జాన్వీ కపూర్: ‘బవాల్’లో యూదుల ఊచకోతను చిన్నది చేసి చూపించారా? హిట్లర్ ప్రస్తావన, గ్యాస్ చాంబర్ సన్నివేశాలపై వారి అభ్యంతరాలు ఏమిటి?

బవాల్

ఫొటో సోర్స్, SPICE PR

ఫొటో క్యాప్షన్, ''మనందరం కూడా హిట్లర్‌‌ లాంటి వాళ్లమే, ఏం కాదా'' అని బవాల్ చిత్రంలోని ఒక సన్నివేశంలో జాన్వీ కపూర్ అంటుంది.
    • రచయిత, గీతా పాండే, షెరిలాన్ మొల్ల
    • హోదా, బీబీసీ న్యూస్

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'బవాల్'‌ స్ట్రీమింగ్ నిలిపివేయాలని, దానిని తొలగించాలని ఒక యూదు సంస్థ అమెజాన్ ప్రైమ్‌‌కు లేఖ రాసింది. యూదుల ఊచకోత(ది హోలో కాస్ట్)ను ఈ సినిమాలో చిన్నది చేసి చూపించారని ఆ సంస్థ చెప్పింది.

లక్షల మంది హత్యాకాండను, వారి బాధను తక్కువ చేసి చూపించేలా బవాల్‌లో సన్నివేశాలు ఉన్నాయని ‘సిమన్ వీసెంతల్’ సంస్థ ఆరోపించింది.

బవాల్ చిత్రంలో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లై యూరప్‌ వెళ్లిన జంటగా వారిని చూపించారు.

ఈ సినిమాలో ధవన్ హిస్టరీ టీచర్. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులను ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ ద్వారా తన విద్యార్థులకు చూపిస్తుంటాడు. జాన్వీ విఫలమైన తమ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చివరి ప్రయత్నం చేయాలనుకుంటుంటుంది.

బవాల్ సినిమా కమర్షియల్‌గా హిట్ అయిందని, ఇప్పటికే 60 లక్షల నుంచి 70 లక్షల మంది చూశారని, ప్రైమ్ వీడియో యాప్‌లో బవాల్ మూవీ గురువారం ఇండియా టాప్ టెన్‌ లిస్టులో నిలిచిందని బాలీవుడ్ వెబ్‌సైట్‌లు చెబుతున్నాయి.

బవాల్

ఫొటో సోర్స్, SPICE PR

ఫొటో క్యాప్షన్, బవాల్ చిత్రంలో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

రొమాంటిక్ డ్రామాలో మారణ హోమాన్ని చొప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ బవాాల్ చిత్రాన్ని భారత్‌లోనూ చాలా మంది విమర్శిస్తున్నారు.

అయితే, సినిమా దర్శకుడు, నటీనటులు మాత్రం అది అనవసర రాద్ధాంతమని కొట్టిపారేస్తున్నారు.

ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలు మొదలయ్యాయి. చిత్రంలో లవ్ స్టోరీకి, యూదుల ఊచకోతకు పోలిక పెట్టడాన్ని సినీ విమర్శకులు, ప్రేక్షకులు తప్పుబడుతున్నారు.

చిత్రంలో ఒక గ్యాస్ చాంబర్‌లో ఫాంటసీ సన్నివేశం ఉంది.

జర్మనీ ఒకప్పటి నియంత, నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్, ఆష్విజ్ డెత్ క్యాంప్(సుమారు 11 లక్షల మందిని ఊచకోత కోసిన ప్రదేశం)ను ప్రతీకలుగా చూపించారు.

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమర్శలను బవాల్ చిత్ర బృందం కొట్టిపారేస్తోంది.

విడుదలైనప్పటి నుంచి విమర్శలు

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాపై పాజిటివ్ రివ్యూలు కూడా రాలేదు. యూదుల మారణహోమానికి సంబంధించిన సీన్లు, సినిమాలో డైలాగ్స్ బాలేవని విమర్శకులు అంటున్నారు.

మనిషి దురాశకు ప్రతీకగా హిట్లర్‌ను చూపించారు. ''మనందరం కూడా హిట్లర్‌‌ లాంటి వాళ్లమే. ఏం కాదా'' అని ఒక సీన్‌లో జాన్వీ కపూర్ అంటుంది.

మరో సీన్‌లో ఆమె- ''ప్రతి బంధం ఆష్విజ్‌ను దాటి రావాల్సిందే'' అనే డైలాగ్ చెబుతుంది.

ఆష్విజ్ క్యాంప్‌లో చిత్రహింసలను చూపించే సీన్‌లో జంటను గ్యాస్ చాంబర్‌లో పడేస్తారు. చుట్టూ ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తుంటాయి.

ఈ సినిమాపై యూదు మానవ హక్కుల సంస్థ సిమన్ వీసెంతల్ సెంటర్ విమర్శలు చేసింది.

ఆష్విజ్‌ను కేవలం అప్పుడు జరిగిన హింసకు గుర్తుగా చూపించడం సరికాదని, అది మనిషి దుర్మార్గపు ప్రవర్తనకు పరాకాష్ట అని యూదు సంస్థ ప్రకటనలో పేర్కొంది.

''సినిమాలో ప్రతి బంధం ఆష్విజ్‌ను దాటి రావాల్సిందే అనే డైలాగ్ సరికాదు. అది హిట్లర్ మారణకాండ సమయంలో 60 లక్షల మంది యూదుల ఊచకోత, అప్పట్లో వారు అనుభవించిన వేదనను చిన్నచూపు చూడడమే. దర్శకుడు నితేష్ తివారి చరిత్రను తప్పుగా చూపించారు.'' అని యూదు సంస్థ ప్రకటనలో తెలిపింది.

''నాజీ డెత్ క్యాంప్‌ గురించి తమకు నచ్చినట్టు చూపించి పబ్లిసిటీ పొందడమే చిత్ర బృందం లక్ష్యం అయితే అది నెరవేరినట్టే'' అని సిమన్ వీసెంతల్ వ్యాఖ్యానించింది.

తక్షణమే బవాల్‌ చిత్రాన్ని తొలగించాలని అమెజాన్ ప్రైమ్‌‌కు రాసిన లేఖలో కోరింది.

అయితే, యూదు సంస్థ ప్రకటనపై సినిమా టీం ఇంతవరకూ స్పందించలేదు. హిందీ సినిమాల్లో చిన్న విషయం పట్టుకుని రాద్ధాంతం చేస్తారని, అదే ఇంగ్లిష్ సినిమా అయితే పట్టించుకోరని మూవీ ప్రమోషన్ సందర్భంగా నటుడు వరుణ్ ధవన్ వ్యాఖ్యానించారు.

సినిమాను మరీ భూతద్దం పెట్టి చూడొద్దని, అలా చేస్తే ప్రతి చోటా ఏదో ఒక తప్పు కనిపిస్తుందని దర్శకుడు నితేష్ తివారి అన్నారు.

బవాల్

ఫొటో సోర్స్, BBC WORLD SERVICE

అసలేంటీ ఆష్విజ్ నాజీ క్యాంప్?

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1940-45 మధ్య, దక్షిణ పోలాండ్‌లో‌ని ఈ ఆష్విజ్ నాజీ క్యాంప్‌లో దాదాపు 11 లక్షల మందిని దారుణంగా చంపేశారు. వారిలో ఎక్కువ మంది యూదులే.

సుమారు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ క్యాంప్ నిర్మాణం 1940లో ప్రారంభమైంది.

ఈ క్యాంప్‌లో రోమా జిప్సీలు, వికలాంగులు, స్వలింగ సంపర్కులు, పోలండ్‌కు చెందిన యూదేతరులను, సోవియట్ యూనియన్‌కి చెందిన ఖైదీలను ఉంచేవారు.

1945 జనవరి 27న సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ సాయంతో ఆష్విజ్ - బిర్కెనో విముక్తి పొందింది.

1947లో దానిని మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియంను నిర్వహించేందుకు నిధుల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు.

హత్య చేయడానికి ముందు పెట్టే చిత్రహింసలు, అమానుష ఘటనలను తెలిపే జ్ఞాపకాలను మ్యూజియంలో భద్రపరిచారు.

రష్యా విడుదల చేసిన ఒక నివేదిక, ఈ క్యాంప్‌లోని భయంకరమైన పరిస్థితులను వివరిస్తుంది. సైన్యం ఆ క్యాంప్ గేటు తెరిచి చూసినప్పుడు లెక్కలేనన్ని శవాల గుంపు బయటపడిందంటూ ఫస్ట్ యుక్రేనియన్ ఫ్రంట్ 60వ ఆర్మీ జనరల్ క్రమ్నికోవ్ చెప్పిన విషయం కూడా ఆ నివేదికలో ఉంది.

ఆష్విజ్‌ క్యాంప్‌లో లక్షల మంది ఖైదీలు ఉండేవారు. చనిపోయేంత వరకూ వారితో పనిచేయించడం, లేదంటే తగలబెట్టడం, కాల్చిచంపడం చేసేవారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: