒక ఇల్లు, వార్షిక భత్యం పొందే అవకాశం ఈ కుటుంబానికి దక్కింది.
సోఫియా కాస్త పెద్దయ్యాక ఆమెకు హాంప్టన్ కోర్టు ప్యాలెస్‌లో ఒక భవనాన్ని క్వీన్ విక్టోరియా కేటాయించారు.
ఆ తర్వాత కాలంలో ఆ భవనం వెలుపలే మహిళలకు ఓటు హక్కు కోసం సోఫియా నిరసన చేపట్టారు.
‘‘చిన్న వయసు నుంచే ఎవరితో ఎలా మాట్లాడాలో సోఫియా చక్కగా నేర్చుకున్నారు. ఒకవైపు బ్రిటన్‌లోని ప్రముఖుల్లో ఒకరిగా, మరోవైపు బ్రిటన్‌లో జీవిస్తున్న భారతీయ మహిళగా నాటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు’’ అని ‘ద బ్రిటిష్ విమెన్స్ సఫ్రేజ్ క్యాంపెయిన్’ పుస్తకంలో చరిత్రకారిణి ఎలిజబెత్ బేకర్ వివరించారు.
మొత్తంగా సోఫియా నాలుగుసార్లు భారత్‌కు వచ్చారు. ఆమె పర్యటనలను బ్రిటన్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేది. ఎందుకంటే ప్రజల్లో అసమ్మతికి దులీప్ సింగ్ కుటుంబ సభ్యుల పర్యటనలతో ఆజ్యం పోసినట్లవుతుందని బ్రిటన్ అధికారులు భావించేవారు.
1906-07లో భారత స్వాతంత్ర్య పోరాట యోధులు గోపాల కృష్ణ గోఖలే, లాలా లాజ్‌పత్ రాయ్‌లను లాహోర్‌లో ఆమె కలిశారు. గోఖలే, లాజ్‌పత్ రాయ్ ప్రసంగాల నుంచి ఆమె స్ఫూర్తి పొందారు.
‘‘1907లో ఆమె ఆరు నెలలు భారత్‌లో గడిపారు. అక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని ఆమె దగ్గరుండి గమనించారు. స్వాతంత్ర్యం కోసం ప్రజల పోరాట స్ఫూర్తి ఆమెను కదిలించింది’’ అని తన పుస్తకంలో ఆనంద్ వివరించారు.
1908లో తిరిగి బ్రిటన్‌కు వచ్చిన కొన్ని నెలలకే అక్కడి విమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ (డబ్ల్యూఎస్‌పీయూ)లో సోఫియా చేరారు. హక్కుల కోసం ఉద్యమించేందుకు బ్రిటన్ రాజకీయ ఉద్యమకర్త ఎమెలీన్ పాంగ్‌కర్స్ట్ డబ్ల్యూఎస్‌పీయూను ప్రారంభించారు.
ఆ తర్వాత ‘నో వోట్, నో ట్యాక్స్’ నినాదంతో పనిచేసే విమెన్స్ ట్యాక్స్ రెసిస్టెన్స్ లీగ్‌లోనూ ఆమె చేరారు.
ఈ ఉద్యమాల్లో సోఫియా ఉత్సాహంగా పాల్గొనేవారు. 1911లో డౌనింగ్ స్ట్రీట్‌లో వెళ్తున్న ప్రధాన మంత్రి కారును అడ్డగించి ‘‘గివ్ విమెన్ ద వోట్!” బ్యానర్‌ను ఆమె ప్రదర్శించారు. అదే ఏడాది నిరసనగా జనాభా లెక్కల పత్రాన్ని పూరించలేదు. పన్నులు కట్టేందుకు కూడా ఆమె నిరాకరించారు.
1913లో తను నివసించిన హాంప్టన్ కోర్టు ప్యాలెస్ ఎదుట ‘రెవల్యూషన్’ అనే బోర్డు పక్కన నిలబడి ద సఫ్రజెట్ న్యూస్‌పేపర్ కాపీలను ఆమె అమ్ముతున్నట్లు ఓ ఫోటోలో కనిపిస్తుంది.
‘ఆ ఫోటోనే ‘సఫ్రజెట్ వీక్’కు ఆమె ముఖచిత్రంలా మారేలా చేసింది.
‘‘బ్రిటన్‌లో మరింత మంది మహిళలను తమలో చేర్చుకునేందుకు సఫ్రజెట్ వీక్‌ను డబ్ల్యూఎస్‌పీయూ నిర్వహించింది’’ అని బేకర్ రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, BRITISH LIBRARY
పన్నులను చెల్లించకపోవడంతో ఆమె ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుని, వేలం వేసినట్లు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. ఇతర హక్కుల ఉద్యమకర్తలతోపాటు సోఫియాను కూడా చాలాసార్లు అరెస్టు చేశారు. అయితే, ఆమెపై అభియోగాలను ఎప్పటికప్పుడే వెనక్కు తీసుకునేవారు.
