మణిపుర్: ప్రతి 75 మంది పౌరులకు ఒక జవాన్.. అయినా హింస ఎందుకు ఆగట్లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడు నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్‌లో దాదాపు 40 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
భారత సైన్యంతో పాటు అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ సిబ్బంది వారిలో ఉన్నారు.
మణిపుర్ మొత్తం జనాభా సుమారు 30 లక్షలు. అంటే, సగటున ప్రతి 75 మందికి ఒకరు చొప్పున భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. అయినా అక్కడ హింస మాత్రం ఆగడం లేదు.
గత మూడు రోజుల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మరో ఆరుగురు చనిపోయారు.
శనివారం విష్ణుపూర్‌లోని క్వాటా ప్రాంతంలో మెయితీ తెగకు చెందిన ముగ్గురిని దారుణంగా చంపేశారు.
ఆందోళనకారులు తుపాకులు, మోర్టార్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆ ఆయుధాలను దోచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్‌పై ప్రపంచం దృష్టి
భద్రతా బలగాలను భారీగా మోహరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కుతగ్గడం లేదు. బఫర్ జోన్ దాటి వచ్చి మరీ లోయ, కొండ ప్రాంతాల్లోని ప్రజలపై దాడులు చేస్తున్నారు.
దేశం, ప్రపంచమంతా మణిపుర్ వైపే చూస్తోంది. మణిపుర్‌లో జరుగుతున్న జాతుల మధ్య హింస గురించి అంతర్జాతీయ మీడియా విస్తృతంగా రిపోర్ట్ చేస్తోంది.
ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగిస్తూ ఓ గుంపు లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇటు వైపు చూస్తోంది. ఈ వీడియో వ్యవహారం బయటికొచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపుర్ హింసపై తొలిసారి స్పందించారు.
''దేశాన్ని అవమానించారు. దోషులను వదిలిపెట్టేది లేదు'' అని మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హింస ఆగాలంటే ఏం చేయాలి?
మణిపుర్‌లో మే 3న మొదలైన హింస నేటికీ కొనసాగుతోంది. ఈ హింస కారణంగా ఇప్పటి వరకూ 160 మందికి పైగా చనిపోయారు. దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇప్పటికే పలుమార్లు రక్తపాతం జరిగినా ఈ హింస ఆగేలా కనిపించడం లేదు.
క్వాటాలో మెయితీ తెగకు చెందిన ముగ్గురి దారుణ హత్యతో సైన్యం, పారామిలటరీ బలగాలను భారీగా మోహరించినప్పటికీ హింసకు పాల్పడే వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వారిని మొదట కత్తులతో నరికి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలను మంటల్లో కాల్చేశారు.
మెయితీ, కుకీలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోకుండా ఉండేందుకు రెండు ప్రాంతాల మధ్య బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి.
''కుకీలు ఉంటున్న కొండ ప్రాంతాల్లో కాకుండా లోయప్రాంతాల్లో బఫర్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇక్కడ సమస్య ఏంటంటే, బఫర్ జోన్ పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా ఉంది. అందులో వరి సాగు చేస్తారు. సైన్యం, కుకీలు బఫర్‌జోన్‌ను ఆక్రమించుకోవడంతో మెయితీలు వ్యవసారం చేసుకోలేకపోతున్నారు'' అని మణిపుర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త కేకే ఓనీల్ అన్నారు.
30 లక్షల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 40 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినా హింస ఎందుకు ఆగడం లేదని మేము ఓనీల్‌ను అడిగాం.
అందుకు ఆయన స్పందిస్తూ- ''40 వేల మందిని కాదు. 50 వేల మంది, లేదంటే లక్ష మంది భద్రతా సిబ్బందిని పెట్టినా, రాజకీయంగా చొరవ తీసుకుని సంక్షోభాన్ని పరిష్కరించేంత వరకూ ఇక్కడ శాంతి సాధ్యం కాదు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ప్రభావం ఎందుకు కనిపించడం లేదు?
