కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?

కామసూత్ర గ్రంథం

వాత్స్యాయనుడు సంస్కృతంలో రాసిన కామసూత్ర అనే గ్రంథంలో ఏముంది?

పాశ్చాత్య ప్రపంచంలో ఈ గ్రంథాన్ని ఒక శృంగార సాహిత్యంగా చూస్తారు. భారత్‌లో చాలా మంది ఇప్పటికీ ‘కామసూత్ర’ను, లైంగిక సంబంధాలను వర్ణించే గ్రంథంగానే చూస్తున్నారు.

క్యాథలిక్ చర్చి తన నియమ నిబంధనల్లో ‘శరీరం పనికిరాని ఒక వస్తువు. శారీరక సుఖం చెడ్డది. దాన్ని పొందాలనే కోరిక రావడమే పాపం’ అని చెప్పింది.

సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానం పొందడానికి మాత్రమే అని అందులో చెప్పారు.

దాదాపు అదే సమయంలో భారతదేశంలో వాత్స్యాయనుడు గంగాతీరంలో కూర్చుని కామసూత్ర రాస్తున్నారు.

లైంగిక ఆనందం ఆరోగ్యానికి చాలా మంచిదని, దానిని ఎక్కువ పొందడం ఎలా అనేది చెబుతూ వచ్చారు.

వాత్స్యాయనుడనే రుషి రాసిన ఈ పుస్తకం లైంగికత గురించి మాత్రమే చెబుతోందా? సెక్స్ మాన్యువల్‌గా ఈ పుసక్తాన్ని పరిగణించడం ఎంత వరకు సబబు?.

‘కామసూత్ర’ను నిజానికి తప్పుడు దృష్టితో చూస్తున్నారు.

ఒకవేళ మీరు ఈ పుస్తకాన్ని చదివి, దానిలోని విషయాలను లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే, దీనిపై ఉన్న ఎన్నో అపోహలు తొలగిపోతాయి.

కామసూత్ర మాత్రమే కాదు, ప్రాచీన భారతదేశంలో లైంగికతపై ఉన్న అభిప్రాయాలు, దానికి మనమెంత దూరంలో ఉన్నామనే విషయాలు అర్థమవుతాయి.

బీబీసీ దీనిపై ఒక ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది.

కామసూత్ర గ్రంథం

ఫొటో సోర్స్, Getty Images

కామసూత్ర కథ

వాత్స్యాయనుడు కామసూత్రను ఏ కాలంలో రాశారన్నది కచ్చితంగా తెలియదు.

పలువురు పరిశోధకులు ఈ పుస్తకం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటిదని చెప్పారు. మరికొందరు ఈ గ్రంథాన్ని 3వ శతాబ్దంలో రాశారని భావిస్తున్నారు.

గుప్తుల కాలంలో ఈ పుస్తకాన్ని రాశారని కూడా చెబుతుంటారు. కానీ, కామసూత్ర పుస్తకంలో ఎక్కడా కూడా గుప్తుల పాలన గురించి ప్రస్తావించలేదు.

చెప్పాలంటే ఇది ఒక పుస్తకం కాదు. ఏడు పుస్తకాల సంకలనం.ఇందులో 36 అధ్యాయాలు, 1250 పద్యాలున్నాయి.

కామసూత్ర గ్రంథంలోని ఏడు పుస్తకాలలో మొదటిది మంచి జీవితాన్ని ఎలా పొందాలనే దాని గురించి వివరించిందని కళా చరిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ అల్క పాండే అన్నారు.

దీనిలో ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు పురుషార్థాలలో మూడు అంశాలు ధర్మ (నైతిక విలువ), అర్థ (డబ్బు), కామ(శారీరక సౌఖ్యం) గురించి వివరించినట్లు తెలిపారు.

లైంగిక ఆనందం పొందడం కోసం, మంచి జీవితాన్ని గడిపేందుకు పని కూడా ఎంతో అవసరమని మనకు తెలుసన్నారు.

ఈ గ్రంథంలోని రెండో భాగంలో లైంగిక భంగిమల గురించి వివరించారు.

కామసూత్ర గ్రంథం గురించి మరింత వివరిస్తూ, ఇందులోని ఒక భాగంలో ఇంటి అలంకరణ గురించి, నివాసాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయాలను చెప్పినట్లు రచయిత, ప్రొఫెసర్ మాధవి మేనన్ తెలిపారు.

