వెయిట్‌ లాస్: ఈ 7 టిప్స్ పాటిస్తే బరువు తగ్గాక మళ్లీ పెరగరు

బరువు తగ్గడం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హెన్రిటా గ్రాహం, క్లెయిర్ మాడిగాన్
    • హోదా, ది కన్వర్జేషన్

బరువు తగ్గడమన్నది సవాలుతో కూడుకున్నది.

బరువు తగ్గగలిగిన వారు మళ్లీ పెరగకుండా దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం అంతకన్నా పెద్ద సవాలు.

బరువు తగ్గేందుకు మీరు ఏ విధానం అనుసరించినా ఇదైతే నిజం.

ఉదాహరణకు, రోజుకు 800 నుంచి 1,200 కేలరీల మధ్యలో తక్కువ కేలరీల ఆహారం తీసుకునే వారు కూడా బరువు తగ్గిన ఐదేళ్లకు మళ్లీ 26 శాతం నుంచి 121 శాతం బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బిహేవియరల్ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ అనుసరించే వారు బరువు తగ్గిన ఏడాదికి మళ్లీ 30 శాతం నుంచి 35 శాతం పెరుగుతున్నారు.

వెగోవి వంటి బరువు తగ్గే మందులను తీసుకున్న వారు, ఈ డ్రగ్ తీసుకోవడం ఆపేసిన ఏడాదికి మళ్లీ మూడింట రెండింతలు బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు చెప్పాయి.

బరువు మళ్లీ పెరగడానికి కారణాలు?

బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగేందుకు చాలా కారణాలున్నాయి.

మొట్టమొదటిది మీరు బరువు తగ్గేటప్పుడు, స్కేల్ మీద నెంబర్లు తగ్గుతుంటే చూసినప్పుడు ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆ బరువు తగ్గడాన్ని అలానే కొనసాగించడం కొంచెం కష్టమే.

ఇక రెండోది, బరువు తగ్గేందుకు పాటించిన జీవన విధానాల మార్పులను అలానే కొనసాగించడం కూడా కాస్త కష్టంతో కూడుకున్నదే.

ఒకవేళ ఈ జీవన విధానాల మార్పులు అవాస్తవికంగా ఉంటే, వాటిని దీర్ఘకాలం కొనసాగించడం కష్టం. అంటే తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం లేదా చాలా వరకు ఆహార పదార్థాలను తినకుండా ఆపివేయడం వంటివన్నమాట.

ఇక మూడోది, బరువు తగ్గిన తర్వాత ఆకలిని కలిగింగే హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మీ జీవక్రియను నెమ్మదించేలా చేస్తాయి.

ఈ మార్పుల వల్ల ఎక్కువ తినకుండా ఆపడం కూడా కష్టమే. దీని వల్ల మీరు ఎంతో కాలం శ్రమించి కోల్పోయిన బరువు, మళ్లీ పెరుగుతుంది.

తగ్గిన తర్వాత మళ్లీ బరువు పెరగడమన్నది చాలా వరకు సాధారణంగా మారిపోతుంది.

అయితే, కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా కూడా ఇలా బరువు పెరగకుండా ఆపవచ్చు.

బరువు మళ్లీ పెరగకుండా ఉండేందుకు పాటించాల్సిన ఏడు టిప్స్ ఇక్కడ చూద్దాం.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

1. గిల్టీగా భావించవద్దు

ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడం జీవిత కాల ప్రక్రియ అన్నది అర్థం చేసుకోవడం ముఖ్యం.

బరువు తగ్గేందుకు మీరు ఫాలో అయిన జీవన శైలిని క్రమం తప్పకుండా పాటించాలన్నది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు.

అలాగే, అతిగా అంచనాలను పెట్టుకోవడం కూడా సాధ్య కాదు.

కొన్ని సార్లు సాధ్యం కానప్పుడు, గిల్టీగా భావించవద్దు. ఎంత వీలైత అంత త్వరగా మీ ప్రణాళికలను మళ్లీ అనుసరించేలా చూసుకోండి.

ఉదాహరణకు, ఒకవేళ మీరు వీకెండ్‌లో బాగా తిన్నట్లు మీకనిపిస్తే, వచ్చే వారం మీ దినచర్యలో నడవడాన్ని కాస్త పెంచండి.

మీ లక్ష్యాలను చేరుకోలేనప్పుడు, మీరు ఏదో తప్పు చేశామనే భావనలో ఉంటారు. బరువు నియంత్రణ విధానాన్ని కూడా మీరు వదిలిపెట్టవచ్చు.

2. పార్టీలకు ప్లాన్ చేసుకోండి

సెలవుల్లో, పెళ్లి వేడుకల్లో, పుట్టిన రోజు పార్టీల్లో మీ వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇలా ఆటంకాలు ఎదురయ్యేటప్పుడు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి.

ఉదాహరణకు, మీరు ఒకవేళ బార్బేక్యూకు వెళ్తే, వెజిటబుల్ స్కేవర్స్ లాంటి ఆరోగ్యకరమైన వాటిని ఎంపిక చేసుకోండి.

ఇలా చేయడం ద్వారా మీరు తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్నట్లు అవుతుంది.

ఇలా బరువు నియంత్రణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సందర్భాలను మీరు ఆస్వాదించవచ్చు.

మీల్ ప్లాన్

ఫొటో సోర్స్, Getty Images

3. మీ విజయాలకు గర్వించండి

కొన్నిసార్లు సహజంగానే మన బరువులో హెచ్చుతగ్గులుంటాయి. మీ లక్ష్యాలను చేరుకున్నప్పుడు గర్వంగా భావించడం చాలా ముఖ్యం.

బరువు ఎంత తగ్గారని కాకుండా ఎలా తగ్గగలిగారన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టే వ్యక్తులు, తగ్గిన బరువును కొనసాగించే అవకాశముంటుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల వారు మళ్లీ బరువు పెరగడం వంటి ప్రభావానికి తక్కువగా గురవుతారు.

4. అలవాటు చేసుకోండి

అలవాట్లను క్రియేట్ చేసుకోవడం కూడా బరువు తగ్గేందుకు సాయం చేయొచ్చు.

ఈ అలవాట్లు బరువు విషయంలో మీకున్న మోటివేషన్‌లో పెద్దగా మార్పులు రాకుండా చూసుకుంటాయి.

అంటే, మనం ప్రయత్నం చేయకూడదనుకున్నప్పుడు కూడా, బరువు తగ్గడానికి మనం అనుసరించిన అలవాట్లే, ఆ తర్వాత కూడా మనం వాటిని అనుసరించేలా సహకరిస్తాయి.

బరువు తగ్గిన తర్వాత కూడా మీరు మరికొన్ని సరికొత్త అలవాట్లను క్రియేట్ చేసుకోవచ్చు.

అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్‌‌కు వెళ్లడం లేదా వీలైతే మెట్లు ఎక్కడం వంటివి చేయాలి.

5. చురుకుగా ఉండండి

తగ్గిన బరువును అలానే కొనసాగించేందుకు శారీరక శ్రమ చాలా ముఖ్యమైన అంశమని విజయవంతంగా బరువు నియంత్రణను కొనసాగిస్తున్న వారిపై చేపట్టిన అధ్యయనం గుర్తించింది.

శారీరక శ్రమ మనం తిన్న కొన్ని కేలరీలను కరిగిస్తుంది.

తగ్గిన బరువును అలానే కొనసాగించేందుకు ప్రతి వారం కనీసం 250 నిమిషాల ఎక్సర్‌సైజును మీరు ప్రయత్నించాల్సి ఉంటుందని ఒక పరిశోధన సూచిస్తోంది.

శారీరక శ్రమ

ఫొటో సోర్స్, Getty Images

6. నిత్యం బరువు చూసుకోండి

వారంలో బరువులో ఒక కేజీ, రెండు కేజీల వరకు హెచ్చుతగ్గులుంటాయి.

నిత్యం మీరు బరువు కొలుచుకోవడం ద్వారా, సగటున మీరెంత ఎక్కువగా, తక్కువగా ఉంటున్నారో తెలుసుకోవచ్చు.

ఇది మీ బరువును ట్రాక్ చేసుకునేందుకు సాయపడుతుంది.

ఒకవేళ మీ డైట్‌లో ఏదైనా మార్పులు చేసుకోవాలో కూడా మీ బరువును ట్రాక్ చేసుకోవడం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు.

తగ్గిన మీ బరువును కొనసాగించేందుకు ఎక్సర్‌సైజులను అలవాటుగా మార్చుకోవాలి.

నిత్యం బరువు కొలుచుకుంటూ, దానికి తగ్గట్టు మార్పులు చేసుకొనేవారు మళ్లీ బరువు పెరగడాన్ని తప్పించుకోవచ్చని ఒక పరిశోధన చెబుతోంది.

7. బ్రేక్‌ఫాస్ట్ తినండి

బరువు నియంత్రణలో బ్రేక్‌ఫాస్ట్ ప్రాధాన్యంపై మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక అధ్యయనంలో, రోజూ బ్రేక్ ఫాస్ట్ తినడం ద్వారా తమ బరువును నియంత్రించుకోగలిగామని 97 శాతం మంది చెప్పారు.

మరో అధ్యయనంలో కూరగాయలను, అత్యధిక ఫైబర్ ఆహారాన్ని అంటే బ్రౌన్ రైసు, హోల్‌ గ్రెయిన్ బ్రెడ్స్, ఓట్‌మీల్ వాటిని రోజూ తీసుకోవడం ద్వారా కూడా మళ్లీ బరువు పెరగడాన్ని తప్పించుకున్నట్లు తేలింది.

ఈ రకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.

తగ్గిన బరువును మళ్లీ పెరగకుండా నియంత్రించుకోవడం చాలా కష్టమే. కానీ, అసాధ్యమేం కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)