సెమీ కండక్టర్: కీలకమైన చిప్‌ల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి కాగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బీబీసీ న్యూస్
దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రోత్సాహకాలతో జాతీయ మిషన్‌ను భారత్ ప్రకటించి ఏడాదిన్నర అయింది. అయితే, ఈ విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
గుజరాత్‌లో మూడు బిలియన్ డాలర్ల (రూ.24.57 వేల కోట్ల) విలువైన చిప్‌ల అసెంబ్లీ, టెస్టింగ్ పరిశ్రమను నెలకొల్పబోతున్నట్లు అమెరికా దిగ్గజ సంస్థ మైక్రాన్ ప్రకటించిన కొన్ని రోజులకే, వేదాంతాతో కలిసి ఏర్పాటుచేయాలనుకున్న 19.5 బిలియన్ డాలర్ల (రూ.1.59 లక్షల కోట్లు) చిప్‌ల తయారీ పరిశ్రమ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకుంది.
మరో రెండు కంపెనీలు కూడా ఇలానే తమ ప్రణాళికలను పక్కన పెట్టేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
అయితే, 10 బిలియన్ డాలర్ల (రూ.81.93 వేల కోట్లు) ప్రోత్సాహకాలను వినియోగించుకొని భారీ పెట్టుబడులు పెట్టే చిప్ తయారీ సంస్థల కోసం మోదీ ప్రభుత్వం ఎదురుచూస్తూనే ఉంది. దేశీయ పరిశ్రమను పటిష్ఠం చేసేందుకు టెక్నాలజీ భాగస్వామ్యాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే సెమీకండక్టర్ల సరఫరా గొలుసుల(సప్లై చెయిన్ల)ను పటిష్ఠం చేసేందుకు అమెరికాతో ఇటీవల క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసీఈటీ) ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. జపాన్‌తోనూ గత వారం ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడివిడిగా పారిశ్రామిక విధానాలను ప్రకటించాయి.
భారీ ప్రోత్సాహకాలు, పటిష్ఠమైన విధానాలు ఈ రంగానికి కావాల్సిన ఊతం అందిస్తున్నప్పటికీ, భారత్ తయారీ హబ్‌గా మారాలంటే టెక్నాలజీ బదిలీ ఇక్కడ కీలకమని కార్నెగీ ఇండియాలో పరిశోధకుడుగా పనిచేస్తున్న కోణార్క్ భండారీ చెప్పారు.
‘‘టెక్నాలజీలను తీసుకురావడానికి కంపెనీలు కట్టుబడి ఉన్నాయా అనేది ఇక్కడ వ్యాపార వాతావరణం, దేశీయ విపణి, ఎగుమతులకు అవకాశం, మౌలిక సదుపాయాలు, నిపుణులు లాంటి భిన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ సానుకూలతలు ఏమిటి?
ఆధునిక, డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇంటర్నెట్‌ను శాసించే డేటా సెంటర్ల వరకూ అన్నింటిలో సెమీకండక్టర్లు కీలకంగా పనిచేస్తాయి.
ఆధునిక సెమీకండక్టర్ టెక్నాలజీలు వాతావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల అభివృద్ధిలోనూ కీలకంగా మారుతున్నాయి.
ప్రపంచ చిప్‌ల డిమాండ్‌లో భారత్ వాటా ప్రస్తుతం 5 శాతం వరకూ ఉంది. అయితే, స్మార్ట్‌ఫోన్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వాడకం లాంటివి పెరగడంతో 2026 నాటికి ఈ డిమాండ్ రెట్టింపు అవుతుందని డెలాయిట్ అంచనా వేస్తోంది.
దేశీయ మార్కెట్ పెరగడం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, సరఫరా గొలుసులోని వివిధ దశలైన ‘ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీపీ (అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్), సపోర్ట్’లలో ప్రస్తుతం డిజైన్ ఫంక్షన్‌లో మాత్రమే భారత్ పరిశ్రమలు ఎక్కువగా పనిచేస్తున్నాయి.
మిగతా మాన్యుఫ్యాక్చరింగ్ (చిప్‌ల తయారీ) విషయానికి వస్తే ప్రాథమిక దశలోనే ఇక్కడి పరిశ్రమలు ఉన్నాయి.
‘‘నిపుణుల విషయానికి వస్తే, ప్రపంచంలో 20 శాతం మంది నిపుణులు ఇక్కడే ఉన్నారు. మొత్తంగా 50 వేల మంది నిపుణులు చిప్‌లపై పనిచేస్తున్నారు’’ అని డెలాయిట్ కోసం పనిచేస్తున్న కాథిర్ తాండవరాయన్ చెప్పారు.
భారత్‌లో ఈ కార్మిక శక్తిని ఉపయోగించుకునేందుకు ఇంటెల్, ఏఎండీ, క్వాల్‌కామ్ లాంటి సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఇక్కడ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేశాయి.
అయితే, పెట్టుబడులు పెరిగేటప్పుడు ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది కార్మికులు అవసరం అవుతారని, అప్పుడు కంపెనీలకు నిపుణులు దొరకడం సవాల్‌గా మారొచ్చని డెలాయిట్ అంచనా వేస్తోంది.
దీంతో పరిశ్రమలు-విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది.
