అమెరికాపై నేరుగా విమర్శలు, జపాన్‌కు ప్రశంసలు.. జైశంకర్ దూకుడు

జై శంకర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జై శంకర్

ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల గురించి సాధారణంగా మంత్రులు ప్రజలతో పంచుకోని సమాచారాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పంచుకున్నారు.

అమెరికాతో రక్షణ ఒప్పందాలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, కానీ రక్షణ పరికరాల సరఫరాకు అమెరికానే తటపటాయించిందని ఆయన చెప్పారు.

అమెరికా మిలటరీ ఒప్పందాల విషయంలో వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తూ, వివిధ అంశాల్లో జపాన్‌ సహకారాన్ని ఆయన ప్రశంసించారు. జపాన్ తోడ్పాటు భారత్‌లో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించిందని జైశంకర్ చెప్పారు.

వ్యూహాత్మక భద్రతా సంస్థ ‘క్వాడ్’లో భారత్‌కు అమెరికా, జపాన్ రెండూ మిత్ర దేశాలే.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికాను సందర్శించిన సమయంలో రెండు కీలకమైన ఒప్పందాలు జరిగాయని జపాన్-భారత్ ఫోరమ్‌ సందర్భంగా భారత్‌కు వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి ముందు జైశంకర్ చెప్పారు.

ఒకటి జీఈ ఏరోస్పేస్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన జీఈ 14 ఇంజిన్ తయారీ ఒప్పందం. మరొకటి ‘హైఆల్టిట్యూడ్ యూఏవీల’ కొనుగోలు, అసెంబ్లింగ్ ఒప్పందం.

‘‘అమెరికా నుంచి ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. కానీ, అమెరికానే చాలా ఏళ్లు వాటిని మాకు సరఫరా చేసేందుకు వెనకాడుతూ వచ్చింది’’ అని జైశంకర్ చెప్పారు. భారత్-అమెరికా అణు ఒప్పందం తర్వాత అమెరికా వెనకాడటం తగ్గిందని ఆయన తెలిపారు.

ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ హయాంలో కుదిరింది.

జైశంకర్, యోషిమస

ఫొటో సోర్స్, ANI

భారత్‌లో ‘విప్లవాలు’ తెచ్చిన జపాన్: జైశంకర్

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి ముందు ఆ దేశంపై భారత విదేశాంగ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రంగాల్లో భారత్‌కు జపాన్ సాయపడిందన్నారు. సెమీకండక్టర్ రంగంలో కూడా జపాన్ సాయపడనుందని చెప్పారు.

‘‘జపాన్ ఈ దేశంలో ఒక విప్లవం తర్వాత మరో విప్లవం తీసుకొచ్చింది. మారుతీ విప్లవం అంటే కేవలం సుజుకి ఇక్కడికి రావడం కాదు. దీంతో పాటు మొత్తం జీవన శైలి భారత్‌కు వచ్చింది. ఒక ఆలోచనా విధానం భారత్‌కు వచ్చింది. అదే, పారిశ్రామిక సంస్కృతి’’ అని ఆయన తెలిపారు.

అలాగే భారత్‌లో జపాన్ రెండో విప్లవం మెట్రో రైలు అని జైశంకర్ చెప్పారు. భారత పట్టణ సదుపాయాలపై ఇది పెద్దయెత్తున ప్రభావం చూపిందన్నారు.

భారత్‌లో జపాన్ మూడో విప్లవం ‘హైస్పీడ్ ట్రైన్’ అని, భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే, హైస్పీడ్ ట్రైన్ ప్రయోజనాలను ప్రజలు చూస్తారని ఆయన తెలిపారు. ఇది భారీ ప్రభావం చూపనుందన్నారు.

ఇక నాలుగో విప్లవం క్రిటికల్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగంలో ఉంటుందని ఆయన వివరించారు.

దిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న జపాన్ మంత్రి యోషిమస

ఫొటో సోర్స్, ANI

భారత్, జపాన్ బంధం బలపడాలి: మంత్రులు

‘‘అణ్వస్త్ర వ్యాప్తి, ఉగ్రవాదం లాంటి పలు ముఖ్యమైన సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. వీటిని అణచివేయడం ఎంతో ముఖ్యం. వీటి బాధ్యులను జవాబుదారీగా మార్చాలి’’ అని జైశంకర్ చెప్పారు.

భారత్, జపాన్ కలిసికట్టుగా ఉన్నాయని, భారత్, జపాన్ వంటి ఆలోచనాత్మక దేశాలకు ఉగ్రవాదంపై పోరాటం తొలి ప్రాధాన్యమని జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి కూడా అన్నారు.

గురువారం దిల్లీలో జరిగిన భారత్-జపాన్ ఫోరమ్ ప్రారంభోత్సవ సదస్సులో ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలు, టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతోపాటు సెమీకండక్టర్ రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.

స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ కోసం భారత్, జపాన్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

భారత్‌లో జపాన్ ఐదో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారిగా ఉంది. 37.8 బిలియన్ డాలర్లను అంటే రూ.3,10,941 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.

ఆంటోనీ బ్లింకెన్‌తో జైశంకర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జైశంకర్ (ఫైల్ ఫోటో)

జైశంకర్ దూకుడు

జైశంకర్ కొంత కాలంగా తన కీలక ప్రకటనలతో వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా పశ్చిమ దేశాలపై ఆయన చేసిన ప్రకటనలు ‘సాహసోపేతం’గా ఉంటున్నాయి.

వర్ధమాన దేశాల ఆలోచనలను ఎలాంటి తడబాటు లేకుండా క్లుప్లమైన మాటల్లో తెలియబరిచే వ్యక్తిగా జైశంకర్ పేరు పొందారు.

అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ముందు ధైర్యంగా ఆయన నిలబడుతున్న తీరు, దేశ ప్రజల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ పాపులారిటీని పెంచింది.

జైశంకర్ ప్రకటనలు కొందరికి చిరాకు కూడా తెప్పిస్తుంటాయి.

భారత్‌లో ప్రజాస్వామ్యం సన్నగిల్లుతోందని, మైనార్టీలతో వ్యవహరించే తీరు సరిగ్గా లేదంటూ పశ్చిమ దేశాల్లో కొన్ని కీలక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయాలపై జైశంకర్ స్పందించే తీరు చాలా దూకుడుగా ఉంది. పశ్చిమ దేశాల వైఖరిపై స్పందించిన ఆయన, ‘‘ఇది వాళ్ల కపటత్వం. ఇలాంటి సర్టిఫికేట్లను జారీ చేయడంలో ప్రపంచంలో కొందరు వ్యక్తులు వారికి వారు కాంట్రాక్టర్లుగా మారారు. భారత్ వారి అంగీకారాన్ని కోరుకునే దేశం కాదనే వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)