తెలంగాణ: ఎడతెగని వానలతో పొంగిపొర్లుతున్న జలాశయాలు, ప్రమాదకరంగా జలపాతాలు, టూరిస్టులకు అధికారుల హెచ్చరికలు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కమ్ముకుంది. నిన్న ఒక్కరోజు దాదాపు అన్ని జిల్లాల్లోనూ సరాసరి 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. కృష్ణా, గోదావరితో పాటు మంజీరా, మానేరు నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటికి తోడు స్థానిక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజ్ వేలు, లోలెవల్ వంతెనలపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నియంత్రిస్తున్నారు.
గడచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో ఇప్పటి వరకూ నమోదైన అత్యంత భారీ వర్షం ఇదేనని చెబుతున్నారు. ములుగు జిల్లా వాజేడులో 2013 జులై 19న 24 గంటలలో 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిన్న భూపాలపల్లి జిల్లా చిట్యాలలో నిన్న 61.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ 25న నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 46.3 సెంటీమీటర్ల వర్షం కురవడంతో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. సుమారు 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
రానున్న వారం రోజులు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గత రెండు రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, UGC
ఏ ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితి ఏంటి?
తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులు అన్నింటికీ వరద కొనసాగుతోంది. చిన్న ప్రాజెక్టులు ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)కు చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కథనం ప్రచురిస్తున్న సమయానికి ఉత్తర తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఇలా ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో 90.3 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ 76.7 టీఎంసీల నిల్వ ఉంది. లక్షా 77 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 26 గేట్ల ద్వారా లక్షా 54 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
కాళేశ్వరం (మేడిగడ్డ) బ్యారేజ్:
మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తోంది. ఇన్ ఫ్లో 4.80 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ 75 గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు.
కడెం ప్రాజెక్ట్: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వస్తున్న భారీ వరద నిరుడు పరిస్థితులను గుర్తుకు తెస్తుంది. స్థానికులు, అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి వరద వస్తోంది.
తక్కువ సామర్థ్యం గల ప్రాజెక్ట్ కావడంతో ఏటా ఫ్లాష్ ఫ్లడ్స్(ఆకస్మిక) ముప్పు ను ఎదుర్కుంటోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.79 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఇన్ ఫ్లో 2 లక్షల 24 వేల క్యూసెక్కుల వరదను 14 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్: ప్రాజెక్ట్ సామర్థ్యం 20.1 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.95 టీఎంసీల నిల్వ ఉంది. 5 లక్షల 54 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 32 గేట్ల ద్వారా 5 లక్షల 54 వేల క్యూసెక్కులను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్ట్ గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో ఇక్కడికి వరద పెరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, UGC
సింగూరు ప్రాజెక్ట్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ పూర్తి స్తాయి సామర్థ్యం 29.9 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 22.1 టీఎంసీల నిల్వ ఉంది. కర్ణాటక నుంచి 5 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది.
పర్యటక ప్రాంతాల వద్ద ఆంక్షలు: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పర్యటక ప్రాంతాల వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా జలపాతాల సందర్శనలకు అనుమతించడం లేదు.
కుంటాల వాటర్ ఫాల్స్: తెలంగాణలో అతి పెద్దదిగా భావించే ఆదిలాబాద్ జిల్లా కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో పర్యటకులను అనుమతించడం లేదు. జాతీయ రహదారి 44పై నేరడిగొండ వద్ద పర్యటకుల వాహనాలను నిలిపివేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా వాటర్ ఫాల్ ప్రవాహం పెరుగుతోంది. జూన్ 19 నుంచి 24 మధ్య కూడా ఆంక్షలు కొనసాగాయి. తాజాగా మరోసారి భారీ వర్షాలతో పర్యటకులను అనుమతించడం లేదు.
పొచ్చెర జలపాతం: ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్న పొచ్చెర వాటర్ ఫాల్స్ వద్ద పర్యటకులకు సోమవారం వరకు అనుమతి లేదని స్థానిక అటవీశాఖ అధికారులు తెలిపారు. వాటర్ ఫాల్స్‌కు వెళ్లే దారిలో బారికేడ్‌ను ఏర్పాటు చేశారు.
బొగత ఫాల్స్: ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అటవీ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా జలపాత సందర్శన నిలిపివేశారు. సందర్శన తేదీలను ప్రకటించేంత వరకు పర్యటకులు రావొద్దని కోరారు.

ఫొటో సోర్స్, UGC
పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
జూన్ 26న ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రం సమీపంలోని ‘ముత్యాలధార’ జలపాతం సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా సమీపంలోని వాగు ఉధృతి కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హన్మకొండ జిల్లాలకు చెందిన 80 మంది యువకులు అక్కడే చిక్కుకుపోయారు.
పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు.
అటవీ ప్రాంతం మధ్యలో ఉండే ముత్యాలధార జలపాతం వద్దకు పర్యటకులను కొద్ది రోజుల కిందటే అటవీశాఖ నిషేధించింది.
భారీ వర్షాలు కురుస్తున్నందున నిషేధిత ప్రాంతాల్లో పర్యటించవద్దని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి వనరుల వద్దకు వెళ్లొద్దని, ఈతలకు దిగడం, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
ముమ్మరంగా సహాయక చర్యలు:
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
కడెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో ప్రభావిత గ్రామాల నుంచి 7 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రాజెక్టును సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.
మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతికి ఏడుపాయల వనదుర్గామాత ఆలయం పూర్తిగా మునిగిపోయింది. దీంతో భక్తులను అనుమతించడం లేదు.
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందం శ్రమిస్తోంది. సహాయక చర్యల కోసం రెండు సైనిక హెలికాప్టర్లను కూడా పంపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ములుగు జిల్లా మేడారం గ్రామం జలమయమైంది. భక్తులు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కాలనీలు నీటమునిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడం, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

ఫొటో సోర్స్, UGC
వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులు
‘ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. పరిస్థితి సమీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భద్రచలం వద్ద కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తుల రెస్క్యూ కోసం ఆర్మీ హెలికాప్టర్లను పంపుతున్నాం. కడెం ప్రాజెక్ట్ ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం’ అని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఉన్నతాధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్, ఫైర్ తదితర శాఖల ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎస్ తెలిపారు.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న అతిభారీ, భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగాలకు సహకరించేందుకు గతంలో ఆయా జిల్లాల్లో పనిచేసిన , అక్కడి పరిస్థితులపై అవగాహన కలిగిన పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
ములుగు జిల్లాకు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు సెర్ప్ సీఈవో పి.గౌతం, నిర్మల్ జిల్లాకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముషరఫ్ అలీ ఫారూకీ, మంచిర్యాలకు స్పెషల్ సెక్రటరీ భారతీ హోళికేరి, పెద్దపల్లి జిల్లాకు సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్ జిల్లాకు పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ హన్మంత రావును నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు: 7997950008, 7997959782, 040-23450779
ఇవి కూడా చదవండి:
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
- బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....
- ‘‘అర్ధరాత్రి నాన్న ఫోన్ చేశాడు. ఏ క్షణంలోనైనా ఆయన్ను ఉరి తీయొచ్చు’’
- మైటోకాండ్రియల్ ఈవ్: ప్రపంచంలోని ఆడవాళ్లందరికీ మూలం ఈమేనా?
- మగ శరణార్థుల కోసం తీరంలో తేలియాడే నివాసం.. లోపల ఏముంది?