‘చిప్స్ టు స్టార్టప్స్’ పథకంలో భాగంగా 85 వేల మంది ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల్లో ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకోవడం, స్థిరంగా విద్యుత్ అందించడం, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన వనరులు సమకూర్చుకోవడం లాంటి అంశాలు కూడా సెమీకండక్టర్ హబ్‌గా భారత్ మారడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా సరఫరా గొలుసులో వేరే దేశం కోసం అమెరికా చూస్తోంది.
‘‘అమెరికాకు సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటి. కాబట్టి అమెరికా కంపెనీలకు భారత్ గమ్యస్థానంగా నిలవొచ్చు’’ అని తాండవరాయన్ అన్నారు.
అయితే, దేశీయ పరిశ్రమలకే ప్రాధాన్యమిచ్చే విధానాలు, రీజినల్ కాంప్రెహెన్షివ్ ఎకనమిక్ పార్ట్‌నర్షిప్(ఆర్‌సీఈపీ) లాంటి వాణిజ్య ఒప్పందాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమూ ఉంది.
‘‘చైనాలో పనిచేస్తున్న కంపెనీలు వేరే దేశాలకు వెళ్లాలని భావిస్తే, తైవాన్ వారికి అనుకూలమైన దేశంగా మారొచ్చు. ఎందుకంటే అక్కడ సుంకాల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. రెండు దేశాల వాణిజ్య విధానాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి’’ అని భండారీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు అడ్డంకులు ఏమిటి?
ఇక్కడ వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉండకపోవడమే భారత్‌కు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ కావచ్చు.
సాఫ్ట్‌వేర్‌లో మొదటి వరుసలో ఉండే భారత్‌లో హార్డ్‌వేర్ పరిశ్రమలు అంతగా కనిపించవు.
దేశ జీడీపీలో తయారీ రంగం ఎప్పటి నుంచో స్తబ్దుగా ఉండిపోయింది. దీనికి కారణం అనుకూల వ్యాపార వాతావరణం లేకపోవడమే.
ఈ పరిస్థితి మారాలంటే చాలా మౌలిక, స్థిరమైన సంస్కరణలను భారత్ తీసుకురావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘కస్టమ్స్/టారిఫ్స్, పన్నులతోపాటు మౌలిక సదుపాయాల లేమి లాంటి అడ్డుగోడలను మొదట తొలగించాల్సి ఉంటుంది’’ అని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఏజెల్ అన్నారు.
‘‘ఈ అడ్డంకులను తొలగించకపోతే దీర్ఘకాలంలో చైనా, యూరోపియన్ యూనియన్, లేదా అమెరికా లాంటి దేశాలతో పోటీపడలేదు. కేవలం ప్రోత్సహకాలపైనే ఇక్కడ ఆధారపడితే సరిపోదు’’ అని ఆయన అన్నారు.
ఎందుకంటే ఇలాంటి ప్రోత్సహకాలను ప్రపంచంలో చాలా దేశాలు అందిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇలాంటి సబ్సిడీలను భారీగా ఇస్తున్నాయి.
‘‘కేవలం ప్రోత్సాహకాల కోసమే కంపెనీలు దేశాలు వదిలి రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ వాటికి మంచి సప్లయిర్స్, పార్ట్‌నర్స్, కన్సూమర్స్, లాజిస్టిక్ నెట్‌వర్క్‌లు ఉంటాయి. కాబట్టి వేరే దేశాల్లో మళ్లీ మొదట్నుంచి ప్రారంభించడం కాస్త కష్టం’’ అని భండారీ చెప్పారు.
సబ్సిడీలు ఇచ్చే విధానాల్లోనూ మార్పులు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా రాయితీలను చిప్‌ల తయారీ సరఫరా గొలుసులో అన్ని దశలకూ ఇస్తున్నారు. దీనికి బదులుగా భారత్ ఏ దశలో నిలదొక్కుకోగలదో అక్కడ ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఉదాహరణకు ఇంజినీర్ల ట్రైనింగ్ స్కూల్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. లేదా సెమీకండక్టర్ ఏటీపీ, డిజైన్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చు.
నేడు భారత సెమీకండక్టర్ భవిష్యత్తు కీలక మలుపులో ఉంది. ఇదివరకు కూడా కొన్నిసార్లు దీనికి ఊతం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవేమీ సఫలం కాలేదు.
చాలా వాయిదాల తర్వాత పటిష్ఠమైన విధానాలతో సరైన దిశగానే తొలి అడుగులు పడ్డాయి.
‘‘ఇదివరకటి తప్పులను సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయం’’ అని భండారీ అన్నారు.
‘‘ఇలాంటి అవకాశాలనే చాలా దేశాలు అందిపుచ్చుకున్నాయి. నేడు అస్తవ్యస్తమైన సరఫరా గొలుసుల నడుమ భారత్‌కూ ఒక అవకాశం వచ్చింది. దీన్ని అందిపుచ్చుకొని హార్డ్‌వేర్ హబ్‌గా మారేందుకు భారత్ ప్రయత్నించొచ్చు. లేదా మరో అవకాశాన్ని చేజార్చుకోనూవచ్చు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
- పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















