‘నా భర్త మరో మహిళతో నగ్నంగా ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలను తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేశారు’ -లోన్ యాప్ బాధితురాలు

లోన్ యాప్‌ల అరాచకం
    • రచయిత, నజిష్ ఫైజ్
    • హోదా, జర్నలిస్ట్, ఇస్లామాబాద్

‘‘నా భర్త ఎడిట్ చేసిన ఫోటోలను మాకు పరిచయమున్న వారందరికీ పంపారు. దానిలో నా భర్త, మరో మహిళతో నగ్నంగా ఉన్నట్లు చూపించారు. ఒకవేళ దీన్ని ఇక్కడే ఆపకపోతే, నా ఫోటోలను కూడా వారు నాకు కాల్స్ వచ్చే నంబర్లతో తప్పుడు వెబ్‌సైట్‌లో పెడతారు.’’

పాకిస్తాన్‌కు చెందిన ఫౌజియా(పేరు మార్చాం) భయపడుతూ ఈ విషయం బీబీసీతో చెప్పారు. ఆమె భర్త కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్ యాప్‌లో రూ.10,000 లోన్ తీసుకున్నారు. ఆ రుణం కొన్ని రోజులకే రూ.10 వేల నుంచి రూ.10 లక్షలకు పెరిగింది.

దీని తర్వాత ఫౌజియా, ఆమె భర్త ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తమ ఇంట్లోని వస్తువులన్నింటినీ అమ్మేశారు.

ఈ సోషల్ మీడియా ప్రపంచంలో, ఫోటోలు తప్పుడు వ్యక్తుల చేతుల్లో వెళ్లకూడదని వారు భయపడుతున్నారు.

ఎందుకంటే, ఆ ఫోటోలను వారు తప్పుడుగా వాడే ప్రమాదం ఉంది.

ఫౌజియాను, ఆమె భర్తను డబ్బులు తిరిగి చెల్లించాలంటూ యాప్ వారు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేశారు.

ఫౌజియా భర్తకు కూరగాయల వ్యాపారం ఉండేది. ఈ వ్యాపారం కోసం ఆయన ఇతర వ్యక్తులను నియమించుకునే వారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా మారాయి. వారు కనీసం తమ కూతురికి పాలను కూడా అందివ్వలేకపోతున్నారు.

రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఫౌజియా, ఆమె భర్త ఎందుకు ఇంట్లో వస్తువులు అమ్మాల్సి వచ్చింది?

2020లో పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి సమయంలో, సులభతరమైన వాయిదాల్లో డబ్బులు చెల్లించేలా ఆన్‌లైన్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ఈ యాప్స్ ద్వారా కూడా ప్రజలు రుణాలు తీసుకున్నారు.

రుణం కోసం రుణగ్రహీతలు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు, దానిలో కొన్ని షరతులున్నాయి. కానీ, రుణం తీసుకున్న తర్వాత, ఈ షరతులకు విరుద్ధంగా ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వ్యవహరించారు.

ఉదాహరణకు, రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించేందుకు 91 రోజుల సమయం ఇస్తున్నట్లు చెబుతారు. అలాగే తీసుకున్న మొత్తంపై కేవలం 3 శాతం వడ్డీ మాత్రమేనని దానిలో ఉంటుంది.

కానీ, ఈ వివరాలను చూసి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న వారికి, వారం వ్యవధిలోనే వివిధ రకాల నంబర్ల నుంచి కాల్స్ రావడం ప్రారంభమైంది.

రుణం తిరిగి చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. అలాగే తీసుకున్న ఈ రుణం ప్రతి రోజూ రెండింతలవుతుందని బెదిరించారు.

గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకొనే సమయంలో, ఫోన్ కాంటాక్ట్‌లకు అవి యాక్సెస్ అడుగుతాయి. అనుమతి ఇచ్చిన వెంటనే, సంబంధిత కంపెనీకి ఫోన్‌లోని కాంటాక్ట్‌ల యాక్సెస్ లభిస్తుంది.

లోన్ యాప్‌లు

ఫొటో సోర్స్, Getty Images

'ఆయన రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు'

ఫౌజియా, ఆమె భర్త విషయంలో కూడా ఇదే జరిగింది. వారం తర్వాత ఫౌజియా భర్తకు లోన్ ఇచ్చిన వారి నుంచి కాల్ వచ్చింది.

తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. లేదంటే తీసుకున్న రుణంపై రూ.5 వేల వడ్డీ చెల్లించాలని చెప్పారు.

తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫౌజియా బీబీసీతో పంచుకున్నారు.

‘‘డబ్బు తిరిగి ఇవ్వాలని నా భర్తను అడిగారు. లేదంటే మీకు తెలిసిన వారందరికీ మీరు రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదని చెబుతామని బెదిరించారు. 91 రోజుల సమయం ఉంటుంది కదా, ఇప్పుడే ఎందుకు మమ్మల్ని బలవంతం చేస్తున్నారని నా భర్త అడిగారు. అయినప్పటికీ, వారు అలా బెదిరిస్తూ ఉండే సరికి, రూ.5 వేలు వారికి ఇచ్చాం. కానీ, అక్కడితో వారు ఆగలేదు’’ అని ఫౌజియా చెప్పారు.

‘‘ప్రస్తుత పరిస్థితి ఎలా మారిందంటే ఒక పూట తిని, మరో పూటకు ఎవరైనా ఆహారం ఇస్తారా అని ఎదురుచూడాల్సి వస్తోంది. నేను, నా భర్త రోజు గడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకొక కూతురు ఉంది. సరిగా తినకపోవడం వల్ల ఆమె వయసు కంటే చాలా చిన్నదిగా, బలహీనంగా కనిపిస్తోంది’’ అని ఫౌజియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇబ్బందులతో విసుగుపోయిన తన భర్త కొన్ని రోజుల క్రితం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారని ఫౌజియా తెలిపారు.

ఈ ఆన్‌లైన్ యాప్‌ల మోసానికి గురైన వారు ఫౌజియా, ఆమె భర్తలా వేల మంది ఉన్నారు. ఇలా వీరందరూ కూడా బ్లాక్ మెయిల్‌‌కు గురయ్యారు.

కొందరు ఈ ఆన్‌లైన్ యాప్స్ ద్వారా కేవలం రూ.13 వేల రుణం తీసుకుని, ఉండే ఇల్లు కూడా అమ్మేసి రూ.17 లక్షల వరకు కట్టారు.

కొందరు రూ.20 వేలు లోన్ తీసుకుని, వారి షాపును, భార్య ఆభరణాలను అమ్మేసి రూ.13 లక్షలు చెల్లించారు.

ఫౌజియా, ఆమె భర్తలాగా పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల మొహమ్మద్ మసూద్ కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొన్నారు.

ఒక లోన్ యాప్ ద్వారా మొహమ్మద్ మసూద్ రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు పదే పదే బ్లాక్ మెయిల్ కాల్స్ రావడంతో, ఆత్మహత్య చేసుకున్నారు.

మొహమ్మద్ మసూద్ ఆత్మహత్య తర్వాత, ఈ యాప్స్‌పై, వీటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.

ఆ తర్వాత ప్రభుత్వ ఏజెన్సీలు మోసపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం తీవ్రతరం చేశాయి.

మొహమ్మద్ మసూద్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ మసూద్

ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఈ యాప్స్‌పై చాలా సార్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ)కి ఫిర్యాదు చేశారని, కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ మోసానికి గురైన చాలా మంది బాధితులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది.

ఆన్‌లైన్ మోసానికి పాల్పడుతున్న కంపెనీలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు ఇస్లామాబాద్ సైబర్‌క్రైమ్ వింగ్, అడిషినల్ డైరెక్టర్ అయాజ్ ఖాన్‌తో బీబీసీ మాట్లాడింది.

చాలా కాలంగా తమకు ఈ యాప్స్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందుతున్నట్లు అయాజ్ ఖాన్ చెప్పారు. వారిపై విచారణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు.

‘‘గూగుల్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే, వీటిని సెక్యూరిటీ, ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్(ఎస్ఈసీపీ) నియంత్రిస్తోంది. అంటే ఈ యాప్స్ ఏ కంపెనీకి చెందినవి, ఈ యాప్స్ వ్యవస్థాపకులు ఎవరు, మిగిలిన వివరాలుంటాయి. సమాచారమంతా వారి వద్ద అందుబాటులో ఉంటుంది.

మాకు ఫిర్యాదులు వచ్చినప్పుడు, మేం తొలుత ఈ యాప్‌లు లైసెన్స్ తీసుకున్నాయా? లేదా అనే విషయాన్ని ఎస్‌ఈసీపీని అడిగాం. వారు లైసెన్స్ తీసుకోలేదని, కొన్ని లైసెన్స్ తీసుకుని కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఎస్‌ఈసీపీ మాకు చెప్పింది’’ అని అయాజ్ ఖాన్ చెప్పారు.

కానీ, ఆ లోన్ యాప్స్‌‌కు ఎలాంటి కార్యాలయాలు లేవు. లోన్ తిరిగి చెల్లించాలంటూ ప్రతిసారి కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్ చేస్తున్నారు. దీంతో వీరిని గుర్తించడం కూడా కష్టమవుతుందని అయాజ్ ఖాన్ అన్నారు.

మొహమ్మద్ మసూద్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాల్స్‌ను ట్రాక్ చేస్తూ, ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవడం తీవ్రతరం చేసినట్లు ఆయన తెలిపారు.

ఇస్లామాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ అడిషనల్ డైరెక్టర్ అయాజ్ ఖాన్
ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ అడిషనల్ డైరెక్టర్ అయాజ్ ఖాన్

‘‘7 ఎఫ్ఐఆర్‌లను మేం దాఖలు చేశాం. 25 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశాం. కాల్ సెంటర్లులాగా పనిచేస్తున్నఏడు కంపెనీల కార్యాలయాలను మూసివేశాం. 35 బ్యాంకు అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశాం’’ అని అయాజ్ ఖాన్ వెల్లడించారు.

ఫోటోలను ఎడిట్ చేసి తప్పుగా వాడేవారిపై సైబర్‌ క్రైమ్ కఠిన చట్టాన్ని ప్రయోగిస్తోందని అయాజ్ ఖాన్ చెప్పారు.

ఈ చట్టం కింద ఆ వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ నేరం. జరిమానాతో వీరికి శిక్ష వేస్తారు.

చాలా మందికి ఈ యాప్స్ మోసం గురించి తెలియదని అయాజ్ ఖాన్ అన్నారు.

డబ్బులు అవసరమైనప్పుడు వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ, సోషల్ మీడియాలో రావల్పిండి వ్యక్తి ఈ యాప్స్ మూలంగా ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన ఫోన్ రికార్డింగ్స్ వైరల్ అయిన తర్వాత వీటి మోసాల గురించి ప్రజలకు తెలిసింది.

ఎవరైనా వ్యక్తులు ఈ యాప్స్ మూలంగా వేధింపులు ఎదుర్కొంటుంటే, వెంటనే ఎఫ్ఐఏ(ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) వద్ద లేదా తమ ప్రాంతంలోని సైబర్‌క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయండి. సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు దాఖలు చేయొచ్చు.

ఫిర్యాదు దాఖలు చేసిన వెంటనే మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అయాజ్ ఖాన్ హామీ ఇచ్చారు.

అఖీల్ నోమీ, ఇమ్రాన్ చౌదరి
ఫొటో క్యాప్షన్, అఖీల్ నోమీ, ఇమ్రాన్ చౌదరి

ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు

అఖీల్ నోమి, ఇమ్రాన్ చౌదరి వంటి వ్యక్తులు ఈ యాప్‌ల మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ యాప్‌ల మోసానికి వీరు కూడా బాధితులయ్యారు.

అఖీల్ నోమి ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ బ్లాక్ మెయిల్ నుంచి ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో ఈ చానల్‌లో అఖీల్ నోమి వివరిస్తున్నారు.

అలాగే, ఇమ్రాన్ చౌదరి కూడా పలుసార్లు ఈ యాప్‌ల మోసాలపై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేశారు.

‘‘ఇది చాలా పెద్ద మోసమని, రోజూ లక్షల మంది ప్రజలు ఈ మోసానికి గురవుతున్నారని, ఆత్మహత్యయత్నం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు, నేను చాలా న్యూస్ ఛానల్స్, ఎఫ్ఐఏ, ఎస్‌ఈసీపీ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేశాను’’ అని ఇమ్రాన్ చౌదరి చెప్పారు.

ఇమ్రాన్ చౌదరి నాలుగేళ్లుగా ఈ యాప్స్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

పాకిస్తాన్‌లో ఈ యాప్స్ మోసాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈ మోసం గురించి ఎఫ్ఐఏకి చాలా సార్లు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇమ్రాన్ చౌదరి చెప్పారు. ఇప్పుడు ఎఫ్ఐఏ పత్రికా ప్రకటన విడుదల చేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఎఫ్ఐఏ ఈ ప్రకటనలో తెలిపింది.

ప్రజలకు ఈ మోసాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సమాచారం లభిస్తోంది.

