పవన్ కల్యాణ్: తమిళ సినిమాల్లో తమిళులే నటించాలనడం సరికాదనే వ్యాఖ్యలపై ఏమిటీ వివాదం... ఫెఫ్సీ రూల్స్‌లో ఏముంది?

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, ShreyasMedia/Youtube

    • రచయిత, కావ్యబృంద ఉమామహేశ్వరన్, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తమిళ సినిమాల్లో కేవలం తమిళనాడుకు చెందిన టెక్నికల్ ఆర్టిస్టులు, నటులు మాత్రమే పనిచేసేలా ఫిల్మ్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఫెఫ్సీ) నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్టులు వస్తున్నాయి.

ఫెఫ్సీ ఈ కొత్త నిబంధనలను తెలుగు నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు.

అలాంటి నిర్ణయాలతో తమిళ సినీ పరిశ్రమ నుంచి ‘ఆర్‌ఆర్ఆర్’ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు రావడాన్ని వారు అడ్డుకుంటున్నారని అన్నారు.

అయితే, పవన్ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందించింది.

గత కొన్ని రోజుల క్రితం ఫెఫ్సీ ప్రకటించిన నిబంధనల ప్రకారం తమిళ చిత్రాల్లో పని చేసేందుకు తమిళ నటులు, టెక్నిషియన్లను మాత్రమే తీసుకోవాలి.

తమిళ నటుడు సముద్రఖని 2021లో రూపొందించిన ‘వినోదయ సిత్తం’ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో తంబి రామయ్యతో పాటు సముద్రఖని కూడా ప్రధాన పాత్రలలో నటించారు.

సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో ‘బ్రో’ పేరుతో విడుదలైంది.

సముద్రఖని చేసిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేశారు. తంబి రామయ్య పాత్రను సాయిధరమ్ తేజ్ చేశారు.

ఫెఫ్సీ
ఫొటో క్యాప్షన్, ఫెఫ్సీ

పవన్ కల్యాణ్ ఏం అన్నారు?

‘బ్రో’ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు, హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోనే తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటులు, టెక్నిషియన్లను మాత్రమే వాడాలని నిర్ణయించిన ఫెఫ్సీ కొత్త నిబంధనలను పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు

‘‘తమిళ పరిశ్రమవారికి నేను విన్నపం చేస్తున్నా. మన కోసమే మనం మనం పనిచేస్తున్నట్లు ఆలోచించకూడదు. అన్ని భాషలు మాట్లాడే వారిని తెలుగు సినీ పరిశ్రమ ఆదరిస్తుంది కాబట్టే నేడు ఈ స్థాయికి ఎదిగింది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

‘‘అన్ని భాషలు వారు కలిసినప్పుడే అది సినిమా అవుతుంది తప్ప, కేవలం మా వారికే మాత్రమే ఉపాధి కల్పించాలనుకోవడం వల్ల పరిశ్రమ కుంచించుకుపోతుంది’’ అని అన్నారు.

తమిళ సినిమాల్లో తమిళనాడుకు చెందిన నటులు మాత్రమే నటించాలనే ఆలోచన నుంచి కోలీవుడ్ బయటికి వస్తేనే ఆర్‌ఆర్‌ఆర్ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలను తీయగలదని పవన్ కల్యాణ్ అన్నారు.

సౌత్ ఇండియా నడిగార్ సంఘం అధ్యక్షులు నాజర్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, సౌత్ ఇండియా నడిగార్ సంఘం అధ్యక్షులు నాజర్

నాజర్ ఏమని స్పందించారు?

పవన్ కల్యాణ్ విమర్శలపై తమిళ పరిశ్రమలో పలువరు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఫెఫ్సీ నియమాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

ప్రముఖ నటుడు, సౌత్ ఇండియా నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ దీనిపై ఒక వీడియోను విడుదల చేస్తూ, ‘‘తమిళ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన నటులు నటించడానికి వీలులేదనే సమాచారం ప్రచారమవుతోంది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ఒకవేళ ఇలాంటి రూల్స్ ఏమన్నా తీసుకొస్తే, వీటిని వ్యతిరేకించే తొలి వ్యక్తిని నేనే’’ అని నాజర్ అన్నారు.

ప్రస్తుతం తాము పాన్ ఇండియాలో, అంతర్జాతీయంగా షూటింగ్ చేస్తున్నామన్నారు. అప్పుడు అక్కడ ఇతర భాషలకు చెందిన వారు కూడా నటిస్తున్నారని చెప్పారు.

‘‘తమిళ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన నటులు పనిచేయకూడదనే నిర్ణయాన్ని ఎవరూ తీసుకోలేదు. తమిళ సినిమాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని, తమిళనాడులో సినిమాలను తీసేటప్పుడు, తమిళ సినీ వర్కర్లను వాడుకోవాలని చెప్పారు. ఇది కూడా రూల్ కాదు. సూచన మాత్రమే.

అంతేకానీ, తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటులు మాత్రమే నటించాలని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తమిళ సినిమా అని, తెలుగు సినిమా అని ఏమీ లేదు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందరూ అన్ని సినిమాలు చేస్తున్నారు. చూస్తున్నారు.’’ అని అన్నారు.

తమిళ సినిమా అనేది గర్వించదగిన సినీ పరిశ్రమ. ఇది ఇతర భాషలకు చెందిన నటులను గుర్తించి, వారికి అవకాశాలు ఇస్తుందని నాజర్ అన్నారు.

ఎస్వీ రంగారావు, సావిత్రి, వాణీ జయరామ్ లాంటి చాలా మంది ప్రముఖ నటీనటులు తెలుగువారని తనకు తెలియదని, తమిళనాడుకు చెందినవారేనని చాలా కాలం అనుకున్నామని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. అందరం కలిసి సినిమాలు తీసి, ప్రపంచానికి తీసుకెళ్దామని నాజర్ చెప్పారు.

ఆర్కే సెల్వమణి

ఫొటో సోర్స్, RK SELVAMANI / FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఆర్కే సెల్వమణి

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఫెఫ్సీ స్పందనేంటి?

ఫెఫ్సీ తీసుకొచ్చిన కొత్త నిబంధనల గురించి ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణిని బీబీసీ సంప్రదించింది.

"సినిమాల్లో కులమతాలు, ప్రాంతాన్ని చూడకూడదన్నది నిజం. తమిళ సినిమా రంగంలో 40 శాతం తెలుగు టెక్నిషియన్లు, 20 శాతం మందికి పైగా మలయాళం టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. సినిమా రంగంలో కులం, మతం, ప్రాంతం చూడకూడదని పవన్ కల్యాణ్ తనకు తాను చెప్పుకోవాలి ’’ అని సెల్వమణి అన్నారు.

"సోదరుడి కోసం తల్లిని, తండ్రిని అన్నం అడగడం తప్పుకాదు కదా? అలాగే మేం కూడా మా ఆర్టిస్టులను పనిలో పెట్టుకోవాలని డిమాండ్ చేశాం. ఎందుకు దీనిపై వారు రాద్ధాంతం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. కొత్త ఫెఫ్సీ నిబంధనలపై మేం స్పష్టమైన ప్రకటన చేశాం. వీటిని పవన్ కల్యాణ్ పూర్తిగా చదవాలి’’ అని సెల్వమణి సూచించారు.

‘‘చిరంజీవి ఒకవేళ ఇక్కడికి వచ్చి, సినిమా తీస్తే, ఆయనతో పాటు కారులో 30 మంది వస్తారు. ఆయనపై ఆధారపడిన వారిని ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే, ఇది కూడా. ప్రముఖ స్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ అలా మాట్లాడకూడదు. ఆలోచించి మాట్లాడాలి’’ అని ఆయన అన్నారు.

ఎస్ఆర్ ప్రభు

ఫొటో సోర్స్, SR PRABU

ఫొటో క్యాప్షన్, ఎస్ఆర్ ప్రభు

తమిళ పరిశ్రమలో విభిన్న కథాంశాలపై సినిమాలు తీసే ‘‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’’ వ్యవస్థాపకుడు ఎస్ ఆర్ ప్రభుతో పవన్ కల్యాణ్ ప్రసంగం గురించి బీబీసీ తమిళ్ మాట్లాడింది.

‘‘ఫెఫ్సీ అనేది కార్మికుల సంక్షేమ సంస్థ. కార్మికుల సంక్షేమం కోసమే ఇది రిజిస్టర్ అయింది. అంతే తప్ప. దీనిలో ఎలాంటి తప్పు లేదు. దీన్ని ఒక గొడవగా మార్చవద్దు’’ అన్నారు.

‘‘ఫెఫ్సీ కొత్త నిబంధనలను పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారు. అందరం కలిసి పనిచేస్తేనే ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు వస్తాయని ఆయన అన్నారు. నిజమే, అందుకే, తమిళంలో పొన్నియన్ సెల్వన్ సినిమా తీశారు. ఫెఫ్సీ నిబంధనలను తమిళ సినిమా కోసం అన్నట్లుగా చూడడం సరికాదు. దీన్ని రాష్ట్ర సమస్యగా లేదా గొడవగా మార్చాల్సిన అవసరం లేదు’’ అని ప్రభు చెప్పారు.

తెలుగు ఇండస్ట్రీ ఏమంటోంది?

ఈ వి‌‍షయంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో మాట్లాడారు.

‘‘తెలుగు సినిమాలలో తెలుగు వారే చేయాలనే విషయాన్ని సీనియర్ నటుడు కోటా వంటి వారు గతంలో చాలాసార్లు అనేవారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియే‌షన్‌లోనూ గతంలో మూడుసార్లు తీర్మానాలు చేశారు. కానీ, అమలు చేయగలిగామా..? ఒకవేళ తమిళ ఇండస్ట్రీలో అలాంటి తీర్మానం చేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదు" అని భరద్వాజ అన్నారు.

ఇప్పుడు అన్ని పరిశ్రమలకు చెందిన నటులు కలిసి సినిమాలు చేస్తున్నారని, వేయి కోట్ల సినిమా రావాలంటే అది అనివార్యంగా మారిందని ఆయన అన్నారు.

తమిళ సినిమాలు చేస్తున్న రజినీకాంత్, అజిత్, విశాల్ సహా ఎంతో మంది నటులు వేరే భాషలకు చెందిన వారే కదా అని చెప్పిన తమ్మారెడ్డి, "అలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం" అని అన్నారు.

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు నేనూ విన్నానని చెప్పిన తమ్మారెడ్డి, "ఆయనేమీ వివాదాస్పదంగా అనలేదు. తమిళ్ ఇండస్ట్రీని అనడం ఆయన ఉద్దేశం కాదు. అందరూ అన్ని సినిమాలు చేయాలనే అన్నారు’’ అని అన్నారు.

దీనిపై సినీ నిర్మాత అశ్వినీదత్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘గతంలో మన ఆర్టిస్టులతోనే సినిమాలు చేయాలి, మనవాళ్లే ఉండాలనే డిమాండ్లు వినిపించేవి.‌‍ ఆ రోజులన్నీ దాటిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ఒకే ఇండస్ట్రీలోని నటులు, టెక్నీషియన్లతోనే సినిమాలు చేయాలంటే వినే పరిస్థితి లేదు.కొందరు మా ఇండస్ట్రీలోని టెక్నీషియన్లతోనే, నటులతోనే సినిమాలు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. అలాంటి డిమాండ్లు ఎక్కువ రోజులు నిలబడవు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)