పనిని, సంతోహాన్ని పెంచుకునేందుకు మీరు స్థలాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్నెలా అందంగా అలంకరించుకోవాలనే విషయాలను ఈ గ్రంథంలోని ఒక పుస్తకంలో తెలిపినట్లు మాధవి చెప్పారు.

‘‘ఆరో పుస్తకం పూర్తిగా వేశ్యల గురించి ఉంది. ఈ పుస్తకంలో మహిళల కోరికల గురించి నేరుగా రాశారు. దీంతో చాలా మంది దీన్ని ప్రాస్టిట్యూషన్ గురించి రాసిన పుస్తకమని కొట్టిపడేశారు. నిజానికి, అప్పటి వేశ్యలు ఆనాటి భారతీయ సాంస్కృతిక వ్యవస్థలోని శ్రేష్టమైన జీవితంలో వీరు ఒక భాగమ"ని మాధవి వివరించారు.

స్త్రీ కోరికలకు ప్రాధాన్యత

ఫొటో సోర్స్, Getty Images

స్త్రీ కోరికలకు ప్రాధాన్యం

సంభోగ సమయంలో కేవలం పురుషుడి కోరికలే ముఖ్యమని, స్త్రీ కోరికలు ముఖ్యం కాదని ఒక అపోహ ఉంది.

కామసూత్ర ద్వారా ఈ సిద్ధాంతాన్ని కొట్టివేశారు.

స్త్రీలు ఆనందం పొందేందుకు పురుషులు అవసరం లేదని తొలిసారి కామసూత్రలో తెలిపారు.

సెక్స్ అనేది మహిళలు, పురుషులు ఇద్దరికీ కావాల్సిన శారీరక అవసరమైనప్పటికీ దానిపై వారిద్దరికీ ఉన్న భావాలు, లైంగికత మూలాలు భిన్నంగా ఉంటాయి.

వాత్స్యాయనుడు పురుషుడి కోరికలను అగ్నిలా వర్ణించారు. అవి తన జననాంగం నుంచి పుట్టి మస్కిష్తం వైపు వెళ్తాయి. అగ్నిలా ఎంత వేగంగా రాజుకుంటాయో, అంతే సులభంగా చల్లారిపోతాయి.

కానీ, స్త్రీ కోరికలు దానికి భిన్నంగా నీళ్లలా ఉంటాయి. అవి ఆమె తల నుంచి ప్రారంభమై కింది వైపు వస్తాయి. వాటిని తట్టిలేపేందుకు ఆమెకు పురుషుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అవి ఒకసారి మొదలైతే, వాటిని చల్లార్చడానికి కూడా చాలా సమయం పడుతుంది అని చెప్పారు.

కామసూత్రంలో పురుషులు, స్త్రీల మధ్య శారీరక సంబంధం గురించి చెప్పినప్పుడల్లా, మహిళల శారీరక కోరికలేంటి, ఎలా ముద్దు పెట్టుకోవాలి వంటి విషయాలను వాత్స్యాయనుడు రాశారు.

పురుషులు, స్త్రీల మధ్య శారీరక సంబంధం, అలాగే వారి ప్రేమ, భావోద్వేగ సంబంధాలపై కూడా వాత్స్యాయనుడు కామసూత్ర గ్రంథంలో వివరించారు.

స్త్రీ, పురుష సంబంధాలు తాజాగా, ఉత్తేజం కలిగించేలా ఉండాలంటే వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలు రావడం కూడా అవసరమే అంటారు.

స్త్రీ, పురుషుల మధ్య బంధం గాఢంగా, ఒకరిమీద ఒకరికి బలనైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ గొడవలు సఫలం అవుతాయని వాత్స్యాయనుడు చెప్పారు.

కానీ, ఇద్దరి మధ్యా మొదటి నుంచే అభిప్రాయ బేధాలు ఉండి, వారిమధ్య ఎలాంటి ప్రేమ లేనప్పుడు ఆ గొడవలు మరింత ప్రమాదంగా మారుతాయి. వాటికి ఎలాంటి పరిష్కారం ఉండదు.

ఈ జగడం ఎప్పుడూ పురుషుల నుంచే మొదలవుతుంది. మహిళ విసిగిపోయి అరుస్తుంది. తన నగలు తీసి విసిరేస్తుంది. వస్తువులు విరగ్గొడుతుంది. వాటిని పురుషుడిపై విసిరికొడుతుంది.

కానీ, ఈ గొడవలో ఒక నియమం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా, ఆమె తన ఇంటి బయట అడుగుపెట్టదు. కామసూత్రలో దానికి కారణం కూడా చెప్పారు.

