వాయేజర్-2 : నాసాతో తిరిగి పూర్తిగా కాంటాక్ట్‌లోకి వచ్చిన స్పేస్‌క్రాఫ్ట్, ఇది ఎలా సాధ్యమైందంటే...

వాయేజర్ 2

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, వాయేజర్ 2

భూమికి బిలియన్ల మైళ్ల దూరంలో ఉంటూ, రెండు వారాలుగా కాంటాక్ట్ కోల్పోయిన వాయేజర్ 2 ఊహించినదానికంటే ముందుగానే తిరిగి నాసాకు కాంటాక్ట్‌లోకి వచ్చింది.

ఒక చిన్న తప్పుడు కమాండ్ కారణంగా వాయేజర్ 2కు నాసాతో సంబంధాలు తెగిపోయాయి. దాని యాంటెన్నా పక్కకు వంగిపోవడంతో అది భూమికి పంపించాల్సిన సమాచారం ఆగిపోయింది.

దీంతో దీన్ని తిరిగి కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి శాస్త్రవేత్తలు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా పంపిన ఇంటర్‌స్టెల్లార్ షౌట్ అనే కమాండ్‌తో వాయేజర్ 2 నుంచి సిగ్నల్స్ అందడం ప్రారంభించాయి.

జరిగిన పొరపాటును సరిదిద్ది, తిరిగి తమ కమ్యూనికేషన్స్‌ పరిధిలోకి తెచ్చుకోవాలంటే అక్టోబర్ వరకు పట్టొచ్చని మొదట నాసా భావించింది. వచ్చే అక్టోబర్‌ 15న ఈ మిషన్ రీసెట్ అవుతుంది. అప్పుడు ఈ యాంటెన్నా యధాతథ స్థితికి వస్తుందని భావించారు.

అయితే, అప్పటి వరకు వేచి చూడకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, వాయేజర్ 2 తిరిగి కాంటాక్ట్‌లోకి వచ్చింది.

ఇంటర్‌స్టెల్లార్ కమాండ్ ఫలితం ఇచ్చిందో లేదో తెలియడానికి మిషన్ కంట్రోలర్స్‌కు 37 గంటల సమయం పట్టింది. కమాండ్‌లు పంపడానికి హైపవర్ ట్రాన్స్‌మీటర్లను ఉపయోగించారు.

‘‘సవ్యంగా చేరుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడేదాకా వేచి చూసి సిగ్నల్స్ పంపించాం. దీంతో యాంటెన్నా సవ్యదిశలోకి వచ్చింది’’ అని వాయేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ సుజాన్ డాడ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

ప్రస్తుతం ఈ స్పేస్ క్రాఫ్ట్ నుంచి డేటా అందుతోందని, అంతకు ముందులాగానే పని చేస్తోందని నాసా వెల్లడించింది.

హార్ట్ బీట్ శబ్ధాలతో మొదలు...

వాయేజర్ 2 నుంచి తమకు హార్ట్‌బీట్ తరహా సిగ్నల్ అందినట్లు నాసా ఇటీవల ప్రకటించింది.

మంగళవారం నాడు నాసా ఆకాశాన్ని స్కాన్ చేస్తుండగా, దీని నుంచి సిగ్నల్‌ అందింది.

అయితే అది పూర్తిస్థాయి సిగ్నల్ కాకపోవడంతో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను కొనసాగించారు.

వాయేజర్ 2

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, హీలియో స్పియర్‌లో వాయేజర్ 1, వాయేజర్ 2 నౌకలు

వాయేజర్ 2 ఇప్పుడు ఎక్కడ ఉంది?

వాయేజర్ 2 భూమి నుండి 1990 కోట్ల కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరంలో ఉంది. నక్షత్రాల మధ్య ఖాళీగా ఉన్న ఇంటర్ స్టెల్లార్‌లో అది గంటకు 55,346 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది.

అయితే, జూలై 21 నుంచి ఈ ప్రోబ్ భూమి నుంచి కమాండ్స్ తీసుకోలేకపోతోంది. డీప్ స్పేస్ నెట్‌వర్క్‌కు సంబంధించిన డేటాను కూడా నాసాకు అందించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ రేడియో యాంటెన్నాలు, స్పేస్‌క్రాఫ్ట్‌ల గ్రౌండ్ కంట్రోల్ నుంచి కూడా కమాండ్స్ తీసుకోవడం లేదు.

వాయేజర్2 భూమికి దగ్గరదగ్గరగా 2000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండంతో, అక్కడి నుంచి సిగ్నల్స్ భూమికి రావాలంటే దాదాపు 18 గంటల సమయం పడుతుంది.

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోని భారీ డిష్ యాంటెన్నాలు వాయేజర్ 2 నుండి ఏవైనా సిగ్నల్స్ అందుతాయేమోనని గుర్తించడానికి విస్తృతంగా ప్రయత్నించాయని నాసా ఇంతకు ముందు తెలిపింది.

వాయేజర్ 2ను సిగ్నల్స్ సాయంతో ఎలాగైనా చేరుకుని, దాన్ని తిరిగి ట్రాక్‌లో పెట్టేందుకు నాసా జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ విస్తృతంగా ప్రయత్నించింది.

వాయేజర్ 2

ఫొటో సోర్స్, NASA

వాయేజర్‌ను ఎందుకు పంపారు?

సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు నాసా 1977లో ప్రయోగించినప్పటి నుంచి ఈ ప్రోబ్(నౌక) అంతరిక్షంలో తిరుగుతూనే ఉంది.

వాయేజర్ 1, వాయేజర్ 2 జంట హీలియోస్పియర్ వెలుపల పనిచేసే ఏకైక వ్యోమనౌకల జంట. సూర్యుని నుంచి వెలువడే అణువులు, అయస్కాంత క్షేత్రాలను రక్షించే బబుల్‌ను హీలియోస్పియర్ అంటారు.

వాయేజర్ 1 నౌక 2012లో, వాయేజర్ 2 నౌక 2018లో ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించాయి.

బృహస్పతి, శని గ్రహాల మధ్య ప్రతి 176 సంవత్సరాలకు ఒకసారి సంభవించే అవుటర్ ప్లానెట్ అమరికను గమనించడానికి ఈ రెండు నౌకలను రూపొందించారు.

నెప్ట్యూన్, యురేనస్ ద్వారా ప్రయాణించిన ఏకైక అంతరిక్ష నౌక వాయేజర్ 2.

ప్రస్తుతం వాయేజర్ 1 భూమికి దాదాపు 2400 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. ఇది మానవాళికి అత్యంత దూరంలో ఉన్న అంతరిక్ష నౌకగా రికార్డులకెక్కింది.

వీడియో క్యాప్షన్, గురుగ్రహాన్ని, దాని శీతల ఉపగ్రహాలను అన్వేషించే ప్రయత్నం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)