రటౌల్ మామిడి: ఈ పండ్లు పుట్టింది భారతదేశంలోనా లేక పాకిస్తాన్‌లోనా?

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్ రటౌల్ మామిడి పండుతోంది
    • రచయిత, షాబాజ్ అన్వర్
    • హోదా, బీబీసీ కోసం

దిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో రటౌల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేక రకమైన మామిడి పండ్లు పండుతాయి.

ఈ గ్రామం పేరుతోనే మామిడి పండ్లనూ పిలుస్తుంటారు.

అయితే, రటౌల్ అనేది భారత్‌కు చెందిన మామిడి కాదని, ఇది పాకిస్తానీ మామిడి అని కొందరు పాకిస్తానీలు చెబుతున్నారు.

అయితే, దీని వెనుక ఒక రాజకీయ కథ కూడా ఉంది. అదేమిటో తెలుసుకుందాం.

1981లో అప్పటి పాకిస్తానీ అధ్యక్షుడు జనరల్ మహమ్మద్ జియా-వుల్-హక్ అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి కొన్ని మామిడి పండ్లను పంపించారు. వీటిని రటౌల్ మామిడి అని పిలుస్తారని, ఇవి పాకిస్తాన్‌లోనే పండుతాయని కూడా జనరల్ జియా-వుల్-హక్ చెప్పారు.

అయితే, ఈ విషయం ఉత్తర్ ప్రదేశ్‌లోని రటౌల్ గ్రామం వరకూ వచ్చింది. దీంతో ఈ గ్రామానికి చెందిన కొందరు ఇందిరా గాంధీని కలిసేందుకు దిల్లీ కూడా వచ్చారు. రటౌల్ పాకిస్తానీ మామిడికాదని, ఇది ఇక్కడి మామిడేనని వారు ఇందిరా గాంధీకి వివరించారు. అప్పట్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో రటౌల్ ఉండేది.

ప్రస్తుతం బాగ్‌పత్‌లోని ఖేకడా తహశీల్‌లో రటౌల్ నగర పంచాయతీలో ఈ గ్రామముంది.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, జునైద్ ఫరీదీ(కుడి నుంచి మూడో వ్యక్తి)ని సత్కరిస్తున్న అధికారులు

రటౌల్ మ్యాంగో ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఆర్ఏపీఏ)కు సెక్రటరీ, నగర పంచాయతీ చైర్మన్‌గా జునైద్ ఫరీదీ పనిచేస్తున్నారు.

ఈ మామిడి పండ్ల కథ గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు. ‘‘అప్పటి క్యాబినెట్ మంత్రి చౌధరి చాంద్‌రామ్, మా చిన్నాన్న జావెద్ ఫరీదీ, నేను, మరో ఇద్దరం.. ఇందిరా గాంధీని కలిసేందుకు దిల్లీ వెళ్లాం’’ అని చెప్పారు.

‘‘ఇదేమీ పాకిస్తానీ మామిడి కాదని, మేరఠ్ జిల్లాలోని రటౌల్ గ్రామానికి చెందిన ప్రత్యేకమైన మామిడని చెప్పాం. ఈ రకాన్ని మా తాతయ్య అభివృద్ధి చేశారు. ఇదే విషయాన్ని విలేకరులతోనూ ఇందిరా గాంధీ చెప్పారు. ఆమెతో కలిసి మేం ఫోటో కూడా తీసుకున్నాం’’ అని ఆయన వివరించారు.

ఇది పాకిస్తానీ మామిడని చెబుతున్న వార్తలపై ఆర్ఏపీఏ సభ్యుడు హబీబుర్ రెహ్మాన్ స్పందిస్తూ ‘‘పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోంది. ఈ మామిడి బాగ్‌పత్‌లోని రటౌల్ గ్రామంలో పండిస్తారు’’ అని ఆయన అన్నారు.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాన మంత్రిని ఇందిరా గాంధీని రటౌల్ గ్రామస్థులు కలిసినప్పటి చిత్రం

చరిత్ర ఏం చెబుతోంది?

ప్రస్తుతం రటౌల్ ఒక నగర పంచాయతీ. దీనికి చైర్మన్‌గా జునైద్ ఫరీదీ పనిచేస్తున్నారు. తన తాతయ్య షేక్ మహమ్మద్ అఫాక్ ఫరీదీనే ఈ మామిడి రకాన్ని అభివృద్ధి చేశారని జునైద్ ఫరీదీ చెబుతున్నారు.

