వన్నూరమ్మ: బంజరు భూమిలో ప్రకృతి సేద్యం, ప్రధాని మోదీ మెచ్చుకున్న ఆ గిరిజన మహిళ విజయగాథ ఏంటి?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
“నేను ఒక ఒంటరి మహిళను. భర్త లేడు. నలుగురు పిల్లలను చదివించి, పెద్దవాళ్లను చేసి ఈరోజూ ఎవరి మీదా ఆధారపడకుండా బతికే స్థాయికి చేరుకున్నాను.”
గిరిజన మహిళ వన్నూరమ్మ గర్వంగా చెప్పే ఈ మాటలే ఆమె సాధించిన విజయాలకు ఉదాహరణ.
అందుకే, ఏకంగా దేశ ప్రధాని నుంచే ప్రశంసలు అందుకున్న రైతుగా నిలిచారామె.
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మండలంలోని దురదగుంట వన్నూరమ్మ స్వగ్రామం.
2010లో ఆమె భర్త చనిపోయారు. ఆ తర్వాత ఒంటరిగానే తన నలుగురు పిల్లలను చదివించి ప్రయోజకులను చేశారు.
ఎందుకూ పనికిరాదనుకున్న తన బంజరు భూమిలో రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు.
ఈ తరహా వ్యవసాయం చేస్తున్న రైతుగా విజయాలు అందుకోవడమే కాదు, ఇప్పుడు ఎంతోమంది రైతులను తనతోపాటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

కూలీ నుంచి రైతుగా
మొదట్లో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకున్న ఆమె, ప్రభుత్వ సహకారంతో తన బంజరు భూమిలో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు.
“నేను మొదట ఒక ఎకరాన్ని వ్యవసాయం కోసం తయారు చేసుకున్నాను. తర్వాత నాకున్న మొత్తం భూమిలో ప్రకృతి వ్యసాయమే చేసుకున్నాను. మొత్తం 20 రకాల ధాన్యాలు పండించాను. బంజరు భూమి అయినా పంట చాలా బాగా వచ్చింది. అక్కడే వేరుశెనగ వేస్తే ఆ ఏడాది నాకు లక్ష రూపాయలు వచ్చాయి” అని వన్నూరమ్మ తెలిపారు.
పంటపై వచ్చిన లాభాలనే మళ్లీ వ్యవసాయంపైనే పెట్టుబడిగా పెట్టారు. ప్రకృతి వ్యవసాయం కోసం ఆమె ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా ఉపయోగించారు.
“పంట నుంచి నాకు డబ్బులు వచ్చిన తర్వాత పొలంలో బోర్ వేయించాను. నీళ్లు వచ్చాయి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కింద కూరగాయలు, మొక్కజొన్న, అలసందలు ఇలా రకరకాల పంటలు సాగు చేశాను. అలా వర్షాధార పంటలతోపాటూ డ్రిప్ ఇరిగేషన్ కింద కూడా వ్యవసాయం చేస్తున్నా.” అని చెప్పారామె.
“నా భర్త 2010లో చనిపోయాడు. చాలా కష్టాలు పడ్డాను. నా పిల్లలు దిక్కులేని వాళ్లు కాకూడదని, వారిని ఒక స్థాయికి చేర్చాలని కష్టపడ్డాను. నలుగురి పిల్లల్లో నా కూతురికి, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసేశాను. నా చిన్న కొడుకు ప్రస్తుతం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇలా వ్యవసాయం చేసుకుంటూనే వారిని ప్రయోజకుల్ని చేశాను” అని అన్నారు.
ఒకప్పుడు నలుగురు పిల్లలను ఎలా పోషించాలో తెలీక దిక్కుతోచని స్థితిలో పడిన తాను ఇప్పుడు పది మంది జీవితాలను సరిచేయగలిగే స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెబుతున్నారు వన్నూరమ్మ.
“మొదట కూలి పనులకు వెళ్లేదాన్ని. రూ.200 కూలి ఇచ్చేవారు. ఆ రూ.200తో నలుగురు పిల్లలను ఎలా పెంచాలి. వారికి ఏం చేయాలని ఆలోచించేదాన్ని. ఇప్పుడు పంటలు పండిస్తూ ఒంటరి మహిళను అయినా గర్వంగా, ధైర్యంగా బతుకుతున్నా. వ్యవసాయం చేసుకుని ఎలా బతకవచ్చో పది మందికి చెప్పి, వారు కూడా బాగుపడేలా చేసే స్థాయికి చేరుకున్నాను” అని చెప్పారు.

