స్నానం చేస్తుండగా బకెట్‌లో 12 కోట్ల ఏళ్ల నాటి చేప జాతిని గుర్తించిన కేరళ వాసి.. ప్రశంసించిన డికాప్రియో

లియోనార్డో డికాప్రియో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చేపల్లో ఒక కొత్త జాతిని గుర్తించిన కేరళ వాసిని హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో ప్రశంసించారు.

పారామిలిటరీ మాజీ జవాను అయిన ఎ. అబ్రహం మూడేళ్ల క్రితమే ఈ అరుదైన చేపను కనుగొన్నారు.

అయితే, లియోనార్డో డికాప్రియో తాజాగా ఆన్‌లైన్ వేదికగా ఆయనను పొగడటంతో అబ్రహం పేరు మరోసారి ప్రముఖంగా మారింది.

‘పాతాల ఈల్ లోచ్’ అనే భూగర్భ జాతి చేపను 2020లో అబ్రహం కనుగొన్నారు.

పాతాల అనే సంస్కృత పదం ఆధారంగా చేపకు ఈ పేరు పెట్టారు. సంస్కృతంలో పాతాల అంటే భూమి అడుగుభాగం అని అర్థం.

పామును పోలి, పరిమాణంలో చిన్నగా ఉండే ఈ జాతి చేపలు భూగర్భజలాలు ఉండే రాళ్లు, సెడిమెంట్లతో కూడిన భారీ పొరల్లో నివసిస్తాయి.

ఈ చేప జాతిని యాదృచ్ఛికంగా గుర్తించినట్లు అబ్రహం తెలిపారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఆయన ఉంటారు.

స్నానం చేస్తున్నప్పుడు, బకెట్‌లో ఒక ఎర్రటి దారం లాంటి దాన్ని చూసినట్లు ఆయన చెప్పారు.

చేపలు

ఫొటో సోర్స్, RAJEEV RAGHAVAN VIA TWITTER

ఫొటో క్యాప్షన్, పాతాల ఈల్ లోచ్ చేప మామూలుగా భూగర్భజలాల్లో కనిపిస్తుంది

ఆసక్తిగా పరిశీలించగా, అది కదులుతున్నట్లు గుర్తించానని ఆయన అన్నారు.

కదులుతున్న ఆ జీవిని ఒక గాజు సీసాలో భద్రంగా ఉంచి డాక్టర్ బినోయ్ థామస్ అనే ఒక స్థానిక కాలేజీ ప్రొఫెసర్‌ను కలిసినట్లు అబ్రహం చెప్పారు.

థామస్ సహాయంతో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీష్ అండ్ ఓషన్ స్టడీస్ (కుఫోస్) పరిశోధకులను కలిసినట్లు, అక్కడ వారు ఇదొక కొత్త జాతి చేప అని గుర్తించినట్లు ఆయన వివరించారు.

తర్వాత కొన్ని వారాల పాటు అబ్రహం ఇంటిలోని బావి, నీళ్ల ట్యాంకులో ఈ జాతికి చెందిన మరిన్ని చేపలను వారు కనుగొన్నారు.

పర్యావరణ ప్రచారకుడు, హాలీవుడ్ స్టార్ డికాప్రియో కారణంగా ఈ అందమైన ఆవిష్కరణ గత వారం మరోసారి వార్తల్లో నిలిచింది.

పాతాల ఈల్ లోచ్ చేపకు సంబంధించిన కలర్‌ఫుల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న డికాప్రియో, అబ్రహంను ప్రశంసించడంతో దీనికి మరోసారి ప్రాధాన్యం దక్కింది.

‘‘మన చుట్టూనే అద్భుతాలు ఉన్నాయి. ఒక కొత్త జాతిని కనుగొనడానికి కొన్నిసార్లు ఒక సాధారణ రోజు మాత్రమే సరిపోతుంది’’ అని డికాప్రియో వ్యాఖ్యను జోడించారు.

ఎవరికీ తెలియని ఈ భూగర్భ పర్యావరణ వ్యవస్థలపై పరిశోధకులు అధ్యయనం చేయడానికి పౌర విజ్ఞానం ఎంత కీలకమో ఇది చూపిస్తుందని ఆయన రాసుకొచ్చారు.

అబ్రహం
ఫొటో క్యాప్షన్, 2020లో అబ్రహం కొత్త జాతి చేపను గుర్తించారు

చేపలు మామూలుగా నదులు, సరస్సుల వంటి నీటి ఉపరితలాల్లో ఉంటాయి. కానీ, పాతాల ఈల్ లోచ్ చేప జాతి మాత్రం భూగర్భ జలాల్లో నివసించే చేపల సమూహానికి చెందినది.

‘‘భారత్‌లో ఇలాంటివి దాదాపు 17-18 చేప జాతులు ఉన్నాయి. ఇందులో 11కు పైగా చేప జాతులు కేరళకు చెందినవే’’ అని బీబీసీతో కుఫోస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ రాఘవన్ చెప్పారు.

ఈ చేపలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే భారత్, చైనా, మెక్సికో వంటి ప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తాయి. ఈ ప్రదేశాల్లో అత్యధిక సంఖ్యలో భూగర్భజల జాతుల చేపలు ఉంటాయి.

‘‘ఈ చేపలు భూగర్భజలాల్లోనే కనిపిస్తాయి. కాబట్టి వీటిని పట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం- పొరపాటున అవి కుళాయిల్లోంచి బయటకు వచ్చినప్పుడు పట్టుకోవడమే’’ అని రాఘవన్ చెప్పారు.

వేసవిలో బావుల్లో నీరు అడుగంటిపోయినప్పుడు ఈ చేపలు కనిపిస్తుంటాయి. భారత్‌ మొత్తమ్మీద కేరళలో బావులు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 70 లక్షల వరకు బావులు అక్కడ ఉన్నాయి.

పాతాల ఈల్ చేప తొలుత భూగర్భజలాల నుంచి బావిలోకి, బావి నుంచి నీళ్ల ట్యాంకులోకి, అక్కడ నుంచి బకెట్‌లోకి వచ్చినప్పుడు అబ్రహం దాన్ని గుర్తించి ఉండొచ్చు.

భూగర్భజలాల్లో ఉండే చేపల గురించి 1950ల వరకు పెద్దగా ఎవరికీ తెలియదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, Shark Attack: లక్షలాది చేపల గుంపు మీద ఒక్క షార్క్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూశారా..

కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి 2015లో కుఫోస్ అధ్యయనం చేస్తుండగా కేరళలో భూగర్భజల చేప జాతుల ఉనికి గురించి తెలిసింది.

అప్పుడు కుళాయిలు, బావు అడుగుల నుంచి ఇలాంటి చేపలు వస్తాయనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కుఫోస్ యూనివర్సిటీ ఒక సిటిజన్ సైన్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.

‘‘ఇలాంటి చేపలు కనిపిస్తే మాకు ఫోన్ లేదా మెసేజ్ చేయాలని మేం ప్రజలకు చెప్పాం. అలా చేయడం వల్లే 11 జాతులకు చెందిన 150కి పైగా నమూనాలను మేం సేకరించగలిగాం’’ అని రాఘవన్ చెప్పారు.

పరిణామ క్రమ దృక్కోణంలో కూడా పాతాల ఈల్ లోచ్ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘‘భూగర్భజలాల్లో ఉండే చాలా చేప జాతులు పురాతనమైనవి. కేరళలో లభ్యమైన 11 జాతుల్లో ఒకదానిపై అధ్యయనం చేసినప్పుడు అది 12.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని కనుగొన్నాం. అప్పుడు భూమిపై డైనోసార్లు కూడా ఉండేవి’’ అని రాఘవన్ చెప్పారు.

‘‘అంటే దీనర్థం, భూగర్భజలాల్లో చిక్కుకుపోయిన చేపలన్నీ దాదాపు లక్షల ఏళ్ల క్రితం నాటివి’’ అని ఆయన వివరించారు.

ఈ చేపను కనుగొనడాన్ని అబ్రహం గర్వంగా భావించారు.

ఇప్పుడు డికాప్రియో ఈ చేప గురించి, తన గురించి ప్రస్తావించడంతో ఆయన మరింత ఆనందంగా ఉన్నారు.

‘‘అలాంటి గొప్ప వ్యక్తి నన్ను ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ అబ్రహం హర్షం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, టీటీడీ: ఈ ఆవు దూడ పుట్టుక ప్రత్యేకం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)