మద్యం - గంజాయి: అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతారా?

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

పట్నాకు చెందిన సంజన(పేరు మార్చాం) వయసు 22 సంవత్సరాలే. వృత్తిపరంగా ఆమె ఇంజినీర్.

‘‘చదువుకునే రోజుల్లో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అతనితో విడిపోయిన తర్వాత, చిన్న విషయాలకు కూడా ఏడ్చేదాన్ని. బాగా కోపం వచ్చేది. చదవాలనిపించేది కాదు’’ అని సంజన తెలిపారు.

‘‘ప్రతిదానిలో నాకు సందేహాలు ఉండేవి. నా జీవితంలో అవే చాలా దారుణమైన క్షణాలు. అప్పుడే స్నేహితులతో కలిసి గంజాయిని, ఆల్కాహాల్‌ను తీసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడు, ఎలా దీనికి బానిసయ్యానో నాకు తెలియదు’’ అని ఆమె చెప్పారు.

‘‘అంతకుముందు నేనెప్పుడూ మందు తాగలేదు. గంజాయి కూడా తీసుకోలేదు. కానీ, ప్రతీది చాలా త్వరగా మారిపోయింది. ఎప్పుడైనా టెన్షన్‌గా అనిపిస్తే, నేను గంజాయి లేదా ఆల్కాహాల్ తీసుకుంటూ ఉండేదాన్ని’’ అని సంజన చెప్పారు.

ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు కనిపించకుండా తిరిగొచ్చి నిద్రపోయేదాన్ని అని ఆమె తెలిపారు.

సిగరెట్ తాగడం

ఫొటో సోర్స్, Getty Images

‘‘స్నేహితుల ద్వారా అమ్మానాన్న ఈ విషయం తెలుసుకున్నాక, నన్ను అర్థం చేసుకునేందుకు వారు ప్రయత్నించారు’’ అని సంజన తెలిపారు.

‘‘వారు నాకు చికిత్స ఇప్పించారు. కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకున్నాను. నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత, ఈ అలవాట్ల నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు ఉద్యోగం కోసం నేను పుణె వెళ్తున్నాను. ఇది నా జీవితంలో సరికొత్త ఆరంభం’’ అని సంజన చెప్పారు.

సంజన ఒక్కరే కాదు. ఆమె లాంటి అమ్మాయిలు వందల మంది ఉన్నారు. కొందరు భావోద్వేగాలతో, కొందరు స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్ తీసుకోవడం లేదా మందు తాగడం మొదలుపెట్టారు.

డాక్టర్ ప్రతిభ

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ప్రతిభ

ఈ వ్యసనాలకు ఎలా బానిసలవుతున్నారు?

చాలా కేసుల్లో ఈ వ్యసనం తెలియకుండానే అలవాటు అవుతుందని పట్నాలో ప్రముఖ యాంటీ-అడిక్షన్ సెంటర్‌‌కు చెందిన డాక్టర్ ప్రతిభ చెప్పారు.

మీరు వ్యసనానికి బానిసవుతున్నారన్న విషయాన్ని కనీసం మీరు గుర్తించలేరని చెప్పారు.

‘‘చాలా సార్లు ప్రజలు ప్రతీది వారి నియంత్రణలో ఉందని భావిస్తారు. వారు వ్యసనానికి బానిస అవ్వరని అనుకుంటారు. కానీ, చాలా త్వరగా ఈ ఉచ్చులో పడిపోతారు. ఒక్కసారి మందు తాగి లేదా గంజాయి తీసుకుని, దాని రుచి చూసి తర్వాత వదిలిపెడతా అనుకుంటారు. ’’

‘‘కానీ, వారికి పదే పదే మందు తాగాలని లేదా గంజాయి తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాటికి బానిస అయిపోతారు. కానీ, దీని నుంచి బయటకు రావడం అంత తేలికైన విషయం కాదు.

కుటుంబ మద్దతుతో, కొన్ని నెలల పాటు కౌన్సిలింగ్, చికిత్స తీసుకున్న తర్వాత ఈ వ్యసనాల నుంచి బయటికి రావొచ్చు’’ అని డాక్టర్ ప్రతిభ బీబీసీకి చెప్పారు.

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువగా వ్యసనాలకు బానిసవుతున్నారని కింగ్స్ కాలేజీ లండన్‌లోని ప్రొఫెసర్ షెల్లీ మార్లో తెలిపారు.

25 ఏళ్ల వయసులో తాను కూడా బానిస అయ్యానని, ఆ తర్వాత చికిత్స తీసుకున్నట్లు చెప్పారు.

గ్యాంబ్లింగ్, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన బాధిత మహిళలకు షెల్లీ మార్లో సాయపడుతున్నారు.

