‘రాహుల్‌కు పెళ్లి చేస్తాం, అమ్మాయి ఉంటే చెప్పండి’: హరియాణా మహిళలతో సోనియా గాంధీ వ్యాఖ్యలు

హరియాణ మహిళతో సోనియా

ఫొటో సోర్స్, INC @TWITTER

ఫొటో క్యాప్షన్, హరియాణ మహిళతో సోనియా

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పెళ్లి చేసుకోవాలంటూ రాహుల్ గాంధీకి బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సలహా ఇచ్చారు. జూన్‌లో పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం సందర్భంగా లాలూ చేసిన సూచనపై సోషల్ మీడియాలో చర్చలు బాగానే నడిచాయి.

తాజాగా రాహుల్ పెళ్లి దిల్లీలో కూడా చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై సోనియా గాంధీ హరియాణా మహిళలలో చేసిన వ్యాఖ్యలు , రాహుల్ గాంధీల స్పందనలు వైరల్‌గా మారాయి. అంతేకాదు రాహుల్ పెళ్లి ప్రస్తావనను రాజకీయ వ్యూహంగా పలువురు భావిస్తున్నారు. ఇంతకీ మహిళలతో సోనియా ఏమన్నారు?

రాహుల్ గాంధీ శనివారం (జూలై 29) ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఇందులోరాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో హరియాణాకు చెందిన కొందరు మహిళా రైతుల భేటీని చూపించారు.

ఈ నెల 8వ తేదీన దిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్ వెళ్తుండగా సోనిపట్‌లోని మదీనా అనే గ్రామంలో రాహుల్ గాంధీ ఆగారు.

పొలాల్లో పని చేస్తున్న కొంతమంది రైతులతో రాహుల్ మాట్లాడారు. అక్కడి మహిళలు రాహుల్ గాంధీతో దిల్లీ ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ, ఎప్పుడూ చూడలేదని అన్నారు.

దీంతో దిల్లీలో 10 జనపథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ ఇంటికి రావాల్సిందిగా రాహుల్ ఆ మహిళలను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సోనియా ఇంటికి హరియాణా మహిళలు వచ్చారు.

ఇంటికి వచ్చిన అతిథులకు సోనియా భోజనం ఏర్పాటు చేశారు. అయితే, ఈ మహిళలు తమ వెంట ఆహార పదార్థాలు కూడా తెచ్చుకున్నారు.

ఈ భేటీ వీడియోను రాహుల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

ఈ వీడియోలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు వచ్చిన మహిళలు మెడిసిన్, విత్తనాలు, గ్యాస్ ధరలు మొదలుకొని మహిళా హక్కుల వరకు పలు అంశాలపై మాట్లాడుతున్నట్లు ఉంది.

ఈ సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీతో రాహుల్‌కు పెళ్లి చేద్దామని అడిగారు.

దానికి సోనియా గాంధీ స్పందిస్తూ.. ‘మీరు అమ్మాయిని వెతకండి' అన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ ‘అది జరుగుతుంది' అని బదులిచ్చారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FACEBOOK

రాహుల్ ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు?

జూన్‌లో రాహుల్‌ గాంధీ దిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్ మెకానిక్‌లతో కాసేపు మాట్లాడారు. ఈ క్రమంలో ఓ బైక్ రిపేర్ కూడా చేశారు.

ఆ సమయంలో విక్కీ అనే మెకానిక్ రాహుల్‌ను "పెళ్లెప్పుడు?" అని అడిగారు. దీనికి రాహుల్ స్పందిస్తూ 'మీరెప్పుడంటే అప్పుడే' అని బదులిచ్చారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ స్వయంగా పెళ్లి గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి సోనియా, నానమ్మ ఇందిర వంటి గుణాలున్న మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రాహుల్ చెప్పారు.

మరొక ఇంటర్వ్యూలో "మా అమ్మ, నాన్నల మధ్య చాలా మంచి అనుబంధం, ప్రేమ ఉంది. అందుకే నా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సరైన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా" అని అన్నారు.

అయితే రాహుల్ పెళ్లి ప్రస్తావనలో 'రాజకీయ వ్యూహం' కూడా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, DREW ANGERER/GETTY IMAGES

రాహుల్ పెళ్లి ప్రస్తావన రాజకీయ వ్యూహమా?

పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ రాహుల్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తొందరగా పెళ్లి చేసుకోవాలని, బరాత్‌కు వస్తామని లాలూ అన్నారు. అయితే దీన్ని రాజకీయ నిపుణులు మరో కోణంలో చూస్తున్నారు.

రాహుల్ గాంధీని వరుడిగా సంబోధిస్తూ ఇండియా కూటమికి ఆయన ఒక ఫేస్‌లాగా ఉండాలని లాలూ సింబాలిక్ గా చెప్పారని అంటున్నారు.

రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మహిళా ఓటర్లను ఆకర్షించడంలో భాగమేనని పలువురు విశ్లేషిస్తున్నారు.

2019లో మహిళల్లో ఆదరణ అత్యధికంగా బీజేపీకే దక్కిందని ఆ పార్టీ చెబుతూ వస్తోంది.

2022 ప్రారంభంలో ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అయితే, భాజపా విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారని పలువురి అంచనా.

"బీజేపీ మహిళలకు ఆకర్షణీయంగా మారింది. దానికి మోదీనే కారకుడు" అని బీబీసీతో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కు చెందిన సంజయ్ కుమార్ తెలిపారు.

రాహుల్ గాంధీకి కూడా మహిళల్లో మంచి ఆదరణ ఉంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి అన్ని వయసుల మహిళల నుంచి మద్దతు లభించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

రాహుల్ ఇమేజ్ పెంచే యోచన

"2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇమేజ్‌ను పెంచడానికి ప్రయత్నిస్తోంది" అని రాజకీయ విశ్లేషకుడు, రచయిత రషీద్ కిద్వాయ్ అంటున్నారు.

అయితే, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలోని విషయాలు ప్రజాజీవితంపై పెద్దగా ప్రభావం చూపవని కూడా రషీద్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

"ములాయం సింగ్ యాదవ్ రెండో వివాహం ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయలేదు. అదేవిధంగా నటుడు ధర్మేంద్ర ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు అతని రెండో వివాహం చర్చనీయాంశమైంది. కానీ అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేదు" అని గుర్తుచేశారు రషీద్.

రాజకీయాల్లో లీడర్ పెళ్లి చేసుకున్నారా, చేసుకోలేదా, ఒంటరిగా ఉన్నారా? అన్నది ముఖ్యం కాదని రషీద్ అంటున్నారు.

దేశంలో వాజ్‌పేయి, నరేంద్ర మోదీ వంటి నాయకులు కూడా ఉన్నారని, ప్రజానీకం వారికి మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు రషీద్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)