అయితే, కొన్నిసార్లు ఆమె రావడంతో ఆ నిరసనలపై అధికారులు మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు.
‘‘పత్రికల్లో వచ్చే వార్తలు, ఆమె వ్యక్తిగత, ఆర్థిక వివరాలను ఇండియా ఆఫీస్ అధికారులు తరచూ సేకరించేవారు. దులీప్ సింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు తీసుకునే చర్యల్లో ఇవి కూడా భాగంగా ఉండేవి’’ అని బేకర్ రాసుకొచ్చారు.
మహిళా ఓటు హక్కు ఉద్యమంలో బ్రిటిష్, భారత ఉద్యమకారుల మధ్య ఒక వారధిలా సోఫియా పనిచేశారని బేకర్ వివరించారు.
1918లో 30 ఏళ్లకు పైబడిన మహిళలకు కొన్ని షరతులపై ఓటు హక్కును ఇచ్చే చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. పురుషులతో సమాన ఓటు హక్కు వచ్చేందుకు మరో పదేళ్లు పట్టింది.
1919లో లండన్‌లోని ఇండియా ఆఫీస్‌కు రాజకీయ ప్రముఖులైన సరోజినీ నాయుడు, అనీ బిసెంట్‌లతో కలిసి సోఫియా వచ్చారు. నాడు భారత మహిళలకు ఓటు హక్కు కోరుతూ వీరు విదేశాంగ మంత్రిని కలిసేందుకు వచ్చారు. వీరిని విదేశాంగ మంత్రి కలిశారు. కానీ, ఎలాంటి హామీ ఇవ్వలేదు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇక్కడ అందరికీ సమాన ఓటు హక్కు కల్పించారు.
‘‘మహిళలకు ఓటు హక్కుపై విముఖత చూపే కింగ్ జార్జ్ 5కు ఈ నిరసనల్లో సోఫియా పాల్గొనడంతో ఆగ్రహం వచ్చేది. కానీ, ఇక్కడ ఆయన ఏమీ చేయలేకపోయేవారు. ఎందుకంటే ఆమె ఆర్థిక లావాదేవీలన్నీ పార్లమెంటు చేతుల్లో ఉండేవి’’ అని ఆనంద్ రాసుకొచ్చారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికుల కోసం విరాళాలు సేకరించడం లాంటి ఇతర కార్యక్రమాల్లోనూ సోఫియా చురుగ్గా పాల్గొనేవారు.
1924లో మరోసారి సోఫియా భారత్‌కు వచ్చారని, అప్పుడు పంజాబ్ మొత్తం ఆమె పర్యటించారని ఆనంద్ వివరించారు.
తన సోదరి బాంబాతో కలిసి పాత సిక్కు రాజ్యంలో తిరిగేటప్పుడు- ‘‘మా రాకుమార్తెలు వచ్చారు’’ అని చాలా మంది ప్రజలు వారిని చూడటానికి వరుస కట్టేవారు.
వీరు సందర్శించిన ప్రాంతాల్లో 1919 నాటి జలియన్‌వాలా బాగ్ ఊచకోత జరిగిన ప్రాంతం కూడా ఉంది. ఇక్కడే వందల మంది భారతీయులను బ్రిటిష్ బలగాలు హతమార్చాయి.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తన సోదరి క్యాథ్రీన్, మరో ముగ్గురితో కలిసి లండన్‌ను విడిచిపెట్టి బకింగ్‌హ్యామ్‌షైర్‌కు వెళ్లిపోయారు.
చివరి రోజుల్లో తన ఇంట్లో పనిచేసే జానెట్ ఐవీ బోడెన్‌తో కలిసి జీవించారు. ఐవీ కుమార్తె డ్రోవ్నాతోనూ సోఫియాకు మంచి అనుబంధముంది.
‘‘ఓటు హక్కు ప్రాముఖ్యం గురించి తరచూ నాతో సోఫియా మాట్లాడేవారు’’ అని ఆనంద్‌తో డ్రోవ్నా చెప్పారు.
1948 ఆగస్టు 22న 71 ఏళ్ల వయసులో సోఫియా మరణించారు.
ఆమె చివరి కోరిక ప్రకారం తన అస్థికలను లాహోర్‌కు ఆమె సోదరి బాంబా తీసుకొచ్చారు. అయితే, వీటిని ఏ నదిలో కలిపారో తెలియలేదు.
ఇప్పటికీ బ్రిటన్‌లో చాలా మంది ఆమెను గుర్తుపెట్టుకుంటారు. ఆమె నివసించిన ఇంటి బయట ఇటీవల ఒక శిలా ఫలకాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఆమెపై తీసిన ఒక సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















