World No Tobacco Day: 'నా భర్త చైన్ స్మోకర్... నాకు క్యాన్సర్ వచ్చింది'

ఫొటో సోర్స్, Nalini Satyanarayan
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
"నేను ముక్కుతో ఊపిరి పీల్చుకోలేను. నా మెడ పై అమర్చిన స్టోమా అనే రంధ్రం ద్వారా ఊపిరి తీసుకుంటాను" అని 75 ఏళ్ల నళిని సత్యనారాయణ్ చెప్పారు.
నళినికి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఆమె 33 సంవత్సరాల వైవాహిక జీవితంలో పక్క నున్న వ్యక్తుల నుంచి పొగను పీల్చాల్సి వచ్చింది.
భర్త మరణించిన 5 సంవత్సరాల తర్వాత 2010లో ఆమెకు క్యాన్సర్ సోకినట్లు నిర్ధరించారు.
"నా భర్త చెయిన్ స్మోకర్. అది నా పై కూడా ప్రభావం చూపిస్తుందని, అది ఇంత తీవ్రంగా ఉంటుందని నాకు తెలియదు.
ఆయన ఆరోగ్యం గురించి నాకు ఆందోళన ఉండేది. నేనాయనను పొగాకు తాగడం ఆపమని చెప్పేదానిని, కానీ, ఆయన ప్రవర్తన మార్చుకోలేదు" అని నళిని చెప్పారు. ఆమె హైదరాబాద్ లో ఉంటారు. .
పొగాకు తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 80లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందులో 12లక్షల మంది తమ పక్కనున్న వారు పొగ తాగడం వల్ల ప్రభావితమైనవారే.
చాలా మంది ఆయుష్షును తగ్గించే రోగాల బారిన పడుతున్నారు. పొగాకు ప్రభావం పొగ తాగని వారిపై కూడా ఎలా ఉంటుందో బీబీసీ పరిశీలించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం (మే 31) సందర్భంగా బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

బొంగురు గొంతు
నళినికి తన గొంతు బొంగురుపోయినట్లు కనిపెట్టేటప్పటికి తన మనుమరాలు జననికి ఆసక్తికరమైన కథలను చెబుతున్నారు.
మరి కొన్ని రోజుల్లో ఆమె గొంతు పూర్తిగా పోయింది. మాటలో స్పష్టత పోయింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.
ఆమె సమస్యను థొరాసిక్ క్యాన్సర్ గా గుర్తించారు. ఆమె వోకల్ కార్డ్స్, థైరాయిడ్ గ్రంథిని తొలగించారు.

ఫొటో సోర్స్, Nalini Satyanarayan
"నేను మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోయాను. చాలా బాధాకరంగా అనిపించింది. నా పాత గొంతు తిరిగి రాదని డాక్టర్లు చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ ట్యూబులు అమర్చారు" నళిని చెప్పారు.
జననికి ఇప్పుడు 15 ఏళ్లు. ఎప్పుడూ గల గలా మాట్లాడే తన నానమ్మకు అకస్మాత్తుగా జరిగిన మార్పు గురించి గుర్తు చేసుకున్నారు.
నళినికి క్యాన్సర్ సోకినట్లు తెలిసిన తర్వాత ఆమె చాలా రోజులు ఇంట్లో లేరు.
"నానమ్మ ఇంటికి తిరిగి వచ్చేసరికి నాకు 4 సంవత్సరాలు. ఆమె కడుపులో ట్యూబులు అమర్చారు. శరీరం పై ఎక్కడ పడితే అక్కడ ట్యూబులు ఉన్నాయి. మా ఇంటిని చాలా సార్లు శుభ్రం చేసుకోవలసి వచ్చేది. నానమ్మ కోసం ఒక నర్స్ మాతో ఉండేవారు. అయితే, ఆ వయసులో పరిస్థితి తీవ్రత నాకు అర్ధమవ్వలేదు. నాకదంతా చికాకుగా అనిపించేది" అని జనని చెప్పారు.
థొరాసిక్ క్యాన్సర్
నళినికి మెరుగైన వైద్యం అందడంతో, వైబ్రేషన్ వాయిస్ బాక్స్ సహాయంతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆమె బాధకు కారణం ఆమెకు తెలుసు.
"నా భర్త వల్లే నాకు క్యాన్సర్ వచ్చింది" అని నళిని చెప్పారు.
"పొగాకు తాగేవారు విషపూరితమైన పదార్ధాలను గాలిలోకి వదులుతూ ఉంటారు. వాటిని పొగాకు తాగే అలవాటు లేని వారు పీలుస్తూ ఉంటారు" అని అన్నారు.
క్యాన్సర్ కారక పదార్ధాలు
"పొగాకు ఏ రూపంలో తీసుకున్నా హానికరమే" అని పొగాకు తీసుకునేందుకు సురక్షితమైన పరిమితి ఏమి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
"ఇతరుల ద్వారా పీల్చే పొగలో 7000కు పైగా రసాయనాలు ఉంటాయి. అందులో 70 రసాయనాలు క్యాన్సర్ కు కారకమవుతాయి.
పొగాకు పీల్చని వారు కూడా ఈ రసాయనాల బారిన పడినప్పుడు 20 - 30 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశముంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ఆఫీసులో టొబాకో కంట్రోల్ టెక్నికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఏంజెలా సియోబాను చెప్పారు.
పొగాకు వల్ల కలిగే పొగ కూడా గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది.
"ఒక గంట పాటు పొగాకు పీల్చేవారి పక్కన ఉంటే గుండె నాళాల లోపల ఉండే పొరను దెబ్బ తీస్తుంది. ఇది గుండె పోటు వచ్చే ముప్పును పెంచుతుంది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నారుల మరణాలు
ప్రతీ ఏడాది ఇతరుల నుంచి పొగను పీల్చడం వల్ల 65,000 మంది చిన్నారులు మరణిస్తున్నారని ఐక్య రాజ్య సమితి ఆరోగ్య విభాగం అంచనా వేసింది. ఇతరుల నుంచి పొగను పీల్చే పిల్లల్లో చెవిలో ఇన్ఫెక్షన్లు వచ్చి చెవుడు, వినికిడి లోపానికి దారి తీసే ముప్పు కూడా ఉంది.
"చిన్నారులు తీవ్రమైన శ్వాస కోశ వ్యాధులు, ఉబ్బసం బారిన పడే అవకాశం 50 - 100 శాతం ఎక్కువగా ఉంది" అని సియోబాను చెప్పారు.