"రాష్ట్రంలో నాయకత్వ మార్పుకు అవకాశం లేదు. శాంతిభద్రతలు నెలకొల్పే విషయంలో ప్రస్తుత ప్రభుత్వానికి కచ్చితమైన కార్యక్రమం ఏమీ లేదు. ప్రభుత్వ చర్యలు చాలా పేలవంగా ఉన్నాయి. హింసను అదుపులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీల్లో అలాంటి వారే ఉన్నారు'' అని ఓనీల్ చెప్పారు.
ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తే శాంతి నెలకొంటుందా?
''రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. అంతకుమించి మరో గత్యంతరం లేదు. మెయ్‌తెయి, కుకీల మధ్య హింసను అడ్డుకోవడమే మొదటి ప్రాధాన్యం కావాలి.'' అని ఒనీల్ అన్నారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించినా మణిపుర్‌లో హింస ఎందుకు చెలరేగుతోందని అక్కడి నుంచి వార్తాకథనాలు అందిస్తున్న బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవను అడిగితే, ఆయన ఇలా చెప్పారు.
''మణిపుర్‌ను భౌగోళికంగా మరింత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొండలు, లోయలు, మైదాన ప్రాంతాలు పక్కపక్కనే ఉంటాయి. కుకీ ప్రజలు కొండ ప్రాంతాల్లో ఉండేవారు. మెయ్‌తెయిలు మైదాన ప్రాంతాల్లో ఉండేవారు. కానీ, ఇప్పుడు రెండు ప్రాంతాల్లోనూ రెండు తెగల వారూ ఉంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే ఉంది.
కేవలం ఒకటిన్నర కిలోమీటరు పరిధిలోనే భౌగోళిక పరిస్థితి మారుతుంది. మెయితీలు, కుకీలు ఉండే ప్రాంతాల మీదుగా వెళ్తుంటే అది మనకు కనిపిస్తుంది. రెండు ప్రాంతాలు సమీపంలోనే ఉంటాయి'' అని నితిన్ తెలిపారు.
''అల్లర్లకు పాల్పడుతున్న గుంపు తుపాకులు, మందుగుండు సామగ్రితో రావడం లేదు. కేవలం కర్రలు, ఇతర వస్తువులతో వస్తున్నారు. అలాంటి వారిపై కాల్పులు జరపాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అయితే, భద్రతా సిబ్బంది ఉన్నప్పుడు జరిగిన దాడుల్లో ప్రాణనష్టం పెద్దగా జరగలేదు. వస్తువులను దోచుకోవడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేశారు'' అని ఆయన వివరించారు.
మరి మణిపుర్ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులను ఎందుకు సరిదిద్దలేకపోతోంది?
''ఇక్కడ హింసను అరికట్టడంలో మణిపుర్ ప్రభుత్వ యంత్రాంగం పాత్ర చాలా తక్కువ. హింస చెలరేగిన వెంటనే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మెయితీలు, కుకీలు వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కేవలం మెయితీల ముస్లింలు, నాగాలు, కొందరు తమిళ ప్రజలు, కొద్ది మంది అధికారులు, ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దీంతో పాలనా యంత్రాంగం బలహీనపడింది'' అని నితిన్ తెలిపారు.
అధికార యంత్రాగం బలోపేతం అయ్యేంతవరకూ ఇక్కడ శాంతిని పునరుద్ధరించడం కష్టమేనని, స్థానిక యంత్రాంగం బలంగా ఉంటేనే సైన్యం కూడా ప్రభావవంతంగా పనిచేయగలదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హింస ఎలా మొదలైంది?
కొన్ని దశాబ్దాలుగా మెయితీ, కుకీ తెగల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొన్నేళ్లుగా ఒకరి భూములు మరొకరు ఆక్రమించుకోవడంతో టెన్షన్ పెరిగింది.
