మణిపుర్: కుకీ, మెయితీల తర్వాత నాగాలు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు?

నాగాల ర్యాలీ

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA

    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం, గువాహటి నుంచి

మణిపుర్‌లో గత మూడు నెలలుగా జాతి హింస జరుగుతున్న నేపథ్యంలో తాజాగా నాగా తెగ ప్రజలు కూడా రోడ్డెక్కారు.

బహుళ గిరిజన జనాభా ఉండే ఈ రాష్ట్రంలోని తామెంగ్‌లాంగ్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి జిల్లాల్లో నాగా తెగ ఆధిపత్యం ఉంటుంది.

రాజధాని ఇంపాల్‌తో పాటు కొండ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా నాగా జనాభా స్థిరపడింది.

నాగా తెగకు చెందిన వేలాదిమంది ప్రజలు గత బుధవారం రెండు డిమాండ్లను వినిపిస్తూ ప్రదర్శనలు చేపట్టారు.

మే 3న కుకీ, మెయితీ కమ్యూనిటీ ప్రజల మధ్య మొదలైన జాతి హింస, రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించింది.

పర్వత ప్రాంతాల్లోని కుకీలు, లోయల్లో నివసించే మెయితీలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు వెళ్లలేని విధంగా ఈ రెండు వర్గాల మధ్య విభజన ఏర్పడింది.

హింసాకాండ తర్వాత, ప్రత్యేక పరిపాలన కావాలంటూ కుకీ ప్రాంతాల్లో డిమాండ్ తీవ్రమైంది.

నాగాల ర్యాలీ

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA

ఇటువంటి పరిస్థితుల్లో, భారత ప్రభుత్వం మణిపుర్‌లోని ఏ కమ్యూనిటీ కోసమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పుడు నాగాల ప్రయోజనాలు, భూభాగానికి నష్టం కలుగకుండా వ్యవహరించాలని నాగాలు స్పష్టం చేస్తున్నారు.

నిజానికి మణిపుర్ ప్రభుత్వ మంత్రులు, శాసన సభ్యుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు కమ్యూనిటీ పరంగా చీలిపోయారు.

మణిపుర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే, జాతి ఘర్షణల కారణంగా కుకీ జనాభా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల్లో ప్రభుత్వ పట్టు సడలింది.

రాష్ట్రంలో హింస చెలరేగి 100 రోజులకు పైగా గడిచినా ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఇప్పటికీ కుకీ ప్రాంతాలను సందర్శించలేకపోయారు.

తమకు ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలంటూ కుకీ కమ్యూనిటీ వారు చేస్తోన్న డిమాండ్, ఇప్పుడు నాగా తెగ వారు కూడా తమ డిమాండ్లను వినిపించడానికి అవకాశాన్ని కల్పించింది.

కుకీల ప్రాంతాల్లో పరిపాలనా ఏర్పాట్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే, చివరి దశలో ఉన్న నాగా శాంతి చర్చలకు ఏదైనా నష్టం వాటిల్లుతుందనే భయం నాగా ప్రజల్లో మొదలైంది.

అందుకే బుధవారం నాగా ఆధిపత్య ప్రాంతాల్లో ర్యాలీలు జరిగాయి. భారత ప్రభుత్వానికి తమ సందేశం పంపే ప్రయత్నమే ఈ ర్యాలీలని నాగాలు చెబుతున్నారు.

మణిపుర్

ఫొటో సోర్స్, Getty Images

నాగా తెగ డిమాండ్ ఏంటి?

మణిపుర్‌లో స్థిరపడిన నాగా తెగల అత్యున్నత సంస్థ ‘‘యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీల్లో రెండు ప్రధాన డిమాండ్లు వినిపించాయి.

2015 ఆగస్టు 3న భారత ప్రభుత్వం, వేర్పాటువాద సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం (నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్)కి చెందిన ఇసాక్-ముయివా వర్గం మధ్య కుదిరిన ముసాయిదా ఒప్పందం అంశాన్ని లేవనెత్తుతూ ప్రధాని నరేంద్ర మోదీకి యూఎన్‌సీ మెమోరాండంను పంపింది.

ముసాయిదా ఒప్పందం తర్వాత జరిగిన సుదీర్ఘ శాంతి చర్చలను త్వరగా ముగించాలని మెమోరాండమ్‌లో పేర్కొన్నారు.

ఇతర కమ్యూనిటీల డిమాండ్లను పరిష్కరించే క్రమంలో నాగాల ప్రయోజనాలు, భూభాగాలు ప్రభావితం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు.

యూఎన్‌సీ అధ్యక్షుడు ఎన్జీ లోర్హో మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లో 20 నాగా తెగలు ఉన్నాయి. ఇతర కమ్యూనిటీల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నంలో నాగాల భూభాగానికి నష్టం కలిగించడం, ఇతర ప్రయోజనాలకు భంగం కలిగించడం లాంటి చర్యలను నాగాలు సహించరు’’ అని అన్నారు.

