BRO సినిమా రివ్యూ: పవన్ పొలిటికల్ పంచ్‌లు, త్రివిక్రమ్ డైలాగ్స్‌తో 'బ్రో' టార్గెట్ రీచ్ అయ్యాడా?

ఫొటో సోర్స్, facebook/People Media Factory
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
విలువైనదీ.. వెనక్కి రానిదీ... కాలం మాత్రమే. ఆ కాలమే మరణాన్ని వాయిదా వేసి, ఒకరికి తిరిగి బతుకునిస్తే, ఆ మనిషి కాలం విలువ తెలుసుకుంటాడా? అంతకంటే విలువైన పాఠాలు నేర్చుకుంటాడా?
ఈ పాయింట్ నుంచి 'వినోదయ సిత్తమ్' అనే కథ పుట్టింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ, నటించిన ఈ చిత్రం తమిళ నాట సంచలన విజయాన్ని అందుకుంది.
ఓ భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు సదా సిద్దంగా ఉంటారు కాబట్టి 'వినోదయ సిత్తమ్'పై తెలుగు చిత్రసీమ దృష్టి పడింది.
అయితే... అక్కడ సముద్రఖని చేసిన పాత్రలో ఇక్కడ పవన్ కల్యాణ్ నటించడం, సాయిధరమ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషించడం, త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఈ కథకు మరిన్ని మెరుగులు అద్దుకున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పటికీ క్రేజే. అందుకే 'బ్రో' గురించి ఆశలు, అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. మరి 'బ్రో' ఎలా ఉంది? అంచనాలకు తగ్గట్టుగానే తయారైందా? త్రివిక్రమ్ చేసిన మార్పులు, చేర్పులూ మూల కథని మరింత నిలబెట్టాయా? పడగొట్టాయా?
కాలం చేసిన ఇంద్రజాలం
ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు, అమ్మ... ఇలా కుటుంబ భారాన్నంతా తన భుజాలపైచ మోస్తుంటాడు మార్క్ (సాయిధరమ్ తేజ్). తను ఎప్పుడూ బిజీనే. కుటుంబంతో కాసేపు సరదాగా గడపడానికి కూడా తన దగ్గర టైమ్ లేదంటాడు. ఓ అమ్మాయి (కేతిక శర్మ)ని ప్రేమిస్తాడు. తనక్కూడా టైమ్ ఇవ్వడు. కష్టపడి పనిచేసి, తన కంపెనీకి జీ.ఎం అయిపోవాలన్నది తన ఆశ.
అయితే.. ఓ రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా కన్నుమూస్తాడు. కళ్లు తెరచి చూసే సరికి... చుట్టూ చీకటి. అక్కడ ఓ వెలుగుని చూస్తాడు. అదే.. కాలం.. (పవన్ కల్యాణ్). తాను చనిపోయానన్న సంగతి తెలుసుకొన్న మార్క్.. కాలం ముందు తన బాధని వెళ్లగక్కుకొంటాడు.
అన్నీ సరి చేసి రావడానికి తనకు అనుమతి ఇవ్వాలని అడుగుతాడు. దాంతో.. కాలం 90 రోజుల వ్యవధి ఇస్తుంది. మరి ఈ 90 రోజుల్లో మార్క్ ఏం చేశాడు? ఈ ప్రయాణంలో తనకు బోధపడిన విషయాలేంటి? అనేది తెరపై చూడాలి.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
పాయింట్ కొత్తదే!
మరణాన్ని 90 రోజుల పాటు వాయిదా వేసే అవకాశమే వస్తే.. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అనేది నిజంగా కొత్త పాయింటే.
ఈ పాయింట్ చుట్టూ ఎన్నో ఉద్వేగభరితమైన సన్నివేశాలు అల్లొచ్చు. కంట తడి పెట్టించొచ్చు. హృదయాన్ని పిండేయొచ్చు. 'వినోదాయ సిత్తమ్'లో అదే చేశారు. అందుకే ఈ సినిమా తమిళ నాట మంచి విజయాన్ని అందుకొంది.
'వినోదాయ సిత్తమ్' ఓ స్టేజీ డ్రామాలా ఉంటుంది. సముద్రఖని, తంబి రామయ్య (తెలుగులో ఈ పాత్రని సాయిధరమ్ తేజ్ పోషించాడు) వీరిద్దరి ఇమేజ్‌కూ.. ఆ కథ సూటవుతుంది. తెలుగులో రీమేక్ చేసినప్పుడు మాత్రం ఈ భావోద్వేగాలకు పవన్ స్టామినా, క్రేజ్ జోడించాల్సి వచ్చింది.
