నేపాల్ మీదుగా భారత్‌లోకి టమాటాల స్మగ్లింగ్, ఇది ఎలా జరుగుతోందంటే....

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, బీబీసీ టీమ్
- హోదా, న్యూఢిల్లీ
భారత్‌లో టమాటాల ధరలు ఆకాశాన్ని తాకడంతో, ఉత్తరప్రదేశ్‌కి పక్కనే ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దు గుండా టమాటాలను మన దేశంలోకి పెద్ద ఎత్తున్న అక్రమంగా తరలిస్తున్నారు.
భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో కేజీ టమాటా ధర రూ.150కి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో కేజీ రూ.200 పలుకుతోంది.
ఈ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
పెరిగిన ఈ ధరల నుంచి లాభపడేందుకు స్మగ్లర్లకు అవకాశం దక్కింది.
ఇటీవలే, టమాటాలతో నిండిన రెండు పికప్ ట్రక్కులను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సీజ్ చేసింది. దీనిలో 3,060 కేజీలు టమాటాలున్నాయి.
నేపాల్ నుంచి పెద్ద మొత్తంలో భారత్‌కు టమాటాలను తరలిస్తున్నట్లు వెజిటేబుల్ ట్రేడర్లు చెప్పినట్లు నేపాల్‌కు చెందిన బీమ్లా చౌదరి అనే వ్యక్తి బీబీసీకి తెలిపారు.
నేపాల్‌గంజ్ కూరగాయల మార్కెట్లో కేజీ టమాటాల ధర రూ.60గా ఉన్నట్లు ట్రేడర్లు చెప్పారు. అదే భారత్‌లో కేజీ టమాటాల ధర రూ.200గా పలుకుతున్నట్లు తెలిపారు.
సల్యాన్ జిల్లా కపూర్ కోట్ ప్రాంతం నుంచి టమాటాల ట్రక్కులలో 60 శాతం నేపాల్‌గంజ్‌లోనే వినియోగించారని ట్రేడర్ మోహమ్మద్ సలీం రాయ్ చెప్పారు.
40 శాతం మాత్రం భారత్‌కు ఎగుమతి చేశారని తెలిపారు.
దాదాపు నెల రోజులుగా నేపాల్ నుంచి భారత్‌కు టమాటాలను పంపుతున్నట్లు చెప్పారు.
నేపాల్‌గంజ్ నుంచి రోజూ 15 నుంచి 20 టన్నుల టమాటాలను భారత్‌కు పంపుతామని నేపల్‌గంజ్ రాణి తాలౌ వద్దనున్న కూరగాయల మార్కెట్ నిర్వహణ కమిటీ చైర్మన్ మోతిసారా థాపా చెప్పారు.
కానీ, నేపాల్‌గంజ్ కస్టమ్స్ ఆఫీసు ఇలా పంపడాన్ని ప్రస్తుతం కష్టతరం చేసిందని తెలిపారు.

ఫొటో సోర్స్, BIMALA
జూన్ నుంచి ఇండో-నేపాల్ సరిహద్దు గుండా టమాటాల స్మగ్ల్లింగ్
జూన్ నుంచి ఇండో-నేపాల్ సరిహద్దు గుండా టమాటా స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కి చెందిన స్థానిక జర్నలిస్ట్ ఆశీష్ సోని చెప్పారు.
‘‘ నేపాల్‌లో కేజీ టమాటాలు 40 నుంచి 60 నేపాలీ రూపాయలు పలుకుతున్నాయి. భారత కరెన్సీలో వాటి ధర రూ.24 నుంచి రూ.38 మాత్రమేనని బోర్డర్ గుండా టమాటాలను అక్రమంగా తరలించే ఒక యువకుడు చెప్పాడు’’ అని ఆశీష్ సోని తెలిపారు.
నేపాల్‌లోని రూపాందేహి, కపూర్ కోట్, లుంబినీ జిల్లాలోని అర్ఘఖాంచిలోని మండీల నుంచి ఈ టమాటాలను కొనుగోలు చేసి, వాటిని భారత్‌కు తరలిస్తున్నట్లు ఆ యువకుడు చెప్పాడు.