నాగా శాసన సభ్యులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జూన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నాగా శాసన సభ్యులు భేటీ అయ్యారు

అమిత్ షాతో నాగా ఎమ్మెల్యేల భేటీ

జూన్‌లో నాగా తెగకు చెందిన శాసనసభ్యులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తొలిసారి కుకీలు డిమాండ్ చేస్తోన్న ప్రత్యేక పరిపాలన వ్యవస్థపై తమ వైఖరిని వినిపించారు.

పర్వత ప్రాంతాల జిల్లాల కోసం ప్రత్యేక పరిపాలనా ఏర్పాటుకు సంబంధించిన ఏ చర్య అయినా నాగాల శాంతి ప్రక్రియపై ఆధారపడి ఉండాలనే డిమాండ్‌ను వారు అమిత్‌షా ముందు ఉంచారు.

మెయితీ, కుకీ కమ్యూనిటీల హింసలో ఇప్పటి వరకు నాగాలు తటస్థంగా ఉన్నారు. అయితే, గిరిజనులు, గిరిజనేతరుల మధ్య పోరుగా చూస్తే మాత్రం నాగాలు, కుకీల పక్షానే ఉన్నట్లు కనిపిస్తారు.

నాగా శాసనసభ్యుడు ఎల్. దిఖో బీబీసీతో మాట్లాడుతూ, "మణిపుర్‌లో నాగా, కుకీల మిశ్రమ జనాభా ఉన్న కొన్ని పర్వత ప్రాంతాలు ఉన్నాయి. చందేల్, తామెంగ్‌లాంగ్ జిల్లాలు పూర్తిగా నాగా ఆధిపత్య ప్రాంతాలు. అయితే, చురచాంద్‌పూర్ జిల్లాలో 90 శాతం చైనా-కుకీ జనాభా ఉంటుంది.

గిరిజనుల ప్రాతిపదికన విభజన సాధ్యం కాని అనేక ఇతర సంక్లిష్ట ప్రాంతాలు కూడా ఉన్నాయి.

కొత్త పరిపాలన వ్యవస్థ పేరుతో నాగా ప్రాంతాన్ని ముట్టుకోవద్దని, ఇలా చేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని అమిత్ షాకు మేం చెప్పాం.

నాగా శాంతి చర్చలు జరిగి 26 ఏళ్లు గడిచాయి. ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం చూపాలని’’ ఆయన అన్నారు.

నాగాలు

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA

ఫొటో క్యాప్షన్, మణిపుర్ ఘర్షణల్లో ఇప్పటివరకు 150 మంది చనిపోయారు

నాగా శాంతి చర్చల్లో చిక్కుముడి ఏంటి?

ప్రస్తుతం నాగా శాంతి ప్రక్రియ క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. వేర్పాటువాద గ్రూపు ఎన్‌ఎస్‌సీఎన్ -ఐఎం, కేంద్ర ప్రభుత్వాల మధ్య 'గ్రేటర్ నాగలిమ్' డిమాండ్‌తో పాటు, ప్రత్యేక జెండా, నాగాలకు ప్రత్యేక రాజ్యాంగం వంటి డిమాండ్లపై విభేదాలు ఉన్నాయి.

గ్రేటర్ నాగలిమ్ అంటే ఈశాన్యంలో నాగా జనాభా స్థిరపడిన అన్ని ప్రాంతాల ఏకీకరణ.

మణిపుర్‌లో స్థిరపడిన నాగా తెగ ప్రజలు శాంతి చర్చలను త్వరగా ముగించాలని డిమాండ్ చేయడానికి ఇదే కారణం.

అయితే, నాగాలాండ్‌ పొరుగు రాష్ట్రాలైన మణిపుర్‌, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లుతుందని కేంద్రం ఈ ఆలోచనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ముసాయిదా ఒప్పందం
ఫొటో క్యాప్షన్, భారత ప్రభుత్వం, ఎన్‌ఎస్‌సీఎన్ మధ్య జరిగిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం

స్వయం ప్రతిపత్తి, ఏకీకరణ డిమాండ్

మణిపుర్‌లో బుధవారం జరిగిన ర్యాలీల్లో "నాగాలకు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ఏకీకరణ అనేవి నాగా ప్రజల అమూల్యమైన హక్కులు", "ముసాయిదా ఒప్పందాన్ని అమలు చేయండి", "భారత ప్రభుత్వం విభజన రాజకీయాలను నిలిపివేయాలి" వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి.

నాగాలాండ్‌లో 1950ల నుంచి సాయుధ పోరాటం జరుగుతోంది.

నాగా ప్రజలకు స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం జరుగుతోంది.

నాగాలాండ్‌తో పాటు దాని పొరుగు రాష్ట్రాలైన అస్సాం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్‌, మియన్మార్‌లోని నాగా నివాస ప్రాంతాలన్నింటినీ కూడా ఇందులో చేర్చాలనేది వారి డిమాండ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)