పొగ తాగడంపై నిషేధం
పొగ తాగడంపై నిషేధం విధించేందుకు పొగతాగే వారు, తాగని వారు కూడా సమర్ధిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదిస్తోంది.
"పొగ తాగని వారి ఆరోగ్యాన్ని కాపాడాలంటే పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడమొక్కటే మార్గం" అని సియోబాను అన్నారు.
"మీ పిల్లలకు దగ్గరగా ఎవరినీ పొగాకు తాగనివ్వద్దు. పరిశుభ్రమైన గాలిని పీల్చడం కనీస మానవ హక్కు" అని సియోబాను అన్నారు.
పొగాకు తాగడాన్ని పూర్తిగా ఆపడం సులభమైన విషయం కాదు. 2021లో ఈ పరిశ్రమ విలువ 850 బిలియన్ డాలర్లని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ విశ్లేషణ అంచనా వేసింది.
ఇది నైజీరియా దేశపు స్థూల జాతీయ ఉత్పత్తి కంటే రెండింతలు ఎక్కువ. 2020లో ఈ దేశ ఆర్ధిక విలువ 430 బిలియన్ డాలర్లని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
"ఆసియా, ఆఫ్రికాలో పెరుగుతున్న పొగాకు వినియోగదారుల వల్ల పొగాకు డిమాండు కొనసాగుతోందని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ చెబుతోంది.
వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు పెద్ద పెద్ద పొగాకు సంస్థలు ఆరోగ్య నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసి, పొగాకు పై నిషేధం విధించడాన్ని వాయిదా వేయిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Ainuru Altybaeva
సుదీర్ఘమైన పోరాటం
బహిరంగ ప్రదేశాలలో పొగాకు తాగడాన్ని నిషేధిస్తూ కిర్గిజ్స్తాన్ లో ఇతర పార్లమెంట్ సభ్యులతో చేయి కలిపిన వారిలో ఐనూరు ఆల్టీబేవా ఒకరు. ప్రతి ఏటా పొగాకు వల్ల 6000 మరణాలు చోటు చేసుకుంటున్నాయని పొగాకు తాగడాన్ని నిషేధించడం వల్ల పొగాకు వినియోగం 10 శాతం తగ్గుతుందని ఆమె వాదించారు.
కానీ, ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురయింది.

