ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలియో డీ కార్వాలో పోన్స్
- హోదా, బీబీసీ ముండో
డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు భద్రతా సంస్థల కళ్లు గప్పేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మన శరీరంలోని జీవక్రియ(మెటబాలిజం)తో అధికారులను బురిడీ కొట్టిస్తున్నాయి.
‘ప్రోడ్రగ్స్’.. ఇవి ఒకరకమైన మత్తు మందులు. మన జీర్ణాశయంలోని కొన్ని ఎంజైమ్‌లతో లేదా శరీరంలోని కొన్ని రసాయనిక చర్యలలో ఇవి కలుస్తాయి. అప్పుడే వీటి ఫలితం మన శరీరంపై కనిపిస్తుంది.
వీటిలోని సమ్మేళనాలను ఎప్పటినుంచో ఔషధాల రూపంలో రోగులకు ఇస్తున్నారు. కానీ, వీటిని మత్తు కోసం సాధారణ ప్రజలు తీసుకోవడం ఎక్కువవవుతోంది.
సాధారణ అక్రమ డ్రగ్స్ చాలావరకు మెదడులోని కొన్ని రెసెప్టర్లతో చర్యలు జరపడంతో మత్తును ఇస్తాయి. ఇవి మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్లుగా పిలిచే రసాయన పదార్థాలను ప్రేరేపిస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. కొద్దిసేపటి తర్వాత ఇవి అచేతనం అవుతాయి లేదా వీటి ప్రభావం తగ్గుతుంది. చివరగా మూత్రంలోంచి ఇవి శరీరం నుంచి బయటకు వెళ్తాయి.
అదే ప్రోడ్రగ్స్ విషయానికి వస్తే, మెదడులోని రెసెప్టర్లపై ఇవి పనిచేయాలంటే మొదటగా వీటిలోని కొన్ని పరమాణువులను తొలగించాల్సి ఉంటుంది. లేదా వీటి రసాయనిక రూపంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి మన శరీరంలోని సహజంగా జరిగే చర్యలు తోడ్పడతాయి.
ప్రోడ్రగ్స్‌కు ఉదాహరణగా ఏఎల్‌డీ-52 (1-ఎసెటైల్-ఎల్‌ఎస్‌డీ)ని చెప్పుకోవచ్చు. దీని నుంచి రసాయనిక చర్యల ద్వారా రెండు కార్బన్, ఒక ఆక్సిజన్ అణువులను మన శరీరం తొలగించడంతో ఇది ఎల్‌ఎస్‌డీ(డ్రగ్)గా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటి నుంచి ఉన్నాయి?
ఏఎల్‌డీ-52 లాంటి ప్రోడ్రగ్స్ 1960 నుంచీ ఉన్నట్లు కొన్ని వార్తలు చెబుతున్నాయి. అయితే, వీటిని డ్రగ్స్ రూపంలో తీసుకోవడాన్ని మొదటిసారి అధికారికంగా ఫ్రాన్స్‌లో 2016లో గుర్తించారు.
అప్పుడప్పుడు తనిఖీల్లో పట్టుబడటంతో వీటిని నియంత్రించాల్సిన ఔషధాల జాబితాలోకి బ్రిటన్ చేర్చింది. ఆ తర్వాత చాలా రకాల ప్రోడ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు.
ఏఎల్‌డీ-52 లాంటి ఎల్‌ఎస్‌డీ ప్రోడ్రగ్స్ కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ఇటలీలో పెద్దయెత్తున బయటపడ్డాయి. మరోవైపు ఇటీవల జపాన్‌లోనూ వీటిని పట్టుకున్న కేసులు ఎక్కువ అవుతోంది. బ్రెజిల్‌లో 20222లో వీటిని ప్రజలు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
పార్టీల్లో ఎక్కువగా తీసుకునే అక్రమ డ్రగ్ ‘జీహెచ్‌బీ’ కూడా ప్రోడ్రగ్ రూపంలో దొరకుతోంది. దీని పేరే జీబీఎల్ (గామా బ్యూటిరోలాక్టోన్).
జీబీఎల్‌ను మొదట్లో క్లీనింగ్ ప్రాడెక్టుల్లో భాగంగా బ్రిటన్‌లో అమ్మేవారు. కానీ, దీన్ని మత్తుమందుల రూపంలో తీసుకుంటున్నారని తెలియడంతో 2022లో కఠినమైన నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ జీబీఎల్‌ను బీ-క్లాస్ డ్రగ్‌గా చేర్చారు. అంటే గంజాయి, కెటామైన్‌లతో సమానంగా దీన్ని చూస్తున్నారు.