ప్రధాని నుంచి ప్రశంసలు
వన్నూరమ్మ సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందంటే ఆమెపై ప్రధాని ప్రశంసలు కురిపించడం వల్లే. 8వ విడత రైతు సమ్మాన్ నిధి విడుదల సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ విజయాలు సాధించిన వివిధ రాష్ట్రాల రైతులతో మాట్లాడిన ప్రధాని, వన్నూరమ్మతో కూడా మాట్లాడారు.
2021 మే 14న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన్నూరమ్మతో మాట్లాడారు. ఆ సమయంలో బంజరు భూమిలో ఆమె ఈ తరహా వ్యవసాయం చేయడాన్ని ప్రధాని మెచ్చుకున్నారు.
‘‘మీరు కృషితో బంజరు భూమిలో పంటలు సాగు చేశారని నేను విన్నాను. అది మీరు ఎలా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మీ అనుభవాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. వాళ్లు కూడా కచ్చితంగా మీ మాటలు వినాలని కోరుకుంటారు.’’ అని ప్రధాని ఆమెతో అన్నారు.
ఆ సమయంలోనే వన్నూరమ్మ తమకు ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమి ఇచ్చిందని, అది పదేళ్లుగా సాగుకు పనికిరాకుండా ఉండిపోయిందని ప్రధానికి చెప్పారు.
అందులో రెండెకరాల భూమిలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా మూడు పంటలు పండించానని వన్నూరమ్మ చెప్పారు.
నవధాన్యాలు, వేరుశెనగ, కూరగాయలు సాగు చేశానన్నారు. పెట్టుబడి రూ.27 వేలు అయితే ఎకరాకు లక్ష రూపాయలకు పైనే లాభాలు సంపాదించానని ఆమె వివరించారు.
తమకు వర్షపాతం తక్కువ కాబట్టే ప్రకృతి వ్యవసాయం చేయాల్సి వచ్చిందని ప్రధానికి చెప్పారు వన్నూరమ్మ.
అడిగిన వెంటనే ఆపకుండా వన్నూరమ్మ తన వ్యవసాయం గురించి వివరించడం ప్రధానిని కూడా ఆకట్టుకుంది.
ఆ సమయంలో ఆయన వన్నూరమ్మను సూపర్ ఫాస్ట్ అని కూడా వర్ణించారు ప్రధాని . ‘‘వ్యవసాయంలో మీ అనుభవం, మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని అలా మాట్లాడించింది.’’ అని ప్రశంసించారు.
తమ పక్క తండాలోని 70 మంది గిరిజన మహిళలకు కూడా ప్రస్తుతం తను చేస్తున్న వ్యవసాయ విధానాన్ని నేర్పిస్తున్నానని, వారు కూడా రకరకాల పంటలు సాగు చేస్తున్నారని వన్నూరమ్మ ప్రధానితో చెప్పారు.
బంజరు భూమిని సాగు భూమిగా మార్చినందుకు మెచ్చుకుంటూనే.. ఎంతోమంది ఆదివాసీలను తనతో కలుపుకుని ఆ సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆకట్టుకుందని చెప్పారు.
రైతు తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అనడానికి మీరే సజీవ సాక్ష్యమంటూ ఆమెను ప్రధాని అభినందించారు.

