ఈ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు ఇంట్లోకి రావు

బొద్దింకలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేష్
    • హోదా, బీబీసీ తమిళ్

చాలా మందికి ముఖ్యంగా మహిళలకు బొద్దింకలంటే భయం, చిరాకు.

నాకు ఆరేళ్లుండగా వంటగదిలో నుంచి ఓ గాజు సీసా తీస్తుండగా, దాని వెనకున్న బొద్దింక ఎగిరి నా మెడపై పడింది. భయంతో అరుస్తూ గాజు సీసా కిందపడేశాను. అంతకుముందు కూడా నేను బొద్దింకను చూశా. అయితే అంత దగ్గరగా చూడలేదు.

ఇంటి దగ్గర మా అన్నదమ్ములు మాత్రం బొద్దింకలతో ఆడుకుంటుంటారు. నాకైతే విరక్తి వచ్చేది.

నిజానికి బొద్దింకలకు మనుషులు భయపడాల్సిన అవసరం లేదని ఇపుడు తెలుస్తోంది.

ఎందుకంటే దోమలు, ఇతర కీటకాల మాదిరి అవి మన రక్తం తాగవు కదా.

అయితే, బొద్దింకలు చాలా కలుషితమైన ప్రాంతాలలో జీవిస్తాయని అటవీ పర్యావరణ పరిశోధనా సంస్థలో కీటక శాస్త్రవేత్త బ్రోనోయ్ అంటున్నారు.

"సాధారణంగా మురికి ప్రదేశాలు, చెత్తాచెదారం, టాయిలెట్లు మొదలైన వాటిలో బొద్దింకలు కనిపిస్తాయి. అందుకే వాటిని చాలా మంది అసహ్యించుకుంటారు" అని బ్రోనోయ్ తెలిపారు.

బొద్దింకల ద్వారా వ్యాధులు వస్తాయనే భయం పురాతన గ్రీస్ కాలం నుంచి ఉందన్నారు బ్రోనోయ్.

‘‘ప్రాచీన గ్రీకుల కాలంలో బొద్దింకల వల్ల వ్యాధులు వస్తాయని భయపడేవారు. బొద్దింకల్లో ట్రోపోమియోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. బొద్దింక మలం, చర్మం, శరీర భాగాలలో ఉండే ఈ ప్రోటీన్ మానవులకు అలర్జీని కలిగిస్తుంది" అని బ్రోనోయ్ చెప్పారు.

పురాతన ఈజిప్షియన్లు బొద్దింకలను తరిమేందుకు దేవుళ్లను పూజించేవారు.

వైద్య పరిభాషలో బొద్దింకలంటే భయం లేదా అసహ్యం కలగడాన్ని ‘కట్సరిడాఫోబియా’ అంటారు.

బొద్దింకలు

ఫొటో సోర్స్, Getty Images

బొద్దింకల ద్వారా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?

బొద్దింకల వల్ల మనుషులకు నేరుగా ఎలాంటి వ్యాధి రాదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంటమాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ సెల్వముత్తుకుమరన్ చెబుతున్నారు.

''మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. కలరా ఈగల ద్వారా వ్యాపిస్తుంది. కానీ బొద్దింకల ద్వారా మనుషులకు నేరుగా వ్యాధులు సంక్రమించవు. అయితే, బొద్దింకలు తినే కుళ్లిన పదార్థంలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి తిన్న తర్వాత మనం తినే ఆహారంపై బొద్దింకలు చేరినప్పుడు ఈ సూక్ష్మజీవులు మన ఆహారంలో కలిసిపోయి మనకు రోగాలను కలిగిస్తాయి'' అని అన్నారు సెల్వ.

బొద్దింక

ఫొటో సోర్స్, Getty Images

ఇంట్లోకి రాకుండా ఎలా నియంత్రించాలి?

ఆహారం, తేమతో కూడిన వాతావరణం ఉన్నచోట బొద్దింకలు వృద్ధి చెందుతాయని, పరిశుభ్రత పాటిస్తే అవి రావని సెల్వముత్తుకుమరన్ సూచిస్తున్నారు.

  • తిన్న ప్లేట్లను వెంటనే కడగాలి. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే బయట పడేయాలి.
  • ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. మీరు ఉపయోగించే చెత్త డబ్బాలు మూసివేయదగినవిగా ఉండాలి. వాటిని రాత్రిపూట ఇంటి బయట పెట్టాలి.
  • బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.
  • అట్ట పెట్టెలపై శ్రద్ధ వహించండి. ఆ పెట్టెలను చెక్క గుజ్జుతో తయారు చేస్తారు. బొద్దింకలకు ఇవి అద్భుతమైన ఆహారం.
  • బొద్దింకలు చాలా వరకు డిష్ వాషర్ల నుంచే ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, రాత్రి పూట దానిపై ఏదైనా కప్పి ఉంచితే బెటర్.
  • బొద్దింకలను ఇంటి లోపల నుంచి పంపేందుకు స్ప్రేలు, జెల్‌లను ఉపయోగిస్తారు. అయితే, ఏరోసోల్‌ల ఉపయోగం మనుషులకు కూడా హానికరమే.
వీడియో క్యాప్షన్, బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఏం చేయాలంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)