ఎయిడ్స్: అలా చేస్తే ఈ వ్యాధి 2030లోగా అంతం అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఎయిడ్స్‌కు సంబంధించిన కీలక ఆరోగ్య కార్యక్రమాలకు నిధులు పూర్తిగా సమకూరితే, 2030 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించే దిశగా ప్రపంచం పయనిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.
65 శాతం మంది హెచ్‌ఐవీ బాధితులు నివసించే సబ్ సహారన్ ఆఫ్రికా కూడా ఈ వ్యాధిని నిర్మూలించడంలో గొప్ప పురోగతిని సాధిస్తోంది.
యూఎన్‌ఎయిడ్స్ సమాచారం ప్రకారం బోట్స్‌వానా, ఈస్వటిని, రువాండ, టాంజానియా, జింబాబ్వే దేశాలు ఇప్పటికే 95-95-95 లక్ష్యాన్ని సాధించాయి.
95-95-95 లక్ష్యం అంటే, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి వారి వ్యాధి ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడం, వ్యాధి స్థితి గురించి అవగాహన ఉన్న వారిలో 95 శాతం మంది యాంటీరెట్రో వైరల్ చికిత్సను తీసుకోవడం, యాంటీరెట్రో వైరల్ చికిత్స తీసుకుంటున్న వారిలో 95 శాతం మంది వైరస్‌ను అణచివేయడం.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని దాదాపుగా నిర్మూలించవచ్చు.
ఇవే కాకుండా మరో 16 దేశాలు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. వీటిలో ఎనిమిది దేశాలు సబ్-సహారన్ ఆఫ్రికాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Kuy Pov
యూఎన్‌ఎయిడ్స్ బడ్జెట్ కొరతను ఎదుర్కొంటోంది. అల్ప, మధ్య ఆదాయ దేశాల కోసం తమ బడ్జెట్‌లో 2025 నాటికి రూ. 69,791 కోట్ల (8.5 బిలియన్ డాలర్లు) కొరతను ఎదుర్కొంటుంది.
ఎయిడ్స్ వ్యాధితో 2022లో ప్రతీ నిమిషానికి ఒకరు చనిపోయిన నేపథ్యంలో బడ్జెట్ కొరత వల్ల ఇప్పటివరకు సాధించిన పురోగతి వృథాగా మారే ప్రమాదం ఉందని యూఎన్‌ఎయిడ్స్ నివేదిక చెప్పింది.
‘‘ఈ నివేదికలో పంచుకున్న అంశాలు, గణాంకాలు మనం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దిశగా ప్రయాణిస్తున్నట్లు సూచించట్లేదు. కానీ, మనం ఆ దిశగా సాగగలం అని చూపిస్తున్నాయి. ప్రయాణించే మార్గాన్ని స్పష్టం చేస్తున్నాయి’’ అని యూఎన్‌ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యానిమా అన్నారు.

ప్రమాదంలో బాలికలు
కానీ, దీన్ని అధిగమించడానికి ఇంకా అడ్డంకులు ఉన్నాయి. ప్రతీ వారం, 4 వేల మంది కౌమార బాలికలు, అమ్మాయిలు కొత్తగా హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు.
సబ్-సహారన్ ఆఫ్రికాలో పురోగతి ఉన్నప్పటికీ, 2022లో నమోదైన మొత్తం కొత్త హెచ్‌ఐవీ కేసుల్లో అన్ని వయస్సులకు చెందిన మహిళలు, బాలికలు 63 శాతం మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి చెప్పింది.
దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో బాలికలు ఈ వ్యాధి ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అక్కడ ‘ఇంటర్-జనరేషనల్ సెక్స్’ పేరిట పెద్దవయస్కులైన పురుషులు వారిని లోబరుచుకుంటారు.
గ్యావోన్‌కు ఇప్పుడు 32 ఏళ్లు. పాఠశాలకు వెళ్లే సమయంలోనే ఆమెకు హెచ్‌ఐవీ సోకింది.
‘‘మాకు దగ్గరి బంధువుల్లో ఒకరు నాకు చాలా సహాయం చేసేవారు. అప్పుడు అతను తన ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్నాడు. నా వయస్సుకు రెట్టింపు వయస్సు అతనిది. నేను అతన్ని చాలా నమ్మాను. దాన్ని అదునుగా తీసుకొని నాతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు’’ అని ఆమె చెప్పారు.
గ్యావోన్ 2012 నుంచి యాంటీరెట్రోవైరల్ మందులను వాడుతున్నారు. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరికీ హెచ్‌ఐవీ సోకలేదు. ఇప్పుడు ఆమె ఎయిడ్స్ ప్రచార కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు.
లైంగిక దాడి, లైంగిక దోపిడి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఈ సమాజం ఇంకా సిద్ధంగా లేదని గ్యావోన్ అన్నారు.

