నంద్యాల డీఈఓ పేరిట వచ్చిన 'తెలుగు' ప్రకటన‌ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది?

నంద్యాల డీఈవో పేరిట విడుదలైన పత్రికాప్రకటన
    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయం విడుదల చేసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పత్రికా ప్రకటన పేరుతో జులై 26న విడుదల చేసినట్లుగా చెబుతున్న ఈ లేఖ ప్రారంభం నుంచి చివరి వరకు అక్షర దోషాలు ఉండడమే దీనికి కారణం.

విద్యాశాఖ అధికారి విడుదల చేసిన లేఖే ఇలా ఉంటే ఎలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా విద్యాశాఖ 'కార్యాలయం' అనే పదం కూడా అందులో తప్పుగా రాసి ఉంది.

లేఖ కుడివైపున పైభాగంలో జిల్లా విద్యాశాఖ 'కార్యాయం' అనే అక్షర దోషంతో మొదలైన ఈ లేఖలో పత్రికా ప్రకటన అనే పదం కూడా తప్పుగానే రాశారు.

విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలలు, రేపటి నుంచి.. వంటి పదాలను కూడా తప్పులు లేకుండా రాయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

తెలుగు

ఫొటో సోర్స్, Facebook

అసలు ఏం జరిగిందంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలోని పాఠశాలలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ కార్యాలయం పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జులై 27 నుంచి 30 వరకు నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 27వ తేదీ గురువారం సెలవుకు బదులుగా ఆగస్టులో 2వ శనివారం పాఠశాల తరగతులు నిర్వహించాలని సూచించారు.

28వ తేదీ ఐచ్ఛిక సెలవు కాగా, 29 మొహర్రం సెలవు, 30వ తేదీ ఆదివారం కలిపి నాలుగు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో ఉంది.

అయితే, డీఈవో కార్యాలయం పేరుతో విడుదలైనట్లుగా చెబుతున్న ఆ లేఖలోని ప్రతి వరుసలోనూ తప్పులు దొర్లడం, చదవడానికి కూడా ఇబ్బందులు పడేలా రాసి ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరలైంది.

తెలుగు పదాలు మాత్రమే కాకుండా, తేదీలను కూడా సరిచూసుకోకుండా ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. 27 జులై 2023కి బదులు, 27 జులై 2022 అని పేర్కొన్నారు.

నంద్యాల విద్యాశాఖాధికారి లేఖ

ఫొటో సోర్స్, Fb/mannava.gangadaharaprasad

సోషల్ మీడియాలో వైరల్

తప్పుల తడకగా ఉన్న ఈ లేఖను మన్నవ గంగాధర ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ''ఇది నిజమైతే.. ఓ దేవుడా.. నీవే గతి'' అంటూ తెలుగు భాషను దేవుడే రక్షించాలనే అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశారు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన శాఖలో కీలక అధికారి కార్యాలయం నుంచి విడుదలైన లేఖలో లెక్కలేనన్ని తప్పులు ఉండడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

''తెలుగు పరిమళిస్తోంది ప్రభుత్వ సహకారంతో'' అంటూ తెలుగు గేయ రచయిత భువనచంద్ర రాజు ఫేస్ బుక్‌‌లో వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

''నేను ఏదైనా లిపి లేని భాషను నా మాతృభాషగా మార్చుకుంటా, కష్టమైనా నేర్చుకుని. ఇలా చదివే చిత్రవధకు దూరంగా పారిపోతా!'' అని సత్యం వేమూరి అనే వ్యక్తి కామెంట్ చేశారు.

డీఈవో పేరుతో విడుదలైనట్లు చెబుతున్న ఈ లేఖపై భాషాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ లేఖ విషయమై నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడేందుకు ‘బీబీసీ తెలుగు’ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి: