మెక్‌డోనల్డ్స్ భారత్‌లో తమ మెనూలోంచి టమోటాలను ఎందుకు తీసేసింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, చెరిలన్ మొలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
టమోటాను పండు అనాలా? లేదంటే అది కూరగాయల కేటగిరీలోకి వస్తుందా?.. ఇండియాలో ఇప్పుడు టమోటా విషయంలో ఇలాంటి తికమకల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆలోచన అంతా టమోటా ధర పెరుగుదలపైనే.
రెండుమూడు వారాలుగా టమోటా ధర విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం కేజీ టమోటా సుమారు రూ. 200 పలుకుతోంది. మామూలు రోజుల్లో అయితే రూ. 40, రూ. 50కి దొరికే టమోటా ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.
టమోటా ఖరీదైన వస్తువుగా మారడంతో ఆ ప్రభావం పర్స్‌పైన, వంట గదులపైన మాత్రమే కాకుండా వీధుల్లోనూ కనిపిస్తోంది.
మెక్‌డోనల్డ్స్ కూడా తమ మెనూ నుంచి టమోటాలను తప్పించి వార్తల్లో నిలిచింది. ఉత్తర, తూర్పు భారతదేశంలోని అనేక అవుట్‌లెట్లలో ఇదే పరిస్థితి ఉంది. అయితే, ఇందుకు ధరలను కారణంగా చెప్పడం లేదు ఆ సంస్థ. పంటల విషయంలో సీజనల్‌గా ఏర్పడే సమస్యల కారణంగా నాణ్యమైన టమోటాలు దొరక్క తమ మెనూలో వాటికి స్థానం కల్పించడం లేదని మెక్‌డోనల్డ్స్ చెప్పింది.
ఆకాశాన్నంటుతున్న టమోటా ధరలు ప్రధానంగా మధ్య తరగతి, పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మహారాష్ట్రలోని పుణెలో పావు కేజీ టమోటాల ధర విషయంలో కస్టమర్‌కు, కూరగాయలమ్మే వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. కూరగాయలమ్మే వ్యక్తి కస్టమర్ ముఖంపై తూనిక యంత్రంతో కొట్టారు.
ఇక వారణాసిలో ఓ రాజకీయ నాయకుడు తన దుకాణంలో టమోటాలు అమ్ముతూ, కొనడానికి వచ్చిన ప్రజలు బేరాలాడకుండా, గొడవలు జరగకుండా ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నారు.
పొలాల్లోని టమోటాలను దొంగిలించడం, టమోటాలతో వెళ్తున్న లారీలను హైజాక్ చేయడం వంటి ఘటనలూ జరిగాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టమోటాల ధరలు పెరగడానికి కారణమేంటనే విషయంలో నిపుణులు వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. వాతావరణం అనుకూలించక పంటలు దెబ్బతిన్నాయని, డిమాండ్‌కు తగినంత సరఫరా లేదని, మార్కెట్లో సరకు తగినంత లేకపోవడంతో ధరలు మరింత పెరిగాయని చెప్తున్నారు.
ధరల పెరుగుదల అనేది తాత్కాలికమని, రానున్న నెలల్లో ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెప్తోంది.
వినియోగదారులపై భారం తగ్గించే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాయితీ ధరలకు టమోటాలు విక్రయించే ఏర్పాట్లు చేశాయి.
టమోటా గ్రాండ్ చాలెంజ్ హ్యాకథాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం జూన్ 30న ఓ కార్యక్రమం ప్రారంభించి ధరల పెరుగుదలను అరికట్టే ఆలోచనలను పంచుకోవాలని సూచించింది.
భారతదేశ వంటలలో టమోటా పాత్ర చాలా ఎక్కువ. దాదాపు ప్రతి వంటకంలో దీన్ని జోడిస్తారు. అందుకే టమోటాలకు కొరత ఏర్పడినప్పుడు, వాటి ధరలు పెరిగినప్పుడు చాలా పెద్ద వార్తాంశంగా మారడంతోపాటు రాజకీయంగానూ వివాదాలకు కారణమవుతుంది.
ధరలు అమాంతం పెరగడమనేది సున్నితమైన ద్రవ్యోల్బణ సమతౌల్యాన్ని దెబ్బతీయొచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో 4 నుంచి 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జులై-సెప్టెంబర్‌లో 5.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం కేజీ రూ. 200 పలుకుతున్న టమోటాకు రెండు నెలల కిందట హోల్ సేల్ మార్కెట్లలో రూ. 2 నుంచి రూ. 3 ధర ఉండేది. డిమాండ్‌కు మించి సరఫరా ఉండడంతో ధర దక్కక రైతులు టమోటాలను రోడ్లపై పారబోసేవారు.