భారత్‌లోని మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్ మండీలలో వీటిని కేజీ రూ.70 నుంచి రూ.80కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు.
అయితే, చైనా నుంచి కూడా నేపాల్ మీదుగా భారత్‌కు టమాటాలు తరలి వస్తున్నాయా? అనే విషయంపై కూడా ట్రేడర్లు స్పందించారు.
నేపాల్ బుట్వాల్ మార్కెట్ నుంచి, రైతుల పంట పొలాల నుంచి భారత్‌కు టమాటాలను సరిహద్దు మీదుగా తరలిస్తున్నామని నేపాల్ మండీ ట్రేడర్లు, వాటిని తరలించే వారు చెప్పారు.
నేపాల్‌లో పెద్ద ఎత్తున టమాటాలను సాగు చేశారని, భారత్ మార్కెట్లో వీటి ధరలు పెరిగిపోవడంతో, వీటిని ఇరు దేశాల మధ్య అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక జర్నలిస్టులు తెలిపారు.
కేవలం టమాటాలు మాత్రమే కాదు, క్యాబేజీ, దోసకాయలను కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు వారు వివరించారు.

ఫొటో సోర్స్, ASHISH SONI
సోనౌలి చెక్‌పోస్టు మీదుగా అక్రమంగా తరలిస్తున్నారా?
ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా, ఇండో-నేపాల్ బోర్డర్‌కి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ 84 కి.మీ వరకు ఇండో-నేపాల్ ఓపెన్ బోర్డర్ ఉంది.
మహారాజ్‌గంజ్ నేపాల్‌కి దక్షిణంలో ఉండగా, గోరఖ్‌పూర్ నేపాల్‌కి ఉత్తరాన ఉంది. ఇక్కడ ఇరు దేశాల మధ్యల రెండు ముఖ్యమైన సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి.
దానిలో ఒకటి సోనౌలి చెక్‌పోస్టు కాగా, మొరకటి తుతిబరి చెక్‌పోస్ట్.
సాయుధ ధళాల జవాన్ల క్యాంపు, కస్టమ్స్, యూపీ పోలీస్ స్టేషన్లు, అవుట్‌పోస్ట్‌లు సరిహద్దులో భద్రతపై దృష్టిసారించాయి. సరిహద్దు మీదుగా సాగే ఎగుమతి-దిగుమతులపై ఒక కన్నేసి ఉంచాయి.
ఓపెన్ బోర్డర్ కావడం వల్ల, స్మగ్లింగ్ ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
ఇరు దేశాల మార్కెట్‌పై స్మగ్లర్లు కూరగాయల ధరలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఏదైనా దేశంలో ధరల మధ్య వ్యత్యాసం రాగానే, స్మగ్లింగ్‌కి తెరలేపుతారు.
ఇలాంటి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు, ట్రేడర్లు, నిరుద్యోగులు పాలుపంచుకుంటూ ఉంటారు.
అంతేకాక, సరిహద్దులో ప్రతి అంగుళం అక్కడి ప్రజలు తెలిసి ఉంటుంది. అందుకే చాలా తేలిగ్గా వస్తువులను, ఉత్పత్తులను తరలిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, BIMALA
కెనడియన్ బఠానీలు, చైనా యాపిళ్లు, చక్కెర, యూరియా కూడా తరలించారు
గత ఏడాది కెనడియన్ బఠానీలు కూడా వార్తల్లో నిలిచాయి. పెద్ద ఎత్తున వీటిని అక్రమంగా తరలించారు. ఈ బఠానీల తరలింపులో సరిహద్దులో నివసించే చాలా మంది యువతకు ప్రమేయమున్నట్లు పోలీసులు తెలిపారు.
కెనడియన్ బఠానీలకు చెందిన తొలి కన్‌సైన్‌మెంట్ తొలుత కెనడా నుంచి నేపాల్‌కి వచ్చిందని, ఆ తర్వాత భారత్‌లోకి చేరుకున్నట్లు చెప్పారు.
