హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్... పుష్ప సినిమాను మించిన ఐడియాలు చూసి ఆశ్చర్యపోతున్న పోలీసులు

ఫొటో సోర్స్, Cyberabad police
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అప్పుడే అక్కడికి స్కోడా కారు వచ్చి ఆగింది.
ఖరీదైన కారులో రావడంతో పోలీసులు తనిఖీ చేయరని డ్రైవర్ ఆలోచన. కానీ, పోలీసులు కారును పూర్తిగా తనిఖీ చేశారు. అందులో 148 కిలోల గంజాయి పట్టుబడింది.
ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది.
హైదరాబాద్‌లో వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.
వందలాది కిలోల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలిస్తున్నారు.
అధికారికంగా నమోదవుతున్న కేసులలోనే భారీగా పట్టుపడుతుండగా.. పోలీసుల కళ్లుగప్పి తీసుకెళ్తోన్న గంజాయి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు వేర్వరు పద్దతులు ఎంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Cyberabad police
పైన గాజులు.. కింద గంజాయి మూటలు
గంజాయి స్మగ్లింగ్ తీరును చూసి పోలీసులే విస్తుపోతున్నారు.
రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు పది రోజుల కిందట హైదరాబాద్ శివారులో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు.
వీరు గాజుల మూటల కింద గంజాయి పెట్టుకుని తీసుకెళుతున్నారు. పైకి రంగురంగుల గాజులు తరలిస్తున్నట్లుగా ఉంది.
కింద మాత్రం గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వ్యవసాయ సీజన్ కావడంతో విత్తనాల చాటున తరలిస్తున్నారు.
గతేడాది మే నెలలో ఒడిశా నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు తీసుకెళ్తోన్న 800 కిలోల గంజాయిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఇందులో యూపీకి చెందిన ముగ్గుర్ని అరెస్టు చేశారు.
తాజాగా మరో కేసులో కొబ్బరిబొండాల మధ్యలో పెట్టి గంజాయిను తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఈ అక్రమ రవాణాపై రాజేంద్రనగర్ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్ నారాయణరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘గంజాయి రవాణా పద్ధతులు ఎప్పటికప్పుడు మార్చకుంటుంటారు.
కొన్నిసార్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు(ప్రజా రవాణా అయిన బస్సులు, రైళ్ల)లోనే తరలిస్తుంటారు.
ఇప్పుడు ఖరీదైన కార్లు ఎంచుకుంటున్నారు. అంత పెద్ద కారు అనేసరికి తనిఖీ చేయరనో, అందులో గంజాయి తీసుకెళ్తారనే అనుమానం రాదనో అలా చేస్తుండొచ్చు.’’ అని చెప్పారు.
అలాగే డీసీఎం వాహనాలలో ఎక్కువగా తరలిస్తుంటారని వివరించారు.
గంజాయి వాసన రాకుండా ప్యాకింగ్ పకడ్బందీగా చేస్తున్నట్లు చెప్పారు.
‘‘మల్టీ లేయర్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. దీనివల్ల వాసన బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు.’’ అని నారాయణరెడ్డి వివరించారు.
నాలుగైదు రూట్లలో ప్రవేశం
గంజాయి అక్రమ రవాణా కేసులు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నమోదవుతున్నాయి.
అక్కడి వరకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి మూణ్నాలుగు జిల్లాలు దాటుకుని రావాలి.
ఏపీ నుంచి తెలంగాణలో నాలుగైదు రూట్లలో గంజాయిని తీసుకువస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అక్కడే అడ్డుకట్ట వేస్తే హైదరాబాద్ వరకు వచ్చే పరిస్థితి ఉండదని పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఏపీ-తెలంగాణ బోర్డర్ దాటుకుని గంజాయిని ఎలా తీసుకువస్తున్నారని బీబీసీ ప్రశ్నించింది.
‘‘ఒక రూట్లో పోలీసుల నిఘా ఉందని భావిస్తే మరో రూట్లో తీసుకు వస్తుంటారు.
ఖమ్మం జిల్లా సరిహద్దులోని గ్రామాల మీదుగా తీసుకువచ్చే వీలుంది.
కొన్నిసార్లు బోర్డర్‌లో పోలీసులు పట్టుకున్నప్పటికీ, వదిలేస్తుండవచ్చు.’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Cyberabad police
దూరాన్ని బట్టి రేటు
గంజాయి రవాణాలో స్మగ్లర్లకు దూరాన్ని బట్టి రేటు నిర్ణయించి వ్యాపారులు చెల్లిస్తున్నారు.
ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి హైదరాబాద్ వరకు తీసుకువస్తే రూ.2 లక్షలు ఇస్తున్నట్లు సైబరాబాద్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ఒకరు బీబీసీకి చెప్పారు.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో చెప్పిన చోటుకు తరలిస్తే రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తున్నారు.
అదే నేరుగా ఏపీ నుంచి మహారాష్ట్రకు తీసుకెళితే రూ.5 లక్షలకు పైనే స్మగ్లర్లు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణ తెలిసింది.
‘‘ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటున్నారు.
వారికి కూలీ కిందట రూ.నాలుగైదు వేలు ఇస్తున్నారు.