‘‘ఈ మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కోసం మేం ఏళ్లపాటు కృషిచేశాం. దీన్ని మా తాతయ్యే అభివృద్ధి చేశారు’’ అని జునైద్ ఫరీదీ చెప్పారు.

‘‘మా తాతయ్య మామిడి ఆకుని తిని అది ఏ రకమైన మామిడి చెట్టో కూడా చెప్పగలిగేవారు. ఆయనే రటౌల్ మామిడిని అభివృద్ధి చేశారని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2021 అక్టోబరు 5న బనారస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెన్నైకు చెందిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ మాకు జీఐ ట్యాగ్ కూడా ఇచ్చింది’’ అని ఆయన వివరించారు.

‘‘ఏళ్ల నుంచి మేం చేసిన కృషి ఫలించింది. నేడు రటౌల్ మామిడి పేరుతోనే వీటిని ఎగుమతి చేసేందుకు అనుమతులు కూడా పొందాం’’ అని ఆయన చెప్పారు.

ఈ మామిడికి జీఐ ట్యాగ్ రావడంపై బాగ్‌పత్ జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ దినేశ్ కుమార్ అరుణ్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతంలో పండే పండ్లు లేదా ఉత్పత్తులు ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి’’ అని ఆయన అన్నారు.

‘‘అలా గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఆ ప్రత్యేక ప్రాంతం నుంచే మొదలయ్యాయని ధ్రువీకరించేందుకు కొన్ని ప్రక్రియలను అనుసరిస్తారు. అన్నీ సరిచూసుకున్నాకే జీఐ ట్యాగ్ ఇస్తారు’’ అని ఆయన చెప్పారు.

‘‘అలానే బాగ్‌పత్‌లోని రటౌల్ మామిడికి 2021లో జీఐ ట్యాగ్ వచ్చింది. ఇది ఈ ప్రాంతం మొత్తం సంతోషించాల్సిన విషయం’’ అని ఆయన వివరించారు.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, మ్యాంగో ఫెస్టివల్‌లో రటౌల్ మామిడితో హబీబుర్ రెహ్మాన్

అసలు ఇది పాకిస్తాన్ వరకూ ఎలా వెళ్లింది?

ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే ఈ మామిడి పాకిస్తాన్ వరకూ ఎలా వెళ్లింది?

దీనిపై బాగ్‌పత్‌లోని రటౌల్ గ్రామంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మామిడికి జీఐ ట్యాగ్ వచ్చిన తర్వాత దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.

ఉమర్ ఫరీదీ సంస్థ పేరుపై ప్రస్తుతం రటౌల్ మామిడికి జీఐ ట్యాగ్ వచ్చింది. రటౌల్ నగర పంచాయతీ చైర్మన్ జునైద్ ఫరీదీ కుమారుడే ఉమర్ ఫరీదీ.

‘‘రటౌల్ మామిడి మా గ్రామంలోనే పుట్టింది. మా తాతయ్య తండ్రి దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ధ్రువీకరించేందుకు జీఐ ట్యాగ్ కూడా వచ్చింది’’ అని ఉమర్ బీబీసీతో చెప్పారు.

‘‘మా తాతయ్య తండ్రి అఫాక్ ఫరీదీ ఒకసారి మా నర్సరీలోని మామిడి మొక్కల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు ఒక ఆకును తీసి నమిలి చూశారు. దాని రుచి కాస్త భిన్నంగా ఉండటంతో ఆయన వాటిపై పరిశోధన చేశారు. ఆ తర్వాత 40 ఏళ్లలో రటౌల్ మామిళ్లలో చాలా రకాలను ఆయన అభివృద్ధి చేశారు’’ అని ఉమర్ వివరించారు.

1928లోనే ఆ నర్సరీ (సారా-ఎ-అఫాక్)ని తమ తాతయ్య తండ్రి అభివృద్ధి చేశారని, దానిలో 500కుపైగా మామిడి రకాలు ఉండేవని ఉమర్ చెప్పారు.

1935లో ఆ నర్సరీని రిజిస్టర్ కూడా చేయించామని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, స్టేట్స్‌మన్ పత్రికలో 1957 జులై10న అఫాక్ ఫరీదీపై వచ్చిన కథనం

అసలు ఆ పేరు ఎలా వచ్చింది?

ఈ మామిడిని రటౌల్ గ్రామంలో పండిస్తున్నారు. కాబట్టి ఆ గ్రామం పేరునే ఆ మామిడికి కూడా పెట్టి ఉండొచ్చు. అయితే, పాకిస్తాన్‌లో దీన్ని అన్వర్ రటౌల్‌గా పిలుస్తున్నారు.