ఈ కన్‌సైన్‌మెంట్ కోసం చీకట్లోనే సరిహద్దు వద్ద వాహనాలు సిద్ధంగా ఉంచారు. అవకాశం రాగానే, సరిహద్దు దాటించారు.
నేపాల్ నుంచి ఈ బఠానీలను అక్రమంగా తరలించి, వాటిని దేశంలో ప్రతి మూలన విక్రయించారు.
సరిహద్దుల్లో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, సైనికులు పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేసినప్పటికీ, స్మగ్లర్లు స్థానిక ప్రజలను వాడుకుంటూ ఈ కార్యకలాపాలను సాగిస్తున్నారు.
ఇటీవల ఇదే సరిహద్దులో చైనీస్ యాపిళ్ల స్మగ్లింగ్ కూడా జోరుగా సాగింది.
అయితే, ఈ యాపిళ్లు చైనా నుంచి వచ్చాయా? లేదా? అన్నది తెలియడం లేదని అధికారులు తెలిపారు.
నేపాల్ నుంచి యాపిళ్లను కేజీ రూ.60 నుంచి రూ.70కు భారత్‌కు తరలించారు. ఆ తర్వాత వీటిని భారత మండీలలో రూ.100 నుంచి రూ.120కి విక్రయించారు.
అదేవిధంగా చక్కెర, యూరియాను కూడా అక్రమంగా ఎప్పటికప్పుడూ సరిహద్దు దాటిస్తున్నారు.
భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉన్న లఖింపూర్ ఖేరి కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
కస్టమ్ ఆఫీసు ఏం చెబుతోంది?
నేపాల్ నుంచి భారత్‌కు టమాటాలను తరలిస్తున్నారన్న దానిపై తమకెలాంటి సమాచారం లేదని నేపాల్‌గంజ్ కస్టమ్ ఆఫీసుకు చెందిన సమాచార అధికారి దిల్లు ప్రసాద్ శర్మ చెప్పారు.
భారత్ నుంచి వస్తోన్న కూరగాయాల సమాచారం తమ వద్ద ఉందని, కానీ నేపాల్ నుంచి పంపిస్తోన్న కూరగాయల సమాచారం తమ వద్ద లేదని అన్నారు.
నేపాల్‌లో పెద్ద మొత్తంలో పండించే కూరగాయాలను కస్టమ్స్ ద్వారా వెళ్లడానికి అనుమతి లేదని, తాము (నేపాలీ రైతులం) ఇబ్బందుల్లో పడతామని థాపా చెప్పారు.
ఎగుమతులను రద్దు చేయడంతో, టమాటాలు రేట్లు చాలా తగ్గాయని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇండో-నేపాల్ సరిహద్దులో ఎగుమతి-దిగుమతి నిబంధనలు
ఇండో-నేపాల్ సరిహద్దులో ఎగుమతి-దిగుమతి కోసం నిర్దేశిత పాయింట్లు ఉంటాయని, ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ లేకుండా ఏ దిగుమతిదారు కూడా దిగుమతి చేయడానికి వీలు లేదని కస్టమ్స్ కమిషనర్ ఆర్తి సక్సేనా అన్నారు.
ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్స్(ఎల్‌సీఎస్) పేరుతో ఈ పాయింట్లను పిలుస్తారు.
ఇండో-నేపాల్ సరిహద్దు చాలా పెద్దది. ఇరు దేశాల మధ్యల ప్రజల రాకపోకలు కూడా సాగుతుంటాయి.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్న ఇండో-నేపాల్ బోర్డర్‌ను లఖ్‌నవూ కస్టమ్ యూనిట్ పర్యవేక్షిస్తోంది.
కొన్ని నిర్దేశిత ప్రాంతాల వద్దనే కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన అధికారులుంటారు. సాయుధ దళాల మాదిరి మొత్తం సరిహద్దు గుండా వీరు ఉండలేరు. దీంతో స్మగ్లింగ్ యధేచ్ఛగా జరిగిపోతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