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ బాండింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అందుకే వాటిని మ్యాచ్ అయ్యేలా సన్నివేశాల్ని రాసుకోవాల్సి వచ్చింది. ఓ రకంగా దర్శకుడికి ఇది అదనపు భారమే.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
పవన్ మేనియా
ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించారు. మాతృకలోని కథలో ఆయన ఎక్కువ జోక్యం చేసుకోలేదు కానీ, ఆ కథని చెప్పే విధానంలో మాత్రం పవన్ మార్క్‌ని మిళితం చేసేందుకు ప్రయత్నించారు.
పవన్ ఎంట్రీ దగ్గర్నుంచి, చివరి సన్నివేశం వరకూ పవన్ అభిమానుల్ని ఎలా మెప్పించాలా? అనే తపనే త్రివిక్రమ్ లో ఎక్కువ కనిపించింది.
పవన్‌ని పరిచయం చేసే సన్నివేశంలోనే ఆ మార్క్ స్పష్టంగా తెలుస్తుంది. 'తమ్ముడు'లోని రైల్వే కూలీ కాస్ట్యూమ్స్ వేసి, అందులోని 'వయ్యారి భామ' పాటలోని బీజియమ్ వాడుతూ...అభిమానుల్ని థియేటర్లో ఊగిపోయేలా చేశారు.
అక్కడి నుంచి సందర్భం వచ్చినప్పుడూ, కొన్ని సార్లు కుదుర్చుకొని మరీ.. పవన్ సినిమాలోని పాత పాటలు వినిపిస్తూ... పవన్ దానికి స్టెప్పులేస్తూ.. థియేటర్లో ఫ్యాన్స్ కూడా గోల చేసేలా చేశారు. పవన్ పాత పాటల్ని మళ్లీ వినడం సంతోషమే. కానీ, కొన్నిసార్లు అవి మరీ శ్రుతి మించినట్టు అనిపిస్తాయి.
'ఇంత వాడకం అవసరమా? అధ్యక్షా..?' అని అడగాలనిపిస్తుంది. 'వినోదాయ సిత్తమ్' చూసొచ్చిన వాళ్లకు `కథ ఎటు పోతుంది, కాన్సెప్ట్ ఏమైపోతోంది` అనే బెంగ రావడం కూడా సహజమే.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
పొలిటికల్ పంచ్‌లు
పవన్ కేవలం నటుడే కాదు. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. అందుకే పవన్ సినిమాల్లో పొలిటికల్ పంచ్‌లు పడుతుంటాయి.
కానీ 'బ్రో' కథలో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇదో ఫాంటసీ. పాలిటిక్స్‌కీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకూ ఏమాత్రం సంబంధం లేని కథ. అయినా సరే... ఆ 'టచ్' వచ్చేలా జాగ్రత్త పడ్డారు త్రివిక్రమ్.
ఈ భూమ్మీదకు వచ్చిన ప్రతీ వ్యక్తి.. అతిథే అని చెప్పి అక్కడితో ఆగకుండా.. 'భూములు దోచేస్తున్నారు. ఇసుక తవ్వేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు..' అంటూ ఓ సందర్భంలో పొలిటికల్ లీడర్‌లా విమర్శనా బాణాలు ఎక్కు పెట్టారు.
అలాగే, 'టీ తాగుతారా` అని అడిగితే... 'ఈ గ్లాసులో అయితే తాగుతా' అని పవన్ టీ గ్లాసు జనసేన సింబల్‌ను గుర్తుకు తెస్తుంది.
చావుని వాయిదా వేసి, మళ్లీ ప్రయాణం సాగించిన మార్క్ పాత్ర ఈ కథకు చాలా కీలకం. ఈ 90 రోజుల్లో తానేం చేశాడు? అనేది ఆసక్తికరంగానే చూపించారు. టైమ్ (పవన్ ) ఎప్పుడూ మార్క్‌ని ఉడికిస్తూ, ఆట పట్టిస్తూ ఉంటుంది. అందుకే వారిద్దరి మధ్య సన్నివేశాలు సహజంగా, సరదాగా వచ్చాయి.
తొలి సగంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త డల్‌గా అనిపిస్తుంది. టైమ్ పాత్రలో పవన్ మరీ కొటేషన్లు దంచి కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే చివరి 20 నిమిషాల్లో మళ్లీ కథలోకి వచ్చిన దర్శకుడు, తాను చెప్పాలనుకొన్న ఫిలాసఫీ చెప్పి, ప్రేక్షకుల్ని థియేటర్ల నుంచి బయటకు పంపిస్తాడు.
