నిజామాబాద్: వేల్పూర్‌లో 46 సెం.మీ. వర్షం, ఇంత వాన తర్వాత ఈ గ్రామం ఎలా ఉంది?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో జూన్ 25న 46.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం తెలంగాణలో గతంలో నమోదైన గరిష్ఠ వర్షాపాతాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది.
2013లో ములుగు జిల్లా వాజేడు లో 51.7 సెం.మీ., కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం లో 50.36 సెం.మీ. రికార్డ్ స్థాయి వర్షాపాతం నమోదైంది.
వేల్పూర్‌లో సోమవారం అర్ధరాత్రి మొదలై మంగళవారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. దీంతో గ్రామంలోని చెరువుకు గండి పడింది. పోలీస్ స్టేషన్ సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి.
స్థానిక మదరసాలో నీళ్లు చేరాయి. వరి పొలాల్లో వరద నీరు చేరి నీట మునిగాయి. చెరువు నీరు రోడ్లపై రావడంతో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి.
ఏకధాటిగా సుమారు 9 గంటలు కురిసిన వర్షానికి వేల్పూర్ గ్రామప్రజలు అవస్థలు పడ్డారు.
పంటలకు తీవ్ర నష్టం కలిగించిన ఈ వర్షం గురించి ప్రభుత్వ యంత్రాంగం ముందే ఎందుకు హెచ్చరికలు చేయలేకపోయింది? వాతావవరణ శాఖ అధికారులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, UGC
వేల్పూర్ లో ఆ రోజు ఏమైంది
వర్షం కురిసిన రోజు పరిస్థితిని వేల్పూర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి బీబీసీ తో వివరించారు.
‘‘గతంలో ఎన్నడూ ఇలాంటి వర్షం చూడలేదు. ఎక్కువసేపు వర్షం కురవడంతో ఎక్కువగా నీరు వచ్చింది. కొందరు ఇళ్లలో వర్షం నీరు చేరింది. వంటసామగ్రి తడిసిపోయింది. రెండు చెరువు కట్టలు తెగిపోయి నీరు ఎక్కువగా వచ్చింది’’ అని మోహన్ రెడ్డి తెలిపారు.
ముందు జాగ్రత్తగా మదరసాలో విద్యార్థులకు గ్రామంలోని షాదీఖానాలో ఆశ్రయం కల్పించామని, ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆశ్రయమిచ్చామని ఆయన వివరించారు.
‘‘నా 45 ఏళ్ల జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదు. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు, ఇళ్లు ఏకమయ్యేలా వరద నీరు పారింది. పోలీస్ స్టేషన్ ముందు నీరు నిలిస్తే అక్కడి డివైడర్‌లను తొలగించి ఆటంకం తొలగించాం. చెట్లు పడిపోయిన దగ్గర ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు’’ అని వేల్పూర్ గ్రామస్తుడు వనందాసు మహేందర్ గౌడ్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది
ప్రస్తుతం వేల్పూర్ కుదుటపడింది అన్నారు సర్పంచ్ మోహన్ రెడ్డి.
‘‘గ్రామానికి వచ్చే రోడ్లు క్లియర్ చేశాం. చెరువులకు పడిన గండ్లు పూడ్చేశాం. అంత భారీ వర్షం కురిసినా గ్రామంలో ఇళ్లు కూలడం, ప్రాణనష్టం లాంటివి జరగలేదు. బాధితులకు భోజన ఏర్పాట్లు చేశాం. వంటసామగ్రి, బియ్యం,పప్పులు పంపిణీ చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
తన సొంతూరు వేల్పూర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చేందుకు చేపట్టిన పనులను తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు.
‘భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఆందోళనకు గురికావొద్దు’ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల్లో వరి, పసుపు, సోయాబీన్, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది.
వర్షాలతో ఎవరైనా ప్రమాదంలో పడితే డయల్ 100 లేదా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08462220183 నంబర్ పై ప్రభావిత ప్రాంతాల ప్రజలు సహాయం కోసం సంప్రదించవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు.

వేల్పూర్ లో ‘క్లౌడ్ బరస్ట్’ జరిగిందా?
వేల్పూర్‌లో పరిస్థితి గమనిస్తే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది ‘క్లౌడ్ బరస్ట్’ అయ్యుండొచ్చని నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ బీబీసీతో చెప్పారు.