‘‘మహిళలు దేనికి బానిసలైనా, వారికి ఎలాంటి మద్దతు లభించదు. ఈ నిందను వారు మాత్రమే భరించాల్సి ఉంటుంది’’ అని వివరించారు.

18 నుంచి 75 ఏళ్ల లోపున్న వారు 15 కోట్ల మందికి పైగా ఆల్కాహాల్‌‌కు బానిసయ్యారని కేంద్ర సమాచార ప్రసార శాఖ 2018లో తెలిపింది.

ఇది మాత్రమే కాక, చాలా ఇతర వ్యసనాలకు ప్రజలు బానిసలవుతున్నారు.

దీనిలో ఎంత మంది మహిళలున్నారన్న విషయం తెలియనప్పటికీ, ప్రభుత్వ ఈ గణాంకాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి.

వ్యసనాలకు బానిసలైన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను నడుపుతోంది.

సిగరెట్ తాగుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిగరెట్ తాగుతున్న మహిళ(ప్రతీకాత్మక చిత్రం)

మితి మీరిన పరిశుభ్రత కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది

నేటికి కూడా మహిళలలో వ్యసనాలకు సంబంధించి సరైన అవగాహన లేదని పట్నాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ బిందా సింగ్ తెలిపారు.

మొహమాటాలు పోలేదు. కేవలం మందు, సిగరెట్ లేదా గంజాయికి మాత్రమే కాదు, సోషల్ మీడియాకు కూడా బానిసవ్వడం పెరిగింది.

మితి మీరిన పరిశుభ్రతకు బానిసవ్వడం కూడా మహిళల రోజువారీ జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

రోజంతా ఇంటిని శుభ్రం చేయడానికి బానిసైన మహిళకు ప్రస్తుతం తాను కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు డాక్టర్ బిందా సింగ్ చెప్పారు.

ఎవరైనా అతిథులు వస్తే, వారు వెళ్లిన వెంటనే ఇంటిని శుభ్రం చేస్తుంటారు. దీని వల్ల ఆమె తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

ఆమె భర్త ఆ మహిళను తన దగ్గరకు తీసుకొచ్చినట్లు డాక్టర్ తెలిపారు.

‘‘పట్నా, రాంచీ, రాయ్‌పూర్, వారణాసి లాంటి టైర్-2 నగరాల్లో వ్యసనాలకు బానిసలయ్యామని ఫిర్యాదు చేస్తూ డాక్టర్ దగ్గరకు వచ్చే మహిళలు, పురుషుల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సగటున ప్రతి పది మంది రోగులలో, ఒకరు మహిళ ఉంటున్నారు’’ అని డాక్టర్ బిందా సింగ్ బీబీసీకి తెలిపారు.

‘‘అవును, దిల్లీ, ముంబయి, లక్నో, పుణె వంటి నగరాల్లో సగటు బాగుంది. ఏ అలవాటు అయినా, దానిపై మీకు నియంత్రణ లేకపోతే దానికి బానిసవుతారు. దాని కోసం వైద్య సలహాలు తీసుకోవాలి. డాక్టర్‌ను ఎంత త్వరగా సంప్రదిస్తే, అంత వేగంగా రికవరీ అవుతారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి’’ అని వివరించారు.

ఆల్కాహాల్

ఫొటో సోర్స్, Getty Images

పెద్ద నగరాల్లో పరిస్థితులేంటి?

చిన్న పట్టణాల మహిళలతో పోలిస్తే మెట్రోల్లో మహిళలకు ఎక్కువ అవగాహన ఉంటుందని ముంబయిలోని మహిళల అడిక్షన్ రీహాబ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ ఆశా లిమాయే చెప్పారు.

వారు తమ సమస్యలను చెబుతున్నారని, దీంతో రికవరీ కూడా మెరుగ్గా ఉందన్నారు.

వ్యసనాలకు బానిస అయిన బాధిత యువత సంఖ్య చిన్న పట్టణాల్లో కూడా ఎక్కువగానే ఉందని రాంచీలోని డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఆఫ్ ది సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ డాక్టర్ రోషన్ వి ఖనాండే చెప్పారు.

వీరిలో 18 నుంచి 28 ఏళ్ల లోపున్న బాలికలు ఎక్కువగా ఉన్నారని అన్నారు. వీరు మందుకి, గంజాయికి, డ్రగ్స్‌కి, వైట్నర్, మత్తు మాత్రలు వంటి వాటికి బానిసలయ్యారని తెలిపారు.

అయితే చికిత్స కోసం అడిక్షన్ సెంటర్‌కు చాలా తక్కువ మంది అమ్మాయిలే వస్తున్నారని అన్నారు.

ప్రతి 15 మంది రోగులలో ఒకరు మహిళ ఉంటున్నారు. వారు రాకపోవడానికి ప్రధాన కారణం సామాజికంగా ఒక నిషేధమే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)