అందులో మొదటిది పురుషుడు ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆమె వెనక పడకపోతే, అది స్త్రీని అవమానించినట్టే అవుతుంది.

ఇంకొకటి పురుషుడు స్త్రీ కాళ్లపై పడి ఆమెను క్షమాపణ కోరితే ఆ గొడవ సద్దుమణుగుతుంది. ఎందుకంటే ఆ పని అతడు ఇంటి బయట చేయలేడు.

హోమోసెక్సువాలిటీ

ఫొటో సోర్స్, Getty Images

హోమో సెక్సువాలిటీ ప్రస్తావన

సుశ్రుత సంహిత ప్రకారం హోమోసెక్సువల్ పురుషులు అంటే క్లిబాలు వారి లైంగిక కోరికల ప్రకారం ఐదు రకాలుగా ఉన్నారని రచయిత రాశారు. ఈ కేటగిరీల్లో అసేక్యా, సుగంధిక, కుంభిక, ఇర్షక, శాంధ.

తనరద్ స్మృతిలో ముఖేభాగ, సేవక్య, ఇర్షకల గురించి ప్రస్తావించి, ఆ పురుషులు మహిళలను పెళ్లి చేసుకోవడం నిషేధమని రాశారు.

గే పురుషుల కోసం ‘పాండ’ అనే పదాన్ని పేర్కొని, దాని కింద 14 రకాల పురుషులను వాత్స్యాయనుడు ప్రస్తావించారు.

హోమోసెక్సువల్ మహిళలు, వారి గుర్తింపు కోసం వేదాల సాహిత్యంలో ‘నస్త్రీయా’ అనే పదం కనిపిస్తోంది.

వివిధ గ్రంథాలలో 10 రకాల వేశ్యలను పేర్కొన్నట్లు రచయిత గుర్తించారు.

స్వైరిణి - ఇతర స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు గలది

కామిని - స్త్రీ పురుషులిద్దరితో ప్రేమ వ్యవహారాలు గలది

స్త్రీపుంస - పురుషుడిలా ప్రవర్తించేది

నపుంసక - రుతుక్రమం, రొమ్ములు లేక మగ మనిషిలా కనిపించేది

నరషండ - స్త్రీత్వం పూర్తిగా నశించినది

వర్త - గర్భాశయంలో అండాలు ప్రవేశించ వీలులేనిది

సుశివక్త్ర లేదా సుసిముఖి - చిన్న యోని లేదా అభివృద్ధి చెందని యోని గలది

వంధ్య - రుతుస్రావం లేనిది

మోఘపుష్ప - గర్భవతి కానిది

పుత్రఘ్ని - తరచుగా గర్భస్రావం అయ్యే స్త్రీ

తృతీయ ప్రకృతి- పీపుల్ ఆఫ్ ది థర్డ్ సెక్స్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తృతీయ ప్రకృతి- పీపుల్ ఆఫ్ ది థర్డ్ సెక్స్ పుస్తకం

కామసూత్రంలో స్వైరిణి ప్రస్తావన ఉంది. భార్గవ పురాణంలో కామిని, మహాభారతంలో స్త్రీపుంసల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ మూడు రకాల స్త్రీలను వారి లైంగిక ప్రవర్తన ఆధారంగా వర్గీకరించారు.

షండ అనే సంస్కృత పదాన్ని పుట్టుకతో వచ్చిన పురుషత్వాన్ని కోల్పోయి, స్త్రీలా ప్రవర్తించే వ్యక్తిని సూచించడానికి ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా, స్త్రీ ఆకారంలో ఉండి, పురుషుడిలా ఉండాలని కోరుకునే వ్యక్తిని స్త్రీపుంస అని అంటారు.

నపుంసకుడు అంటే ఇంటర్ సెక్సువల్‌‌గా భావించాలి. అంటే పుట్టినప్పుడు ఆ వ్యక్తి మగా లేక ఆడా అన్నది నిర్ధారించలేని స్థితిలో ఉన్న వ్యక్తిని నపుంసకుడు అని అంటారు.

ప్రాచీన వేద భారతదేశంలో, లింగమార్పిడి వ్యక్తులు తమ జెండర్ ఐడెంటిటీని సమాజం నుండి దాచాల్సిన అవసరం లేదని, అయితే తమ అవయవాలను గుడ్డతో కప్పి ఉంచాలని అమరా రాశారు.