‘గతంలో 1983 అక్టోబర్ 10న నమోదైన 33 సెం.మీ. వర్షం ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా పరిధిలో రికార్డ్ స్థాయి వర్షపాతం గా ఉంది. నిరుడు జిల్లాలో ఒక రోజు కురిసిన అత్యధిక వర్షపాతం 19సెం.మీ.లుగా నమోదైంది. ఇప్పుడు వేల్పూర్, జక్రాన్ పల్లి, భీంగల్ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల వల్ల క్లౌడ్ బర్స్ట్ జరిగి 46 సెం.మీ. వర్షం పడింది. 24 గంటల్లో 7 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే భారీ వర్షంగా పిలుస్తాం’ అని ప్రతాప్ వివరించారు.
వేల్పూర్‌లో భారీ వర్షపాతం నమోదు వెనుక ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా వంటి మరిన్ని వివరాల కోసం బీబీసీ, హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని సంప్రదించింది.
‘వేల్పూర్‌లో ఉన్న భౌగోళిక, ఇతరత్రా పరిస్థితులు ప్రస్తుతానికి మాకు తెలియవు. ప్రత్యేకంగా అధ్యయనం జరిగితే తప్ప కారణాలు చెప్పలేం’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం బీబీసీ తో అన్నారు.
‘ఓరోగ్రఫీ ఎఫెక్ట్’ వల్ల..అంటే పర్వతాలు, భారీ నీటి వనరులు ఉన్న చోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉంటుంది అని నాగరత్నం వివరించారు.

గ్రామ స్థాయిలో వర్షాన్ని ముందుగా అంచనా వేయలేమా?
భారత వాతావరణ శాఖ నుండి వర్షాలకు సంబందించి జారీ చేసే గ్రీన్,ఎల్లో,ఆరెంజ్, రెడ్ అలర్ట్ ల గురించి వింటుంటాం.
ఇందులో గ్రీన్ అలర్ట్ అంటే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మోస్తారు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్టు జారీ చేస్తారు.
రెడ్ అలర్ట్ అంటే వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అధికారయంత్రాంగం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టాలని అర్థం.
#ఒక మోస్తరు వర్షం - 15.6 మి.మీ - 64.4 మి.మీ.
#భారీ వర్షం - 64.5 మి.మీ. - 115.5 మి.మీ.
#అతి భారీ వర్షం - 115.6 మి.మీ. - 204.5 మి.మీ.
#కుంభవృష్టి - 204.5 మీ.మీ కంటే ఎక్కువ
వేల్పూర్ గ్రామంలో కుంభవృష్టి పడుతుందని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేయలేకపోయిందా అన్న అనుమానం రావొచ్చు. దీనిపై ప్రాంతీయ వాతావరణ కేంద్రం, హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్నం వివరణ ఇచ్చారు.
‘ప్రత్యేకంగా గ్రామస్థాయి వరకు అలర్ట్ లను ఇచ్చే సౌకర్యాలు మనకు లేవు. ఆ అంశం పరిశోధన దశలో ఉంది. ప్రస్తుతం జిల్లా నుండి బ్లాక్ లెవల్ వరకు మాత్రమే అలర్ట్ లను ఇవ్వగలం’ అని తెలిపారు.
ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది.
ఈ అంచనాల కోసం భారత్‌లో 650కిపైగా అబ్జర్వేటరీలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం సమాచారాన్ని సేకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్‌కు పంపిస్తాయి.
ఏదైనా ప్రాంతంలో ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేయడంలో ‘పీడనం’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పీడనం ఏర్పడటంలో ఉష్ణోగ్రత కీలకంగా మారుతుంది. ఈ రెండింటినీ బారోమీటర్(పీడనం), థర్మోమీటర్ (ఉష్ణోగ్రత)లతో కొలిచి వర్షం పడే అవకాశాలను అంచనా వేస్తారు.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.
ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.
వర్షాకాలంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?
సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.
మే నుంచి జులై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, UGC
వాతావరణశాఖ తాజా హెచ్చరికలు
తెలంగాణ లో రానున్న వారం రోజులకు సంబంధించి హెచ్చరికలను తాజాగా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని తెలిపింది.
ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని, కొమురంభీము ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడం, హన్మకొండ, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని తన ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