ప్రస్తుతం చాలా డ్రగ్స్‌లో కొన్ని అణువులను కలిపేసి ప్రోడ్రగ్స్‌గా మత్తుమందుల ముఠాలు మార్చేస్తున్నాయి. ఇవి మన జీర్ణాశయంలోని ద్రవాలతో చర్యలు జరిపిన తర్వాత మత్తు మందులుగా మారిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీటిని గుర్తించడం కష్టమా?
ప్రోడ్రగ్స్‌తో ప్రధానమైన సమస్య ఏమిటంటే.. వీటిని గుర్తించడం చాలా కష్టం. మొదట వీటిని గుర్తించేందుకు పోలీసుల దగ్గర రిఫరెన్సు శాంపిల్స్ ఉండాలి. లేదా వీటి అణువుల స్ట్రక్చర్‌ను గుర్తించేందుకు ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావాలి.
వీటిలోని సమ్మేళనాలపై ఎవరికీ పెద్దగా అవగాహన ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చిన్న రసాయనిక మార్పులు కూడా ఒక్కోసారి చాలా కొత్త సమ్మేళనాలకు దారితీయొచ్చు. పైగా ఇలాంటి కొత్త డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేయడం కూడా తేలిక.
మరోవైపు రక్తం, మూత్రం, లాలాజలం లాంటి శరీరక ద్రవాల్లోనూ వీటిని గుర్తించడం కష్టమే. ఎందుకంటే ఇవి మన శరీరంలో పనిచేసే ముందే వీటిని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఓవర్‌డోస్ అయిన విషయం కూడా పరిస్థితి ప్రాణాంతకం అయ్యేవరకూ తెలియదు.
సాధారణ ఔషధాల నుంచి ప్రోడ్రగ్స్‌ను విడదీయడం చాలా కష్టం. అయితే, వీటి కోసం ఏ డ్రగ్స్‌ను మొదట ఉపయోగించారో తెలుసుకుంటే.. అవి ప్రజలకు అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణగా జీహెచ్‌బీ ప్రోడ్రగ్స్ అయిన జీబీఎల్, 1, 4 బ్యూటానెడయోన్ లాంటి వాటిపై ఇప్పటికే చాలా దేశాల్లో కఠిన ఆంక్షలను తీసుకొచ్చారు. కానీ, చాలా దేశాల్లో ఇప్పటికీ ఎల్ఎస్‌డీ ప్రోడ్రగ్స్ విషయంలో చాలా అస్పష్టత, గందరగోళం నెలకొని ఉంది.
బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్‌లలో ఏఎల్‌డీ-52, 1పీ-ఎల్‌ఎస్‌డీలపై ఇప్పటికే కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే, అమెరికా, కెనడాలలో వీటిని ఇంకా బ్లాక్‌లిస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ సమ్మేళనాలను కొన్ని ఔషధాల రూపంలో ప్రజలకు ఇస్తున్నారు.
ఒక కొత్త డ్రగ్ మన మెదడులో మార్పులకు కారణం అవుతోందని చెబుతూ దానిపై ఆంక్షలు విధించాలంటే, మొదటగా దానిలోని సమ్మేళనాలు మేధోశక్తి, మూడ్, భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధన చేపట్టాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ల్యాబ్‌లలో..
ఈ విషయాలను ల్యాబ్‌లలో టెస్టుల ద్వారా నిరూపించొచ్చు. కొన్ని కణాలతో చర్యలు జరిపించడం ద్వారా ఇవి రెసెప్టెర్లను క్రియాశీలం చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు.
అయితే, చాలా ప్రోడ్రగ్స్ మన శరీరంలోని ద్రవాలతో కలవకముందు ఎలాంటి చర్యలూ జరపవు. దీంతో అసలు వీటి కోసం మొదట ఏ సమ్మేళనాలు ఉపయోగించారు? వీటిలో ఏ మార్పులు చేశారు? లాంటి విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
కొకైన్, హెరాయిన్, గంజాయి తరహాలో పెద్దమొత్తంలో ఈ ప్రోడ్రగ్స్ ప్రస్తుతానికి బయటపడటం లేదు. అయితే, అక్రమ మార్కెట్లలో ఇవి కూడా ఉన్నాయనే వార్తలను హెచ్చరికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ డ్రగ్స్‌లో వాడే సమ్మేళనాలు, వీటి ప్రభావం గురించి పెద్దగా సమాచారం లేకపోవడంతో.. వీటిని సరఫరా చేస్తున్న వారినీ పట్టుకోవడం కష్టం అవుతోంది.
2021లో అక్రమ మార్కెట్‌లోకి ప్రతివారమూ ఒక కొత్త డ్రగ్ అందుబాటులోకి వస్తున్నట్లు కొన్ని వార్తలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని గుర్తించడం చాలా కష్టమవుతోందని టాక్సికాలజిస్టులు, ఫోరెన్సిక్ కెమిస్టులు చెబుతున్నారు.
(రచయిత బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















