మగ శరణార్థుల కోసం తీరంలో తేలియాడే నివాసం.. లోపల ఏముంది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మైఖేల్ షీల్స్ మెక్‌నామి, డాన్ జాన్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
శరణార్థుల కోసం బ్రిటన్ ప్రభుత్వం సముద్ర తీరంలో ఒక తేలియాడే నివాసాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఫ్లోటింగ్ బార్జ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో అధికారులు మీడియా ప్రతినిధులను అందులోకి తీసుకెళ్లారు.
నైరుతి ఇంగ్లండ్‌లోని పోర్ట్‌ల్యాండ్ రేవులో ఈ వివాదాస్పద బార్జ్ ఏర్పాటు చేశారు. ఆశ్రయం ఇవ్వాలని బ్రిటన్‌ను కోరుతున్న 500 మంది ఒంటరి పురుషులకు ఇది త్వరలో ఆవాసంగా మారనుంది.
‘బిబ్బీ స్టాక్‌హోమ్’ అనే ఈ బార్జ్‌లో కారిడార్‌లు పొడవుగా, గందరగోళంగా ఉన్నాయి. అయితే లోపల డెస్క్, టీవీ, పెద్ద కిటికీలతో కూడిన విశాలమైన క్యాబిన్‌లు ఉన్నాయి. ప్రతి గదిలో ఒక షవర్ రూం ఉంది.
వాస్తవానికి ఇక్కడ 222 క్యాబిన్‌లు ఉన్నాయి, అయితే ప్రతి గదిలో బంక్ బెడ్‌లను ఉంచి, దాని సామర్థ్యాన్ని 506కి పెంచారు. బెడ్‌లు పెద్దగా లేకపోయినా, గదులు మరీ అంత ఇరుకుగా అనిపించవు.
దీనిలో పెద్ద స్క్రీన్, సోఫాలతో కూడిన టీవీ గది, ఆయా వర్గాలకు ప్రార్థనా గది, సమావేశాలు, కార్యకలాపాల కోసం గదులు ఉన్నాయి.
కొన్ని సాధారణ స్థలాలను నలుగురి నుంచి ఆరుగురి కోసం అదనపు బెడ్‌రూమ్‌లుగా మార్చారు. కానీ వాటిని చూడటానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు.
భోజనాల గది పెద్దగా ఉంది. క్యాంటీన్‌లో టేబుల్స్ ఉన్నాయి. మెనూలో అల్పాహారం కోసం గుడ్లు, పాన్‌కేక్‌లు, బంగాళాదుంప సూప్, రాత్రి భోజనం కోసం గొడ్డు మాంసం ఉన్నాయి.
వ్యక్తిగత, మతపరమైన అవసరాల దృష్ట్యా మెనూ క్రమం తప్పకుండా మారుతుందని అధికారులు చెప్పారు.
మొత్తం మూడు అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో సోర్స్, PA Media
24 గంటల భద్రత, ఆరోగ్య సేవలు
బార్జ్ మధ్యలో వ్యాయామశాల, వినోద స్థలం ఉన్నాయి.
బార్జ్‌లో 24/7 భద్రత ఉంటుంది. బార్జ్‌లో నేరుగా లేదా రిమోట్‌గా నిపుణుల బృందం వైద్య సాయం అందిస్తుందని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) చెప్పింది.
శరణార్థులను పోర్ట్‌ల్యాండ్, వేమౌత్‌లకు తీసుకెళ్లడానికి 9:00 నుంచి 23:00 గంటల మధ్య ప్రతీ గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
ఇది కర్ఫ్యూ కాదు, ఒకవేళ వారు తిరిగి రాకపోతే, వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి "వెల్ఫేర్ కాల్" ఉంటుంది.
ఈ వసతి అమానవీయమైనది కాదని, దారుణమైనది కాదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టంగా చూపించాలనుకుంటోంది.
హోం శాఖ దీనిని ప్రాథమిక వసతిగా చెబుతోంది.
ఇది ‘ఓషన్ లైనర్’ మాదిరైతే ఉండదు. ఇక్కడ గొప్ప మెట్లు, చక్కటి కళాఖండాలు, శిల్పాలేం లేవు.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో సోర్స్, PA Media
ఎన్ని రోజులు ఉండొచ్చు?
ఈ బార్జ్ శుభ్రంగా, సౌకర్యవంతంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం యూకేలో శరణార్థులను ఉంచే హోటళ్ల కంటే ఇది మెరుగైనదని కొంత మంది జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. అయితే మేం అందులో ఉన్నది గంట సేపే.
కొంత మంది శరణార్థులు ఇందులోనే తొమ్మిది నెలల పాటు కొనసాగొచ్చు. అయితే, బార్జ్ నిండిన తర్వాత పరిస్థితులు మారవచ్చు.
ప్రస్తుతం 50,000 మందికి పైగా వలసదారులకు హోటల్ వసతి కోసం రోజుకు సుమారు రూ. 63 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
సెప్టెంబరు నాటికి దాదాపు మూడు వేల మంది శరణార్థులను హోటళ్లలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉంచాలని హోంశాఖ భావిస్తోంది. బిబ్బీ స్టాక్‌హోమ్ బార్జ్, ఎసెక్స్‌లోని వెదర్‌ఫీల్డ్, లింకన్‌షైర్‌లోని స్కాంప్టన్‌లో ఉన్న పూర్వ సైనిక స్థావరాల్లో వీరికి ఆశ్రయం కల్పించాలని ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో సోర్స్, PA Media
స్థానికులు, మానవ హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత
బిబ్బీ స్టాక్‌హోమ్ బార్జ్ మంగళవారం ఉదయం తీరానికి చేరుకున్నప్పుడు స్థానికులు, మానవ హక్కుల సంఘాల వారు నిరసనలు తెలిపారు.
అక్రమంగా యూకేలోకి వచ్చే వారిని ఖరీదైన హోటళ్లలో పెట్టరాదని ప్రభుత్వం భావిస్తోందని ఇమ్మిగ్రేషన్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ గుర్తుచేశారు.
బిబ్బీ స్టాక్‌హోమ్‌లోని ఒక్కో బెడ్‌కు రోజుకు దాదాపు రూ. 3.6 లక్షల చొప్పున డోర్సెట్ కౌన్సిల్‌కు చెల్లిస్తున్నామని, స్థానిక ఎన్‌హెచ్‌ఎస్, పోలీసులకు కూడా చెల్లింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
బోర్డులో సేవలందించే స్థానిక స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల కోసం డోర్సెట్ సిటీ కౌన్సిల్ దాదాపు రూ. 4 కోట్ల వరకు గ్రాంట్ పొందినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎయిడ్స్: అలా చేస్తే ఈ వ్యాధి 2030లోగా అంతం అవుతుందా?
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