గత ఏడాది కూడా టమోటా రైతులు ధరలు పడిపోయినప్పడు గిట్టుబాటు కావడంలేదంటూ సరకు రోడ్ల మీద పారబోశారు. మార్చి నెలలో మహారాష్ట్రలోని ఉల్లి రైతులు తమ పంటకు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.
ఉల్లిపాయలు, టమోటా వంటి త్వరగా పాడయ్యే నిత్యవసరాల విషయంలో భారతదేశంలో తరచూ డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసమేర్పడి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇవి రెండూ దాదాపు ఏడాదంతా పండే పంటలు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వేర్వేరు సీజన్లలో పంట ఏడాదంతా మార్కెట్‌కు వస్తూ ఉంటుంది.
ఈ ఏడాది మొదట్లో టమోటా పంట దిగుబడులు బాగుండగా ఆ తరువాత వాతావరణం అనుకూలించక పరిస్థితి తారుమారైంది.
‘‘దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్ అయిన కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురిసిన ఫలితమే ప్రస్తుత ధరలు’’ అని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ చెప్పారు.
జూన్ రెండో వారం దాటినప్పటి నుంచి సరఫరా బాగా తగ్గిపోయిందని, డిమాండ్ మాత్రం తగ్గలేదని, దీంతో ధర పెరిగిపోయిందని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వాయువ్య భారతదేశంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల రానున్న మరికొద్ది రోజుల్లోనూ టమోటాల సరఫరా తగ్గొచ్చని అశోక్ అంచనా వేస్తున్నారు.
‘‘అనేక ప్రాంతాలు వరదలు, వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాయి’’ అన్నారు అశోక్.
టమోటాల ధరలు ఏటా పెరుగుతాయి కానీ ఈ స్థాయిలో పెరగడం మాత్రం ఎన్నడూ చూడలేదని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సభ్యుడు అనిల్ మల్హోత్రా పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.
‘‘వర్షాల కారణంగా సరఫరా భారీగా తగ్గిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి నుంచి మాకు రావాల్సిన సరకులో సగం పాడైపోయింది’’ అన్నారు అనిల్.
హరియాణాకు చెందిన టమోటా రైతు అరవింద్ మలిక్ ‘ద గార్డియన్’ పత్రికతో మాట్లాడుతూ.. తాను ఏటా సగటున 30 టన్నుల టమోటా విక్రయిస్తానని, కానీ, ఈసారి తెగుళ్ల కారణంగా పంట నాశనమై అందులో సగం దిగుబడి కూడా రాలేదని చెప్పారు.
‘‘వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల టమోటా పంటలకు తెగుళ్లు, వ్యాధులు వస్తాయి’’ అని నిపుణులు చెప్తున్నారు.
మరి, ఈ సప్లయ్, డిమాండ్ గ్యాప్‌ను ఇండియా ఎలా డీల్ చేయనుంది?
ఇలాంటి వర్షాల సమయంలో సప్లయ్ తగ్గకుండా ఉండేందుకు సరకు విరివిగా ఉన్నప్పుడు నిల్వ చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని చెప్తున్నారు.
అయితే, ఇది చెప్పడం సులభమే కానీ ఆచరణ అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. టమోటాలు తొందరగా పాడైపోతాయని, కోల్డ్ స్టోరేజీలలో ఉంచినా కొద్దివారాల వరకే నిల్వ ఉంటాయని చెప్తున్నారు.
టమోటాల సప్లయ్ స్థిరంగా ఉండాలంటే రక్షిత సాగును ప్రోత్సహించడం ఒక మార్గమని అశోక్ గులాటీ చెప్పారు.
అలాగే ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాసెస్ చేసి పేస్ట్ రూపంలో నిల్వ చేసుకుంటే తాజా సరకు దొరకనప్పుడు, ధర ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి ప్రాసెస్డ్ టమోటా ఉత్పత్తులను వినియోగించవచ్చని ఆయన సూచిస్తున్నారు. కానీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు పెరుగుతాయన్నారు అశోక్ గులాటీ.
ప్రస్తుతం ఏర్పడినలాంటి పరిస్థితులను నివారించాలంటే కూరగాయల ఉత్పత్తి నుంచి వినియోగం వరకు మొత్తంగా వేల్యూ చెయిన్ విధానం అవలంబించాలని, కానీ అలాంటి ఫ్రేమ్ వర్క్ ఏదీ ఇప్పుడు లేదని గులాటీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