దీనిపై జునైద్ ఫరీదీ మాట్లాడుతూ.. ‘‘మా నాన్నమ్మ పేరు అన్వర్ ఖాతూన్. ఆమె పేరు మీదే మా తాతయ్య దీనికి ఆ పేరు పెట్టారు. అయితే, దేశ విభజన తర్వాత మా గ్రామానికి చెందిన కొందరు పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. వారే కొన్ని మొక్కలను అక్కడికి తీసుకెళ్లి అన్వర్ రటౌల్ పేరుతో పండించడం మొదలుపెట్టారు’’ అని చెప్పారు.

‘‘ఈ మామిడి చాలా తియ్యగా ఉంటుంది, సువాసనలూ వెదజల్లుతుంది. గదిలో రెండు మామిడి పండ్లను పెడితే చాలు.. ఆ గది మొత్తం మంచి సువాసనలు వస్తాయి’’ అని జునైద్ ఫరీదీ చెప్పారు.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

అయితే, ప్రస్తుతం కేవలం రటౌల్ మాత్రమే కాదు. ఇక్కడ మిగతా మామిళ్ల పంటతోపాటు దిగుబడి కూడా తగ్గిపోతోంది.

దీనిపై మ్యాంగో ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యుడు హబీబుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ‘‘నేను బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివాను. అయితే, పదేళ్ల క్రితం ఉన్నన్ని చెట్లు ప్రస్తుతం లేవు’’ అని ఆయన చెప్పారు.

‘‘పంట దిగుబడిపై ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా రటౌల్ మామిడి పండ్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గత రెండేళ్లలో ఈ దిగుబడి మరింత పడిపోయింది. ఒకప్పటి దిగుబడిలో కేవలం 20 శాతం మాత్రమే ఇప్పుడు చేతికి అందుతోంది’’ అని ఆయన తెలిపారు.

తగ్గిపోతున్న మామిడి విస్తీర్ణంపై ప్రాంతీయ హార్టికల్చర్ ఆఫీసర్ దినేశ్ కుమార్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చుట్టుపక్కల ఇటుకల బట్టీలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల మామిడి పంట దెబ్బ తింటోంది. ప్రస్తుతం ఇక్కడ రటౌల్ మామిడి 250 ఎకరాల్లో పండుతోంది. దీనికి ఇతర రకాలను కలిపితే మొత్తంగా 1000 ఎకరాల వరకూ ఉంటుంది. అయితే, ఈ ప్రాంతం ఎన్‌సీఆర్ పరిధిలోకి వస్తోంది. దీంతో చాలా మంది మామిడి తోటల భూములను భారీ ధరలకు విక్రయించేస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.

రటౌల్ మామిడి

ఫొటో సోర్స్, SHAHBAZ ANWAR

ఫొటో క్యాప్షన్, రటౌల్ మామిడి జీఐ సర్టిఫికేట్

విదేశాల్లోనూ పేరుంది

పంట తగ్గుదలపై ఎస్‌డీఎం జ్యోతి శర్మ మాట్లాడుతూ.. ‘‘రటౌల్ మామిడి దిగుబడి తగ్గడానికి పట్టణీకరణతోపాటు చాలా కారణాలు ఉన్నాయి. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఈ మామిడి దిగుబడిని పెంచడంపైనా దృష్టిసారించాను’’ అని చెప్పారు.

‘‘ఈ మామిడి గురించి చాలా మంది చాలా కథలు చెబుతుంటారు. ఇప్పటికే దీనికి జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. దీని దిగుబడిని పెంచేందుకు ఇంకా ఏం చేయాలనే అంశంపైనా మేం దృష్టి సారించాం’’ అని ఆమె చెప్పారు.

రటౌల్ మామిడి భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ ఫేమస్సే.

దిల్లీలోనే కాదు, చాలా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ పండ్లను కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది విదేశీయులు కూడా ఈ పళ్లను పండించే గ్రామానికి వస్తుంటారు.

దీనిపై స్థానికుడు షకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల స్వీడన్, చైనాకు చెందిన కొందరు పర్యటకులు మా గ్రామానికి వచ్చారు. అంతేకాదు, గతంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన చాలా మంది చాలాసార్లు మా గ్రామానికి వచ్చి బాక్స్‌లతో మామిడి పండ్లు తీసుకెళ్లారు. వీటి ధర కేజీ రూ.100 నుంచి మొదలవుతుంది’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)