ఫొటో సోర్స్, Mary Assunta
"వ్యక్తిగతమైన మలుపులు"
పార్లమెంటులో కొంత మంది సభ్యులకు పొగాకు పరిశ్రమతో అనుబంధం ఉండటంతో, ఈ ప్రతిపాదనను సెలెక్ట్ కమిటీకి పంపి, చట్టం చేయడంలో జాప్యం చేశారు. వీటి పై విధించే పన్నుల వల్ల వచ్చే ఆదాయం తగ్గుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని అధికారులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు" అని ఆల్టీబేవా చెప్పారు.
"నాతో పాటు నా కుటుంబం పై దాడి చేసేందుకు కొంత మంది సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నారు".
ఆమె చేసిన పోరాటంతో, బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడాన్ని నిషేధిస్తూ 2021లో చట్టం అమలులోకి వచ్చింది.
ఆమె దీని పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పొగాకుకు వ్యతిరేకంగా వివిధ వర్గాల వారి మద్దతును సేకరిస్తున్నారు.
"పొగాకు వినియోగం పురుషుల్లో తగ్గుతోందని, కానీ మహిళల్లో పెరుగుతోందని 2013లో నిర్వహించిన ఒక సర్వే తెలిపింది".
చాలా మంది మహిళలు పొగాకు తాగే అలవాటును బయటపెట్టడం లేదని, అమ్మాయిలు ఈ అలవాటు నుంచి బయటపడాలని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మందకొడిగా అభివృద్ధి
పొగాకు వల్ల ఏర్పడుతున్న మరణాలను తగ్గించేందుకు జరిగిన అంతర్జాతీయ ప్రయత్నాలు 2005లో టొబాకో కంట్రోల్ గురించి రూపొందించిన ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ రూపంలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ తీర్మానానికి 182 దేశాలు సంతకం చేశాయి.
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడాన్ని నిషేధించడం కంటే కూడా కన్వెన్షన్ లో పేర్కొన్న ఇతర సూచనలను కూడా అమలు చేయాలని పొగాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ప్రచారకర్తలు అంటున్నారు.
"పొగాకు రహిత విధానం ప్రజలు పరిశుభ్రమైన గాలిని పీల్చుకునే హక్కును గౌరవించడమే" అని సిడ్నీకి చెందిన డాక్టర్ మేరీ అసుంటా అన్నారు. ఆమె గ్లోబల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్ టొబాకో కంట్రోల్ అనే స్వచ్చంద సంస్థ లో గ్లోబల్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ విభాగానికి అధిపతిగా ఉన్నారు.
మరణాల రేటును తగ్గించడంలో పొగాకు నిషేధం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ విధానం సమగ్రమైన పొగాకు నిరోధన విధానాల్లో అంశాలను భాగంగా చేసుకోవాలి. పొగాకు పై అధిక పన్నులు, పొగాకు ప్యాకెట్ల పై స్పష్టంగా కనిపించే చిత్రాలతో కూడిన హెచ్చరికలు, పొగాకు ప్రచారం, ప్రకటనల పై నిషేధం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి".
ప్రపంచ వ్యాప్తంగా పొగాకు తాగే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ వారి సంఖ్య 1.3 బిలియన్ ఉంది.
ప్రతీ 10 సిగరెట్లలో ఒక సిగరెట్ అక్రమ పొగాకు వాణిజ్యం నుంచి వచ్చేదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.
వీటికి నియంత్రణలు ఉండవు.
అధికారులు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అసుంటా అన్నారు.
పొగాకు ఉత్పత్తులను పిల్లలు ఆడుకునే యాప్ లు, గేమ్ ల మధ్యలో ప్రకటనలు రావడం చాలా సార్లు చూశానని ఆమె చెప్పారు.
"సగం మంది వినియోగదారులను మధ్య వయసులోనే అంతం చేస్తూ, పొగ తాగని వారి మరణాలకు కూడా కారణమవుతున్న ఉత్పత్తులను అమ్మడం ఈ పరిశ్రమ చేస్తున్న క్రూరత్వం. పొగాకు వల్ల కలిగిన హానికి ఈ పరిశ్రమ మూల్యం చెల్లించాలి" అని అసుంటా అన్నారు.

ఫొటో సోర్స్, Nalini Satyanarayan
నా భర్తను నిందించటం లేదు
అయితే, నళిని తన సమస్యకు ఎవరినీ నిందించడం లేదు. ఆమె మెడ పై ఉన్న రంధ్రం ద్వారానే శ్వాస తీసుకుంటున్నారు.
ఆమె కేవలం మెత్తగా ఉండే ఆహారం మాత్రమే తినగలరు.
కానీ, ఆమె స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకున్నారు. ఆమె క్యాన్సర్‌ను జయించిన వ్యక్తిగా తనను తాను చెప్పుకుంటారు.
ఆమె క్లెయిర్ నెట్ అనే సంగీత పరికరాన్ని వాయించడం నేర్చుకున్నారు. నళిని బోటనీలో ఎం.ఫిల్ చేశారు. తోట పని అంటే ఆసక్తి.
ఆమె పశువుల వైద్యురాలు అవుదామనుకుంటున్న తన మనవరాలికి సహాయపడుతూ ఉంటారు.
"తనను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం" అని జనని అన్నారు.
నళిని స్కూళ్ళు, యూనివర్సిటీలు, కమ్యూనిటీ సమావేశాలు, ఇతర ప్రదేశాలకు వెళ్లి, పొగాకు తాగేవారి పక్కన ఉండేవారి పై కలిగే ప్రభావం గురించి అవగాహన కల్పిస్తున్నారు.
ఆమె గొంతును కోల్పోయి, చాలా బాధను అనుభవించినప్పటికీ ఆమె భర్త పై ఎటువంటి కోపం లేదు.
"నా భర్తతో నేనెప్పుడూ కలత చెందలేదు. దాని గురించి ఇప్పుడు ఏడవడంలో అర్ధం లేదు. దాని వల్ల సమస్య పరిష్కారం అవ్వదు.
నేను పరిస్థితిని ఆమోదించాను. నా అనారోగ్యం గురించి మాట్లాడేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు".
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













