కేప్టగాన్: జంతువుల కళేబరాల్లో రహస్యంగా తరలిస్తున్న డ్రగ్స్

కేప్టగాన్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, యోలాండె నెల్
    • హోదా, బీబీసీ న్యూస్

డ్రగ్స్‌కు బానిసలైన వారిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చే పునరావాస కేంద్రంలో ఓ వ్యక్తి అటూఇటూ తిరుగుతూ కనిపించారు. ఆయనకు సుమారు 20 ఏళ్లుంటాయి. డ్రగ్స్‌ తీసుకోవడం ఆపేయడంతో వచ్చే సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు.

టీవీ రూమ్‌లో ఓ యువతి సిగరెట్ తాగుతూ కనిపించారు. ఆమె కూడా డ్రగ్స్ తీసుకోవడం ఆపేయడంతో వచ్చే కొన్నిరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇది జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని అల్-రషీద్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన డ్రగ్స్ బానిసల పునరావాస కేంద్రంలో పరిస్థితి. ఇది హోటల్‌లా కనిపిస్తోంది. అయితే, ఇక్కడి పరిస్థితులను చూస్తే కుంగుబాటు వచ్చేలా అనిపిస్తోంది.

దశాబ్దంపాటు కొనసాగిన అంతర్యుద్ధంతో సిరియాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు డ్రగ్స్ రూపంలో మరో కొత్త సమస్య ఈ దేశాన్ని పీడిస్తోంది. ఇది సిరియాతో పాటు చుట్టుపక్కల దేశాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

స్మగ్లర్ల చేతిలో ఓ జోర్డాన్ సైనికుడు హత్యకు గురయ్యారు

ఫొటో సోర్స్, Jordanian Armed Forces

ఫొటో క్యాప్షన్, స్మగ్లర్ల చేతిలో ఓ జోర్డాన్ సైనికుడు హత్యకు గురయ్యారు

‘‘మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. కొందరికి ఒక నెల పట్టొచ్చు. మరికొందరికి మూడు నెలలు పట్టొచ్చు’’అని అల్-రషీద్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న హదీల్ బీతర్ చెప్పారు. అక్కడి పరిస్థితులను ఆమె మాకు వివరించారు.

ఇక్కడున్న వారు జోర్డాన్‌తోపాటు గల్ఫ్‌లోని అరబ్ దేశాల నుంచి వచ్చారు. సిరియా, లెబనాన్‌లో చౌకగా తయారుచేసే డ్రగ్ కేప్టగాన్‌కు వీరిలో చాలా మంది బానిసలు. దీన్ని పేదల కొకైన్‌గా పిలుస్తారు.

‘‘కేప్టగాన్‌ను తీసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా మారతాయి. కొంతమందికి మానసిక సమస్యలు చుట్టుముడితే, మరికొంత మందిలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది’’అని అక్కడ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ అలీ అల్-ఖామ్ చెప్పారు.

‘‘ఈ డ్రగ్స్‌కు మనం చాలా త్వరగా బానిసలైపోతాం. మొదట ఒక ట్యాబ్లెట్‌తో దీన్ని మొదలుపెడతారు. ఆ తర్వాత రెండు, మూడు ఇలా పెంచుకుంటూ పోతారు. ఆ తర్వాత, క్రిస్టల్ మెథ్ లాంటి డ్రగ్స్‌ తీసుకోవడాన్ని ప్రారంభిస్తారు’’అని ఆయన వివరించారు.

జోర్డాన్

ఫొటో సోర్స్, AFP

భారీ సామ్రాజ్యం

సిరియాలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరినప్పుడు స్మగ్లర్లు, సాయుధ పోరాట సంస్థలు ఇక్కడి పరిస్థితులను అవకాశంగా తీసుకొని కేప్టగాన్ ఉత్పత్తి మొదలుపెట్టాయి. ముఖ్యంగా కెఫీన్‌తో కలిసి దీన్ని ఇస్తే, ఫైటర్లు చాలా అప్రమత్తంగా ఉంటారని, వారి పోరాట సామర్థ్యం కూడా పెరుగుతుందని ప్రచారం చేశారు.

ఉద్యోగ అవకాశాలు పడిపోవడం, పేదరికం పెరగడంతో సాధారణ పౌరులు కూడా ఈ డ్రగ్స్ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు.

దశాబ్ద కాలంపాటు కొనసాగిన అంతర్యుద్ధంతో సిరియా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అంతర్జాతీయ ఆంక్షలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రం చేశాయి. ప్రస్తుతం ఇక్కడ డ్రగ్స్ సామ్రాజ్యం బిలియన్ డాలర్లలో విస్తరించిందని నిపుణులు చెబుతున్నారు.

దీనితో తమకు ఎలాంటి సంబంధమూలేదని సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ వ్యాపారం వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అల్ రషీద్ ఆసుపత్రి

‘‘కేప్టగాన్ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాలు ఎక్కువగా బసర్ అల్ అసద్ కుటుంబం, ఆయన ప్రభుత్వంలోని సీనియర్ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి’’అని సెంటర్ ఫర్ ఆపరేషనల్ అనాలసిస్ అండ్ రీసెర్చ్ (సీవోఏఆర్)కు చెందిన విశ్లేషకుడు ఇయాన్ లార్సన్ చెప్పారు.

‘‘ఇక్కడి పరిస్థితులు కూడా ఈ డ్రగ్స్ సామ్రాజ్యం విస్తరణకు కారణం అవుతున్నాయి. అయితే, అన్నింటికీ పరిస్థితులే కారణం అని చెప్పలేం’’అని ఆయన వివరించారు.

2021లో మైండ్ నంబింగ్ పేరుతో కేప్టగాన్ ఉత్పత్తిపై ఓ నివేదిక విడుదలైంది. 2020లో మొత్తంగా ఇక్కడ ఉత్పత్తైన కేప్టగాన్ విలువ 3.5 బిలియన్ డాలర్లు (రూ.26 వేల కోట్లు)గా దీనిలో అంచనా వేశారు.

నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, చెక్‌పోస్టుల్లో ఈ డ్రగ్స్ ఎప్పటికప్పుడే బయటపడుతున్నాయి. ముఖ్యంగా పళ్లు, ఇతర సామగ్రిని తరలించే కంటైనర్లలో వీటిని దొంగచాటుగా తరలిస్తున్నారు. ఒక జంతువు కళేబరం నుంచి ఈ డ్రగ్స్‌ను బయటకు తీస్తున్న ఓ వీడియోను ఇటీవల జోర్డాన్ అధికారులు విడుదల చేశారు.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

చుట్టుపక్కల దేశాలకు

మొదట్లో సిరియాలోని శరణార్థులు ఈ డ్రగ్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఇది పక్కనున్న జోర్డాన్‌కు భారీగా విస్తరించింది.

జోర్డాన్ సైన్యం, డ్రగ్స్ స్మగ్లర్లు ఘర్షణలకు దిగుతున్న వార్తలు ఎప్పటికప్పుడే మీడియాలో కనిపిస్తున్నాయి.

2022 ప్రారంభం నుంచి ఇప్పటివరకు జోర్డాన్ సైన్యం 17,000 ప్యాకెట్ల హషీష్, 1.7 కోట్ల కేప్టగన్ మాత్రలను స్వాధీనం చేసుకుంది.

2021లో మొత్తం 1.55 కోట్ల కేప్టగన్ మాత్రలు స్వాధీనం చేసుకోగా, 2020లో ఈ సంఖ్య 14 లక్షలుగా ఉంది.

గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు తరలించే ఈ డ్రగ్స్ జోర్డాన్ మీదుగా వెళ్తుంటాయి. ముఖ్యంగా భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ సౌదీ అరేబియాకు తీసుకెళ్తుంటారు.

‘‘ఇప్పుడు స్మగ్లర్లతోపాటు సాయుధ పోరాట సంస్థలు ప్రతినిధులు కూడా కనిపిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం’’అని జోర్డాన్ సైన్యానికి చెందిన కల్పల్ జైద్ అల్-దబ్బాస్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, తాలిబాన్లు నల్లమందు సాగుతో వేల కోట్లు సంపాదిస్తున్నారా?

160 ముఠాలు

దక్షిణ సిరియాలో దాదాపు 160 ముఠాలు ఈ డ్రగ్స్ వ్యాపారంలో క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు జైద్ అంచనా వేశారు. ‘‘ఈ వ్యాపారం నానాటికీ విస్తరిస్తోంది. డ్రోన్లు, ఇతర అధునాతన వాహనాలను కూడా స్మగ్లర్లు ఉపయోగిస్తున్నారు’’అని ఆయన చెప్పారు.

డ్రగ్స్ వ్యాపారం పెరగడంతోపాటు ఓ సైనికుడి హత్య తర్వాత జోర్డాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. షూట్-టు-కిల్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. స్మగ్లర్లను సైన్యం నేరుగా కాల్చేసేందుకు ఈ విధానం అవకాశమిస్తోంది.

ఇప్పటివరకు తాము 27 మంది స్మగ్లర్లను హతమార్చినట్లు జనవరి 27న జోర్డాన్ మిలిటరీ వెల్లడించింది. ఇతర ఆపరేషన్లలో మరో నలుగురు స్మగ్లర్లు కూడా మరణించారు.

జోర్డాన్ సరిహద్దుల వెంబడి ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు తాము యుద్ధమే చేస్తున్నట్లు మరో సైన్యాధికారి చెప్పారు.

‘‘ఇతర దేశాల తరఫున కూడా మేం పోరాడుతున్నాం’’అని కల్నల్ ముస్తాఫా అల్ హైదరీ చెప్పారు. ‘‘ఈ డ్రగ్స్ వ్యాపారం మా కుటుంబాలను, విలువలను ఛిన్నాభిన్నం చేస్తోంది’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)