ఫొటో సోర్స్, Rev Mmachakga Mpho Moruakgomo
మతపెద్దల సహకారం
హెచ్‌ఐవీ సోకిన మహిళల కంటే పురుషులే వైద్య సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.
పురుషుల వైఖరిని మార్చడానికి, హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి బోట్స్‌వానా ఇప్పుడు మత పెద్దల సహాయం తీసుకుంటోంది.
‘‘బోట్స్‌వానాలో 95 శాతం మందికి తమకు హెచ్‌ఐవీ ఏ దశలో ఉందో తెలుసు. ఇలా వ్యాధి దశ తెలియని వారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. మత పెద్దలను ప్రజలు గౌరవిస్తారు. అందుకే వ్యాధి నిర్ధరణ పరీక్షలు, చికిత్స అవసరం గురించి పురుషులతో మాట్లాడటానికి వారిని ఉపయోగిస్తున్నాం’’ అని ఎయిడ్స్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న గ్రూపులో సభ్యుడైన క్రైస్తవ మత పెద్ద రెవ్ మచాక చెప్పారు.
ఈ సమస్య పరిష్కారం కోసం హిందూ, ముస్లిం, బహాయి పెద్దలు కూడా పాటుపడుతున్నారని ఆయన తెలిపారు. కొందరు ఇంటింటికి వెళ్లి నిర్ధరణ పరీక్షలకు హాజరుకావాల్సిందిగా కోరుతున్నారని చెప్పారు.
‘‘బ్రదర్స్ అరైస్-నానోగ్యాంగ్’’ పేరిట వారు ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
2030 నాటికి ఎయిడ్స్‌ను నిర్మూలించే దిశలో బోట్స్‌వానా ఉందని, ఈ లక్ష్య సాధనలో మతపెద్దలు కీలకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు నేషనల్ ఎయిడ్స్ అండ్ హెల్త్ ప్రమోషన్ ఏజెన్సీ (ఎన్‌ఏపీహెచ్‌ఏ) అధ్యక్షుడు ఒంటిరెట్సె లెట్‌హరె అన్నారు.

ఫొటో సోర్స్, UNAIDS
మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?
ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ధోరణి పెద్దగా కనిపించట్లేదు. 2022లో నమోదైన కొత్త హెచ్‌ఐవీ కేసుల్లో దాదాపు నాలుగింట ఒకవంతు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోనే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి చెప్పింది.
తూర్పు యూరప్, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, ఉత్తర అమెరికాల్లో కొత్త హెచ్‌ఐవీ కేసులు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపింది.
అట్టడుగున ఉన్న జనాభాకు హెచ్‌ఐవీ నిరోధక సేవలు అందకపోవడం వల్ల ఈ ధోరణి పెరుగుతున్నట్లు వెల్లడించింది.
కానీ, ‘ప్రి-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్’ లేదా ప్రెప్ అని పిలిచే చికిత్స ప్రస్తుత పరిస్థితుల్లో ఆశాజనకంగా కనిపిస్తోందని చెప్పింది.
సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు వంటి కమ్యూనిటీకి కంబోడియా దేశం ఉచితంగా ఈ మందులను అందజేస్తోంది.
‘‘మూడు నెలలుగా నేను రోజూ మందులను తీసుకుంటున్నా. మొదట కొన్ని రోజుల తలనొప్పిగా అనిపించింది. కానీ, తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా’’ అని 32 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ కుయ్ పొవ్ చెప్పారు.
కంబోడియా రాజధాని నగరంలో ఆమె బ్యూటీ సెలూన్ నడుపుతున్నారు.
‘‘నేను ప్రెప్ తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు లైంగిక భాగస్వాములు ఒకరి కంటే ఎక్కువగా ఉన్నారు. నేను ప్రమాదం అంచున ఉన్నట్లు నాకు తెలుసు. కండోమ్స్ ధరించాల్సిందిగా నా భాగస్వాములకు చెబుతుంటా. కానీ, కొన్నిసార్లు వారు తిరస్కరిస్తారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కంబోడియాలో 76 వేల మంది హెచ్‌ఐవీతో ఉన్నట్లు అంచనా. వీరిలో 86 శాతం మందికి వారికి వ్యాధి ఏ దశలో ఉందో అవగాహన ఉంది. వ్యాధి దశపై అవగాహన ఉన్న వారిలో 99 శాతం మంది చికిత్స పొందుతున్నారు.
1996తో పోలిస్తే కొత్త ఇన్‌ఫెక్షన్లు 91 శాతం తగ్గాయి. కానీ, రోజుకు నలుగురు కొత్తగా ఈ వ్యాధి బారిన పడటమే ప్రధాన ఆందోళన.
ప్రెప్ ట్యాబ్లెట్ల వల్ల ప్రోత్సాహకర ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వేతర సంస్థ తరపున కంబోడియాలో పురుషుల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న డనౌ చి చెప్పారు.
ఇంజెక్షన్ రూపంలో కూడా దీన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