అలాగే, చురాచంద్‌పూర్, నోనె జిల్లాల్లోని కొండ ప్రాంతాలకు చెందిన 38 గ్రామాలను అనధికారికమైనవిగా పేర్కొంటూ పోయిన సంవత్సరం ఆగస్టులో బిరేన్ సింగ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ గ్రామాలు రక్షిత అటవీ ప్రాంతంలోకి వస్తాయిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కుకీలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
సరైన నోటిఫికేషన్ ఇవ్వకుండా తమ గ్రామాలను అనధికారిక గ్రామాలుగా ప్రకటించారని వారు చెబుతున్నారు. దానికి తోడు ఈ ఏడాది మార్చిలో ఆయా ప్రాంతాల్లో అపరాల సాగును ప్రభుత్వం నాశనం చేయించింది.
మెయితీ తెగకు గిరిజన హోదా కల్పించేందుకు సిఫార్సులు పంపించాలని ఈ ఏడాది ఏప్రిల్ 14న మణిపుర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
మెయితీ గిరిజన యూనియన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. మెయితీలను గిరిజనుల్లో చేర్చాలని కేంద్ర గిరిజన శాఖకు మణిపుర్ ప్రభుత్వం సిఫార్సులు పంపాలని హైకోర్టు ఆ ఆదేశాల్లో సూచించింది.
నాలుగు వారాల్లో కేంద్రానికి సిఫార్సులు పంపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితి ఎలా చేయి దాటిపోయింది?
మే 3న హింస చెలరేగక ముందు చురాచంద్‌పూర్‌లో ఒక గుంపు ఏప్రిల్ 27న ఒక జిమ్‌ను తగులబెట్టిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఒకరోజు తర్వాత ఆ జిమ్‌ను ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రారంభించాల్సి ఉంది.
ఆ మరుసటి రోజు ఏప్రిల్ 28న భూముల తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టిన కుకీల గుంపు అటవీ శాఖ కార్యాలయాన్ని తగులబెట్టింది.
ఆ తర్వాత, మెయితీ తెగకు గిరిజన హోదాను సిఫార్సు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొండ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
అయితే, ఆ నిరసనలకు వ్యతిరేకంగా రాడికల్ మెయితీలైన మెయితీ లిపున్ వర్గం మార్చ్ నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. తర్వాత అది రక్తపాతానికి దారితీసింది. పరిస్థితి చేయిదాటిపోయింది.
మే 3న మొదలైన ఈ హింస కారణంగా ఇప్పటి వరకూ 160 మందికి పైగా చనిపోయినా నేటికీ హింసాత్మక పరిస్థితులు అదుపులోకి రాలేదు.
మే 3న నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో టొర్బంగ్, కంగ్వాయ్ ప్రాంతాల్లో ఇరువర్గాలవారు ఇళ్లు తగులబెట్టుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.
మధ్యాహ్నానికి మెయితీలు ఎక్కువగా ఉండే విష్ణుపూర్‌లో చర్చి తగులబెడుతున్నారనే వార్త వచ్చింది.
సాయంత్రానికి విష్ణుపూర్, చురాచంద్‌పూర్‌లలో మెయితీలు, కుకీల మధ్య వీధుల్లో ఘర్షణలు మొదలయ్యాయి. ఆగ్రహానికి గురైన అల్లరి మూకల గుంపు చురాచంద్‌పూర్, పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను దోచుకోవడం ప్రారంభించింది.
రాత్రి అయ్యేసరికి ఇరు వర్గాలు ఇళ్లకు నిప్పు పెట్టడం మొదలైంది.
అదే సమయంలో, మెయితీ మహిళలపై కుకీలు లైంగిక దాడులకు పాల్పడ్డారనే, చంపేశారనే వదంతులు వ్యాపించాయి.
ఆ తర్వాత రక్తపాతం చోటుచేసుకుంది. పరిస్థితి పోలీసుల చేయిదాటిపోయింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: గణేశుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?
- ఆదిత్య L1: సూర్యుడి వైపు ఇస్రో చూపు, ఈ ప్రయోగం ఎలా జరుగుతుందంటే....
- ఓవర్సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
- హీట్‌వేవ్: వడగాల్పులతో రక్తం వేడెక్కి రక్తనాళాలు తెరుచుకుంటాయ్, చెమట పడుతుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే...
- మణిపుర్: కుకీ, మెయితీల మధ్య బలమైన విభజన రేఖ...అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