ప్రధాని ప్రశంసలే బలంగా
ప్రధాని తనతో మాట్లాడడాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు వన్నూరమ్మ. ఆ రోజు ఆయన మాటలు తనలో మరింత ఉత్సాహాన్ని నింపాయంటున్నారు.
“2019లో పంట వేశాను 2020లో నా పంట బాగా వచ్చింది. దాంతో నన్ను ప్రధాన మంత్రితో మాట్లాడించారు. మాకు దగ్గరలో చెలికేరు అని ఉంది. అక్కడ మేము పంట అమ్ముకునేవాళ్లం. లేదంటే ఎస్ఈఓ ఆడిట్ వాళ్లు తీసుకునేవాళ్లు. ప్రధానితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు టీటీడీ వాళ్ళు కూడా మా వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుంటామని మా పేర్లు నమోదు చేసుకున్నారు. మేం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.
రసాయనాలు వాడడం వల్ల పంటలు దెబ్బతింటాయని, అందుకే సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తూ నేలను కూడా సారవంతంగా మారుస్తున్నామని వన్నూరమ్మ వివరించారు.
“కెమికల్స్ వాడడం వల్ల వర్షాలు పడకపోతే పంటలు దెబ్బతింటాయి. అదే సేంద్రీయ వ్యవసాయం అయితే మనం జీవామృతం కొట్టడం వల్ల ఎండలకు పంట తట్టుకుంటుంది. ఘన జీవామృతం వేయడం వల్ల నేల మెత్తగా స్పాంజ్‌లా మారుతుంది. నేలలో 15 అడుగుల కింద వానపాముల బొరియలు ఉంటాయి.
ఘన జీవామృతం వేయడం వల్ల ఆ బొరియల్లోని వానపాములు బయటకు వచ్చి ఘన జీవామృతం తిని లాలాజలాన్ని మొక్కలకు ఆహారంగా వేస్తాయి. దీంతో పంట బెట్టను తట్టుకుంటుంది. గాలిలో నుంచి, భూమి నుంచి మొక్కలకు తేమ అందుతుంది కాబట్టి, వర్షపాతం తక్కువైనా పంట పండించుకోవచ్చు” అని చెప్పారు.
సేంద్రీయ వ్యవసాయం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయని వన్నూరమ్మ చెబుతున్నారు.
“మేం రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండిస్తున్నాం. రసాయనాలు వాడితే అవి మూడు రోజులకే పాడవుతాయి. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిస్తున్నందున్న వారం, పది రోజులు ఉంచినా కూరగాయలు, టమాటాలు లాంటివి పాడవకుండా ఉంటున్నాయి. అందుకే మేం సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఎంచుకున్నాం.” అని అన్నారు.

పంటను రాష్ట్రాలు దాటిస్తున్నారు
తాము పండించిన ఉత్పత్తులను బెంగళూరుకు తీసుకెళ్లినపుడు మొదట అనంతపురం నుంచి తీసుకెళ్లినవే అమ్ముడయ్యాయని, తమ పంటకు చాలా డిమాండ్ ఉందని సంతోషంగా చెబుతారు వన్నూరమ్మ.
‘‘మేం 20 మంది కలిసి కొర్రలు పండించి బెంగళూరుకు పంపిస్తున్నాం, ఇక్కడ మా కలెక్టర్ మీరు అన్నీ పండించండి వాటిని మేమే తీసుకుంటాం, మార్కెటింగ్ చేస్తామని చెబుతున్నారు. 20 మంది రైతులను కలిసి మీరు రాగులు, కొర్రలు పండించండి, మార్కెటింగ్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. మాకు అంతకంటే ఇంకేం కావాలి. ఇప్పటికే బెంగళూరు వాళ్లు మా దగ్గర కిలో కొర్రలు రూ.350కి కొంటున్నారు.’’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ విధానంలో వచ్చిన ఉత్పత్తులకు బెంగళూరులో మంచి మార్కెట్ ఉందని, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి తమ ఉత్పత్తులను అడుగుతున్నారని ఆమె చెబుతున్నారు. వాటిని బస్సులు, ఇతర మార్గాల ద్వారా వారికి అందేలా చేస్తున్నానని తెలిపారు.
“బెంగళూరులో మా ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉంది. వాళ్ళు మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి కొర్రలు, రాగులు అడుగుతుంటారు. మేం సేంద్రీయ వ్యవసాయం చేస్తే 20 రాష్ట్రాల నుంచి మా ఉత్పత్తులు అడిగారు.
10 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రవాణ చేశాం. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి చాలా మంది మా ఉత్పత్తుల కోసం అడుగుతుంటారు. నేను కొందరికి బస్సులో పంపిస్తే, వాళ్లు అక్కడ వాటిని తీసుకుంటున్నారు” అన్నారు.

మార్కెట్ రేటు కంటే రూ.5 ఎక్కువే ఇస్తా
కూలీ నుంచి రైతుగా మారి ప్రకృతి వ్యవసాయ విధానంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న వన్నూరమ్మ ఇప్పుడు తనలాంటి రైతుల నుంచి పంట కొనుగోలు చేసి ఇతరులకు సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారు.
రైతులకు మార్కెట్ రేటు కంటే 5 రూపాయలు ఎక్కువే ఇస్తానని చెబుతున్నారు.
“సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతుల దగ్గర ఉత్పత్తులను ఇప్పుడు నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటాను. ఇంకా వేరే పంటలు కూడా అడుగుతున్నారు. రైతుల దగ్గర ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేస్తాం. అవసరమైతే 5, 10 రూపాయలు ఎక్కువే ఇస్తాను.
మేము ఇక్కడ కిలో కొర్రలు రూ.300 కొనుగోలు చేస్తే, వారికి అందేసరికి రవాణా ఖర్చులు అన్నీ కలిసి రూ.350 కూడా కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీటిని కొనుగోలు చేస్తా అంటోంది. ఆర్‌బీకే( రైలు భరోసా కేంద్రం)కు ఇస్తాం. తర్వాత వాళ్ళ అమ్ముకుంటారు. మార్కెట్ రేటు బట్టి తీసుకుంటారు” అని తెలిపారు.
వ్యవసాయంలో వచ్చిన లాభాలను వృథా చేయకుండా దానిని ఎగుడు దిగుడుగా ఉన్న మొత్తం భూములను చదును చేయించారు వన్నూరమ్మ.

వన్నూరమ్మ బాటలో
అనంతపురం జిల్లాలోనే కల్యాణదుర్గం, పాలవాయికి చెందిన చంద్రకళ కూడా వన్నూరమ్మ బాటలోనే నడుస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం లాభసాటిగానే ఉందంటున్నారు.
“రెండు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. దీనివల్ల మాకు లాభం బాగుంది. వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ముల్లంగి, గోరు చిక్కుడు, అలసందలు అన్నీ వేసాం. పండించిన వాటిని ఇక్కడే రోడ్లోనే పెట్టుకుని అమ్ముతున్నాను, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాటిని తీసుకుంటారు. వారందరికీ మేం వీటిని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎలాంటి రసాయనాలు కొట్టకుండా పండిస్తున్నామని చెబుతున్నాం” అని తెలిపారు.
రసాయనాల ద్వారా పండే పంటలకు, సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించే పంటలకు సైజులో కూడా ఎలాంటి తేడాలూ ఉండవంటారు చంద్రకళ. పైగా తాము పండించేవి ఆరోగ్యం కూడా అంటున్నారు.
“కూరగాయల సైజు మామూలుగానే వస్తాయి. మందులు కొట్టి పండిస్తే ఎలా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తున్నాయి. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ... పంట కూడా బాగా వస్తుంది. ఇంతకు ముందు టమాటాలు వేసేవాళ్లం. ఇప్పుడు ముల్లంగి, వంకాయ, మిరప, క్యారెట్, బీట్రూట్, చిక్కుడు, అలసందలు, బీన్స్ అన్నీ పెట్టాం వీటివల్ల నాకు నష్టమేమీ లేదు” అని చెప్పారు.

అండగా రైతు సాధికార సంస్థ
వన్నూరమ్మ కృషిని ఏపీ రైతు సాధికార సంస్థ కూడా గుర్తించింది. ఆమె చేస్తున్న వ్యవసాయాన్ని తమ టెక్నాలజీ ద్వారా మెరుగుపరిచామని సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ చెప్పారు.
ఇప్పుడు తాము సమీప గిరిజన గ్రామంలో ఉన్న మహిళా రైతులు అందరికీ టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ వారందరినీ ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లించే ప్రయత్నంలో ఉన్నారన్నారు.
“మేం ఒక మార్కెటింగ్ లింక్ ద్వారా గతంలో వారు పండించిన ఉత్పత్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశాం. అలాగే, బెంగళూర్లో ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్లడం వల్ల వారికి నేరుగా బెంగళూరు మార్కెట్‌తో ఒక కనెక్షన్ ఏర్పడింది. పట్టుదలతో, ఏకాగ్రతతో దానిని వారు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. ఆమె చాలా ప్రత్యేకం. అందుకే ప్రధానమంత్రికి కూడా తన లైఫ్ స్టోరీని చెప్పే అవకాశం ఆమెకు దక్కింది.’’ అని విజయకుమార్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?
- రబ్బర్‌ను చెట్ల నుంచి ఎలా తీస్తారో తెలుసా... ఈ పరిశ్రమకు భారత్‌లో మళ్ళీ మంచిరోజులు వస్తాయా?
- గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట...బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు, అధికారులు
- ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: ఏటా వేల మంది రాయలసీమ కూలీలు గుంటూరుకు ఎందుకు తరలివస్తున్నారు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