డబ్బు ఎక్కువగా వస్తోందని వారు ఆశపడి పనికి ఒప్పుకొంటున్నారు.’’ అని రాజేంద్రనగర్ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్ నారాయణరెడ్డి బీబీసీతో చెప్పారు.
నాలుగింతల ధరకు విక్రయం
ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో సగటున కేజీ దాదాపు రూ.4 వేలకు కొంటున్నారు.
హైదరాబాద్ మీదుగా రెండు తెలుగు రాష్ట్రాలు దాటించి మహారాష్ట్ర, కర్ణాటకలకు చేరవేస్తున్నారు.
అక్కడ రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్యలో అమ్ముతున్నారు.
గతంలో రూ.15వేల వరకు ఉన్న ధరను పోలీసుల నిఘా పెరగడంతో మరింత పెంచినట్లు పోలీసులకు చిక్కినప్పుడు స్మగ్లర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Cyberabad police
పుష్ప సినిమాను తలపించే స్కెచ్
పుష్ప సినిమాలోని ఎర్రచందనం అక్రమ రవాణా గుర్తుంది కదా..?
పాల ట్యాంకర్ అడుగు భాగంలో ప్రత్యేక కంపార్టుమెంట్ ఏర్పాటు చేస్తారు. కింది భాగంలో ఎర్రచందనం దుంగలు ఉంచుతారు. పైన ఉండే కంపార్టుమెంట్లో పాలతో నింపుతారు.
ఇలాంటి తెలివిని స్మగ్లర్లు ప్రదర్శిస్తున్నారు.
మార్చి నెలలో రాచకొండ ఎస్వోటీ పోలీసులు ఈ తరహా అక్రమ రవాణాను పట్టుకున్నారు.
డీసీఎం అడుగు భాగంలో ప్రత్యేక కంపార్టుమెంట్ ఏర్పాటు చేశారు.
అందులో 400 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద పట్టుకున్నారు.
కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
వీరు ఏవోబీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే ఆరుసార్లు ఆ విధంగా తరలించారు.
‘‘పుష్ప సినిమా చూసి గంజాయి స్మగ్లింగ్ ముఠా బాగా ఇన్‌స్పైర్ అయినట్టుంది.
వాళ్లే కాదు, మా పోలీసులు కూడా పుష్ప సినిమా చూశారు. అనుమానంతో డీసీఎం వాహనాన్ని తనిఖీ చేశాం. స్పెషల్ కంపార్టుమెంట్ ఉన్నట్లు గుర్తించాం. అందులో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నారు.
సరుకును లోకల్‌గా సరఫరా చేయడంతోపాటు మహారాష్ట్రకు పంపిస్తున్నారు.’’ అని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
గంజాయి స్మగ్లింగ్ కోసం ఏకంగా ఎస్కార్ట్ వాహనం
గంజాయి స్మగ్లింగ్ కోసం ఏకంగా ఎస్కార్ట్ వాహనం వాడుతున్నారు.
ముందుగా ఎస్కార్ వాహనం వెళుతుంది. తర్వాత డీసీఎం లేదా మరో వాహనం గంజాయి లోడుతో ఉంటుంది.
రెండు వాహనాల్లోని వ్యక్తులు ఫోన్ ద్వారా కాన్ఫరెన్సు కాల్ మాట్లాడుతుంటారు.
ఎస్కార్ట్ వాహనం ఆగినా, కాన్ఫరెన్సు కాల్‌కట్ అయినా.. వెనుక గంజాయి సరఫరా వాహనం పక్కకు తీసి నిలిపివేసేలా కోడ్ భాష ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల మోదులగూడెనికి చెందిన ధరావత్ పూల్ సింగ్ ఇదే తరహా గంజాయి స్మగ్లర్.
గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లొచ్చాడు.
అయినా అతనిలో మార్పు రాలేదు.
ఏపీలోని అప్పర్ సీలేరు నుంచి మహారాష్ట్ర సోలాపూర్‌కు 160 కిలోల గంజాయి సరఫరా చేస్తూ గత నెలలో మరోసారి పోలీసులకు చిక్కాడు.

ఫొటో సోర్స్, Cyberabad police
భారీగా కేసుల నమోదు
రెండు వారాల కిందట మూడు ముఠాల నుంచి 910 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని అంచనా.
రెండేళ్ల కిందట హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
అప్పట్లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1800 కేజీల గంజాయి పట్టుబడింది. 120 మంది అరెస్టయ్యారు.
2021లో తెలంగాణలో 1104 గంజాయి అక్రమ రవాణా కేసులు పోలీసులు నమోదు చేశారు.
ఏకంగా 31,301 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2582 మందిని అరెస్టు చేశారు.
ఈ ఏడాది ఇప్పటికే 400 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఓవైపు కేసులు పెడుతున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
దీనికితోడు అధికారికంగా పట్టుకుంటున్న గంజాయి భారీ మొత్తంలో ఉంటే.. అనధికారికంగా సాగుతున్న దందా మరింత ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడంతోపాటు లోకల్‌గా కూడా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది.
‘‘యువత గంజాయికి అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి.
గంజాయికి బానిసలయ్యారని తెలిస్తే, కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకెళ్లాలి.’’ అని డీఎస్ చౌహాన్ చెప్పారు.














