కులు - మనాలి వరదలు: 'మేం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుంది, మాకు సాయం చేయండి'

ఫొటో సోర్స్, ARCHANA PHULL
- రచయిత, అర్చన ఫుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా పర్యటక కేంద్రమైన మనాలి అల్లకల్లోలమైంది. జులై రెండో వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నగరం స్తంభించింది.
ఈ విపత్తు కారణంగా మనాలిలో ప్రాణనష్టం, భారీగా ఆస్తి నష్టం వాటిల్లాయి. నగరం ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం కులు జిల్లాలో ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశారు, వాటిలో 15 మృతదేహాలను గుర్తించారు. అయితే మరో 21 మంది జాడ తెలియలేదు.
బియాస్ నది ప్రవాహంతో 50కి పైగా ఇళ్లు, కమర్సియల్ ప్రాపర్టీస్ కొట్టుకుపోయాయి. ప్రవాహం ధాటికి జాతీయ రహదారి పక్కన భారీగా ఆస్తి నష్టం జరిగింది.
“1995 సెప్టెంబర్‌లో బియాస్ నది వరద కారణంగా సంభవించిన వినాశనం ఇలాంటిదే. ఆ సమయంలో మనాలికి రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. నెలల తరబడి అదే పరిస్థితి కొనసాగింది. ఈసారి కూడా అదే నష్టం జరిగింది'' అని స్థానికుడైన సీనియర్ జర్నలిస్ట్ ఛబీందర్ ఠాకూర్ అన్నారు.
“కొన్ని నష్టాలు ఎప్పటికీ కోలుకోలేని విధంగా ఉంటాయి. బియాస్ నది తన మార్గాన్ని మార్చుకోవడం, వరదలో అన్నీ కొట్టుకుపోవడం భయానకంగా ఉంది. జాతీయ రహదారిపై నిలిపిన వాహనాలు, దుకాణాలు, ఇళ్లు అన్నీ నిమిషాల వ్యవధిలోనే కొట్టుకుపోయాయి'' అని గుర్తుచేసుకున్నారు ఠాకూర్.

ఫొటో సోర్స్, ARCHANA PHULL
రూ. 1,000 కోట్ల మేర నష్టం
ఈ వరద కారణంగా కులు, మనాలి మధ్య కనెక్టివిటీ తెగిపోయింది.
ఈ రెండింటి మధ్య 45 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతాల మధ్య మార్గాలను పునరుద్ధరించడానికి స్థానిక అధికార యంత్రాంగం చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ పనులను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరింత కష్టతరం చేస్తున్నాయి.
“ఈ రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. తాత్కాలికంగా అయినా కనెక్టివిటీని పునరుద్ధరించడమే మా ప్రయత్నం. అప్పుడే ప్రజలు నిత్యావసర వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించవచ్చు'' అని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు.
జాతీయ రహదారితో పాటు, కులు, మనాలిని కలిపే రహదారిపై అధికారులు దృష్టి పెట్టాలని ఛబీందర్ ఠాకూర్ సూచిస్తున్నారు.
కులు, మనాలిలో నది ఒడ్డున నిర్మించిన గోడలు బలంగా లేవని, వాటిని సరిగ్గా నిర్మించలేదని ఠాకూర్ ఆరోపించారు.
"ఇటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కులు, మనాలిని కలుపుతూ సరైన రహదారిని నిర్మించాలి. తద్వారా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రజలు సహాయం పొందవచ్చు. పండ్ల పెంపకందారులు తమ ఉత్పత్తులు సకాలంలో తరలించవచ్చు" అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహాయ బృందంలో కులు డిప్యూటీ కమిషనర్ అశుతోశ్ కూడా ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 1,000 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అశుతోశ్ చెప్పారు.
జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారికి జరిగిన నష్టాన్ని దీనిలో కలపలేదు. ఈ రోడ్డు చాలా చోట్ల తెగిపోయింది.

ఫొటో సోర్స్, ARCHANA PHULL
చిక్కుకుపోయిన 50 వేల మంది పర్యాటకులు
కులు, మనాలిలో చాలా వరకు పర్యటకులందరినీ సురక్షితంగా తరలించామని అశుతోశ్ అంటున్నారు.
అయినప్పటికీ పెద్ద సంఖ్యలో పర్యటకులు కనిపిస్తున్నారు. వారి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మనాలిని అంతర్జాతీయ పర్యటక ప్రాంతంగా పరిగణిస్తారు. ఇది అటల్ టన్నెల్ ద్వారా లేహ్‌కు అనుసంధానించి ఉంది.
ఈ నగరం ఆర్థిక వ్యవస్థ యాపిల్ ఉత్పత్తి, ఎగుమతుల రంగంతోపాటు పర్యటకంపై ఆధారపడి ఉంది.
ఏటా సుమారు 35 లక్షల మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. కులు, మనాలిలోని మారుమూల ప్రాంతాలు పర్యటకులను ముఖ్యంగా విదేశీయులను ఆకర్షిస్తాయి.
జిల్లా యంత్రాంగం ప్రకారం ఎడతెరిపి లేకుండా వర్షాలు, వరదలు సంభవించినప్పుడు కులు, మనాలీలలో సుమారు 50,000 మంది పర్యటకులు ఉన్నారు.
నగరంలో 1,500 హోటళ్లు, అతిథి గృహాలు, హోమ్ స్టేలు ఉన్నాయి. వీరందరిపై వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
''అంతా మారిపోయింది''
“మేం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లుంది. ఇక పర్యటకులు ఎక్కువగా రాకపోవచ్చు. మేం కోవిడ్ కాలాన్ని కూడా చూశాం" అని మనాలిలోని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖేష్ ఠాకూర్ అన్నారు.
"కోవిడ్‌తో పర్యటకుల రాక తగ్గిపోయింది. అయితే, కొంతకాలంగా వ్యాపారం ఊపందుకుంది, మళ్లీ అంతా మారిపోయింది. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీరు, మొబైల్ నెట్‌వర్క్‌లు అన్నీ దెబ్బతిన్నాయి. మాకు ఈ వ్యాపారం తప్ప మరొకటి తెలీదు" అని ఆయన చెప్పారు.
బియాస్ నది వెంబడి జాతీయ రహదారి, గోడల నిర్మాణం సరిగా జరగలేదని ముఖేష్ ఠాకూర్ ఆరోపించారు.
“అందుకే రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డు నిర్మాణ సమయంలో పోగుపడే చెత్తను కూడా నదిలోకి వదులుతున్నారు. వరదల సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతోంది. వీటన్నింటినీ పర్యవేక్షించే వ్యవస్థ ఎక్కడ'' అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ARCHANA PHULL
పర్యటకాన్ని తిరిగి తీసుకురావడం సవాలే
టూరిజం పరిశ్రమ పునరుజ్జీవానికి ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ఇవ్వాలని ముఖేష్ ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు.
“పర్యటకులందరినీ రక్షించారు, కాని వారిలో భయం ఏర్పడింది. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మేం ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ సంక్షోభ సమయంలో మాకు ఎలాంటి సహాయమూ అందలేదు. కానీ ప్రస్తుత సంక్షోభంలో మాకు సహాయం అవసరం" అని ఆయన అన్నారు.
డబుల్ లేన్ రోడ్డు వస్తుందన్న సంతోషం కూడా వరదల కారణంగా స్థానిక పౌరుల్లో ఆవిరైపోయింది.
కులు, మనాలీలను రోడ్డు మార్గంలోనే కాకుండా విమాన మార్గం ద్వారా కూడా ఇతర ప్రాంతాలకు అనుసంధానించాలని స్థానికులు కోరుతున్నారు.
నది ఒడ్డున భారీ నిర్మాణ పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.
దీంతో పాటు నిర్మాణ వ్యర్థాలను నదిలో వేయడాన్ని నిషేధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవన్నీ పర్యావరణ ఉద్యమకారులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న అంశాలే అయినా ప్రభుత్వం, సామాన్యుల దృష్టి మాత్రం ఏనాడూ వాటి పైకి పోలేదు.
ఇవి కూడా చదవండి
- సోఫియా దులీప్ సింగ్: బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన భారత రాకుమారి కథ
- కరెన్సీ: చిరిగిన, పాడైపోయిన నోట్లను ఫ్రీగా ఎలా మార్చుకోవాలి? నిబంధనలు ఇవీ
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