స్వలింగ సంపర్కాన్ని అంగీకరించే స్థితిలో మన సమాజం లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని ఆమోదించడానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌జీబీటీక్యూ అని పిలుచుకునే ఈ వర్గం వ్యక్తులు తమ జెండర్ ఐడెంటినీ సాధించడానికి పోరాడుతుండగా, ప్రాచీన భారతదేశంలో దీనికి సంఘం నుంచి ఆమోదం ఉంది. వారికి భిన్నమైన జెండర్ ఐడెంటినీ అప్పట్లో అంగీకరించారు.

గే అండ్ లెస్బియన్ వైష్ణవ్ అసోసియేషన్ (GALVA-108) అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. వేద సాహిత్యంలో లింగ వైవిధ్యంపై పరిశోధన చేసి కథనాలు రాసింది. అమర దాస్ విలియమ్స్ దీనీని తన మరో ముగ్గురు సహచరులతో కలిసి 2001లో స్థాపించారు. ఆయన 'తృతీయ ప్రకృతి- పీపుల్ ఆఫ్ ది థర్డ్ సెక్స్' అనే పుస్తకాన్ని రచించారు.

నారద స్మృతి, సుశ్రుత సంహిత, వాత్సయనుడు రాసిన కామసూత్రాలలో లైంగిక ధోరణిని బట్టి వర్గీకరణలు కనిపిస్తాయని ఆయన నిరూపించారు.

కామసూత్రలో 'తృతీయ ప్రకృతి' అనే పద ప్రయోగం కనిపిస్తుంది.

బ్రిటిష్ పాలన పరిణామాలు

మన గ్రంథాలలో జెండర్, ఇండివిడ్యువల్ సెక్సువల్ డైవర్సిటీ చోటు చేసుకుంటే మనం వాటిని ఎలా అర్థం చేసుకున్నాం, మారుతున్న కాలంలో మనం ఈ సామాజిక అంశాలకు ఎలా అలవాటు పడ్డాం? వారిని సమాజంలోని ప్రధాన స్రవంతి సభ్యులుగా అంగీకరించకపోవడం ఎప్పటి నుంచి మొదలైంది?

బ్రిటీష్ వలసవాద మనస్తత్వం ప్రభావంతో మనం ఇంకా ఇబ్బంది పడుతున్నామని రచయిత్రి, ప్రొఫెసర్ మాధవీ మీనన్ అన్నారు.

మనం ఇప్పుడు తృతీయ ప్రకృతి అని పిలుస్తున్న 'థర్డ్ జెండర్' గురించి కామసూత్ర కాలం నుంచే మనకు అవగాహన ఉంది.

'హిజ్రాలు' అని పిలిపించుకునే వారికి మొఘల్ ఆస్థానంలో గౌరవ స్థానం ఉంది. వివిధ వేడుకలు, మతపరమైన కార్యక్రమాలలో వారి ఉనికిని శుభప్రదంగా భావించేవారు.

కానీ బ్రిటీష్ వారు భారతదేశానికి వచ్చాకా, అసలు మగవాళ్లు ఆడవాళ్ల వేషం ఎలా వేస్తారు అని ప్రశ్నించడం మొదలైంది.

అప్పట్లో వారు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకువచ్చి ఒక వ్యక్తి తన జెండర్‌కు అనుగుణంగా వేషధారణ లేకపోతే అతన్ని అరెస్టు చేయవచ్చు అని నిర్ణయించారు.

సంతానోత్పత్తి లైంగికత చట్రంలో సరిపోని వాటినన్నింటినీ వాళ్లు నేరంగా పరిగణించారు.

ఆలయ శిల్పాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆలయ శిల్పాలు - స్వలింగ సంపర్కం

ప్రాచీన భారతదేశంలో లైంగికత విషయంలో అందరినీ కలుపుకుపోయే ఉదారవాద విధానం కామసూత్రలాంటి గ్రంథాలకే పరిమితం కాలేదు. పురాతన శిల్పాలలో కూడా ఈ స్వభావం కనిపిస్తుంది.

ఈ శిల్పాల గురించి ప్రముఖ రచయిత, పురాణాలను చదివిన పండితుడు దేవదత్త పట్నాయక్ ఇలా అన్నారు, "కాంచీపురం, కోణార్క్, ఖజురహో వంటి దేవాలయాల గోడలపై స్వలింగ సంపర్క వర్ణనలు ఉన్నాయి. అవి సాధారణంగా స్త్రీలు కామోద్రేకంలో ఉన్నట్లుంటాయి. బహుశా వాళ్లంతా ప్రేమలో ఉన్న స్త్రీలు కావచ్చు. లేదంటే పురుషులను సంతోషపెట్టే ఆలయ నృత్యకారులు కావచ్చు.’’

