ఛత్తీస్‌గఢ్ ఐఏఎస్ అధికారి రానూ సాహూను ఎందుకు అరెస్ట్ చేశారు?

రానూ సాహూ

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, సీఎం భూపేశ్ బఘేల్‌కు అత్యంత సన్నిహితులైన అధికారుల్లో ఆమె కూడా ఒకరు
    • రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

ఛత్తీస్‌గఢ్‌లో నిరుడు అక్టోబరు నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతోంది. దీనిలో భాగంగానే గత శనివారం రాష్ట్ర వ్యవసాయ విభాగం డైరెక్టర్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు విశ్వాసపాత్రుల్లో ఒకరైన ఐఏఎస్ అధికారిణి రానూ సాహూను అరెస్టు చేశారు.

ప్రస్తుతం రాయ్‌పుర్‌లోని స్థానిక కోర్టు రానూను మూడు రోజులపాటు ఈడీ రిమాండ్‌కు అప్పగించింది.

భూపేశ్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్‌ల తర్వాత ఈ బొగ్గు కుంభకోణం కేసులో మూడో ప్రధాన అరెస్టు రానూదే.

ఇప్పటికే ఈ కేసులో కొందరు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులను జైలుకు తరలించారు. తాజా అరెస్టుతో ఈ కేసు పరిధిని ఈడీ మరింత విస్తరించింది.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ నాయకులతోపాటు సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆదివారం, సోమవారం కూడా ఈడీ అధికారులు విచారించారు. మరోవైపు రాష్ట్రంలోని 18 చోట్ల తనిఖీలు చేపట్టారు.

రానూ అరెస్టుపై ఈడీ న్యాయవాది సౌరభ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బొగ్గు కుంభకోణంలో ఆమె అరెస్టు తప్పనిసరైంది. ఎందుకంటే ఆమెను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించాం. కానీ, ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదు’’ అని చెప్పారు.

అయితే, ఈడీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని రానూ సాహూ న్యాయవాది ఫైజల్ రిజ్వీ చెప్పారు.

ఈ అవినీతి కేసులో రానూ ప్రమేయముందని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూలేవని ఆయన అన్నారు.

మరోవైపు ఈడీ అధికారులు ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలతోనే ముందు వెళ్తున్నారని సీఎం భూపేశ్ బఘేల్ కూడా వ్యాఖ్యలు చేశారు.

‘‘భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం.. ఈ రెండింటినీ రాష్ట్రంలో దుర్వినియోగం చేస్తున్నారు. అయినప్పటికీ వారు అనుకున్నవి సాధించలేకపోతున్నారు’’ అని భూపేశ్ బఘేల్ వ్యాఖ్యలు చేశారు.

భూపేశ్ బఘేల్

ఫొటో సోర్స్, ALOK PUTUL

ఫొటో క్యాప్షన్, ఈడీ అధికారులు ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలతోనే ముందు వెళ్తున్నారని సీఎం భూపేశ్ బఘేల్ వ్యాఖ్యలు చేశారు

అసలేమిటీ కుంభకోణం?

నిరుడు అక్టోబరులో రాష్ట్రంలోని కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బొగ్గు రవాణాలో ఒక టన్నుకు రూ.25 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్న మూఠాతో వీరికి సంబంధముందని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ విషయంలో 2020 జులై 15న ప్రభుత్వ అధికారులు ఒక ఆదేశాన్ని విడుదల చేశారని, ఆ తర్వాతే ఈ అక్రమ వసూళ్లు మొదలయ్యాయని ఈడీ చెబుతోంది.

ఆ తర్వాత నుంచి నేటి వరకూ ఆన్‌లైన్‌లో ‘డెలివరీ ఆర్డర్’లు జారీ చేయకుండా మినరల్ ఆఫీసర్లు ‘సర్వీస్ ఎర్రర్’అని చెబుతూ ఆఫ్‌లైన్ ఆర్డర్‌లు జారీచేస్తూ వచ్చారని ఈడీ పేర్కొంది. ఆ నిర్దేశిత రుసుము చెల్లిస్తేనే ‘డెలివరీ ఆర్డర్’లను మినరల్ ఆఫీసర్లు జారీచేస్తున్నారని తెలిపింది.

మొత్తంగా ఇలా వ్యాపారవేత్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొందరు అధికారులు కలిసి రూ.540 కోట్లకుపైనే వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలకు సంబంధించి డైరీలు, ఫోన్‌చాట్‌లు, కోట్ల రూపాయల నగదు, బంగారం, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కోర్టులో ఈడీ వెల్లడించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలు, అధికారులు, నాయకుల అక్రమాలకు సంబంధించి రూ.200 కోట్లకుపైనే ఆస్తులను కూడా స్వాధీనం చేసినట్లు ఈడీ పేర్కొంది.

మరోవైపు రాష్ట్రంలో రూ.2,000 కోట్ల ‘లిక్కర్ స్కాం’, కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కుంభకోణాలపైనా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేపడుతోంది.

ప్రస్తుతం రానూ సాహూను బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇతర అవినీతి కేసుల్లో ఆమె పాత్రపైనా ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.

రానూ సాహూ

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL

ఫొటో క్యాప్షన్, గత తొమ్మిది నెలల్లో ఈడీ అధికారులు మూడుసార్లు రానూ సాహూ ఇంటిలో సోదాలు నిర్వహించారు

రానూ సాహూ ఎవరు?

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో చాలావరకు వ్యవసాయ రంగానికి సంబంధించినవే. అరెస్టయ్యే సమయంలో రాష్ట్ర వ్యవసాయ విభాగానికి డైరెక్టర్‌గా రానూ సాహూ పనిచేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ స్టేట్ మండీ బోర్డుకు కూడా ఆమె మేనేజింగ్ డైరెక్టర్.

భూపేశ్ బఘేల్‌కు అత్యంత సన్నిహితులైన అధికారుల్లో ఆమె కూడా ఒకరు.

రానూ సాహూ స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్. 2005లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్‌పీ) పోస్టుకు ఆమె ఎంపికయ్యారు.

2010లో ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆమెకు రాష్ట్ర క్యాడర్‌ను కేటాయించారు. రానూ సాహూ భర్త జయప్రకాశ్ మౌర్య కూడా ఐఏఎస్ అధికారే.

2021 జూన్ నుంచి 2022 జూన్ వరకూ కోర్బా జిల్లా కలెక్టర్‌గా రానూ పనిచేశారు. ఆ తర్వాత నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆమె రాయగఢ్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగారు.

రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉండే జిల్లాల్లో ఈ రెండు జిల్లాలు కూడా ఉంటాయి.

మరోవైపు రానూ సాహూ భర్త ఐఏఎస్ జయప్రకాశ్ మౌర్య.. భూగర్భ, ఖనిజ విభాగానికి ప్రత్యేక కార్యదర్శిగా 2021 జూన్ నుంచి పనిచేస్తున్నారు.

గత తొమ్మిది నెలల్లో ఈడీ అధికారులు మూడుసార్లు రానూ సాహూ ఇంటిలో సోదాలు నిర్వహించారు. పలుసార్లు ఆమెను ప్రశ్నించారు కూడా.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, ALOK PUTUL

నిరుడు అక్టోబరు 11న రాయగఢ్‌లోని రానూ సాహూ నివసించే కలెక్టర్ బంగ్లాకు ఈడీ అధికారులు సోదాలకు వెళ్లినప్పుడు తాళాలు వేసి కనిపించాయి. అయితే, ఆమె సెలవులపై వెళ్లారా లేదా వేరే ఎక్కడికైనా వెళ్లారా? ఎలాంటి సమాచారమూ అధికారులకు ఇవ్వలేదు.

దీంతో ఆ బంగ్లాను ఈడీ అధికారులు సీల్ చేశారు. ఆ తర్వాత అనారోగ్యంపై చికిత్స కోసం ఆమె హైదరాబాద్‌కు వెళ్లినట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు.

నవంబరు 14న చికిత్స అనంతరం తాను రాయ్‌గఢ్‌కు వస్తున్నట్లు ఈడీకి రానూ వెల్లడించారు. అప్పుడే ఈ కేసులో ఆమె పాత్రపై దర్యాప్తు మొదలైంది.

అప్పటినుంచి రానూను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే వార్తలు మీడియాలో కనిపించాయి.

నిరుడు రానూపై కోర్బా ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ మంత్రి జయ్ సింగ్ అగర్వాల్ బహిరంగంగానే పలుమార్లు అవినీతి ఆరోపణలు చేశారు.

కానీ, మంత్రి ఆరోపణలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రానూ అదే పదవిలో కొనసాగుతూ వచ్చారు.

రానూ అరెస్టు తర్వాత కూడా ఇది రాజకీయ దురుద్దేశాలతో తీసుకున్న చర్యలని సీఎం భూపేశ్ బఘేల్ చెప్పారు.

భూపేశ్ బఘేల్

ఫొటో సోర్స్, ANI

హస్‌దేవ్ అరణ్యం, బొగ్గు గనులు

ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన హస్‌దేవ్ అటవీ ప్రాంతంలో భూములను బొగ్గు గనులను తవ్వి తీసేందుకు రాజస్థాన్ ప్రభుత్వానికి అప్పగించడంపై ఇక్కడ చాలాకాలం నుంచీ గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు.

హస్‌దేవ్ అరణ్యంలో చెట్లను కొట్టివేయడంపై ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు, హక్కుల ఉద్యమకారులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

దీనికి సంబంధించి బయోడైవర్సిటీ, పీసా యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లాంటి చాలా చట్టాలపై నమోదైన కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

హస్‌దేవ్ అరణ్యంలో అనుమతులను రద్దు చేయాలని కోరుతూ నిరుడు జులైలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క అనుమతిని కూడా వెనక్కి తీసుకోలేదు.

మరోవైపు బొగ్గు కొరతను ప్రధానంగా చూపిస్తూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఈ విషయంలో ముందుకు వెళ్లాయి.

అయితే, గత వారంలో ఈడీ సోదాల తర్వాత దీనిపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇదివరకు రాజస్థాన్‌కు కేటాయించిన బొగ్గు గనుల నుంచి వచ్చే 20 ఏళ్లకు సరిపడా బొగ్గు వస్తుందని, హస్‌దేవ్ అరణ్యంలో కొత్తగా గనులను తెరవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.

ప్రస్తుతం బొగ్గు గనులను వారి ‘‘స్నేహితులకు’’ కేటాయించలేదనే ఈడీ, ఐటీ దాడులు చేపడుతున్నారని అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వ్యాఖ్యలు చేశారు.

భూపేశ్ బఘేల్

ఫొటో సోర్స్, Getty Images

‘‘బొగ్గు గని ప్రాంతంలో మేం ఏనుగుల కారిడార్‌ను ఏర్పాటుచేశాం. అయితే, దాని పక్కనే వారు బొగ్గు గని తెరవాలని భావించారు. మధ్యప్రదేశ్ తరహాలోనే ఇక్కడ కూడా బొగ్గు గనుల నుంచి గ్యాస్ వెలికితీయాలని భావించారు. దీనికి మేం అనుమతించలేదు. అందుకే ఇంత చిన్న రాష్ట్రంలోనూ ఇన్ని రోజులు ఐటీ, ఈడీ అధికారులు కూర్చున్నారు’’ అని భూపేశ్ బఘేల్ వ్యాఖ్యలు చేశారు.

‘‘దీనంతటికీ కారణం ఒకటే. వారి స్నేహితులకు మేం బొగ్గు గనులు కేటాయించలేదు’’ అని ఆయన అన్నారు.

అయితే, ఆయన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం రమణ్ సింగ్ విభేదించారు. ‘‘ఇది చాలా పెద్ద కుంభకోణం. దీనిలో చాలా మంది పాత్ర ఉంది. ఒక్కొక్కరిగా అందరి పేర్లూ దీనిలో బయటకు వస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘కోర్టులో ఈడీ 13 వేల పేజీల ఆధారాలను సమర్పించింది. ఇంతకంటే సీఎంకు పెద్ద ఆధారాలు ఎక్కడ దొరకుతాయి’’ అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి పది కొరడా దెబ్బలు

నాలుగు నెలల్లో ఎన్నికలు

రాష్ట్రంలో అక్టోబరు నుంచి నవంబరు మధ్య జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుంభకోణాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముందని రమణ్ సింగ్ అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈడీ, ఐటీ విభాగాలతో సోదాలు చేస్తున్నారని చెబుతోంది.

ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుశీల్ ఆనంద్ శుక్లా మాట్లాడారు. ‘‘ప్రస్తుతం రమణ్ సింగ్ ఈడీ అధికార ప్రతినిధిగా మారిపోయారు. ఆయన చెప్పేవన్నీ ఈడీ అలానే అభియోగ పత్రాల్లో రాసుకొస్తోంది. రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో 85 శాతం గనులు కోల్ ఇండియా చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ టన్నుకు ఇంత చొప్పున రవాణాకు వసూలు చేస్తే.. కేంద్ర గనుల శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు? ముందు వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

‘‘కోర్బాకు కేంద్ర హోం మత్రి అమిత్ షా వచ్చినప్పుడే ఈడీ సోదాలు మొదలుపెట్టింది. మళ్లీ ఆయన రాయ్‌పుర్‌కు వచ్చినప్పుడు సోదాలు జరిగాయి. అంటే అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి’’అని ఆనంద్ ఆరోపించారు.

‘‘ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. బీజేపీకి అనుబంధ విభాగాలుగా ఈడీ, ఐటీ విభాగాలు పనిచేయడంపై ప్రజలే తీర్పు చెబుతారు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)