‘‘భవిష్యత్తులో ఈ యాప్స్‌ను పూర్తిగా నిషేధిస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని ఇమ్రాన్ చౌదరి అన్నారు.

పాకిస్తాన్ సెక్యూరిటీ, ఎక్స్చేంజ్ కమిషన్ సెక్రటరీ డైరెక్టర్ ఖాలీదా హబీబ్
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ సెక్యూరిటీ, ఎక్స్చేంజ్ కమిషన్ సెక్రటరీ డైరెక్టర్ ఖాలీదా హబీబ్

ఈజీ లోన్ యాప్స్‌‌కు లైసెన్స్ ఎలా వస్తుంది?

ఈజీ లోన్ యాప్స్‌‌కు ఎలా లైసెన్స్ జారీ చేస్తారు? చట్టవిరుద్ధ యాప్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఎస్‌ఈసీపీ ఆర్థిక రంగాన్ని నియంత్రిస్తుందని సెక్యూరిటీ, ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సెక్రటరీ డైరెక్టర్ ఖాలీదా హబీబ్ చెప్పారు.

‘‘అంటే నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు ఈ సంస్థ లైసెన్స్‌లను జారీ చేస్తుంది. ఈ లైసెన్స్‌తో ఈ కంపెనీలు రుణాలిచ్చే కార్యకలాపాలను చేపట్టవచ్చు’’ అని తెలిపారు.

‘‘మేం ఏదైనా కంపెనీకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు, ఆ కంపెనీకి ఎవరు మూలధనం పెడుతున్నారో వారి వివరాలను వెరిఫై చేస్తాం. ఎవరు ఈ సంస్థకు అధిపతి, ఇతర అంశాలను చూస్తాం. ఆ తర్వాత సైబర్ క్రైమ్ ఫామ్‌ను ఇస్తాం. దానిలో అంతా సమాచారం ఉంటుంది. లోన్లు ఇచ్చేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో కూడా దానిలో తెలుపుతాం. సైబర్ సెక్యూరిటీకి అనుగుణంగా అనుమతులు ఇచ్చేటప్పుడు, ఆ యాప్ విధాన ప్రక్రియ గురించి కూడా చూస్తాం’’ అని తెలిపారు.

ఈ యాప్‌లు లాంచ్ అయిన తర్వాత, వాటికి వ్యతిరేకంగా ఫిర్యాదులు రావడం ప్రారంభమైందని ఖాలీదా హబీబ్ చెప్పారు. దీంతో ఈ యాప్స్‌పై పలు సందేహాలు వచ్చాయన్నారు.

‘‘యూజర్ల మొబైల్ ఫోన్ యాక్సస్‌ను వాడుకునేందుకు వీలు లేకుండా పరిమితం చేస్తూ ఎస్ఈసీపీ 2022లో ఒక లేఖను పంపింది. రుణ మొత్తానికి, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారమంతా ఇవ్వాలని వారికి చెప్పాం’’ అని ఆమె తెలిపారు.

ఎవరైతే అక్రమంగా లోన్ యాప్స్‌ను నిర్వహిస్తున్నారో, వారిపై చర్యలు తీసుకునేందుకు తాము పాకిస్తాన్ టెలికమ్యూనికేష్ అథారిటీ(పీటీఏ), గూగుల్, స్టేట్ బ్యాంకు, ఇతర వాటాదారులతో చర్చలు జరిపినట్లు చెప్పారు.

ఇప్పటివరకు గూగుల్ ఈ రకమైన 65 యాప్‌లను క్లోజ్ చేసిందన్నారు.

ఆ తర్వాత గూగుల్ కూడా యాప్‌లకు సంబంధించి సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద ఏ యాప్ అయినా తమ ప్లేస్టోర్‌పై వర్క్ చేసుకునేందుకు తొలుత ఎస్‌ఈసీపీ, స్టేట్ బ్యాంకు అనుమతిని చూపించాల్సి ఉంది.

చట్టవిరుద్ధ యాప్‌లను శాశ్వతంగా బ్లాక్ చేస్తారా? అనే ప్రశ్నకు ఖాలీదా హబీబ్ స్పందించారు.

‘‘ఎస్‌ఈసీపీ నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ. దీని బాధ్యత చట్టవిరుద్ధ యాప్‌లను గుర్తించి, బ్లాక్ చేయడం. భవిష్యత్తులో కూడా ఈ యాప్స్‌ను బ్లాక్ చేయడం కొనసాగిస్తాం. వాటిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఖాలీదా హబీబ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)