రాహుల్ గాంధీకి జైలు శిక్షపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయొచ్చా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సుచిత్ర కె.మొహంతి, రాఘవేంద్రరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మోదీ ఇంటి పేరును ఉ్దదేశించి చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్నామని, అయితే వాదనలు కేసు మెరిట్స్‌లోకి వెళ్తున్నట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

దిగువ కోర్టు తీర్పుపై సంబంధిత కోర్టులో ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నందున మెరిట్స్‌పై వ్యాఖ్యానించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలా చేస్తే ప్రొసీడింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. స్టే విధించే విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.

''పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు అంత ఆమోదయోగ్యంగా లేవనడంలో ఎలాంటి సందేహమూ లేదు'' అని జస్టిస్ గవాయ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

రెండేళ్ల గరిష్ఠ శిక్ష విధిస్తూ దిగువ కోర్టు సహేతుక కారణాలు చెప్పలేదనే వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొంది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఆరోపణలు చేసేప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత రాహుల్ స్పందిస్తూ- ''ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి.. నిజం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఏదేమైనా నా దారి స్పష్టం. నేనేం చేయాలి, నా బాధ్యతలేంటనేది నాకు స్పష్టత ఉంది. మాకు సాయంగా నిలిచిన వారికి, ప్రజల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టులో రాహుల్ తరపు వాదనలు ఏమిటి?

పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్ వేసిన వ్యాజ్యంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

''మీ క్లయింట్‌కు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు'' అని బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ రాహుల్ తరపున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది.

గుజరాత్, బిహార్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రాహుల్‌పై కేసులు వేసిన ఫిర్యాదుదారులు బీజేపీ కార్యకర్తలేనని సింఘ్వీ చెప్పారు.

వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఒక వ్యక్తి నైతికత, మేధస్సును తక్కువ చేసేలా ఉంటేనే అది వర్తిస్తుందని సింఘ్వీ వాదించారు. ఫిర్యాదుదారు అయిన పూర్ణేశ్ మోదీ కూడా తన ఇంటి పేరు మోదీ కాదని స్వయంగా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

''ప్రజాస్వామ్యంలో అసమ్మతి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఏ ఒక్కరిని గానీ, ఏ సమూహాన్ని గానీ, ఏ విధంగానూ కించపరిచే ఉద్దేశం రాహుల్‌కు లేదు’’ అని సింఘ్వీ అన్నారు. అవి పక్షపాత వైఖరితో వేసిన కేసులని, ఆయనకు ఎలాంటి నేరపూరిత చరిత్ర కూడా లేదని చెప్పారు.

''రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలి'' అని సింఘ్వీ అన్నారు. ఈ కేసులో రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. ''దీన్ని అనుసరించి ఇలాంటివి మళ్లీ జరగొచ్చు. ఇప్పటికే జరిగి ఉండొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఇప్పటికే పార్లమెంటులో మేము 3 సెషన్స్ కోల్పోయాం. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చడమే ఫిర్యాదుదారు ఉద్దేశం’’ అని చెప్పారు.

‘‘ఈ కేసులో రాహుల్‌పై నేర నిర్ధరణ నిలబడేది కాదు. రాహుల్‌కు వ్యతిరేకంగా ఏ ఆధారమూ లేదు. ఆయన ప్రసంగం కూడా పరువు నష్టం కలిగించేలా లేదు'' అని సింఘ్వీ వాదించారు.

''ఫిర్యాదు చేసిన పూర్ణేశ్ మోదీ ఒక బీజేపీ కార్యకర్త. ఆయన ఇందులో భాగం కాలేరు. నా క్లయింట్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఎలాంటి ఇబ్బందీ లేదు'' అన్నారు.

పూర్ణేశ్ మోదీ

ఫొటో సోర్స్, FACEBOOK/PURNESHMODI

ఫొటో క్యాప్షన్, పూర్ణేశ్ మోదీ

పూర్ణేశ్ మోదీ తరపు వాదనలు ఏమిటి?

పూర్ణేశ్ మోదీ తరఫున సీనియర్ న్యాయవాది మహేజ్ జెఠ్మలాని వాదనలు వినిపించారు.

రాహుల్ ప్రసంగమే ఆధారమని, ఎలక్షన్ కమిషన్ రికార్డుల్లోనూ దానిని జత చేసినట్లు ఆయన చెప్పారు.

రాహుల్ మొత్తం 50 నిమిషాలు ప్రసంగించారని, ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాథమికంగా, పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

''మోదీ అని ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరి పరువు తీయడమే ఆయన వ్యాఖ్యల ఉద్దేశం'' అని జెఠ్మలానీ అన్నారు.

''రాహుల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయి'' అని జెఠ్మలానీ వాదించారు.

ఎలాంటి కారణం చూపకుండా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి రెండేళ్ల జైలు శిక్ష ఎలా విధించారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

జైలు శిక్ష నిర్ణయం కేవలం ఒక వ్యక్తి హక్కును ప్రభావితం చేయడం మాత్రమే కాదని, ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి హక్కును ప్రభావితం చేస్తున్నట్లుగా ఉందని గవాయ్ వ్యాఖ్యానించారు.

''ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రతిష్టకు భంగం కలుగుతుంది'' అని జెఠ్మలానీ అన్నారు. అందులోనూ ఆయన క్షమాపణ కూడా కోరలేదన్నారు.

''చౌకీదార్ ప్రధాన మంత్రి ఓ దొంగ'' అని బహిరంగ సభలో రాహుల్ అన్నారని జెఠ్మలానీ వాదించారు. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, దానిని సమర్థించుకునే ప్రయత్నం చేశారని తప్పుబట్టారు.

''సుప్రీంకోర్టు హెచ్చరించినప్పటికీ, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఆయన చేసిన తప్పు ఒప్పు అయిపోదు. అది నేరాన్ని అంగీకరించడమే అవుతుంది'' అని ఆయన చెప్పారు.

ఇరు వర్గాల సుదీర్ఘ వాదనల అనంతరం, ఈ కేసులో వాదనలు మెరిట్స్‌లోకి వెళ్తున్నట్టుగా ధర్మాసనం అభిప్రాయపడింది. మెరిట్స్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన బెంచ్, ట్రయల్ కోర్టు వేసిన జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వు ఇచ్చింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించినట్టేనా?

జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇస్తే రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు కూడా ఎత్తివేసినట్టేనని, సభ్యత్వం పునరుద్ధరించినట్టేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి బీబీసీతో చెప్పారు.

‘‘రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. దోషిగా నిర్ధరణ అయినప్పుడు ఎంత త్వరగా అనర్హత వేటు పడిందో, సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలోనూ అంతే వేగంగా స్పందించాల్సి ఉంటుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం నుంచి రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావొచ్చని ఆచారి చెప్పారు. కేసులో ఆయనపై నేర నిర్ధరణ వ్యవహారం తేలకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అర్హత ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: