‘కట్టెల కోసం చెట్టు దగ్గరికి వెళితే జవాన్లు వంతులవారీగా నాపై అత్యాచారం చేశారు... వారు క్రూరులు’ -సూడాన్ మహిళల భయానక కథలు

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ ఉస్మాన్
    • హోదా, బీబీసీ అరబిక్

కుల్సుమ్ అనే మహిళపై నలుగురు పారామిలిటరీ జవాన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సూడాన్‌లోని యుద్ధ ప్రభావిత దార్‌ఫుర్‌లో ఈ ఘటన జరిగింది. సామూహిక అత్యాచారంతో పాటు ఆమె జాతిదూషణకు కూడా గురయ్యారు.

హెచ్చరిక: ఈ కథనం కొంతమంది పాఠకులను కలచివేయవచ్చు.

"వాళ్ళు చాలా క్రూరులు. ఒక చెట్టు కింద నన్ను వంతులవారీగా అత్యాచారం చేశారు. కట్టెలు సేకరించడానికి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్లాను’’ అని వణుకుతున్న గొంతుతో ఆమె ఫోన్‌లో చెప్పారు.

ఈ కథనంలో అత్యాచార బాధితుల పేర్లను మార్చాం.

కుల్సుమ్ 40వ పడిలో ఉన్నారు. ఆమె పశ్చిమ దార్‌పుర్‌లోని బ్లాక్ ఆఫ్రికన్ మాసాలిట్ కమ్యూనిటీకి చెందినవారు. ఆమెను అత్యాచారం చేసిన వారు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్)కు చెందిన ఫైటర్లు.

ఈ పారామిలిటరీ బృందం దార్‌పుర్‌లో జరిగిన ఒక సంఘర్షణలో అనేక దురాగతాలకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘర్షణలే దార్‌పుర్‌లో వేగంగా జాతి సంఘర్షణలుగా రూపాంతరం చెందాయి.

దార్‌పుర్‌లో నల్లజాతి ఆఫ్రికన్ల శక్తికి చిహ్నంగా, మసాలిట్ రాజ్య సంప్రదాయిక రాజధానిగా పరిగణించే అల్ జెనినాలో కుల్సుమ్ నివసిస్తారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఉన్న భర్త, పిల్లలతో కలిసి పారిపోయారు.

ఈ నగరం ఇప్పుడు అరబ్బులకు చెందినదని, ఇక్కడి నుంచి పారిపోవాలని రేపిస్టులు తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఇది అక్కడి చాలామంది నల్లజాతి ఆఫ్రికన్లలో భయాన్ని పెంచింది. జంజావీద్‌తో కలిసి ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు ఆ ప్రాంతాన్ని అరబ్ పాలిత ప్రాంతంగా మార్చాలని అనుకుంటున్నారని నల్లజాతీయులు భయపడుతున్నారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్, పారామిలటరీ ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ దగాలో

సూడాన్‌లో ఈ పరిస్థితికి కారణం ఏంటి?

ఏప్రిల్ నుంచి సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. దాని అత్యంత శక్తిమంతమైన ఇద్దరు జనరల్స్ అంటే ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్, ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఆధిపత్య పోరాటం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

వీరిద్దరి పోరాటం దార్‌ఫుర్‌లో సంఘర్షణలకు ఆజ్యం పోసింది. 2003లో ఇక్కడ చెలరేగిన ఘర్షణల్లో 3 లక్షల మంది మరణించారని అంచనా.

తాజా సంఘర్షణ 1,60,000 మందికి పైగా ప్రజలు పొరుగునే ఉన్న చాద్ దేశానికి పారిపోయేలా చేసింది. వీరిలో ఎక్కువ మంది మసాలిట్ వర్గానికి చెందిన వారు.

అల్ జనీనాలో కనీసం 5,000 మంది మరణించారని అంచనా వేశారు. అయితే, ఈ ప్రాంతంలో మరణాలపై స్పష్టత లేదు.

సూడాన్‌లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం, రాజధాని అయిన ఖార్టూమ్‌లో కూడా ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలోని చాలా భాగం పారామిలటరీ బలగాల నియంత్రణలో ఉంటుంది. వారిని వెనక్కి నెట్టడంలో సైన్యం విఫలమైంది. ఈ రెండు మిలటరీల మధ్య పోరాటాల కారణంగా ఏప్రిల్ నుంచి సుమారు 20 లక్షల మంది సూడాన్ నుంచి పారిపోయారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

కారులో తీసుకెళ్లి అత్యాచారం

ఖార్టూమ్‌లోని హింస జాతి రంగును పులుముకోలేదు. ఇక్కడ జరుగుతున్న యుద్ధాలకు అరబ్బులు, ఇతర కులాల వారు బాధితులు.

తన అత్తను కలిసేందుకు వెళ్తుండగా దారిలో ముగ్గురు ఆర్‌ఎస్ఎఫ్ జవాన్లు తనను అడ్డుకున్నారని బీబీసీతో 24 ఏళ్ల ఇబ్తిసామ్ చెప్పారు.

"వారు నా వైపు తుపాకీలను గురిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడిగారు. మా అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పాను. కానీ, వారు నన్ను ఆర్మీ గూఢచారి అని భావించారు. తర్వాత తమతో పాటు కారులో రావాల్సిందిగా బలవంతం చేశారు. కారులో సమీపంలోకి ఒక ఇంటికి తీసుకెళ్లారు’’ అని ఫోన్‌లో మాట్లాడుతూ ఏడుస్తూ ఇబ్తిసామ్ తెలిపారు.

‘‘నేను ఆ ఇంట్లో మరో వ్యక్తిని చూశాను. అతను అండర్‌వేర్ మాత్రమే వేసుకుని కనిపించారు. నేను పారిపోయేందుకు ప్రయత్నించా. కానీ, ఆ సైనికులలో ఒకరు నన్ను గట్టిగా కొట్టడంతో నేలపై పడిపోయాను. నేను కదిలినా లేదా కేకలు వేసినా చంపేస్తానని బెదిరించాడు.

వాళ్ళు ముగ్గురు వంతులవారీగా నాపై అత్యాచారం చేశారు. తర్వాత వారి కారులోకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.

నాకు చాలా అసహ్యంగా అనిపించింది. కోపం వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, నేను ఇంటికి తిరిగి వెళ్లాను. జరిగింది ఎవరికీ చెప్పలేదు" అని ఆమె తెలిపారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

57 మంది మహిళలు, బాలికలపై లైంగిక హింసకు సంబంధించిన 21 ఘటనలు తమ దృష్టికి వచ్చాయని జులై నెల మొదట్లో సూడాన్‌లోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం చెప్పింది.

తమ కార్యాలయానికి అందిన దాదాపు అన్ని కేసుల్లో ఆర్ఓఎస్‌ఎఫ్‌కు చెందినవారే నేరస్థులుగా ఉన్నట్లు గుర్తించినట్లు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ చెప్పారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న నేరాల పరంగా చూస్తే తమ వరకు వచ్చిన కేసుల సంఖ్య అతి స్పల్ప స్థాయిలోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి, స్థానిక హక్కుల సంఘాలు నమ్ముతున్నాయి.

ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి అత్యాచారాన్ని ఒక యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని సూడాన్ మానవ హక్కుల కార్యకర్త అహ్లమ్ నాసర్ అన్నారు.

ఖార్టూమ్‌లోని కొంతమంది మహిళల నుంచి తాను కూడా ఇలాంటి భయానక కథలను విన్నానని నసీర్ చెప్పారు.

"కొన్ని చోట్ల అయితే పిల్లల కళ్లెదుటే తల్లులు అత్యాచారానికి గురయ్యారు" అని ఆయన వెల్లడించారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఆరోపణలను ఖండించిన ఆర్‌ఎస్‌ఎఫ్

ఈ దాడుల వెనుక తమ ఫైటర్లు ఉన్నారనే ఆరోపణలను ఆర్‌ఎస్‌ఎఫ్ కొట్టిపారేసింది.

యుద్ధంలోని అత్యున్నత నైతిక ప్రమాణాలకు తమ యోధులు కట్టుబడి ఉన్నారని బీబీసీకి పంపిన వాయిస్ రికార్డింగ్‌లో ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రతినిధి మొహమ్మద్ అల్ ముఖ్తార్ అన్నారు.

"మేం సైనిక విజయం సాధించడంతో, మా యోధుల ప్రతిష్టను దిగజార్చడానికి కావాలనే ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

ఆర్‌ఎస్‌ఎఫ్ యోధులే తనపై దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన ఒక మహిళతో బీబీసీ మాట్లాడిందని ముఖ్తార్‌కు చెప్పడంతో ఆయన ఇలా బదులిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎఫ్ సభ్యుల వేషధారణలో ఉన్న వ్యక్తులు ఈ దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.

ఈ మిలిటరీ సంఘర్షణ వల్ల అక్కడ లైంగిక హింస బాధితులు అవసరమైన సహాయాన్ని కూడా పొందలేకపోతున్నారు. అక్కడి చాలా ఆసుపత్రులు ఇప్పుడు పని చేయడం లేదు. కొన్నింటికి చేరుకోవడమే కష్టం.

ఈ బాధ తమను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని కుల్సుమ్, ఇబ్తిసామ్ చెప్పారు.

‘‘నాకు జరిగినదేదీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవమానపు నీడ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది’’ అని కుల్సుమ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)