"ఇద్దరు పురుషులు శృంగారంలో పాల్గొన్నట్లు చూపించే బొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి. బహుశా గోడలపై తృతీయ ప్రకృతి వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ, మనం వాటిని రూపాన్ని బట్టి స్త్రీ లేదా పురుషుడు అనుకుంటుంటాం. ఇది చూసేవారి దృష్టిపై ఆధారపడి ఉంటుంది" అన్నారాయన.

వేద భారతదేశం, పురాణాలలో కాలక్రమేణా లైంగికత విషయంలో ఉదారవాద స్వభావం ఎలా తగ్గుముఖం పట్టిందో దేవదత్ వివరించారు.

"ఈ ఆలోచనలు పూర్తిగా పోలేదు. నేటికీ మధురలో శివుడిని బృందావనంలో స్త్రీగా పూజిస్తారు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో మోహినీ అవతారంలో బాలాజీకి చీర చుడతారు. కర్ణాటకలో పులిగమ్మ దేవికి మీసాలు పెడతారు. మగ దేవతలకు స్త్రీల ఆభరణాలు వేస్తారు. అంటే, జెండర్ విషయంలో మన ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవని, మారుతూ వచ్చాయని అర్ధం’’ అన్నారాయన.

ఆలయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆలయాలు

ఆలయాలలో సెక్స్‌ను చూపించే శిల్పాలు, ఇతర బొమ్మల గురించి ఖజురహోలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్న నరేంద్ర మాట్లాడారు.

“ఖజురహో ఒక మతపరమైన రాజధాని మాత్రమే కాదు, విద్యా కేంద్రం కూడా. ఇది కళ గురించి మాత్రమే కాదు, స్వలింగ సంపర్కం, శారీరక సంభోగం గురించి కూడా చెబుతుందిద. ఈ శిల్పం జీవితంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, దాని చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంగా కనిపిస్తుంది" అన్నారు నరేంద్ర

కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా ఈ శిల్పాలను ఒకేలా చూడరని నరేంద్ర అనుభవం చెబుతోంది.

“ఇక్కడికి వచ్చే టూరిస్టులు కొందరు మేం ఈ దేవాలయాలను చూడకూడదని అంటుంటారు. ఇందులో శృంగారానికి సంబంధించిన బొమ్మలున్నాయి, పిల్లలు, కుటుంబంతో కలిసి వచ్చాం కాబట్టి అలాంటి వాటిని దర్శించలేమని అంటుంటారు’’ అని నరేంద్ర చెప్పారు. కళ, సంస్కృతి వారసత్వపు విలువ మనకు ఇప్పటికీ తెలియడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కామసూత్ర, లేదా దేవాలయాలలోని పురాతన శిల్పాలలో మాత్రమే కాదు, అనేక హిందూ గ్రంథాలు, సాహిత్యంలో కాముక జీవితం, లైంగికత గురించి చాలా విషయాలు ఉన్నాయి.

శివ పార్వతుల ప్రేమ కాళిదాసు కుమారసంభవంలో కనిపిస్తుంది. 14వ శతాబ్దంలో జయదేవుడి గీత గోవిందంలో శ్రీకృష్ణుడు స్త్రీ వేషం ధరించాడని చెబుతుంది. అందులో బొమ్మలు కూడా ఉంటాయి. రాధా-కృష్ణులు ఇద్దరూ ఒకే విధమైన దుస్తులు ధరించిన బొమ్మలు కనిపిస్తాయి.

అర్ధనారీశ్వర ప్రతిమకు అర్దం ఏంటి? పిల్లలు పుట్టాలనే ఉద్దేశ్యంతో శారీరక సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషులకు మాత్రమే జెండర్ ఐడెంటిటీలు ఉండవనీ, జెండర్ ఐడెంటిటీ అనేది అంతకు మించినది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

అందుకే ఆధ్యాత్మికత పవిత్రమనీ, సెక్స్ అపవిత్రమనీ అనుకునే వారు పునరాలోచించుకోవాలి. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికతను, లైంగికతను ఒక సూత్రంలో బంధించడానికి ప్రయత్నించాం. అది కామసూత్ర కాలంలో జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)