రేపు బాగుండాలన్న ఆశతో ఈరోజు తప్పులు చేయొద్దని సూచిస్తాడు. ఎవరేం చేసినా, ఏం చేయకపోయినా, కాలం తన పని తాను చేసుకొంటూ వెళ్తుందని హెచ్చరిస్తాడు.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
కెమిస్ట్రీ సూపర్ `బ్రో`
పవన్ కల్యాణ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ.. సినిమా మొత్తం పవన్ హంగామానే ఉంటుంది. సినిమా మొదలైన 15వ నిమిషమే పవన్ ఎంట్రీ. అక్కడి నుంచి దాదాపు ప్రతీ సీన్‌లోనూ.. పవన్, తేజ్ కనిపిస్తూనే ఉంటారు. వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.
పవన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. కళ్లలో పవన్‌లో ఎప్పుడూ ఉండే స్పార్క్ ఈ సినిమాలోనూ కనిపించింది. చాలా సన్నివేశాల్లో తన ఈజ్ చూపించాడు.
కొన్నిసార్లు ఏం మాట్లాడకుండానే.. చాలా విషయాలు కళ్లతోనే పలికించాడు. పవన్ రాకతో ఈ సినిమా స్పాన్ మారిపోయింది. తేజ్ ఫెర్ఫార్మెన్స్ కూడా పవన్‌కి ధీటుగానే అనిపించింది. తనకు ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
అయితే, స్టెప్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. కేతిక శర్మ ఓ పాటలో, కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. చెల్లెలు పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్, తమ్ముడి పాత్రలో సూర్య శ్రీనివాస్ మెప్పించారు. బ్రహ్మానందం, సముద్రఖని అతిథి పాత్రలు అనుకోవాలి.
థీమ్ సాంగ్‌లో ఎలివేషన్
తమన్ వల్ల ఈ సినిమాకి కలిసొచ్చిందేమైనా ఉందంటే.. `బ్రో` థీమ్ సాంగ్‌ని బాగా డిజైన్ చేయడమే. పాటలు సోసోగా ఉన్నా.. థీమ్ సాంగ్ మాత్రం ఎలివేషన్లకు బాగా పనికొచ్చింది. టైటిల్ కార్డ్స్‌తోనే ఈ థీమ్ సాంగ్ ప్రభావం మొదలైపోతుంది. కథలో హై మూమెంట్ ఎప్పుడొచ్చినా ఈ పాటే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటుంది.
సినిమా అంతా రిచ్‌గా ఉంది. నిర్మాతలు ఖర్చుకి వెనుకంజ వేయలేదు. ఐటెమ్ సాంగ్‌లో ఊర్వశీ రౌతెలా కనిపిస్తుంది తప్ప.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుంచుకొనే స్థాయిలో లేదు.
త్రివిక్రమ్ సినిమాల్లో ప్రతీ మాటా గుర్తు పెట్టుకొనేలా ఉంటుంది. మరీ ఆ స్థాయిలో మాటలేం పలకకపోయినా, కొన్ని చోట్ల మాటల వల్లే, సన్నివేశాలు నిలబడ్డాయి. కాలం విలువ చెప్పిన ప్రతీచోటా... త్రివిక్రమ్ కలం బాగానే పనిచేసింది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలకు స్టార్ డమ్ తోడైతే వాటి స్థాయి వేరేలా ఉంటుంది. అయితే అక్కడే ఇబ్బందులు కూడా ఉంటాయి. స్టార్ కోసం సీన్లు రాసుకోవడం, ఫ్యాన్స్ కోసం డైలాగులు ఇముడ్చుకోవడం మొదలవుతుంది. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అయినా, కథలోని ఆత్మ దాని తాలుకూ ప్రభావం తగ్గుతుంటుంది.
'బ్రో' విషయంలో అదే జరిగింది. ఓ మంచి కథని భావోద్వేగభరితంగా చెప్పాల్సిన చోట.. పవన్ కోసం కమర్షియాలిటీని జోడించాల్సి వచ్చింది. ఈ జోడింపు ఫ్యాన్స్‌కు మాత్రం నచ్చుతుంది. చిత్రబృందం ఆలోచన కూడా అదే అయితే... 'బ్రో' తన టార్గెట్ రీచ్ అయినట్టే.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్: 25 ఏళ్లు గడచినా హీరో జాక్ మరణంపై ఆగని చర్చ
- మతమా, దేశమా అనే చర్చ ఎందుకు జరుగుతోంది... అసదుద్దీన్, కుమార్ విశ్వాస్ ఏమని ట్వీట్ చేశారు?
- కార్గిల్ యుద్ధం: పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం ఎలా విరుచుకుపడింది? అమెరికాను నవాజ్ షరీఫ్ ఎందుకు శరణు కోరారు?
- ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?
- సోఫియా దులీప్ సింగ్: బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన భారత రాకుమారి కథ















