పార్కిన్సన్స్ వ్యాధి: లక్షణాలు కనిపించడానికి ఏడేళ్ల ముందే స్మార్ట్ వాచ్‌లు చెప్పేస్తాయా?

స్మార్ట్ వాచ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అన్నాబెల్ రకహామ్
    • హోదా, బీబీసీ న్యూస్

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు బయటపడడానికి కనీసం ఏడేళ్ల ముందే గుర్తించడంలో స్మార్ట్ వాచ్‌లు సహాయపడతాయని తాజా అధ్యయనం ఒకటి సూచించింది.

బ్రిటన్‌లో కార్డిఫ్ యూనివర్సిటీలోని ‘ది యూకే డిమెన్షియా రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్’కు చెందిన పరిశోధకుల బృందం స్మార్ట్ వాచ్‌లు ధరించే 1,03,712 మంది నుంచి డేటా సేకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషించింది.

2013, 2016 మధ్య ఒక వారం రోజుల పాటు వారి చలన వేగాన్ని ట్రాక్ చేయడం ద్వారా వారు పార్కిన్సన్స్ డెవలప్ కావడానికి కారణం కాగల అంశాలను అంచనా వేశారు.

పార్కిన్సన్ విషయంలో ఇది స్క్రీనింగ్ సాధనంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

‘నేచర్ మెడిసన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో... మరిన్ని అధ్యయనాలు జరగాలని, ప్రపంచవ్యాప్తంగా దీనిపై జరిగే ఇతర అధ్యయనాల ఫలితాలలో దీన్ని పోల్చి చూడాలని, ఇది ఎంత కచ్చితమైనదన్నది చెక్ చేయాలని పరిశోధకులు సూచించారు.

పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నవారి మెదడు కొన్నాళ్లకు దెబ్బతింటుంది.

మెదడు

ఫొటో సోర్స్, Getty Images

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలలో కొన్ని:

  • అసంకల్పితంగా వణకడం
  • కదలికలు నెమ్మదించడం
  • కండరాలు బిగుసుకోవడం

సాధారణంగా పార్కిన్సన్స్ కేసులలో ఇలాంటి లక్షణాలు బయటపడి రోగనిర్ధరణ చేసే సమయానికే మెదడు కణాలు దెబ్బతిని కోలుకోలేని నష్టం జరుగుతుంది.

బ్రిటన్ జనాభాలో సుమారు 30 శాతం మంది స్మార్ట్‌వాచ్‌లను ధరిస్తున్నారు కాబట్టి వారందరికీ చౌకైన, నమ్మదగిన మార్గంలో పార్కిన్సన్స్ వ్యాధిని ముందే గుర్తించే అవకాశం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ సింథియా సాండర్ చెప్పారు.

‘‘కేవలం ఒక వారంలో తీసుకున్న డేటా సహాయంతో భవిష్యత్తులో ఏడేళ్ల కాలానికి అంచనా వేయగలమని మేం చూపించాం’’ అన్నారామె.

ఈ అధ్యయన ఫలితాలతో పార్కిన్సన్స్‌ వ్యాధిని ముందే గుర్తించగలిగే స్క్రీనింగ్ టూల్‌ను అభివృద్ధి చేయొచ్చని సింథియా చెప్పారు.

యూకే బయోబ్యాంక్ నుంచి ఈ అధ్యయనానికి డేటాను ఉపయోగించుకున్నారు. 5 లక్షల మందికిపైగా ప్రజల ఆరోగ్య డేటా ఈ బయోబ్యాంక్ వద్ద ఉంది.

పార్కిన్సన్స్ బాధితుడి మెదడు ఎంఆర్ఐ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్కిన్సన్స్ బాధితుడి తల ఎంఆర్ఐ స్కాన్

ఈ అధ్యయనంలో భాగమైన డాక్టర్ కేథరీన్ పీల్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇది కచ్చితమైనదిగా కనిపించింది. వృద్ధాప్యం, బలహీనత వల్ల కలిగే కదలికల సమస్యల నుంచి పార్కిన్సన్స్ సమస్యను వేరు చేసి చేసిన అధ్యయనం ఇది’’ అన్నారు.

‘‘మేం మా ఈ మోడల్‌ను ఇతర న్యూరో డీజనరేటివ్ డిజార్డర్‌లు, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు, కదలికలకు సంబంధించిన సమస్యలకు కారణమయ్యే ఇతర డిజార్డర్లతో పోల్చి చూశాం. యూకే బయోబ్యాంక్ డేటాతో అధ్యయనం చేయడం వల్ల కలిగిన ప్రయోజనం ఇది’’ అన్నారు కేథరిన్ పీల్.

‘‘పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న వ్యక్తుల నుంచి గుర్తించిన ఫలితాలు విభిన్నంగా ఉన్నాయి. అయితే, లక్షణాలు కనిపించడానికి ఏళ్లు ముందుగానే వారికి పార్కిన్సన్స్ ఉన్నట్లు చెప్పాలా అనేది వైద్యుల ఇష్టం’’ అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)