వర్షాకాలంలో జ్వరాలు ఎందుకొస్తాయి, రాకుండా ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
వర్షాలు కొన్ని రోజులుగా ఆగకుండా కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఇళ్ల చుట్టూ మురుగునీరు చేరి, వణికిస్తున్న చలితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు కొత్తకొత్త అనారోగ్య సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాల వల్ల పరిసరాల్లోని దోమల సంఖ్య బాగా పెరుగుతుంది. వీటి వల్ల డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దోమల నివారణ కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి.
- ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కూలర్లలో, చుట్టూ ఏవైనా కొబ్బరి చిప్పలు, కుండీలు, నీటి నిలువలు లాంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి.
- నీటి గుంటలు, మురుగు నీరు ఉంటే, వాటి మీద ఒక చుక్క కిరోసిన్ లేదా నూనె వేయాలి. అది దోమల వ్యాప్తిని అరికడుతుంది.
- దోమ కాటు నివారించడానికి బట్టలు నిండుగా వేసుకోవాలి. ఇంటి తలుపులు సాయంత్రం మూసి ఉంచాలి. దోమ తెరలు వాడాలి. దోమలు రాకుండా ఆపే రిపెల్లెంట్స్ కూడా వాడొచ్చు.
- ప్రభుత్వ అధికారుల సాయంతో దోమలను నివారించడానికి డీడీటీ లాంటివి పిచకారి చేయించాలి.

ఫొటో సోర్స్, Getty Images
డెంగీ రాకుండా ఉండాలంటే..
వర్షా కాలంలో విష జ్వరాలు భయపెడుతుంటాయి. వీటిలో డెంగీ మరింత భయపెడుతుంది.
డెంగీ జ్వరం ఏడెస్ దోమ కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు ఎక్కువగా నిలువ ఉండే మంచి నీటిలో పెరుగుతాయి. వర్షం నీటి గుంటలు, కూలర్‌లో మిగిలిపోయిన నీరు, పాత టైర్లు, కుండీలు లాంటి వాటిలో ఈ దోమలు నివాసం ఉంటాయి. పగటి పూట ఎక్కువగా ఇవి కుడతాయి.
తీవ్రమైన జ్వరం, తల నొప్పి(ముఖ్యంగా తల ముందు భాగంలో), ఒళ్ళు నొప్పులు, వాంతులు లాంటివి డెంగీ ప్రధాన లక్షణాలు. చర్మం అంతా ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంది.
ఈ జ్వరం రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోతే, చర్మం పైన ఎర్రగా చుక్కలు (petechiae) ఏర్పడడం కనిపిస్తుంది. ఒక్కోసారి చిగుర్లు, కడుపు, లేక ఇంకా ఎక్కడి నుంచైనా రక్తస్రావం జరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్లేట్లెట్లు తగ్గిపోతే...
సాధారణంగా లక్షన్నర ఉండాల్సిన ప్లేట్లెట్ల సంఖ్య కనీసం యాభై వేలకు తక్కువ అయితే తప్ప కంగారు అవసరం లేదు. ఆ తర్వాత కూడా ప్లేట్లెట్లను గమనిస్తూ ఉండాలి. వాటి సంఖ్య పది వేలకు తగ్గితే, లేదా ఎక్కడి నుండి అయినా రక్తస్రావం జరిగితే.. ప్లేట్లెట్లు ఎక్కించే అవసరం ఉంటుంది.
ప్లేట్లెట్ సంఖ్య కన్నా, హెమటోక్రిట్ (పీసీవీ /హెచ్‌సీటీ) అనే పరీక్ష ఎక్కువ ముఖ్యం. అది శరీరంలో నీరు తగ్గిపోయి, బీపీ పడి పోయే ప్రాణాపాయ పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. రక్తపరీక్షలో ఐజీఎం లేక ఎన్ఎస్1 అనేవి పాజిటివ్ ఉంటేనే డెంగీ ఉన్నట్టు. ఐజీజీ పాజిటివ్ ఉంటే కంగారు పడే అవసరం లేదు.
డేంగీ జ్వరం వచ్చిన వారు, లక్షణాలను బట్టి మందులు వాడాలి. అధికంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కొందరిలో జ్వరం తగ్గిన తరవాత కూడా పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది.
అందుకే జ్వరం వచ్చిన ఐదవ రోజు నుంచి రెండు మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
కడుపులో నొప్పి, ఎక్కడి నుంచైనా రక్తస్రావం, అధికంగా నీరసం, బీపీ తగ్గిపోవడం, అదుపు కాని వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ఫెక్షన్లు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ సమయంలో నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్‌లు కావచ్చు. ఫలితంగా వాంతులు విరేచనాలు అవ్వొచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- ఏమైనా తినడానికి ముందు, మల మూత్ర విసర్జన తరవాత తప్పకుండా చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
- వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి. శుభ్రమైన ఫిల్టర్ నీటిని కూడా తాగొచ్చు.
- వీలైనంత వరకూ ఆహారం వండిన తరవాత వేడిగా తినాలి.
- చల్లారిన ఆహారాన్ని వేడి చేయకూడదు. దానితో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
శ్వాస కోశ వ్యాధుల ముప్పు కూడా...
శ్వాస కోశ వ్యాధులు కూడా ఈ సమయంలో అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అవి సాధారణ జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, నుంచి ఆయాసం వరకు ఏ రకంగా అయినా ఉండవచ్చు. వీటి నివారణకు, వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- చలిలో ఎక్కువ సేపు ఉండకూడదు. తప్పని పరిస్థితిలో వెచ్చటి దుస్తులు ధరించాలి. ముఖ్యంగా పిల్లలకు చెవులను కప్పెలా దుస్తులు వేయాలి. చెవుల్లో దూది పెట్టుకుంటే మంచిది.
- చల్లటి నీరు, లేదా ఇతర చల్లటి పానీయాలు, ఐస్‌క్రీం వంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు.
- జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్న వారు తప్పకుండా మాస్క్ ధరించాలి. ఇతరులకు అది వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి. పదే పదే చేతులు సబ్బుతో కడగడం, లేదా శానిటైజర్ వాడడం మంచిది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా ఆయాసం ఉంటే ఇన్‌హేలర్ వాడాలి. వీలు అయినంత త్వరగా వైద్యులను కలవాలి.
ఏదైనా జ్వరం వచ్చినట్లు అనిపిస్తే..
జ్వరం లేక వాంతులు, విరేచనాలు మొదలయితే వెంటనే పారాసిటమాల్ వేసుకోవాలి.
ఓఆర్‌ఎస్‌ను తరచూ తాగడం చాలా ముఖ్యం. ఓఆర్‌ఎస్ అందుబాటులో లేకపోతే, దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం వేడి చేసి చల్లార్చిన నీటిని శుభ్రమైన గుడ్డతో వడకట్టుకోవాలి. ఒక లీటర్ నీటిలో రెండు చెంచాల చెక్కర, ఒక చిటికెడు ఉప్పు కలుపుకొని ఓఆర్‌ఎస్ తయారు చేసుకోవచ్చు.
మంచి ఆహారం, పరిశుభ్రంగా ఉండటంతోనే ఆరోగ్యంగా జీవించడం సాధ్యపడుతుంది. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రయత్నం అన్నిటి కంటే ముఖ్యం, ఉత్తమం.
ఏదైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా, వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
(నోట్: రచయిత వైద్యురాలు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)
ఇవి కూడా చదవండి:
- కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
- పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















