INS కృపాణ్: ఆయుధాలు నింపిన ఈ నౌకను భారత్ ఎందుకు వియత్నాంకు ఇచ్చింది, చైనాపై దీని ప్రభావం ఏంటి?

కృపాణ్ యుద్ధనౌక

ఫొటో సోర్స్, @INDIANNAVY

ఫొటో క్యాప్షన్, ఐఎన్‌ఎస్ కృపాణ్ యుద్ధనౌక
    • రచయిత, శుభం కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను శనివారం వియత్నాం సైన్యానికి అప్పగించారు.

క్షిపణులతో కూడిన యుద్ధనౌకను ఇతర దేశాలకు ఇవ్వడం భారత్‌కు చరిత్రలో ఇదే మొదటిసారి.

వియత్నాంలోని క్యామ్ రాన్‌లో జరిగిన వేడుకలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేతృత్వంలో ఈ యుద్ధనౌక బదిలీ ప్రక్రియ పూర్తయింది. భారత్-వియత్నాం దేశాల మెరుగైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని నిపుణులు అంటున్నారు.

ఇదొక చారిత్రక క్షణమని, ఎందుకంటే పూర్తి స్థాయి ఆపరేషనల్ యుద్ధ వాహనాన్ని ఒక మిత్రదేశానికి భారత్ ఇవ్వడం ఇదే తొలిసారి అని నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్ అన్నారు.

భారత నౌకా దళంలోని అత్యుత్తమ, సుదీర్ఘకాలంగా సేవలందించిన యుద్ధనౌకలలో ఒకటైన కృపాణ్‌ను వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు లభించిన గొప్ప గౌరవం అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత నేవీ

ఫొటో సోర్స్, @INDIANNAVY

ఐఎన్‌ఎస్ కృపాణ్ ప్రత్యేకత ఏంటి?

ఐఎన్ఎస్ కృపాణ్‌ను భారత్‌లో తయారు చేశారు. ఈ యుద్ధనౌకతో క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఇది 90 మీ. పొడవు, 10.45 మీటర్ల వెడల్పు ఉంటుంది. అందులోని ఆయుధాలన్నింటితో కలిపి దాని బరువు మొత్తం 1,450 టన్నులు.

1991లో కృపాణ్‌ను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అప్పటినుంచి తూర్పు నౌకాదళంలో ఇది ముఖ్యమైన భాగంగా ఉంది.

32 సంవత్సరాల పాటు సేవలు అందించిన తర్వాత దీన్ని భారత నౌకాదళం నుంచి ఉపసంహరించి, అందులోని ఆయుధాలతో సహా వియత్నాం సైన్యానికి ఇచ్చారు.

ఈ యుద్ధనౌకలో 12 మంది అధికారులతోపాటు 100 మంది నౌకాదళ సిబ్బంది పనిచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

చైనాతో ఎందుకు ముడిపెడుతున్నారు?

ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను వియత్నాంకు అప్పగించడాన్ని కొందరు నిపుణులు చైనాతో ముడిపెట్టి చూస్తున్నారు. దీని గురించి జేఎన్‌యూ ప్రొఫెసర్ స్వరణ్ సింగ్‌తో బీబీసీ మాట్లాడింది.

చైనా, వియత్నాం దేశాల మధ్య భూమి, సముద్ర సరిహద్దు అంశాల్లో వివాదం ఉందని స్వరణ్ సింగ్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ సముద్ర సరిహద్దు వివాదం కొనసాగుతోందని ఆయన తెలిపారు.

భారత్‌ అందించే రక్షణ సహకారంతో వియత్నాం లబ్ధి పొందుతోందని చెప్పారు.

‘‘ఇది భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీతో పాటు, క్వాడ్ ప్లస్ దేశాలతో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక భాగం.

పొరుగు దేశమైన చైనాతో భారత్, వియత్నాం దేశాలకు ఉద్రిక్తతలు ఉన్నాయి. భారత్, వియత్నాం మధ్య ఈ సైన్య సహకారాన్ని.. దక్షిణ చైనా సముద్రంలో తన సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యగా చైనా భావిస్తుంది’’ అని ఆయన వివరించారు.

విదేశీ వ్యవహారాల నిపుణుడు రాబిందర్ సచ్‌దేవా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"యుద్ధనౌకను ఇవ్వడం రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక పెద్ద అడుగుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రెండు దేశాలకు చైనాతో అంతగా మంచి సంబంధాలు లేవు. దక్షిణ చైనా సముద్రంతోనూ ఈ దేశాల ప్రయోజనాలు అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి దీన్ని చైనాతో ముడిపెట్టి చూడటం తప్పేమీ కాదు’’ అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కొన్నేళ్లుగా పటిష్టమైన సంబంధాలు

‘‘అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్(ఏఎస్‌ఈఏఎన్)’’ గ్రూపులో వియత్నాం ఒక కీలక సభ్య దేశం. దక్షిణ చైనా సమద్ర ప్రాంతం విషయంలో చైనాతో వియత్నాంకు వివాదం ఉంది.

దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంకు చెందిన జలాల్లో చమురు అన్వేషణ ప్రాజెక్టులను భారత్ నిర్వహిస్తోంది.

గత కొన్ని కొన్నేళ్లుగా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్, వియత్నాం దేశాలు సముద్ర భద్రత సహకారాన్ని పరస్పరం పెంపొందించుకుంటున్నాయి.

2007 జులైలో అప్పటి వియత్నాం ప్రధాని గుయెన్ టాన్ డంగ్, భారత పర్యటన సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

2016 వియత్నాం పర్యటనలో భారత ప్రధాని మోదీ ఈ ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి తీసుకెళ్లారు.

భారతదేశ యాక్ట్ ఈస్ట్ విధానంతో పాటు, ఇండో-పసిఫిక్ విజన్‌లో వియత్నాం ఒక ముఖ్య భాగస్వామిగా మారింది.

భారత్ మాత్రమే కాదు వియత్నాంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇతర దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా వియత్నాంకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని రాబిందర్ చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వియత్నాంకు ఆర్ధిక సాయం అందిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

గతంలోనూ భారత సాయం

గత ఏడాది జూన్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వియత్నాంలో పర్యటించారు. ఈ సందర్భంగా హనోయిలో వియత్నాం రక్షణమంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్‌ను కలిశారు.

ఆ పర్యటనలో వియత్నాంకు 50 కోట్ల డాలర్ల విలువైన రక్షణ రుణాన్ని అందించే ఒప్పందంపై తుది రూపాన్ని తీసుకురావడంతో పాటు రెండు దేశాల మధ్య అనేక కీలక రక్షణ ఒప్పందాలు కుదిరాయి.

2030 వరకు ఉమ్మడి లాజిస్టిక్స్ మద్దతుకు సంబంధించిన ఒప్పందంపై కూడా రెండు దేశాలు సంతకం చేశాయి. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ‘ఉమ్మడి రక్షణ సహకారం’పై కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఆ తర్వాత వియత్నాంకు భారత్ 12 హైస్పీడ్ గార్డు బోట్లను అందజేసింది.

ఇవే కాకుండా వియత్నాం ఆఫీసర్ ట్రైనింగ్ స్కూల్ కోసం ఆర్థిక సహాయం కూడా చేసింది రక్షణ శాఖ.

వీసా జారీల్లో పెరుగుదల

బౌద్ధమతం, హిందూమతం ప్రభావం పరిశీలిస్తే వియత్నాం పురాతన కాలం నుంచి చారిత్రకంగా, నాగరికంగా భారత ఉపఖండంతో అనుసంధానమై ఉంటుంది.

స్వరణ్ సింగ్ ప్రకారం ఇరు దేశాల స్వాతంత్ర్య సమరయోధుల మధ్య బలమైన అనుబంధం ఉంది. ఇది గాంధీజీ, నెహ్రూ హోచి మిన్‌లు రాసుకున్న లేఖలలో కనిపిస్తుంది.

వియత్నాం ఇతర దేశాలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోందని, తద్వారా చైనాపై ఆర్థికంగా ఆధారపడటం తగ్గించుకుంటోందని రాబిందర్ సచ్‌దేవ్ చెప్పారు.

"చైనా వెలుపల తమ కర్మాగారాలను స్థాపించాలనుకునే అనేక కంపెనీలకు, వియత్నాం పెద్ద కేంద్రంగా నిరూపిస్తోంది. ఇది వియత్నాం ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంది" అని ఆయన తెలిపారు.

అదే సమయంలో వాణిజ్యపరంగా, ముఖ్యంగా పర్యాటక పరంగా వియత్నాం, భారత్‌ల మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా చాలా మెరుగుపడ్డాయి.

గత సంవత్సరం భారతీయులకు వియత్నాం జారీ చేసిన వీసాలు 24 రెట్లు పెరిగాయని భారతదేశంలోని వియత్నాం రాయబారి ఫామ్ సాన్ చౌ ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)